లేఖనములో ప్రకాశవంతమైన వెలుగులా మెరుస్తున్న ఒక వింత ప్రకటన ఉంది. అబ్రాహాము తన స్వస్థలమైన ఊరు నుండి తన జీవితకాల మూలాలను విడిచిపెట్టాడని హెబ్రీయుల పుస్తక రచయిత చెప్పడం మనం చూస్తాము. సరేగానీ, అతను ఎక్కడికి వెళ్ళుచున్నాడు? అబ్రాహాముకు తెలియదు!
అదిగో, అతను దాదాపు డెబ్బై అయిదు సంవత్సరాల వయస్సులో ఉన్నాడు, తన అరవై ఐదు సంవత్సరాల వయస్సు గల భార్య మరియు వృద్ధాప్య తండ్రితో కలిసి ఒంటెల బండిని ఎక్కించుకొని ఎక్కడికో . . . బయలుదేరాడు. హెబ్రీయులకు 11:8 దానిని సూటిగా చెబుతోంది: “అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.” నేను ఆ మాటలను ప్రేమిస్తున్నాను: బయలువెళ్లెను . . . ఎరుగక!
క్లుప్తంగా, అది విశ్వాస జీవితం. వెళ్తున్నారు . . . ఎరుగక. ఖచ్చితమైన దాన్ని విడిచిపెట్టి, తెలిసిన ప్రతిదానికీ దూరంగా నడుస్తూ, వెలుగుజాడ లేని పొడవైన, చీకటి సొరంగం వైపు చూస్తూ మనలో ఎవరు విశ్వాసంతో అడుగు పెట్టలేదు? ఇంకా అనూహ్యమైన ఉత్సాహంతో నిండిపోయింది. బయలువెళ్తున్నారు . . . ఎరుగకపోయినను. లోబడుతున్నారు . . . అర్థం కాకపోయినను. అనూహ్యమైన, ప్రమాదకరమైన మరియు నిర్దేశించని ప్రయాణాన్ని ప్రారంభించడం. వాస్తవంగా ఇతరులకు పిచ్చిగా కనిపించేది . . . అయితే దేవుడు తప్ప మరెవరూ ప్రేరేపించరు.
మన దేవుని వెంబడించువారముగా, ఖచ్చితమైన లక్ష్యాన్ని సాధించడంలో ఆయన మనల్ని ఒక నిర్దిష్ట దిశలో నడిపిస్తాడని మనము విశ్వసిస్తాము. ఆయన నాయకత్వం నిస్సందేహంగా స్పష్టంగా ఉంది. తప్పనిసరిగా తార్కికం లేదా వివరించదగినది కాదు, కానీ స్పష్టంగా ఉంది. మనవరకైనా అలా ఉంది. కాబట్టి పూర్తి విధేయతతో, మనము వెళ్తాము. నడిపింపు ఎంత నిశ్చయమో అంతే అనిశ్చితమైన భవిష్యత్తును ఎదుర్కోవడానికి మనము మన బ్యాగ్‌లను సర్దుకుంటాము, మనము ముందుకు కొనసాగుతాము, మనము స్నేహితులకు వీడ్కోలు పలుకుతాము మరియు మనము ఆరంభిస్తాము. ఎంత వింతగా ఉన్నదో . . . అంతే ప్రత్యేకమైనది!
ఈ పరిస్థితుల్లో లేకుండా నా మాటలు చదవని క్రైస్తవుడు లేడు. అలాగే అది సరైనదని ఇతరులను ఒప్పించే మార్గాలతో పోరాడి ఉంటారు. ఈ ఆలోచన ఎందుకు అస్పష్టంగా ఉందో ఎత్తి చూపడానికి ప్రయత్నించేవారి కోపాన్ని మరియు మంచి ఉద్దేశ్యంతో కూడిన సలహాలను భరించారు . . . పూర్తిగా వ్యర్థమైనది, అని కొందరు అంటారు.
మీరు అటువంటి నిర్ణయం అంచున ఉన్నారా? ఏ దారిలో వెళ్లాలో తెలియని భవిష్యత్తులోకి మీ అడుగులు వేయడానికి మీరు ఆయనపై విశ్వాసం ఉంచే సమయం ఆసన్నమైందని సూచిస్తూ, ప్రభువు మీ మూలాలను వదులుగా చేస్తున్నారా?
నన్ను నమ్మండి, నేను ఆ స్థితిలో ఉన్నాను. సింథియా మరియు నేను కాలిఫోర్నియాకు మారిన తర్వాత, మేము మా మిగిలిన సంవత్సరాలన్నీ అక్కడే నివసిస్తామని మేము ఊహించాము. తప్పు! దేవుడు అడుగుపెట్టాడు, మా 23 ఏళ్ల పాత మూలాలను వదులుగా చేసి, మా దృష్టిని విశాలపరచాడు మరియు మమ్మల్ని టెక్సాస్‌కు తిరిగి నడిపించాడు, అక్కడ నేను డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి అధ్యక్షుడిగా పనిచేసాను-ఆ సమయంలో దేవుడు మమ్మల్ని టెక్సాస్‌లోని ఫ్రిస్కో ప్రాంతంలోని పశువుల విస్తీర్ణంలో ఒక సంఘమును నాటడానికి నడిపించాడు.
కొన్ని సంవత్సరాల క్రితం, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ దాని మొట్టమొదటి అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడానికి మా సంగము ప్రక్కనే ఉన్న ఏడు ఎకరాల ప్రధాన భూమిని ప్రభువు అందించాడు. ఈ శాశ్వత సౌకర్యం నుండి, చాలా కాలం క్రితం అబ్రాహాముకు వాగ్దానం చేసిన మాటలను నెరవేర్చడంలో సహాయం చేయడం ద్వారా ఈ పరిచర్య ప్రభువును సేవించడంలో కొనసాగుతోంది:
యెహోవా–నీవు లేచి
నీ దేశమునుండియు,
నీ బంధువుల యొద్దనుండియు,
నీ తండ్రి యింటినుండియు,
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము . . .
భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను.
(ఆదికాండము 12:1, 3)
రెండు వేల సంవత్సరాల తరువాత, యేసుక్రీస్తు–అబ్రాహాము వంశస్థుడు, లోకానికి దేవుని ఆశీర్వాదమునకు మార్గము–ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని ప్రతిధ్వనించే విధంగా తన శిష్యులను నియమించాడు:
“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19–20)
“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అనే దేవుని ప్రణాళిక యేసు యొక్క గొప్ప ఆజ్ఞతో ప్రారంభం కాలేదని తెలుసుకోండి. ఇది అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానముతో కూడా ప్రారంభం కాలేదు.ఇది నిత్యత్వంలో ఎప్పుడో ఆరంభమైంది, “మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను”(ఎఫెసీయులకు 1:4; 1 పేతురు 1:20 కూడా చూడండి).
ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ద్వారా . . . ప్రపంచాన్ని శిష్యులనుగా చేయడానికి దేవుని ప్రణాళికల గురించి విస్తృత దృక్పథాన్ని చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే అంతకంటే బాగా, ఆయన మంచి పనిలో మీరు ఎలాంటి కీలక పాత్రను పోషించగలరో ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఆశ్చర్యంగా జీవిస్తున్నాను అని కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నాను. నేను సర్వశక్తిమంతుడిని కనుగొన్నానని అనుకున్నప్పుడు, ఆయన తన సార్వభౌమ ఆశ్చర్యాలలో మరొకదానితో నన్ను ఆశ్చర్యపరుస్తాడు!
దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడో గుర్తుంచుకోవడం నాకు సహాయకరంగా ఉంది: పరదేశులము మరియు యాత్రికులము. ఆయన ఎప్పుడు మరియు ఎక్కడికి నడిపించినా–ప్రయాణిస్తున్న వ్యక్తులము, గుడారాలలో నివసిస్తున్నాము, అందుబాటులో ఉన్నాము మరియు ఇతరులకు భారంగా లేనివారము, వదులుగా మరియు స్వేచ్ఛగా, ఎటువెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నవారము, మూస పద్ధతికి భిన్నంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నవారము.
ఎరుగకపోయినను . . . బయలువెళ్లుచున్నాము.