1 రాజులు 18: 1-46
నేను వింతగా ఉండవచ్చు, కాని బైబిల్ నన్ను నవ్వించిన సందర్భాలు ఉన్నాయి. నా ఉద్దేశ్యంలో నిజంగా నవ్వు తెప్పించినవి. నేను పెద్దవాణ్ణి అవుతున్న కొద్దీ ఈ గ్రంథమును సౌకర్యవంతముగా చదువుచున్నాను. అప్పుడు నవ్వుతోకూడిన ప్రతిస్పందన సరైనదే కాదు, అది ఆశించదగినది కూడా అని నేను ఎక్కువగా కనుగొన్నాను.
కర్మెలు పర్వతం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమంలో 450 విగ్రహారాధన ప్రవక్తలు ఒక వైపున, ఏలీయా ఒంటరిగా, మరోవైపున ఉన్న సమయంలాంటిది. మీకు కథ గుర్తు ఉంది (1 రాజులు 18). బయలు వర్సెస్ యెహోవా. పెద్ద బలిపీఠం, అగ్ని కోసం ప్రార్థన. “అగ్ని ద్వారా సమాధానం” ఇచ్చేవాడు . . . అతడే అనుసరింపదగినవాడు.
ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు ప్రవక్తలు తమ దేవతను పిలిచారు. వాళ్ళు చాలా ఆందోళన చెందారు, వారు “తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.”
వారి చేష్టలను చూసి ఏలీయా నవ్వుకొని వారిని అపహాస్యం చేయడం ప్రారంభించాడు: “వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానముచేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసియున్నదేమో” (18:27). హాస్యాన్ని మరింత పెంచడానికి, కొంతమంది పండితులు హెబ్రీ నుడికారం ప్రకారం “దూరముననున్నాడేమో” అనే మాట బయలు “బాత్రూంకు వెళ్ళి ఉండవచ్చు” అనేదాన్ని సూచిస్తుందని చెప్పారు. రండి, నవ్వండి; ఏం పర్లేదు.
దేవుని సత్యానికి హాస్యమును స్పృశించు అనేక సంఘటనలు ఉన్నాయి. మరొక రోజు నేను దావీదు జీవితంలో చీకటి రోజులను త్రవ్వుచున్నప్పుడు, నేను ఒక మంచి హాస్య సంఘటన దగ్గరకు వచ్చాను. సౌలు యొక్క అసూయ హత్య చేసే స్థాయికి పెరిగిపోయింది. ఇది దావీదును తన ప్రాణాల కొరకు పారిపోవటానికి బలవంతం చేసింది. అకస్మాత్తుగా, గాతు సంబంధులైన కొంతమంది అపరిచితులచేత అతను చుట్టబడియుండగా, పిచ్చివానివలె నటించటం తప్ప అతనికి ఏమి చేయాలో తెలియలేదు. “కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపులమీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కార నిచ్చుచు నుండెను . . .”(1 సమూ. 21:13).
ఇప్పుడు, అది వినోదమే తప్ప మరొకటి కాదు. మీరు తదుపరి రెండు వాక్యాలను చదివినప్పుడు, మీరు నవ్వును ఆపుకోలేరు. ఈ వింత దృశ్యాన్ని చూసిన తరువాత, గాతు ప్రజలు అపరిచితుడిని తమ రాజు తలుపు ముందు వరకు పట్టుకొచ్చారు. అతని ప్రతిస్పందన చాలా హాస్యాస్పదంగా ఉంది: “మీరు చూచితిరికదా? వానికి పిచ్చిపెట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి? పిచ్చిచేష్టలుచేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రా తగునా?” మరో మాటలో చెప్పాలంటే, ఆకీషు రాజు తన రాజ్యంలో కావలసిన దానికంటే ఎక్కువమంది పిచ్చివాళ్ళతో బిజీగా ఉన్నాడు!
నిజం కల్పన కంటే వింతగా మాత్రమే కాదు, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అది అలా ఉన్నప్పుడు, మనము నవ్వుతూ దేవుణ్ణి అవమానించటం లేదు; మనము ఆయనను ఘనపరచుచున్నాము. మనం నివసించే చోట మనలను స్పృశించి తన సత్యాన్ని ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మరియు వాస్తవంగా ఉంచాలనే ఆయన కోరికకు మనం ప్రశంసలను వ్యక్తం చేసే మార్గం ఇది. . . ఎందుకంటే జీవితం చాలా మట్టుకు వినోదభరితమై ఉన్నది. నిజంగా వినోదభరితమైనదే.
దేవుడు తన సత్యాన్ని జీవిత చిత్రాలలో అమర్చుతాడు.
Excerpted from Day by Day with Charles Swindoll, Copyright © 2000 by Charles R. Swindoll, Inc. (Thomas Nelson Publishers). All rights reserved worldwide. Used by permission.