గందరగోళం

భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఏమి జరిగిందో స్పష్టంగా తెలియచేయడం జీవితంలో కష్టతరమైన పనులలో ఒకటి.

“ప్రేమలో పడిన” వ్యక్తులు దీనిని వర్ణించలేరు. విపత్తును ఎదుర్కొన్న లేదా ఆకస్మిక నష్టాన్ని అనుభవించిన వారు తరచూ సమాచారాన్ని గందరగోళంగా తెలియజేస్తారు. కారు ప్రమాదాల్లో చిక్కుకున్న వ్యక్తుల విషయంలో కూడా ఇదే పరిస్థితి.

క్రిందివి భీమా లేదా ప్రమాద పత్రాల నుండి తీసిన వాస్తవ మాటలు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇవి తాము ఎదుర్కొన్నవాటిని టూకీగా చెప్పడానికి ప్రయత్నించిన శ్రమపడ్డ వ్యక్తుల అసలైన మాటలు.

ఇంటికి వస్తున్నప్పుడు, నేను పొరపాటున వేరే ఇంట్లోకి తోలి నా యింటి దగ్గర లేని చెట్టును ఢీకొట్టాను.

నేను టి-జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి, ఇంతకు ముందు ఆగుము అనే గుర్తు కనిపించని ప్రదేశంలో అకస్మాత్తుగా ఒక ఆగుము అనే గుర్తు కనిపించింది. ప్రమాదం జరగకుండా ఉండటానికి నేను సమయానికి ఆపలేకపోయాను.

దాని ఉద్దేశాలను గూర్చి హెచ్చరించకుండా వేరే కారు నా కారును ఢీకొట్టింది.

నా కారు వేరే వాహనంలోకి దూసుకొని వెళ్లేముందు సరియైన ప్రదేశంలోనే ఆపి ఉంచబడింది.

నా కారు కిటికీ తెరచి ఉందని నేను అనుకున్నాను, కాని నేను దానిలో చేయి పెట్టినప్పుడు అది పైకి ఉందని తెలుసుకున్నాను.

ఒక అదృశ్యమైన కారు ఎక్కడనుండో వచ్చింది, నా వాహనాన్ని ఢీకొట్టి, మరల అదృశ్యమైంది.

నేను గాయపడలేదని పోలీసులకు చెప్పాను, కాని నా టోపీని తీసివేయగా, నా తల పగిలిందని గుర్తించాను.

ఒక లారీ నా విండ్‌షీల్డ్ ద్వారా నా భార్య ముఖం మీదికి దూసుకువచ్చింది.

ఒక పాదచారుడు నన్ను ఢీకొట్టి నా కారు కింద పడ్డాడు.

పాదచారునకు ఏ దిశలో వెళ్ళాలో తెలియదు, అందుకే నేను అతనిపై దూసుకొని వెళ్లాను.

ఆ వ్యక్తి రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు; నేను అతనిని ఢీకొట్టడానికి ముందు చాలాసార్లు వంకరటింకరగా నడపాల్సి వచ్చింది.

నెమ్మదిగా కదలుతూ, విచార వదనంతో ఉన్న ముసలివాడైన పెద్దమనిషి నా కారు హుడ్ మీద నుండి బంతిలా ఎగరడాన్ని నేను చూశాను.

నేను రోడ్డుమీద కారు నడుపుతూ, నా అత్తగారిని చూస్తూ, కట్ట మీదికి ఎక్కించేశాను.

ఈ ప్రమాదానికి పరోక్ష కారణం చిన్న కారులో పెద్ద నోటితో ఉన్న ఒక చిన్న వ్యక్తి.

టెలిగ్రాఫ్ స్తంభం వేగంగా చేరుకుంది. ఇది నా కారు ముందుభాగాన్ని తాకినప్పుడు దాని దారి నుండి బయటపడటానికి ప్రయత్నించాను.

నేను బాధ్యతగా కారును తోలకుండా ప్రమాదానికి గురైనప్పుడు నేను నలభై సంవత్సరాలుగా కారు నడుపుతున్నాను.

అవి నమ్మదగనివి కాకపోతే, మరేమిటి?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతి నివేదికను ఎవరోయొకరు నిజాయితీగల, గంభీరమైన వ్యక్తి తయారు చేసాడు, అతను స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉండటానికి తన ఉత్తమమైన ప్రయత్నం చేశాడు. భావోద్వేగాలు తార్కిక ఆలోచన మరియు ఖచ్చితమైన సమాచారం యొక్క అద్దమునకు పూత పూసినట్లుగా ఉంటాయి.

మనం “క్రొత్తగా జన్మించడం” లేదా క్రీస్తులో “క్రొత్త సృష్టి” ఎలా అయ్యామో పంచుకున్నప్పుడు క్రైస్తవులకు ఇది తరచుగా జరుగుతుంది. క్రైస్తవేతరులు మన మాటలను అనుసరించడానికి ప్రయాసపడుచున్నప్పుడు, వారిలో ఎంతమంది మన మతపరమైన విస్తార పదజాలము గురించి ఆశ్చర్యపోతున్నారోనని నేను ఆశ్చర్యపోతున్నాను. మనము స్పష్టంగా తెలియచేస్తున్నామని మనం భావిస్తున్నాము, కాని మనం అలా చేయటంలేదు. క్రైస్తవేతరులకు ఇంకా అన్యమైన పదాలను, “సమూహంలోని” వారికి మాత్రమే తెలిసిన పదాలను మనం విసురుతాము. (ఆపై మనం వినేవారు ఆసక్తి చూపడం లేదని నిందిస్తాము!) మన రహస్య భాష విసంకేతించు ప్రక్రియ కోసం పిలుస్తుంది. దేవుని ఆత్మ క్రొత్త క్రైస్తవుడిని చేయగలుగునట్లు సామాన్య, నమ్మదగిన రీతిలో మాట్లాడటం ఎంత మంచిది!

పేతురు ఇలా సలహా ఇచ్చాడు, “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుడి” (1 పేతురు 3:15).

దానిని దేవుడు అప్పగించిన పనిగా తీసుకోండి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి! సాంకేతికత లేని, మూస లేని ఒక్క రచన ద్వారా మీలోని నిరీక్షణను, లేదా మీ రక్షణ అనుభవాన్ని లేదా ఎవరైనా సరే దేవుణ్ణి అర్థవంతంగా మరియు సన్నిహితంగా ఎలా తెలుసుకోగలరో ఆ విషయాన్ని మీరు వ్రాయగలరేమో చూడండి.

నీకొదేమను అనే యూదుల అధికారితో మాట్లాడినప్పుడు యేసు ఈ సవాలును స్వీకరించాడు. మీకు గుర్తుంటే, మన ప్రభువు చాలా సులభంగా చెప్పినప్పటికీ మరియు రబ్బీ చాలా ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ, క్రీస్తు మాటలను అర్థం చేసుకోవడానికి నీకొదేము చాలా కష్టపడ్డాడు. నన్ను నమ్మండి-ముఖ్యంగా గుండె యొక్క భావోద్వేగాలు నోటి వ్యక్తీకరణలను కమ్మేసినప్పుడు, గందరగోళాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమైన పనే.

చాలామంది ఎన్నడూ వినలేదని కాదు . . . వారు విన్నారుగాని మన పదజాలముతో గందరగోళానికి గురయ్యారు.

మన బాధ్యత? స్పష్టం చేయండి!

Copyright © 2012 by Charles R. Swindoll, Inc.

Posted in How to Know God-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.