తొమ్మిదేళ్ల డానీ సండే స్కూల్ నుండి అడ్డూ అదుపూ లేకుండా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతను తన తల్లిని లేదా తండ్రిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని కళ్ళు ప్రతి దిశలోనూ బాణవేగముగ కదులుచున్నవి. మొత్తానికి, త్వరగా వెదకిన తరువాత, అతను తన తండ్రి కాలును పట్టుకుని ఇలా అరిచాడు, “నాయనా, మోషే మరియు ఎర్ర సముద్రం దాటిన ప్రజలందరి కథ చాలా బాగుంది!” అతని తండ్రి క్రిందకు చూస్తూ, చిరునవ్వు చిందించి, దాని గురించి తనకు చెప్పమని తన కుమారుని అడిగాడు.
“సరే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ ఫరో మరియు అతని సైన్యం వారిని వెంబడించారు. కాబట్టి యూదులు ఎర్ర సముద్రం వచ్చేవరకు వీలైనంత వేగంగా పరిగెత్తారు. ఐగుప్తు సైన్యం మరింత దగ్గరవుతోంది. కాబట్టి మోషే తన వాకీ-టాకీని అందుకొని, ఐగుప్తీయులపై బాంబు వేయమని ఇశ్రాయేలు వైమానిక దళానికి చెప్పాడు. అది జరుగుచుండగా, ఇశ్రాయేలు నావికాదళం ప్రజలు దాటడానికి వీలుగా ఒక బల్లకట్టు వంతెనను నిర్మించారు. మొత్తానికి వారు దీనిని సాధించారు!”
ఇప్పటికే డానీ తండ్రి ఆశ్చర్యపోయాడు. “వారు మీకు కథను నేర్పించిన తీరు అదేనా?”
“అంటే, లేదు, సరిగ్గా అలా కాదు,” అని బాలుడు ఒప్పుకున్నాడు, “కానీ వారు మాకు చెప్పిన విధంగా నేను మీకు చెబితే, మీరు ఎప్పటికీ నమ్మరు, నాన్న.”
చిన్నపిల్లలాంటి అమాయకత్వంతో, చిన్నవాడు ఎక్కడైతే నిశ్చలమైన సంశయవాదం ప్రబలంగా ఉన్నదో అటువంటి మన అధునాతన పరిణతిచెందిన ప్రపంచం యొక్క నాడిని పట్టుకున్నాడు. ఇది తప్పు యిది ఒప్పు అని వాస్తవాలను చూసే ప్రపంచంలో చెల్లుబాటు అవ్వడానికి ఇది మరింత ప్రజాదరణ పొందుతోంది . . . అలాగే, వాస్తవానికి, అద్భుతమునకు ఎటువంటి ఆస్కారం లేదు. నా ఉద్దేశ్యంలో . . . శాస్త్రీయ డేటా లేదా గణిత సిద్ధాంతాలు లేదా సహజ సూత్రాల నుండి దాని సూచనలను పొందే తెలివైన మనస్సు ఆ విషయాలను మార్చడాన్ని సహించదు. ఖచ్చితంగా “దైవికపరమైన” ప్రమేయము అని పిలవబడేదాన్ని అస్సలు సహించదు. కొంచెం ఆగుతారా!
ఇది నిజంగా క్రొత్త మనస్తత్వం కాదు. పేతురు తన పత్రికలలో ఒకదానిలో దీనిని పేర్కొన్నాడు:
అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, –ఆయన రాకడనుగూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను. (2 పేతురు 3:3-4)
విశ్వాసము లేనివారు అలానే ఆలోచిస్తారు. వారు తమకు ఇష్టమైన భక్తిగీతమును ఎంచుకోగలిగితే, అది ఖచ్చితంగా ఈ పదాలను కలిగి ఉంటుంది, “ఇది ఆరంభంలో ఎలా ఉన్నదో, అది ఇప్పుడు మరియు సదాకాలము ఇలానే ఉంటుంది . . . ”
గురుత్వాకర్షణ తీసుకోండి. భారీ వస్తువులు భూమి వైపు పడతాయి. ఎల్లప్పుడూ ఇదే జరుగుతుంది. కాబట్టి ఒక బిల్డర్ ఒక ఇంటిని నిర్మిస్తున్నప్పుడు అతని వస్తువులు ఎగిరిపోతున్నాయని చింతించడు. ఇది నిశ్చయం. రసాయన శాస్త్రాన్ని తీసుకోండి. కొన్ని మూలకాలను ఖచ్చితమైన నిష్పత్తిలో కలపడం వలన అదే ఫలితం లభిస్తుంది. ఎల్లప్పుడూ అదే ఫలితం వస్తుంది. కాబట్టి ఒక వైద్యుడు ఊహించదగిన విశ్వాసముతో మందులను సూచించవచ్చు. ఖగోళ శాస్త్రాన్ని తీసుకోండి. సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు సంపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి. ఎల్లప్పుడూ అలానే పనిచేస్తాయి. నిగూఢమైన గ్రహణం కూడా ఏమాత్రం ఆశ్చర్యమును కలిగించదు. మనం దాని గమనమును ప్రతి సెకను నియంత్రించగలుగుచున్నాము. శరీర నిర్మాణ శాస్త్రం తీసుకోండి. కాంతికి ప్రతిస్పందనగా కనుపాప వ్యాకోచించడం మరియు సంకోచించడం లేదా మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే చర్మం లేదా భయాందోళనను వ్యాధిని ఎదుర్కొనే అంతర్నిర్మిత రక్షణ యంత్రాంగమైనా, మనము ఖచ్చితమైన వాస్తవాల ఆధారంగా పనిచేస్తాము. కఠినమైన, మార్పులేని, దృఢమైన వాస్తవాలు. అప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది. సూర్యాస్తమయమంత విశ్వసనీయమైనది. పంటి నొప్పియంత నిజమైనది. కిటికీ యొక్క గాజు పలకంత తేటగా ఉంటుంది. సంపూర్ణమైనది, సడలించలేనిది, తిరస్కరించలేనిది, మారనిది.
అలాంటి ఆలోచన ప్రకారం తమ జీవితాలను నడిపించే వ్యక్తులను తెలివైనవారని అంటారు. వారు అసహజమైనవాటి విషయమై కొంచెం కూడా సహనం కలిగి ఉండరు. వారి యొక్క సంపూర్ణమైన కఠిన ప్రపంచంలో వారు సందేహాస్పదంగా మారిపోయారు. వారికి, వివరించలేని, “అద్భుతం” పరంగా ఆలోచించడం అలసత్వంగా ఉంటుంది. భీమా కంపెనీలు “దేవుని కార్యముల” కోసం కొంచెం వెసులుబాటును ఏర్పరచితే ఏర్పరచుకోవచ్చు, అది వారి పని. “తెలివైన” వ్యక్తులది కాదు. అవి శాస్త్రీయ ప్రయోగశాలలు మరియు ఆపరేటింగ్ గదులు మరియు చిన్న మేధో సెషన్‌లు మరియు వార్తాపత్రిక ఎడిటింగ్ గదులలో కనబడే పోరాట సంబంధమైన పదాలు.
మరి అప్పుడు అద్భుతాల సంగతి ఏమిటి? సరే, వాటిని పిల్లల కల్పన మరియు కట్టుకథల ప్రపంచానికి పరిమితం చేయండి. అలాగే, అవసరమైతే, భావోద్వేగం ఎక్కువగా ఉండి ఆ కథలన్నింటినీ ఆసక్తికరంగా చేయడానికి అవసరమైన ఊహ ఉండే మరకబడిన అద్దాల మందిరములకు వాటిని పరిమితం చేయండి. అయితే, కొన్ని అద్భుతాలు కూడా లేని మతమేదైనా ఉంటుందా? మరియు మనము బైబిల్‌లో ఆ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం మొదలుపెడితే, సూర్యుడు ఎలా ఆగిపోయాడో లేదా ఆ చేపలన్నీ అకస్మాత్తుగా శిష్యుల వలలను ఎందుకు నింపాయో, లేదా లాజరును మరణం నుండి తిరిగి తీసుకువచ్చినదేమిటో, లేదా యేసు మృతదేహం ఎందుకు కనుగొనబడలేదో, లేదా క్రీస్తు మరణం జీవితాలను ఎలా పవిత్రపరచుతుందో, లేదా బైబిల్ ఇంకా ఎలా ఉనికిలో ఉన్నదో వంటి విషయాలను వివరించడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచన చేయండి.
“తెలివైన” సంశయవాదులు అలాంటి చిన్న విషయాలను వివరించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ సంశయవాదులు సజీవంగా మరియు చక్కగా మరియు ఆ కథలన్నీ ముఖ్యమైనవి కావని ఎంచినంతకాలం, ఇది మంచిగా మరియు అందంగా ఉంటుంది . . . అద్భుతము మొత్తంగా తిరస్కారమును స్వీకరించడం సులభం. వారు అనారోగ్యానికి గురయ్యే వరకు, మరణాన్ని ఎదుర్కొనే వరకు, మరియు వారి కష్టాలనుండి విడుదల పొందడానికి అద్భుత సహాయం అవసరమైయ్యేంత వరకు . . . ఇది చాలా ఆమోదయోగ్యమైనదిగా, చాలా జ్ఞానంగలదిగా అనిపిస్తుంది.
అది సరేకాని, జీవితం ముగిసిన తరువాత ఏమి జరుగుతుంది? హే, బైబిల్ నిజంగా ఏమి చెబుతుందో నేను మీకు చెబితే, మీరు ఆశ్చర్యపోతారు!