మనము ప్రతి డిసెంబర్‌లో “సంతోషం” గురించి చాలా పాడతాము. మీరు గమనించారా? మనము “సౌఖ్యానందము యొక్క సువార్తను” అందిస్తాము మరియు “మన సంతోషం ఎంత గొప్పది!” మరియు “సంతోషమౌ దినం భువికి!” అని మనమందరమూ గొంతులు కలిపి ఆనందగీతములు పాడతాము. ఒక్క సమస్య మాత్రమే ఉంది. మనము సంతోషంగా లేము.
ఆహా, మనము పాటలు పాడాము మరియు వేడి చాక్లెట్ ద్రావకం త్రాగుతాము మరియు మనము బహుమతులను చుట్టి చెట్టును అలంకరిస్తాము. అంకుల్ ఫ్రాంక్ ఫ్రూట్ కేక్ కోసం మనము “ధన్యవాదాలు” అని కూడా చెబుతాము. కానీ ఏదో ఒకవిధంగా సీజన్ యొక్క సంతోషం అనేది మనము తెరవని ఒక బహుమతిగా మిగిలిపోవుచున్నది. ఎందుకు? మనము సాధారణంగా మన పరిస్థితిని వ్యాపారతత్వంపై లేదా మనల్ని బిజీగా ఉంచే అన్ని పార్టీలు మరియు క్రిస్మస్ కార్యక్రమాలపై లేదా రద్దీగా ఉండే దుకాణాలపై నిందిస్తాము. కానీ మన ఆనందం చుట్టివేయబడటానికిగల అసలు కారణం ఏమిటి? మన స్వార్థం.
స్వార్థం కోసం మీరు ఎంతో దూరం వెళ్లవలసిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను. అస్సలు అవసరంలేదు. నాకు కావలసినదెల్లా ఒక కుటుంబం ఉంటే చాలు. సింథియా మరియు నేను పిల్లలను కనడం ప్రారంభించడం నాకు గుర్తుంది; నేను రెండు చిన్న స్విడోల్స్ పరిపూర్ణంగా ఉంటారని అనుకున్నాను. మాకు కావలసింది అంతే. మీకు తెలుసుగా, “మొదటివాడు మరియు కడపటివాడు” . . . ఆదర్శ కుటుంబం! అప్పుడు మాకు మూడో బిడ్డ కలిగింది . . . అలాగే చాలా సంవత్సరాల తర్వాత మాకు నాల్గవ బిడ్డ కలిగింది.
ఇప్పుడు, నేను ఎలాంటి వ్యక్తినో మీరు అర్థం చేసుకోవాలి. నా షూస్ త్రొక్కబడి ఉండటం మరియు చిరిగిపోయి ఉండటం కంటే తళతళ మెరిసిపోవడం నాకు ఇష్టం. నా బట్టలు ముడతలు పడి ఉండటం కంటే వార్డ్‌రోబ్‌లో చక్కగా వ్రేలాడదీయబడటం నాకు ఇష్టం. అలాగే గ్లాసులోనుండి నేలపై చిందిన పాల కంటే నేను టేబుల్ మీద ఒక గ్లాస్‌లో ఉన్న పాలను ఇష్టపడతాను. నేను ముఖ్యంగా అద్దాలపై వేలిముద్రలు లేని శుభ్రమైన కారును ఇష్టపడతాను. కాబట్టి నా పరిధులను విస్తృతం చేయడానికి మరియు నేను ఎంత స్వార్థపరుడనో చూపించడంలో నాకు సహాయం చేయడానికి ప్రభువు ఏమి చేసాడు? చాలా సులభం: ఆయన సింథియా మరియు నాకు త్రొక్కివేయబడిన బూట్లు, ముడతలు పడిన బట్టలు, చిందిన పాలు మరియు కారు అద్దాలను నాకే నలుగురు బిజీ పిల్లలను ఇచ్చాడు. నేడు ఆ నలుగురు పెరిగి పదిమంది మనవళ్లు మనవరాళ్ళుగా, ఇద్దరు మునిమనవళ్ళు మనవరాళ్ళుగా ఫలించారు!
మీరు అర్ధరాత్రి గదిలో చెప్పులు లేకుండా నడిచి, ఒక రాయిపై లేదా క్రిస్మస్ రోజున మిగిలిపోయిన కొన్ని చిన్న లెగో ల్యాండ్‌మైన్‌లపై పూర్తి శక్తితో త్రొక్కే వరకు మీరు జీవించినట్లు కాదు. నేను మీకు చెబుతున్నాను, మీరు ఎంత స్వార్థపరులో మీరు చాలా త్వరగా తెలుసుకుంటారు!
చూడండి, ఇది మనం ఆలోచిస్తున్న లోతైన వేదాంత విషయం కాదు. దృక్పథంలో నిస్వార్థంగా ఉండటం అనేది మన జీవితం యొక్క ముఖ్య భాగాన్ని తాకుతుంది. మన స్వంత సుఖాలను, మన స్వంత ప్రాధాన్యతలను, మన స్వంత షెడ్యూల్‌లను మరియు మన స్వంత కోరికలను మరొకరి ప్రయోజనం కోసం వదులుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామని దీని అర్థం. అది మనల్ని క్రిస్మస్ దగ్గరకు తిరిగి తీసుకువస్తుంది. యేసు యొక్క నిస్వార్థ వైఖరియే ఆయనను పరలోకపు మహిమ నుండి బేత్లెహేములోని ఒక దీనమైన తొట్టి వరకు . . . అలాగే కల్వరి సిలువ వరకు తీసుకువచ్చిందని బహుశా మీరు ఎన్నడూ గ్రహించి ఉండరు. అపొస్తలుడైన పౌలు కలం నుండి ప్రవహించిన సరళమైన మాటలలో క్రిస్మస్ కథను చూడండి:
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. (ఫిలిప్పీయులకు 2:5–8)
యేసు మర్త్యరూపమెత్తడంలో పాలుపంచుకున్న ప్రతిదీ సమర్పణ వైఖరితో . . . రక్షణ కోసం తండ్రి యొక్క ప్రణాళికతో సహకరించడానికి సుముఖతతో ప్రారంభమైంది. పరలోకంలో ఉండేందుకు తనకున్న హక్కు కోసం నచ్చజెప్పి, దైవత్వంలోని రెండవ వ్యక్తిగా ఆ ఉన్నతమైన పాత్ర యొక్క అన్ని ప్రయోజనాలను పొందడం కొనసాగించడానికి బదులుగా, యేసు ఇష్టపూర్వకంగా లోబడ్డాడు. తన పరమానందమును విడిచిపెట్టడానికి మరియు వేదనను అంగీకరించడానికి అవసరమైన ప్రణాళికతో సహకరించడానికి ఆయన సమ్మతించాడు. సంపూర్ణ పరిపూర్ణత మరియు క్షీణించని దైవత్వపు స్థితిలో, దేవుని కుమారుడు ఇష్టపూర్వకంగా భూమ్మీదికి వచ్చాడు. స్తుతి ఆరాధనతో తన సన్నిధిని ప్రవాహముగా వచ్చే దేవదూతల సమూహమును విడిచిపెట్టి, తనను తప్పుగా అర్థం చేసుకోవడానికి, దూషింపబడటానికి, శపించబడటానికి, హింసించబడటానికి మరియు సిలువ వేయబడటానికి అవసరమయ్యే నిస్వార్థమైన పాత్రను అంగీకరించాడు.
ఆయన చెడ్డ ఆత్మను అసూయతో సంరక్షించుటకు రాలేదు. ఆయన వాటన్నింటి నుంచి విముక్తి పొందాడు. ఇది ఖచ్చితంగా ఆహ్లాదకరమైన అనుభవం కానప్పటికీ, ఆయన మన మధ్య తన మర్త్యరూపాన్ని మరియు మన కోసం ఇష్టపూర్వకంగా మరియు నిస్వార్థంగా మరణించడాన్ని అంగీకరించాడు. మరి చివరికి ఏం జరిగింది? చదివి ఆనందించండి!
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీయులకు 2:9–11)
దేవుడు యేసును ఘనముగా హెచ్చించాడు, అలాగే ఆయన హృదయపూర్వకముగా ఆహ్వానించబడ్డాడు. పరలోకము యొక్క హర్షధ్వానాలు ఆయన యొక్క భూసంబంధమైన, నిస్వార్థ త్యాగానికి అత్యున్నత బహుమతి.
ఈ క్రిస్మస్‌కి, మన వైఖరి మన సంతోషాన్ని విప్పుతుంది-నిస్వార్థ వైఖరి. మీకు నేనిచ్చే ప్రోత్సాహం ఏమిటంటే, మీకు అనుకూలమయ్యేంత వరకు మీరు దానిని వాయిదా వేయకూడదు. మీరు నిస్వార్థంగా జీవించడం ప్రారంభించినా లేదా మీరు మీ హక్కులను కాపాడుకోకపోతే మరియు “పగ తీర్చుకోవడం” చేయకపోతే ప్రజలు మిమ్మల్ని ఉపయోగించుకుంటారని చాలామంది మీకు చెబుతారు. నేను భిన్నమైన సలహాను అందిస్తున్నాను: వినయ స్వభావము ప్రదర్శించాలనే మీ నిర్ణయాన్ని దేవుడు ఘనపరుస్తాడు. మీరు ద్వేష భావాల స్థానంలో సమాధానము మరియు సంతోషం యొక్క ఉపశమన ప్రవాహములతో భర్తీ చేయబడతారని మీరు కనుగొంటారు. యేసుక్రీస్తు ప్రభువు అని మనం గుర్తించి, మన భారములను, మన నిరాశలను మరియు మన హృదయ వేదనలను ఆయనమీద వదిలేయడం ప్రారంభించినప్పుడు, మనం మన సమతౌల్యాన్ని మాత్రమే కాకుండా, మన హాస్య జ్ఞానాన్ని కూడా ఉంచుకుంటాము. మన భారాలను మోయడానికి ఎవరైనా ఉన్నప్పుడు సంతోషాలు అధికమవుతాయి.
నూతనముగా జన్మించిన రాజును గూర్చి మొదటిసారి ప్రకటించిన అదే దేవదూతల సమూహములలో ఏదో ఒక రోజు మన స్వరాలు కూడా కలుస్తాయి మరియు మనము కలిసి గొప్ప సంగీతాన్ని ఆలపిస్తాము! యేసు వలె మనల్ని మనం ఇష్టపూర్వకంగా తగ్గించుకుంటే, పరలోకంలోని దేవదూతలు కూడా అనుభవించలేని సంతోషాన్ని విప్పడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు.
చెప్పండి, మీరు మీ బహుమతిని తెరిచే సమయం ఇది కాదా?