మీకు ఈ అనుభవం ఉంది.
మీకు తెలుసు-మీరు సువార్తను ప్రకటించాల్సిన సందర్భం, కానీ, ఏ కారణం చేతనో, మీరు ఆ పని చేయలేదు. మీ నోటనుండి మాట రాకపోవడం, మీ మెదడులోనున్న కంఠత వాక్యములు గుర్తుకు రాకపోవడం, సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం, మరియు ఈ సంభాషణ నుండి బయటపడటానికి ఏమి సాకు చెప్పాలా ఆలోచిస్తూ ఉండటం వంటి ఇబ్బందికరమైన క్షణాలు అవి.
మనలో చాలామంది యేసుక్రీస్తు గురించి సాక్ష్యమివ్వడానికి ఇష్టపడని అనేక కారణాలున్నాయి. ఒకటి అజ్ఞాన భావన. దాని విషయమై ఎలా ముందుకు సాగాలో మనకు నిజంగా తెలియదు.
మరొకటి మనల్ని బలంగా ప్రభావితం చేసే ఒక విధమైన అలక్ష్యము. మనం బాగా పోషించబడ్డాము. మనము రక్షకునియందు విశ్వాసముంచాము. మన కుటుంబం పెరుగుతోంది. మనము ఆ బాధ్యతను వేరొకరికి-టెలివాంజెలిస్ట్‌కి, పాస్టర్‌కి లేదా క్రీస్తును బాగా ప్రకటించగల పెద్ద కాన్ఫరెన్స్ క్రూసేడ్ నాయకునికి బదిలీ చేస్తాము.
మనం అయిష్టంగా ఉండటానికి మరొక కారణం భయం. వారు సమాధానం చెప్పలేని ప్రశ్నలు, ముఖ్యంగా అపరిచితునిచేత అడుగబడటానికి ఎవరూ ఇష్టపడరు. మనము ఊహించలేని వాటిని ఆస్వాదించలేము. మనము ప్రతికూల ప్రతిస్పందనకు భయపడతాము. మనము మూర్ఖంగా కనిపించడానికి భయపడతాము. కాబట్టి మనం మన విశ్వాసాన్ని మన వరకే ఉంచుకోవటానికి ఇష్టపడతాము.
వేరేలా ఆలోచించి మోసపోవద్దు-సాక్ష్యం చెప్పడానికి చాలా ధైర్యం అవసరం.
దీనికి నిరూపితమైన పద్ధతి కూడా అవసరం. తప్పిపోయిన వారికి క్రీస్తు సువార్తను తెలియజేయడానికి వివిధ పద్ధతులు ఉపయోగించబడ్డాయి. కొన్ని విధానాలు పైకి విజయవంతమైనవి మరియు ప్రభావవంతమైనవిగా కనిపిస్తాయి, కానీ, లోపల, అవి చాలా అసంతృప్తికరముగా ఉంటాయి.
ఉదాహరణకు, షార్ప్‌షూటర్ విధానాన్ని, తీసుకోండి: “ఎంత ఎక్కువమంది ఉంటే అంత మంచిది.” ఈ సంఖ్యా పద్ధతి నిర్ణయం-కేంద్రీకృతమైనది, మరియు ఫాలో-అప్ చేయడం లేదా శిష్యరికంలో నడిపించడం లేదా సహవాసాన్ని పెంపొందించడం వైపు మళ్లించే ప్రయత్నం తక్కువ (ఏదైనా ఉంటే) జరిగింది.
హార్వర్డ్ విధానం చాలా భిన్నమైనది: “ప్రపంచ మతాల గురించి మనందరం చర్చిద్దాం.” ఈ కారణ-కేంద్రీకృత విధానం నిజమైన మరియు నకిలీ మేధావులను ఆకర్షిస్తుంది మరియు ఇది విద్యాపరమైనది మరియు అప్పుడప్పుడు చాలా ఉత్తేజకరమైనది అయినప్పటికీ, ఇది ఒక స్వల్ప లోపంతో బాధపడుతోంది-ఎవరూ రక్షించబడరు! పాపం లేదా పరలోకం లేదా నరకం గురించి నిజం చెప్పడం కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యం.
బహుశా అత్యంత ప్రజాదరణ పొందినది నిశ్శబ్ద విధానం: “నేను దేవునికి నిశ్శబ్ద సాక్షిని మాత్రమే.” ఈ పద్ధతి గురించి మీరు చెప్పగలిగే గొప్పదనం ఏమిటంటే, ఎవరూ ఎప్పుడూ బాధపడరు. సందేహమే లేదు! ఈ స్వీయ-కేంద్రీకృత విధానం కోసం స్థిరపడిన రహస్య-సేవ పునీతుణ్ణి రహస్య క్రైస్తవునిగా ముద్ర వేయవచ్చు: దేవునికి తప్ప ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఎక్కడో ఈ వ్యక్తి సాతాను యొక్క అత్యంత రుచికరమైన చిట్కాలలో ఒకదాన్ని మింగేశాడు: “మంచి క్రైస్తవ జీవితాన్ని గడపండి. ఇతరులు నిజంగా ఆసక్తి కలిగి ఉంటే క్రీస్తు గురించి మిమ్మల్ని అడుగుతారు, కాబట్టి విశ్రాంతి తీసుకోండి.” స్పష్టంగా చెప్పాలంటే, అకస్మాత్తుగా నా దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తును ఎలా తెలుసుకోవచ్చని నన్ను అడిగినవారిని వేళ్ళతో లెక్కపెట్టవచ్చు (యింకా కొన్ని వేళ్ళు మిగిలిపోతాయి). “విశ్వాసము,” దయచేసి గుర్తుంచుకోండి, “వినుటవలన కలుగును” (రోమా 10:17).
మనకు కావలసింది, ఫిలిప్పు యొక్క విధానం. దానిని నేను మీకు సమర్పిస్తున్నాను. ఈ క్రీస్తు-కేంద్రీకృత పద్ధతి అపొస్తలుల కార్యములు 8:26-40 నుండి తీసుకోబడి ఏడు సూత్రాల శ్రేణిలో నిర్దేశించబడింది.
ఫిలిప్పు సమరయలో సువార్త సమావేశాలలో నిమగ్నమై ఉన్నాడు, యెరూషలేము నుండి గాజా పోవు అరణ్యమార్గమున దక్షిణం వైపు వెళ్ళమని ప్రభువు అతనికి సూచించాడు. నమ్మకమైన ఫిలిప్పు “లేచి వెళ్ళాడు.” అతను అందుబాటులో ఉన్నాడు (సూత్రం 1). దారిలో అతను యెరూషలేము నుండి ఇంటికి ప్రయాణిస్తున్న ఐతియొపీయుడైన అధికారిని ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తి తన రథంలో కూర్చుని యెషయా చదువుతున్నాడు! మరియు దేవుని ఆత్మ యాత్రికుడిని కలిసికొమ్మని ఫిలిప్పును ప్రేరేపించెను. ఫిలిప్పు ఆత్మచేత నడిపించబడ్డాడు (సూత్రం 2). మరో మాటలో చెప్పాలంటే, దేవుడు స్పష్టంగా తలుపు తెరుస్తున్నాడని అతను గ్రహించాడు.
ఫిలిప్పు సహకరించాడు, ఎందుకంటే విధేయత (సూత్రం 3) అవసరం. ఆ వ్యక్తి బిగ్గరగా చదవడం విని, “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడిగాడు. ఎంత అద్భుతమైన ఆరంభం! సరైన దారి తెరువబడటం (సూత్రం 4) చాలా ముఖ్యం. ఫిలిప్పు లోపలికి ప్రవేశించి బోధించడం ప్రారంభించలేదు లేదా బరువైన ప్రశ్నతో పెద్దమనిషిని తప్పించుకోలేని విధంగా చేయలేదు.
ఆ వ్యక్తి ఫిలిప్పుని తనతో పాటు కూర్చోవాలని మరియు అర్థం చేసుకోవడానికి అతని అన్వేషణలో అతనికి సహాయం చేయమని ఆహ్వానించాడు. ఫిలిప్పు గొప్ప యుక్తితో ప్రతిస్పందించాడు (సూత్రం 5). అతనికి అవకాశం వచ్చినప్పటికీ, అతను దయతో, మర్యాదపూర్వకంగా మరియు రక్షణ గురించి ఎప్పుడు మాట్లాడాలో నిండు జాగ్రత్తగా ఉన్నాడు. ఆ క్షణం వచ్చినప్పుడు, అతను “నోరు తెరిచి” నిర్దిష్టంగా (సూత్రం 6) చెప్పాడు. మతం గురించి అస్పష్టమైన సంభాషణ లేదు. అతను ప్రధాన అంశమైన యేసు గురించి మాత్రమే మాట్లాడాడు. చివరి కొన్ని వచనాలు ఫిలిప్పు ఉపయోగించిన సంక్షిప్తమైన కానీ గుర్తుండిపోయే ఫాలో-అప్ (సూత్రం 7) గురించి వివరిస్తాయి.
ఫిలిప్ తన సౌకర్యవంతమైన చోటు నుండి బయటకు అడుగుపెట్టాడు, ఎందుకంటే అతను బాధపడుచున్న మానవాళితో యేసుక్రీస్తు యొక్క సువార్తను పంచుకోవాలనే అభిరుచిని కలిగి ఉన్నాడు. మన సంగతేమిటి? రథం ఎక్కేందుకు ధైర్యం అవసరమై ఉన్నది. నోరు తెరవడానికి ఇంకా ఎక్కువ అవసరం. కానీ ఆ సమయంలో ఫిలిప్పు ఎంత గొప్ప వారసత్వాన్ని సృష్టించాడు. ఈ ఆఫ్రికా యొక్క అధికారిలో ఫిలిప్పు నాటిన విత్తనం ఇథియోపియాలో వంద రెట్లు పంటలను పండించిందని చాలా మంది పండితులు నమ్ముచున్నారు. ఇతరులు చాలామంది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్న ఒక్క వ్యక్తి కారణంగా ఇది జరిగింది.
మనము ఆత్మీయంగా ఆకలితో మరియు దాహంతో ఉన్న పురుషులు మరియు స్త్రీలతో కలిసి ఉన్నప్పుడు మరియు సహాయం మరియు నిరీక్షణ కోసం వారి అంతరంగ బాధను గ్రహించినప్పుడు, షార్ప్‌షూటర్ విధానాన్ని ప్రక్కనబెట్టి, హార్వర్డ్ విధానం నుండి తప్పుకుని మరియు నిశ్శబ్ద విధానాన్ని నిశ్శబ్దం చేద్దాం. దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు-ఆయన తప్పకుండా ఇస్తాడు; మీరు దీన్ని చదివిన వెంటనే కావచ్చు-ఫిలిప్పు విధానాన్ని ప్రయత్నించండి. మీరు ధైర్యంతో చేసే ఒక్క పని మీరు అడిగిన దానికంటే లేదా ఊహించిన దానికంటే మిన్నైన ఆత్మీయ వారసత్వానికి దారితీయవచ్చు.
క్రీస్తు రాకడ సమయంలో, ఇరవై ఒకటవ శతాబ్దపు రథంలో కూర్చొని యేసునందు విశ్వాసముంచడం గురించి బహిరంగంగా మాట్లాడటం కంటే మరే ప్రదేశంలోనూ ఉండటం నేను ఊహించలేను.
Taken from Charles R. Swindoll, “Creating a Legacy of Courage: The Philip Approach,” Insights (March 2004): 1-2. Copyright © 2004 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.