తెరచిన తలుపు యొక్క గుమ్మము దగ్గర

నేను పెరుగుతున్నప్పుడు, శపించడం, త్రాగటం, విడాకులు లేదా ప్రజలు సాధారణంగా పిలిచే “విచ్ఛలవిడి జీవితం” గురించి నాకు అస్సలు తెలియదు. మరియు మీరు నమ్మండి లేదా నమ్మకపోండి, ఆ సమయంలో మిగతా ప్రపంచం భిన్నంగా ఉందని నాకు తెలియదు. ప్రపంచంలోని ప్రమాదాల నుండి విముక్తి చెందినటువంటి రక్షిత వాతావరణంలో పెరగడం వల్ల ప్రయోజనాలు తప్ప మరేమీ లేదని ఈ రోజు చాలా మంది భావిస్తున్నారు . . . కానీ ఒక ఇబ్బంది కూడా ఉంది. ఆ రకమైన ఒంటరితనం మనల్ని నిద్రలోనికి తీసుకెళ్లి, సువార్త పట్ల మనకున్న అభిరుచిని దోచుకుంటుంది.

అది ఎలా?

మీరు ప్రపంచంలోని సౌకర్యవంతమైన క్రైస్తవ పరిసరాల ద్వారము నుండి బయటపడి లోకం యొక్క క్రూరమైన భ్రష్టత్వములోనికి వెళ్లే వరకు, జీవితాన్ని మార్చే సువార్త కోసం మనిషి యొక్క తీరని అవసరాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. మన క్రైస్తవ ప్రార్థనామందిరముల లోపలే ఉండాలనే శోధన గొప్పదని నాకు తెలుసు. అందువల్ల మనలో కొందరు మా “క్రైస్తవ క్లబ్” మనస్తత్వాల నుండి బయటకు రావాలి. పాపపు భ్రష్టత్వం యొక్క లోతుల గురించి నాకు పూర్తిగా తెలుసుకోవటానికి . . . . . . మరియు సువార్త యొక్క రూపాంతరపు శక్తి పట్ల అభిరుచిని పొందడానికి మెరైన్ కార్ప్స్ లో కొంత సమయం పట్టింది.

ఓకినావాలోని ఆ క్వొన్సెట్ గుడిసెలో నా బ్యాగును క్రింద పెట్టేముందు, నేను ఈ క్రింది విధముగా ఆలోచించినట్లు స్పష్టంగా గుర్తుంది: నేను ఈ బట్టలను ఈ లాకర్‌లో పెట్టేముందు, నేను క్రీస్తుతో కలిసి నడుస్తానా నడవనా అనేది నిర్ణయించుకోవాలి. నేను “భూదిగంతముల వరకును” (అపొస్తలుల కార్యములు 1:8) ఆయనకు సాక్షినై ఉంటానా, లేదా నా నోరు మూసుకుని అందరిలో కలసిపోతానా?

సువార్త ప్రకటించుటకు మార్గము తెరువబడుట

నిశ్శబ్దం ఎల్లప్పుడూ సులభమైన మార్గంగా కనిపిస్తుంది, కాదా? మీరు ఎప్పుడైనా ఒక విమానంలో మీ సీటులో మెలికలు తిరిగిపోతూ, మీ ప్రక్కన ఉన్న ప్రయాణీకుడితో ఆత్మీయ విషయాలను మాట్లాడాలా అని ఆశ్చర్యపడ్డారా? క్రొత్తగా వచ్చిన పొరుగువారి ఇంటి గుమ్మం ముందు నిలబడి-అరచేతులు చెమటలు పట్టి, గుండె వేగంగా కొట్టుకుంటూ-వారిని ఇరుగు పొరుగువారికి పరిచయం చేయాలా లేక సంఘానికి ఆహ్వానించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలా అనే దానితో యిబ్బందిపడుతున్న భావన ఎలా ఉంటుందో మీకు తెలుసా?

క్రైస్తవ్యం యొక్క సురక్షితమైన ఉష్ణగృహమునుండి బయటకు అడుగుపెట్టి, సువార్త ప్రకటించుటకు తెరవబడిన ద్వారము గుండా నడవడానికి ధైర్యం అవసరం. ఇది అపాయకరమైనది. ఇది అంత సులభం కాదు. కనుక్కోండి చూద్దాం? ఇది ఎప్పుడూ తేలిక కాదు. వాస్తవానికి, కొన్ని సమయాల్లో ఇది చాలా ఘోరమైనది.

మనం అనేక శతాబ్దాల వెనక్కి వెళ్లి ఆసియా మైనర్ (ఆధునిక టర్కీ) లోని ఫిలదెల్ఫియలోని నమ్మకమైన కానీ దుర్బలమైన సంఘానికి వెళ్దాం. పరలోకమునుండి ప్రభువు రాకడ కొరకు వారు ఆతురతతో ఎదురుచూస్తూ హింసను భరించినప్పటికీ, వారు తమ పరిసరాల్లో సువార్తను ప్రకటించడానికి చాలా యిబ్బందిపడ్డారు. ఫిలదెల్ఫియ బాగా ప్రయాణం సాగించే రహదారిపై ఉన్నందున, ఆ రాచబాట సామ్రాజ్యం అంతటా ఉన్న ప్రజల స్థిరమైన ప్రవాహాన్ని తమ ఇంటి వద్దకు తీసుకువచ్చింది. సువార్త ప్రచారానికి ఎంత అణువైన మార్గము!

అందుకే క్రీస్తు వారికి ఇలా గుర్తుచేశాడు, “ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయనేరడు” (ప్రకటన 3:8). బహుశా ఆ సమాజం-హింసకు మొద్దుబారటం మరియు క్రీస్తు పట్ల తమ స్వంత విశ్వాసంపై తీవ్రంగా దృష్టి పెట్టడం వలన-వారి ముందు తెరచుకున్న అవకాశాల తలుపును గూర్చి మరచిపోయి ఉండవచ్చు. వారి కిటికీల గుండా వెళుతున్న అవిశ్వాసుల యొక్క ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచం వారిని భయంతో లేదా అనిశ్చయత్వంతో స్తంభింపజేసి ఉండవచ్చు. లేదా పొగ పోయేవరకు సువార్త ప్రకటింటడం ఆలస్యం చేయాలని, అలాగే మరింత ఆదర్శవంతమైన అవకాశం లభిస్తుందని వారు నిర్ణయించుకున్నారు.

అధిక అవరోధాలు మనందరినీ పిరికివాళ్ళని చేస్తాయి. అసమర్థత భావనలతో స్తంభించిపోయిన నమ్మకమైన ఫిలదెల్ఫియన్లను మనం తప్పుపట్టలేము. ఈ రోజు కూడా, సువార్త ప్రకటన చేయాలన్న క్రీస్తు ఆజ్ఞను నెరవేర్చడం చాలా భయంకరంగా అనిపించవచ్చు. విమర్శకుల నుండి కొన్ని అవహేళనాత్మక వ్యాఖ్యలు, నాస్తికుడి నుండి అవమానకరమైన వ్యాఖ్య, లేదా ఒక జర్నలిస్ట్ నుండి చెడ్డ పత్రిక సువార్త ప్రకటన పట్ల మనకున్న అభిరుచిని తగ్గించగలవు. మన ముందు ఉన్న అధైర్యపరచు పనిపై ఎక్కువ దృష్టి పెట్టి, “పరిస్థితులను అస్థిరపరచకుండా” ఊరకుండి నిశ్శబ్దముగా ఉండటానికి నిర్ణయించుకున్నప్పుడు మనం సులభంగా ధైర్యాన్ని కోల్పోతాము.

ఫలితం? మన వ్యక్తిగత పరిధిలో ఉన్న ఆ విలువైన కొద్దిమందిని చేరుకోవడానికి మనము అవకాశాన్ని కోల్పోతాము. . . కోల్పోయిన ఆత్మలు మన స్వంత తలుపుల గుమ్మముల గుండా వెళుతున్నాయి.

గుమ్మము అవతల అడుగు పెట్టడం

శతాబ్దాల క్రితం ఫిలదెల్ఫియన్ల మాదిరిగానే, మనలో ప్రతి ఒక్కరం “ఎవరునూ మూసివేయలేని తీసియున్న తలుపు” యొక్క గుమ్మము వద్ద నిలబడి ఉన్నాము. నశించిపోతున్న ఆత్మలు సమీపంలో నిలబడి ఉన్నాయి, అక్షరాలా మనకు అందుబాటులో ఉన్నాయి. మనము సరైన క్షణం కోసం ఎదురుచూస్తుంటే లేదా క్రొత్త ప్రేరణ కోసం ప్రతిఘటిస్తే, మనము నశించిపోయిన ఆత్మలను రాజ్యములోనికి స్వాగతించకుండా వీడ్కోలు పలకడానికి ద్వారము దగ్గర నిలబడతాము.

పిరికితనము . . . భయము . . . అనిశ్చయత్వం-దొంగల త్రయము మాదిరిగా, ఈ స్పందనలు సువార్త పట్ల మీకున్న అభిరుచిని దోచుకుంటాయి, లోకంలో ఉన్నవారి అవసరాలకు మిమ్మల్ని స్తబ్ధులనుగా చేస్తాయి. వాటిని ప్రతిఘటించండి. అధిక అసమానతలను విస్మరించండి. “ఒకవేళ” తిరస్కరిస్తే మరియు అపహాస్యం చేస్తే ఎలా అనే అనుమానాల గురించి మరచిపోండి. దానికి బదులు, మీరు సువార్తను పంచుకోకపోతే ఏమి జరుగుతుందో ఆలోచించండి. మీరు ప్రతిదీ చేయలేనప్పటికీ, మీరు ఏదోయొకటి చేయవచ్చు. మీరు ఒక వ్యక్తి మాత్రమే కావచ్చు, అయినను మీరు వైవిధ్యం చూపవచ్చు. కాబట్టి, దయచేసి, ఒక ప్రత్యేకతను చూపించండి! దేవుడు మీ కోసం ఒక తలుపు తెరిచాడు. ఇది యిప్పుడు తెరచి ఉంది. వెతకండి. దాని గుండా నడవండి. వెనుకాడవద్దు.

నేను చాలా సంవత్సరాల క్రితం ఒకినావాలో ఆ క్లిష్టమైన క్షణానికి తరచు తిరిగి వస్తూ ఉంటాను. ఇది ప్రజల గురించి, సువార్త గురించి, మరియు దేవుడు నా ముందు ఉంచిన అవకాశాల తలుపుల ద్వారా అడుగు పెట్టవలసిన అవసరం గురించి నా అభిప్రాయాలను సవాలు చేసింది. నేను క్రీస్తు రాయబారిగా నశించిపోయిన లోకములోనికి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను కాబట్టి, క్రీస్తుకు మా గుడిసెలో ఉన్న ఏడుగురు, బహుశా ఎనిమిది మంది మెరైన్‌లను నడిపించే ఆధిక్యత నాకు కలిగింది. అది మీకు “గొప్ప మేల్కొలుపు” లాగా అనిపించకపోవచ్చు, కాని నన్ను నమ్మండి-నలభై ఎనిమిది మంది మెరైన్‌లలో ఏడు లేదా ఎనిమిది ఆత్మలు రక్షింపబడటం ఉజ్జీవమే!

నా చిన్నతనంలో వేయబడిన నైతిక పునాదికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను అయినప్పటికీ, నేను పాపుల ప్రపంచంలోకి మొదటి, ప్రమాదకర అడుగు వేసినప్పుడే, సువార్త పట్ల నా అభిరుచి మరియు సువార్త ప్రకటన కోసం హృదయంలో నిప్పురాజుకొని అప్పటినుండి అగ్ని మండుతూనే ఉన్నది.

ఈ రోజు మీరు అదే నిర్ణయం తీసుకుంటారా? మీరు ధైర్యంగా ఆ తెరిచిన తలుపు యొక్క గుమ్మము గుండా అడుగు పెడతారా? నేను మిమ్మల్ని కోరుతున్నాను, దాని గుండా నడవండి. వెనుకాడవద్దు. ఒక ప్రత్యేకతను చూపించండి!

Taken from Charles R. Swindoll, “At the Threshold of an Open Door,” Insights (August 2006): 1-2. Copyright © 2006 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in How to Know God-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.