మీ సాధారణ ఉదయం గురించి ఆలోచించండి. మీరు మంచం మీద నుండి బయటకు వచ్చిన తర్వాత, మీరు వెంటనే అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మీరు నాలాంటి వారైతే, చాలామట్టుకు మీ జుట్టు పరుపుల కర్మాగారం నుండి పేలినట్లు కనిపిస్తుంది, మీ ముఖం ఏడు మరుగుజ్జుల్లో ఒకని పోలి ఉంటుంది మరియు మీ శ్వాస అయితే . . . చెప్పాల్సిన అవసరంలేదు, అద్దాలు వాసనలను ప్రతిబింబించనందుకు సంతోషిద్దాం.
మీరు ఇవన్నీ గమనిస్తున్నారని అనుకుందాం. . . కానీ మీరు ఏమీ చేయరు. మీరు అన్ని గందరగోళాలను విస్మరించి, మీ రోజును ప్రారంభించడానికి ఇంటి నుండి బయలుదేరండి. ఊహించలేము కదా! మనలో చాలా మందికి, అటువంటి దృశ్యం ఒక సంక్షోభం అవుతుంది. నిజానికి మనమంతా పని చేయడానికి అద్దాల ముందుకు వస్తాం! మనం చూసే దాని గురించి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ బాధాకరమైన నిజాయితీగల ప్రతిబింబంలో మనం తీక్షణంగా చూస్తాము. మనము సరిదిద్దాల్సిన వాటి కోసం చూస్తాము మరియు మార్చాల్సిన వాటిని మార్చే వరకు మనము ఇంటిని విడిచిపెట్టము. లేకపోతే, అద్దం వైపు ఎందుకు చూడాలి?
దేవుని వాక్యం విషయంలో కూడా ఇదే నిజం. ఇది మన బాహ్య శరీరాన్ని కాకుండా మన ఆంతర్య స్వరూపాన్ని ప్రతిబింబించే దివ్య దర్పణం. అయితే, మనం బైబిల్లో ఎన్నిసార్లు చదవలేదు, “మీరు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి?” అప్పుడు మనం పుస్తకాన్ని మూసివేసి, మార్పులేకుండా ఉంటున్నామా? అపొస్తలుడైన యాకోబు తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈ ఖచ్చితమైన సారూప్యతను ఉపయోగించాడు: “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి” (యాకోబు 1:22).
కాబట్టి, అవసరమైన మార్పులను మనం ఎలా చేయవచ్చు? మనం సత్యాన్ని ఎలా ప్రతిబింబించగలం?
శాస్త్రియైన ఎజ్రా యొక్క పురాతన రచనలలో నేను సమాధానం యొక్క ప్రధాన భాగాన్ని కనుగొన్నాను. అతని పేరును కలిగి ఉన్న పుస్తకంలో, మనం ఇలా చదువుతాము: “ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను” (ఎజ్రా 7:10).
ఈ వచనంలో మనం సత్యాన్ని ప్రతిబింబించే నాలుగు మార్గాలను నేను కనుగొన్నాను.
1. వ్యక్తిగత సమర్పణ చేసుకోండి.
ఈ వచనం ప్రకారం, “ఎజ్రా దృఢనిశ్చయము చేసికొనెను” లేదా, అక్షరాలా చెప్పాలంటే, “తన హృదయాన్ని దానిపై ఉంచుకున్నాడు.” తన మనస్సును సిద్ధపరచుకోకుండా క్రీస్తు కొరకు ఎవరైనా ప్రత్యేకింపబడినవారిగా జీవించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అక్కడ ప్రారంభించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని కలవాలనేది మరియు క్రీస్తుతో మీ నడక గురించి తీవ్రంగా ఆలోచించాలనేది మీ నిర్ణయం. మీ కుటుంబం లేదా సంఘంలో ఎవరూ మీ కోసం దీన్ని చేయలేరు. మీరు దేవునితో నడవడానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోకపోతే సత్యం ఎన్నటికీ నాటుకోదు. అది అక్కడే మొదలవుతుంది.
2. పరిశుద్ధ గ్రంథము యొక్క నమ్మకమైన విద్యార్థిగా తయారవ్వండి.
ఎజ్రా “యెహోవా ధర్మశాస్త్రమును . . . పరిశోధించి” చదవడానికి సమర్పించుకున్నాడు.
శాస్త్రిగా, ఎజ్రాకు ధర్మశాస్త్రం తెలుసు. అయినప్పటికీ, అతను బైబిల్ యొక్క ఆసక్తిగల విద్యార్థిగా మిగిలిపోయాడు. మీరు మీ అద్దం ముందు చేసినట్లే—దిశానిర్దేశం కోసం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మీరు మీ స్వంత సమయంలో మరియు మీ స్వంత మార్గంలో మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. మీరు పని కొరకు వచ్చారు. ఇది రెండవ రహస్యం. కానీ అక్కడే ఆగిపోవద్దు.
3. సత్యాన్ని ఆచరణలో పెట్టండి.
10వ వచనం దగ్గరకు మరలా రండి: “ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనెను” (నొక్కిచెప్పబడింది). మీరు సత్యాన్ని ప్రతిబింబించాలనుకుంటే, మీరు దానిని ఆచరించాలి . . . మీరు సత్యాన్ని ఆచరణలో పెట్టాలి. విధేయత అంటే మొగ్గుచూపడం కాదు, నిరూపించడం.
ఎజ్రా తాను నేర్చుకున్నదానిని చేయడానికి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు, అతను నిజాయితీ, మంచితనము మరియు పరిశుద్ధత వంటి వ్యక్తిత్వ సంబంధమైన విషయాలను గూర్చి అర్థం చేసుకొని అంగీకరించడం నేర్చుకున్నాడు. నిజం తెలుసుకుంటే సరిపోదు. అది నాటుకొని ఉండాలంటే సత్యాన్ని ఆచరణలో పెట్టాలి. అయితే మరో అడుగు ఉంది.
4. సత్యాన్ని మరొకరితో పంచుకోండి.
ఎజ్రా “ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను” (ఎజ్రా 7:10). తరగతి గదిలో ఎవరు ఎక్కువగా నేర్చుకుంటారో తెలుసా? గురువు. ఆదివారం ఉదయం సందేశం నుండి ఎవరు ఎక్కువగా నేర్చుకుంటారో ఊహించండి? పాస్టర్. మీరు కనుగొన్న సత్యాన్ని వేరొకరితో పంచుకోవడానికి మీరు కట్టుబడి ఉంటే, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లేఖనాలను మీరు నేర్చుకుంటారు.
ఆగి ఆలోచించండి. చాలా మంది ప్రజలు తమ జీవితాల్లో నేర్చుకునే దానికంటే ఎక్కువగా బైబిల్ గురించి మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి! మీకు ఎంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది. మీ వైఖరి ద్వారా మీ ఇంటి వాతావరణాన్ని మార్చడానికి . . . మీ సామాజిక సమూహాలను ప్రేమతో ప్రభావితం చేయడానికి . . . మీ చిత్తశుద్ధి ద్వారా మీ కార్యాలయంలో క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి మీరు తగినంత నిజం నేర్చుకున్నారు. మీరు దానిమీద నిర్మించగలిగినట్లైతే ప్రస్తుతం మీకు అవసరమైన సత్యమంతా మీ దగ్గర ఉన్నది. ఇది ఎంత వ్యత్యాసం తీసుకువస్తుంది!
మీ బైబిల్‌లో మీ నిజమైన ప్రతిబింబాన్ని చూడమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అప్పుడు, దానికి నమ్మకమైన విద్యార్థిగా మారడానికి వ్యక్తిగత సమర్పణ చేసుకోండి. తరువాత, సత్యాన్ని ఆచరణలో పెట్టండి. దానిని సైద్ధాంతికంగానే ఉంచడానికి నిరాకరించండి! మీరు ఆ సవాలును స్వీకరించి, భిన్నమైన వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత, దేవుడు మీకు ఏమి బోధిస్తున్నాడో మీరు పంచుకోవడం ప్రారంభిస్తారు.
మీరు సత్యంలో జీవించడం ప్రారంభించిన తర్వాత మీరు ఎంత ప్రయోజనం పొందుతారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటంటే, మీరు దానిని నిజంగా ప్రతిబింబిస్తారు.
Copyright © 2014 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.