మనం గ్రహించలేనివానిని మనం ఎందుకు స్తుతించుచున్నాము

మనం జీవించే, పని చేసే మరియు ఆడుకునే సంస్కృతి దేవుడు అర్థం కాడని అసంతృప్తి వ్యక్తంచేయుచున్నది, కాబట్టి ఆయనను ఎలా విశ్వసించాలి? వారు అర్థం చేసుకోలేని దేవుడిని ఆరాధించడానికి నిరాకరిస్తున్నారు.

నా ఆలోచన సరిగ్గా దీనికి భిన్నంగా ఉంది.

ఇతరులకు భిన్నంగా, నేను దేవుని అగోచరత్వము అవశ్యముగా ఉత్తేజపరచేది‌గా ఉంటుందని భావిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజుల్లో శక్తివంతమైన అధికారులు గర్వముతో నడుస్తూ మరియు పూజింపబడుచున్న ఆటగాళ్ళు ఇతరులకు గొప్పలు చూపించుకుంటూ గుండెలు బాదుకుంటారు. తమను తాము ఇతరులకంటే గొప్పవారుగా భవించుకుంటూ మనుష్యులను జడిపించడం ఒక కళారూపంగా మారిన ఈ తరుణంలో, కొత్తగా జ్ఞాపకం చేయబడటం ఆనందదాయకం: “మా దేవుడు ఆకాశమందున్నాడు; తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయుచున్నాడు” (కీర్తనలు 115:3).

మన దేవుడు అనుమతి అడగడు. ఆయన వివరించడానికి తొందరపడడు. “నేను చేయవచ్చా?” లేదా “ప్లీజ్” అని అడగవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన కేవలం “తనక ఏది ఇష్టమో అది చేస్తాడు,” ధన్యవాదాలు. ఎందుకంటే, ఆయన దేవుడు . . . భూమ్యాకాశములను సృజించినవాడు, అల్ఫాయు ఓమెగయు అయినవాడు, సమస్త విశ్వానికి సార్వభౌముడైన దేవుడు.

మా ఇటీవలి ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ 2013 గ్రీకు ద్వీపముల క్రూజ్‌లో, మా ఓడ అరమర నుండి నక్షత్రాలను చూసేందుకు నేను ఒక రాత్రి కొంత సమయం తీసుకున్నాను. మధ్యధరా సముద్రపు నీళ్లపై ప్రకాశించే అసాధారణ వెలుగులను చూసి నేను ఆశ్చర్యపోయాను. కీర్తనాకారుడు సరిగ్గా చెప్పాడు: ఆకాశములు నిశ్చయంగా దేవుని మహిమను వివరించుచున్నవి . . . అంతరిక్ష ము నిశ్చయంగా ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది (19:1). మరియు ఆయన మనలో ప్రతి ఒక్కరి యొక్క ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటాడు అనే నమ్మశక్యం కాని వాస్తవాన్ని మీరు అగాధమైన వాస్తవికతతో మిళితం చేసినప్పుడు, కీర్తనాకారుడు మళ్లీ సరిగ్గానే చెప్పాడు: “ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము అది నాకందదు” (139:6).

మన సొంతముగా మనమేమైనా చేయగలమని భావించి శోదించబడుచున్న మనకు, ఈ జ్ఞాపిక అవసరం. మన గమ్యాన్ని మనం నియంత్రించుకోగలమని అనుకునే మనకు, మనం అంత గొప్పవారమేమీ కాదని తెలియబడటం అవసరం. తన మార్గములు మనం నమ్మడం ప్రారంభించే ముందు అర్థం చేసుకోగల మన సామర్థ్యానికి మించినవి అని ఎన్నిసార్లు అగోచరమైన మన దేవుడు చెప్పాలి? “దేవా, నీ ఇష్టానుసారముగా మా జీవితములను నడిపించుము,” అని మనం వంగి, నిశ్శబ్దంగా గుసగుసలాడే ముందు . . . ఆయన కాపరి మరియు మనం గొర్రెలమని . . . ఆయన ద్రాక్షావల్లి మరియు మనం తీగెలమని ఆయన మనకు ఎంత తరచుగా నిరూపించుకోవాలి? దేవుని కుమారుడు తన భూసంబంధమైన జీవితంలో నిర్ణయాత్మకమైన సమయంలో “అయినను నా యిష్టప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము,”(మత్తయి 26:39) అని ప్రార్థించాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నప్పుడు, మనం కూడా తరచుగా అవే ఎనిమిది పదాలను ఉపయోగించడం తెలివిగల పని అవుతుంది. నిజానికి, ప్రతిరోజూ.

కానీ మనం అలా చేయడంలేదు, చేస్తున్నామా? బదులుగా, మన జీవితాల కోసం ఆయన విస్తృత ప్రణాళికను వివేచించగలమని మరియు ప్రకటించగలమని మనము భావిస్తున్నాము. ఎంతటి వేళాకోళం! మనము ఏ రోజుకారోజు “నమ్మకం మరియు విధేయత” కలిగి ఉంటే మంచిగా ఉన్నట్లే. నేను మీతో నిజాయితీగా ఉంటాను, మన విశ్వం యొక్క హద్దులను నేను ఎంత ఎక్కువగా పరిశోధిస్తానో-అది నక్షత్రాలతో నిండిన ఆకాశమైనా, తుఫానుతోకూడిన సముద్రమైనా, గంభీరమైన పర్వతాలు లేదా కంటికి కనబడని చిన్న విషయాలైనా-నేను అంత ఎక్కువగా నిశ్చలముగా ఉండాలనుకుంటాను . . . అలాగే అద్భుతాన్ని అనుమతిస్తాను.

అలాంటి ఆలోచనలు అవి చేయవలసిన పనిని చేస్తాయి: మనకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ ప్రపంచం యొక్క విశ్వాసానికి అడ్డంకిగా ఉన్నది మన విశ్వాసానికి వడిసెలగా మారుతుంది. ఎలా? మన అసౌకర్య సమయంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. ఆయన ఏమియై ఉండాలో మరియు ఆయన ఎవరో దేవుడు అది అవుతాడు, అంటే అగోచరమైనవాడు. పరిశుద్ధుడు? తప్పకుండా. శక్తిమంతుడు? అవును, సందేహమే లేదు. దయాళుడు? ఎల్లప్పుడూ. నీతిన్యాయములుగలవాడు? కృపగలవాడు, ప్రేమగలవాడు, కొదువలేనివాడు, సార్వభౌముడు? ఖచ్చితంగా, పైన పేర్కొన్నవన్నీ.

ఇంకా ఎక్కువ . . . ఎంతో ఎక్కువ. మనం గ్రహించగలిగే దానికంటే ఎక్కువ. మనం ఆలోచించగలిగే దానికంటే ఎక్కువ. మన మధ్యనున్న తెలివైనవారు ఊహించగలిగే దానికంటే ఎక్కువ. (మీరు దానిని ప్రశ్నిస్తే, చక్కగా మరియు నెమ్మదిగా, యోబు 38:l–40:4 చదవడానికి మీకు మీరే రుణపడి ఉంటారు.)

మరియు అటువంటి ప్రత్యక్షత యొక్క ప్రయోజనాలు ఏమిటి? మనము ఇకపై దేవుడిని నిర్వహించదగిన పరిమితులకు తగ్గించము. మనం ఇకపై ఆయనను లేదా ఆయన వాక్యాన్ని మోసపుచ్చటానికి శోధించబడము. మనం ఆయనను మరియు ఆయన చిత్తాన్ని వివరించాల్సిన అవసరం లేదు లేదా ఆయనను మరియు ఆయన మార్గములను కాపాడాల్సిన అవసరం లేదు. దుఃఖిస్తున్న ప్రవక్తయైన యెషయా వలె, మనము “అత్యున్నతమైన” ఆయన యొక్క కొత్త మెరుపులను చూస్తాము, ఆయన చుట్టూ సెరాపుల సైన్యం “సైన్యములకధిపతియగు యెహోవా” అని వారు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసారు (యెషయా 6:1-3). ఇవన్నీ గాయకుడి పురాతన పాటకు క్రొత్త అర్థాన్ని ఇస్తాయి:

యెహోవా మా ప్రభువా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది . . .
నీ చేతిపనియైన నీ ఆకాశములను
నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?
(కీర్తనలు 8:1, 3–4)

గొప్ప ప్రశ్న గురించి మాట్లాడండి! తన గురించిన ఆలోచనలతో నిండిపోయి, ఒకరినొకరు ఆకట్టుకున్న వ్యక్తులతో నిండిపోయి, స్తుతులకు యోగ్యుడైన వానితో తెంచుకున్న ఈ లోకంలో, మనం ప్రాథమిక వేదాంతానికి తిరిగి వచ్చి, ఒక్కడే, అద్భుతంగా ఉన్న ఆయనను, అవును, అగోచరమైనవానిని, చూడటానికి ఇది సమయం అని నేను సూచిస్తున్నాను. ఆయన మన అనంతమైన, తరగని దేవుడు. నా చిరకాల మిత్రుడు ఒకసారి ఇలా అన్నట్లుగా, “అది మీ మంటను వెలిగించకపోతే, మీకు తడి చెక్క వచ్చినట్లే!”

ఈ విషయాల గురించి ఆలోచించడానికి మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ మనస్సును ఈ లోకం మీద కాకుండా దేవుని మీద తిరిగి కేంద్రీకరించండి. మానవ దృక్కోణాల యొక్క అసంబద్ధత మరియు నిత్యత్వం కాని సమస్యల గురించి దుర్భరమైన ఆందోళనలను అధిగమించండి. నిజంగా ముఖ్యమైన ఆలోచనలతో లోతుగా వెళ్ళండి.

ఇది మనము మన సృష్టికర్తతో మళ్లీ పరిచయం చేసుకునే సమయం. దేవుని గూర్చిన ఏదైనా తీవ్రమైన అధ్యయనం మనలను మన అజ్ఞానం యొక్క పరిచితమును అచేతన స్థితినుండి చేతన స్థితికి తీసుకువెళుతుంది.

మనం ఆరాధించేవాడు మానవ విశ్లేషణను ధిక్కరిస్తున్నాడు. నిజానికి, అందుకే మనం ఆయనను స్తుతిస్తున్నాము.

Copyright © 2013 by Charles R. Swindoll, Inc.

Posted in God-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.