జెకర్యా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

యాజకుడైన ఇద్దోకు మనుమడైన జెకర్యా, యూదా ప్రజలు బబులోనులో డెభ్బై సంవత్సరాల చెర నుండి తిరిగి వచ్చిన తరువాత వారికి ప్రవచించాడు (జెకర్యా 1:1; నెహెమ్యా 12:1, 4, 16). జెకర్యా యొక్క తాత బబులోను నుండి తిరిగి వచ్చాడు. అతని యువ మనుమడు, మొదటి ఇశ్రాయేలీయుల బృందంతో కలిసి క్రీ.పూ. 538 లో పారసీకదేశపు రాజైన కోరెషు యొక్క ఆదేశం ప్రకారం మరల అనుమతించబడ్డాడు. అతని వంశపరంపర కారణంగా, జెకర్యా ప్రవక్తతో పాటు యాజకుడు కూడాను. అందువల్ల, అతను పూర్తిగా నిర్మించబడిన ఆలయంలో ఇంతకుమునుపెన్నడూ సేవ చేయకపోయినను, యూదుల ఆరాధన పద్ధతులతో ఆయనకు సన్నిహిత పరిచయం ఉండియుండవచ్చు. తన మొదటి ప్రవచనాల సమయానికి (జెకర్యా 2:4) “యువకుడు” గనుక, అతని జీవితం ఎస్తేరు‌ను పారసీకదేశపు రాణిగా తయారు చేసిన బైబిల్లోని బాగా తెలిసిన రాజైన అర్తహషస్త I (క్రీ.పూ. 485–465) పాలన వరకు విస్తరించింది (ఎస్తేరు 1:1).1

మనమెక్కడ ఉన్నాము?

జెకర్యా అనే యువకుడు, ముఖ్యంగా తన సమకాలీనుడైన హగ్గయితో పోల్చినప్పుడు, ముసలివాడైన ప్రవక్తతో కలిసి ఇటీవల బబులోను నుండి తిరిగి వచ్చిన యూదు శేషానికి ప్రభువు నుండి వచ్చిన సందేశాలను అందించాడు. హగ్గయి యొక్క మొత్తం సందేశానికి చాలా హెచ్చరిక స్వరం ఉన్నప్పటికీ (యూదుల పాపం మరియు స్వీయ-దృష్టిని ఎత్తి చూపడం), జెకర్యా తమ ఆలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ఇశ్రాయేలీయులకు ప్రోత్సాహాన్నిచ్చాడు.

1–8 అధ్యాయాలలో తేదీతో సహా జెకర్యా యొక్క దర్శనాలు మరియు సందేశాలు అన్నీ హగ్గయి కాలవ్యవధిలోనే జరిగాయి. ఇవి క్రీస్తుపూర్వం అక్టోబర్-నవంబర్ 520 నుండి యూదా ప్రజలు పశ్చాత్తాపం చెందాలని పిలుపునిస్తూ ఆరంభమైయ్యాయి (జెకర్యా 1:1). క్రీస్తుపూర్వం 519 ఫిబ్రవరీ 15 న(1:7) విరామం లేని రాత్రిలో అతను ఎనిమిది దర్శనాలను అందుకున్నాడు. తరువాత అతను క్రీస్తుపూర్వం 518 (7:1) డిసెంబర్ 7 న నాలుగు సందేశాలను బోధించాడు. 9-14 అధ్యాయాలలో అతని చివరి సందేశాల తేదీ లేనప్పటికీ, 9:13 లో గ్రీసు ప్రస్తావననుబట్టి చూస్తే ప్రవచనాలు అతని జీవితంలో చాలా ఆలస్యముగా, బహుశా క్రీ.పూ. 480 లలో, ఎజ్రా (క్రీ.పూ. 458) మరియు నెహెమ్యా (క్రీ.పూ. 444) రాకముందే మళ్ళీ యూదు ప్రజలను పునరుజ్జీవింపచేయడానికి వచ్చాయని సూచిస్తుంది.

జెకర్యా ఎందుకంత ముఖ్యమైనది?

జెకర్యా పుస్తకంలో చిన్న ప్రవక్తలలో స్పష్టమైన మరియు అత్యధికమైన సంఖ్యలో మెస్సియానిక్ (మెస్సీయ గురించి) వాక్యభాగాలు ఉన్నాయి. ఆ విషయంలో, జెకర్యా గ్రంథాన్ని యెషయా గ్రంథము యొక్క చిన్న సూక్ష్మ రూపముగా భావించవచ్చు. జెకర్యా గ్రంథము క్రీస్తును ఆయన మొదటి రాకడలో (జెకర్యా 9:9), అలాగే ఆయన రెండవ రాకడలో (9:10-10:12) చిత్రీకరించింది. జెకర్యా ప్రకారం, రక్షకుడిగా, న్యాయాధిపతిగా, చివరికి నీతిమంతుడైన రాజుగా తన ప్రజలను యెరూషలేము నుండి పరిపాలించేవానిగా యేసు వచ్చును (14:8–9).

జెకర్యా యొక్క ఉద్దేశమేమిటి?

“యెహోవా జ్ఞాపకము చేసికొనును” అని అర్థమునిచ్చు జెకర్యా పేరు అతని ప్రవచనాల యొక్క ఉద్దేశ్యానికి సముచితమైయున్నది.2 దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వారు వాగ్దాన దేశము వెలుపల గడిపిన తరువాత కూడా గుర్తుంచుకుంటాడనే నిరీక్షణతో అతని పుస్తకం మొత్తం నిండివున్నది. ప్రవక్త ఎనిమిది దర్శనాల (జెకర్యా 1:1–6:15), నాలుగు సందేశాల (7:1–8:23), మరియు రెండు దేవోక్తుల (9:1–14:21) సాధారణ ఆకృతిని ఉపయోగించి ఆలయ నిర్మాణం పూర్తవ్వాలని అలాగే చివరికి, యెరూషలేము నుండి మెస్సీయ యొక్క భవిష్యత్తు పాలన జరగాలని ఎదురుచూచాడు. చాలా మంది ప్రవక్తల మాదిరిగానే, జెకర్యా భవిష్యత్తును గూర్చి చటుక్కునతీసి వేరుపరచబడిన ఛాయాపటములను చూశాడు; అందువల్ల, జెకర్యా ప్రవచనంలో ఒకదాని తరువాత ఒకటి సంభవించే కొన్ని సంఘటనల మధ్య వాస్తవానికి తరచూ తరాలు లేదా సహస్రాబ్ది వ్యవధి కలిగి ఉంటాయి.

చెర నుండి కొత్తగా తిరిగి వచ్చిన ప్రజలకు, జెకర్యా వారి తక్షణ మరియు సుదూర భవిష్యత్తు గురించి నిర్దిష్ట ప్రవచనాన్ని అందించాడు-నిస్సందేహంగా ఇదొక గొప్ప ప్రోత్సాహం. వారి దేశం వారి పాపానికి తీర్పు తీర్చబడుతుంది (5:1–11), కాని వారు కూడా పరిశుద్ధపరచబడి పునరుద్ధరించబడతారు (3:1–10), మరియు దేవుడు తన ప్రజలను పునర్నిర్మిస్తాడు (1:7–17). జెకర్యా తన పుస్తకాన్ని సుదూర భవిష్యత్తును చూడటం ద్వారా ముగించాడు, మొదట ఇశ్రాయేలు మెస్సీయను తిరస్కరించినప్పుడు (9:1–11:17), ఆపై ఇశ్రాయేలు చివరకు ఆయన యొక్క రాబోయే పాలనలో విమోచింపబడినప్పుడు (12:1–14:21 ).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మీరు నిరుత్సాహంతో యిబ్బందిపడుచున్నారా? జెకర్యా గ్రంథమును చదవండి. ఈ పుస్తకంలో యూదా ప్రజలపై మరియు ఇతరులనేకులపై తీర్పులను గూర్చి కొంత భాగమున్నప్పటికీ, తన ప్రజలపై ప్రభువు యొక్క భవిష్యత్తు పాలనలో నిరీక్షణతో ఇది పొంగిపొర్లుతుంది. రోజువారీ జీవితంలో నిరుత్సాహపరిచే సంఘటనలలో చిక్కుకోవడం, మన దృక్పథాన్ని కోల్పోవడం అలాగే నిరీక్షణలేని ప్రజలుగా జీవించడం చాలా సులభం. జెకర్యా పుస్తకం మన జీవితంలో అటువంటి ధోరణికి దిద్దుబాటుగా ఉపయోగపడుతుంది. మనకు ఖచ్చితమైన నిరీక్షణ ఒకటి ఉంది. ఎంత ఊరట!

  1. హెబ్రీ లేఖనాలననుసరించి, ఎస్తేరు యొక్క అనేక అనువాదాలు పారసీకదేశపు రాజును అహష్వేరోషు అని పిలుస్తారు. ఇది అర్తహషస్త యొక్క హెబ్రీ పేరు.
  2. F. Duane Lindsey, "Zechariah," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 1545.