ఈ పదం మన తలలలో భయంకరమైన శకునంగా వ్రేలాడుతూ ఉంటుంది.
మానసికంగా, మనము క్రూరమైన, వింతైన స్వరూపములను వర్ణిస్తాము. ఆవు ప్రక్కటెముకలు మరియు పండ్లు పొడుచుకు వస్తాయి. శిశువుల కళ్లు బోలుగా ఉన్నాయి. ఉబ్బిన కడుపులు కోపంతో మూలుగుతాయి. చర్మం పెళుసుబారిపోతుంది. పుర్రె యొక్క రూపురేఖ నెమ్మదిగా బయటపడుతుంది. కీళ్లు ఉబ్బుతాయి. భయంకరమైన, నిరాశపరిచే చూపులు చిరునవ్వులను భర్తీ చేస్తాయి. ఆశ ఆవిరైపోతుంది . . . క్షామము తీవ్రమైన ప్రభావం చూపినప్పుడు జీవితం ఒక జీవచ్ఛవముగా క్షయమైపోతుంది. దానిని చూసిన వారు దానిని మర్చిపోలేరు. దానిని చూడనివారు దానిని ఊహించుకోలేరు.
మనకు కరువు వస్తోందని చెప్పారు. “ఎప్పుడో ఒకప్పుడు ఇది జరగాల్సిందే” అని నిపుణులు ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ పుస్తకాలలో మాత్రమే అలాంటి అంచనాలు కనిపించేవి, కానీ ఇకపై అలా ఉండదు. శపించు ప్రవక్తలు ఇప్పుడు బాగా విద్యావంతులైన ఆర్థికవేత్తలు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు మరియు మన సంస్కృతికి అధికారిక ప్రతినిధులుగా ఉన్నారు, మన సమయాన్ని “ఆశంకాజనకమైనది” మరియు “అంత్యమైనది” అని వ్యాఖ్యానించే వివిధ రచయితల గురించి చెప్పనవసరం లేదు. అపారమైన, నిరంతరం విస్తరిస్తున్న జనాభా విస్ఫోటనం అత్యంత ఆందోళన కలిగిస్తుంది. కాదనలేని గణాంకాలు స్పష్టముగా తెలియజేస్తున్నాయి.
మన ప్రపంచం 1825 లో ఒక బిలియన్ చేరుకుంది. వంద సంవత్సరాల తరువాత మన జనాభా రెట్టింపు అయ్యింది–రెండు బిలియన్లు. 1975 నాటికి, మనము మళ్లీ రెట్టింపు అయ్యాము–నాలుగు బిలియన్లు. నేడు మనం యెనిమిది బిలియన్లకు చేరువలో ఉన్నాము. యెనిమిది లేదా అంతకంటే ఎక్కువ బిలియన్ల ప్రజలకు ఆహారం అందించడానికి అవసరమైన ఆహార సరఫరా నమ్మశక్యంగా లేదు. దానికంటే ఘోరమైన విషయమేమంటే, మన ప్రస్తుత వ్యవసాయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే అది అసాధ్యం. ఇప్పుడు ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎండుకుపోయిన శరీరాలతో ఉన్న మానవజాతి పాశ్చాత్య దేశాలలో కూడా ఉదాహరణగా ఉండబోతున్నాయని మనకు తెలియజేయబడింది. ప్రపంచంలోని పెద్ద నగరాల నివాసులు కరకరలాడే పంది క్రొవ్వు ముక్కలు, ట్యూబ్‌లోని పండ్లు, రీసైకిల్ చేసిన ఆహారాలు, ప్రోటీన్ మాత్రలు మరియు కేకులు మరియు పునర్నిర్మించబడిన నీటిపై నివసించే సమయం వస్తుందని ఒక ప్రముఖ సంస్థ అంచనా వేసింది.
బాగా తిండి ఉన్న మనకు, కరువు ఆలోచన విదేశీయమైనది–వాస్తవంగా ఊహించలేనిది. ఇది భారతదేశాన్ని లేదా ఇథియోపియాను పీడిస్తోంది . . . మనలను ఎన్నడూ కాదు! వందలాది మందితో నిండిపోయిన మెక్‌డొనాల్డ్స్, ఐస్ క్రీమ్ విక్రేతలు మరియు రెస్టారెంట్లు వీధులలో వరుస కట్టినప్పుడు దేశంలో కరువు భయం యెంచబడదు.
ఆకలి యొక్క వాస్తవికతపై నా మొట్టమొదటి మేల్కొలుపు 1958 ప్రారంభంలో జపాన్‌లోని యోకోహామా నౌకాశ్రయంలోకి యుఎస్ మెరైన్‌లతో నిండిన మా ట్రూప్ షిప్ వెళ్లినప్పుడు జరిగింది. పదిహేడు రోజులు సముద్రంలో ఉన్నాక, భూమిని చూసి మేము చాలా పులకరించిపోయాము, వెంటనే మా ఓడలకు పలుపులు కట్టుకొంటున్న పడవల నిండా ఉన్న జపనీయుల పురుషులు మరియు మహిళల గురించి మాకు మొదట్లో తెలియదు. ఇది ఒక సాధారణ సంఘటన అని నేను తరువాత తెలుసుకున్నాను. మేము మూడు రోజులు డాక్ వద్ద ఉన్నప్పుడు వారు ఓడ బయటి భాగానికి పెయింట్ వేయడానికి వచ్చారు. ప్రతిఫలంగా వారి జీతం? మా బల్లలమీద నుండి క్రిందపడే రొట్టె తునకలు! ఆ ఆలోచన నన్ను నిర్ఘాంతపరచింది.
మరొక రకమైన క్షామము కూడా అంతే విషాదకరంగా ఉంది . . . కానీ చాలా నిగూఢమైనది. దేవుడు దాని గురించి ప్రవక్తయైన అమోసు ద్వారా సెలవిచ్చాడు. అతని మాటలను చాలా జాగ్రత్తగా చదవండి:
రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. (ఆమోసు 8:11-12)
భౌతికపరమైన క్షామము మనం నమ్మడానికి దాదాపు అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ ఆత్మీయ క్షామము సంగతి ఏమిటి? దాని కోసం మీరు మరో శతాబ్దం వేచి ఉండాల్సిన అవసరం లేదు! ఐరోపా అంతటా యాత్ర చేయండి. లేదా ఏదైనా దేశం లేదా ఖండాన్ని ఎంచుకోండి. క్షామము గురించి మాట్లాడండి! అమోసు మాటలను తప్పుగా చదవడం సులభం. అతను సంఘాలు లేదా ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు లేదా గుడారాలు, సెమినార్లు లేదా ఆదివారపు సంఘ కార్యక్రమాల కొరతను గూర్చి ప్రవచించలేదు. అతను “క్షామము . . . యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామము” గురించి మాట్లాడాడు. గుర్తుంచుకోండి, క్షామము అంటే ఏదైనా లేకపోవడం కాదు . . . కానీ దాని కొరత ఏర్పడటం . . . ఆకలి దృశ్యాన్ని సృష్టించే కొరత.
మన జ్ఞానోదయమైన, ప్రగతిశీలమైన, ఆధునికానంతర యుగంలో, ఒక పురాతనమైన, దుమ్ముపట్టిన ప్రవచనం నెరవేరింది. కల్తీ లేని దేవుని సత్యాన్ని వినడం అరుదైన అనుభవం. దీన్ని మర్చిపోవడం ఎంత సులభం! దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు మరియు వినేవారు అసామాన్యమైనవారనే క్లిష్ట పరిస్థితుల్లోకి మనం వచ్చేశాము.
మన ఆత్మీయ కడుపు నిండినప్పుడు . . . ఎంత సులభంగా చెడగొట్టబడుచున్నాము . . . అహంకారపూరితముగా ఉంటున్నాము . . . కృతజ్ఞత లేనివారముగా ఉంటున్నాము! హాస్యాస్పదమైన విషయమేమిటంటే–నిండుగా ఉన్నవారు సాధారణంగా ఎక్కువ కావాలని కోరుకుంటారు. మనకు పుష్కలంగా ఉన్నందుకు దేవునికి వినయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించకుండా ఎక్కువ డిమాండ్లను మనము వెళ్ళగ్రక్కుతాము.
నాకు చెప్పండి, మీరు ఎప్పుడూ జీర్ణించుకోలేనంతగా ఆయన వాక్యాన్ని వినే పరిపూర్ణమైన ఆధిక్యత కొరకు మీరు దేవునికి చివరిసారిగా ఎప్పుడు కృతజ్ఞతలు తెలిపారు? మరియు మీరు మీ బల్ల నుండి చివరిసారిగా ఎప్పుడు చిన్న ముక్కను పంచుకున్నారు?
అందుకే క్షామము ఉన్నది.