మీరు ఆమె విలువను అనుమానించే స్త్రీ అయితే, మీరు ఒంటరిగా లేరు.
నేను స్పష్టంగా చెప్పడం ద్వారా ప్రారంభించవచ్చా? నేను స్త్రీని కాదు. అలాగే నేనెప్పుడూ అలా ఉండాలని కోరుకోలేదు! మహిళలపై నాకు అధికారం లేదు. కానీ 61 సంవత్సరాల వివాహం మరియు ఇద్దరు కుమార్తెలకు దాదాపు 50 సంవత్సరాల పితృత్వము తర్వాత, స్త్రీలను కదిలించే దాని గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను.
నేను ఇవన్నీ ఒక్క విషయానికి ఉపోద్ఘాతంగా చెబుతున్నాను: స్త్రీలు విలువైన మరియు గౌరవప్రదమైన వ్యక్తులు, వారిలో ప్రతి ఒక్కరు ప్రేమగల సృష్టికర్తచే ప్రత్యేకంగా రూపొందించబడ్డారు.
తన ప్రాథమిక సంవత్సరాల ప్రారంభంలో, మా కుమార్తెలలో ఒకరు తన చేతి ముద్రతో మట్టితో తయారు చేసిన చిన్న, గుండ్రని రంగువేయబడిన ఫలకాన్ని ఇంటికి తీసుకువచ్చారు. కళల తరగతిలో, ఆమె మట్టిని మలచడం; అది ఆరిపోయే వరకు వేచి ఉండటం; మృదువైన, సూక్ష్మ రంగులతో పూయడం; ఆపై దానిని బట్టీలోని తీవ్రమైన వేడిలో కాల్చడం వంటివి నేర్చుకుంది.
ఆమె తన కళాఖండాన్ని ఇంటికి తీసుకువచ్చి గర్వంగా నా చేతుల్లో పెట్టింది. అసమానమైన మరియు అసంపూర్ణమైన ఆకారం ఉన్నప్పటికీ, చిన్న ఫలకం సూర్యకాంతిలో మెరిసింది. నేను దానిని సున్నితంగా పట్టుకున్నప్పుడు-నా ఆమోదం కోసం ఆత్రుతగా నా కుమార్తె కళ్ళు ఎదురుచూస్తుండగా–నేను ఇలా అనుకున్నాను, దేవుడు నిన్ను ఇలానే చూస్తున్నాడు. అద్భుతంగా తయారు చేయబడినదానవు మరియు చాలా విలువైనదానవు.
“నా బంగారుతల్లీ, ఇది అద్భుతంగా ఉంది!” అని నేను చెప్పాను.
ఆ చెక్కిన ఫలకం విలువ దాని బాహ్య రూపంలో కాదు, దాని సృష్టికర్త హృదయంలో ఉంది. దురదృష్టవశాత్తు, చాలా మంది మహిళలు తమ విషయంలో కూడా అదే నిజమని గ్రహించలేకపోతున్నారు.
మన సంస్కృతి అందం, ఆకర్షణ, తెలివితేటలు, అమితమైన దృఢత్వము మరియు శారీరక పరిపూర్ణత యొక్క అధిక విలువల గురించి అన్ని వయసుల మహిళలను బాధించే సందేశాలను పంపుతుంది. మీరు సైజు 6 లేదా అంతకంటే తక్కువ, పదునుగా మరియు బలముగా ఉండి, అవార్డు గెలుచుకున్న పిల్లలను పెంచుతూ ఫార్చ్యూన్ 500 కంపెనీని నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటే తప్ప, మీరు అంచనాలను అందుకోలేరు.
ఆయన తన వాక్యంలో మనకు వెల్లడి చేసినట్లుగా–దేవునికి చాలా భిన్నమైన దృక్కోణం ఉంది, అందుకు సంతోషం. గొప్ప జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు:
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము
యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ
కొనియాడబడును. (సామెతలు 31:30)
దేవుడు బాహ్యమైన వాటికి ఎలాంటి బహుమతి ఇవ్వడు–వాటిలో ఏ ఒక్కటి కూడా శాశ్వతమైనది కాదని సొలొమోను మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి. నిజమైన విలువ దేవునికి భయపడి ఆయనను వెంబడించే వ్యక్తి యొక్క హృదయం నుండి వస్తుంది.
దేవుడు ప్రతి స్త్రీని తనతో మరియు ఇతరులతో సంబంధం ఏర్పడే విధంగా వ్యక్తిత్వం, అభిరుచులు, సామర్థ్యాలు మరియు శైలి యొక్క ప్రత్యేకమైన కలయికతో సృష్టించాడు. “ప్రతి స్త్రీ” అంటే అందులో మీరు కూడా ఉన్నారు!
మీ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. దేవుడు తన సార్వభౌమాధికార ప్రయోజనాలను నెరవేర్చడానికి తన స్వంత రూపకల్పన ప్రకారం జాగ్రత్తగా మరియు శ్రమతో మిమ్మల్ని తీర్చిదిద్దాడు. ఆయన మీ హృదయం యొక్క ఉద్దేశాలు మరియు ప్రేమను గురించే గాని బాహ్య ప్రదర్శనల గురించి అస్సలు పట్టించుకోడు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని, మీ కోసం దేవుని రూపకల్పన మరియు ఉద్దేశ్యంపై మీ దృష్టిని ఉంచడంలో మీకు సహాయపడటానికి నేను మూడు విషయాలను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను:
- నిరోధించండి పరిపూర్ణతను సాధించే ప్రయత్నాలను. పరిపూర్ణత అనేది శత్రువు నుండి వచ్చిన అబద్ధం. ప్రపంచ ప్రమాణాలకు మరియు దేవుని ప్రమాణాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మీరు “పరిపూర్ణంగా” ఉండడం పట్ల దేవునికి ఆసక్తి లేదు. మీరు పరిశుద్ధతను వెంటాడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా? ఆయన యెదుట విధేయతతో నడవడానికి అనుదినమూ సమర్పించుకోవడం ద్వారా (1 పేతురు 1:16).
- గుర్తుంచుకోండి మీ సృష్టికర్త యొక్క ప్రణాళిక ప్రకారం మీరు భయమును ఆశ్యర్యమును కలుగు విధంగా చేయబడ్డారని. నిత్యత్వంలో ఎప్పుడో, దేవుడు మిమ్మల్ని నియమించుకున్నాడు మరియు ఇప్పుడు మిమ్మల్ని తన అద్భుతమైన సృష్టిగా చేసుకున్నాడు. మీరు ఆయన ప్రేమ యొక్క ముద్రను కలిగి ఉన్నారు (యిర్మీయా 31:3).
- గుర్తు చేయండి దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండే అరుదైన మరియు శాశ్వతమైన సుగుణాన్ని యువ తరానికి. దేవునికి భయపడి ఆయనకు సేవ చేయాలనే ఉద్దేశ్యం కలిగియున్న యుక్తవయసులోని బాలికలు మరియు యువతులకు ఆదర్శవంతుల అవసరం ఎప్పుడూ ఉండదు (సామెతలు 31)./li>
నా కుమార్తె యొక్క చిన్న ఫలకం వలె, మనలో ప్రతి ఒక్కరికి అసమానమైన మరియు అసంపూర్ణమైన ఆకారం ఉంది. అతిశయముతో ఆనందముతో ప్రేమతో తండ్రి మనలను సృష్టించిన విధానాన్ని మనం ఎన్నటికీ మరచిపోకూడదు. మీరు ఆయన కళాఖండం, చేతితో తయారు చేయబడ్డారు మరియు విలువైనవారు.
నమ్మండి! ఈరోజు దేవుని వెంబడించాలనే ఉద్దేశ్యం మీ హృదయంలో ఉంచుకోండి. అప్పుడు మీరు అద్భుతంగా ఘనపరచబడతారు.
Copyright © 2017 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.