ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
మునుపటి అధ్యాయంలో మనం గమనించినట్లుగా, హెబ్రీ బైబిల్లో 1 మరియు 2 సమూయేలును కలిపి ఒకే పుస్తకాన్ని రూపొందించారు. బైబిల్ (పాత నిబంధన) యొక్క గ్రీకు అనువాదమైన సెప్టువాజింట్, మొదట ఈ పుస్తకాలను రెండు భాగాలుగా విభజించింది. ఈ పుస్తకానికి ఒక నిర్దిష్ట రచయిత పేరు పెట్టనప్పటికీ, దీనిలోని సమాచారము ప్రవక్తలైన నాతాను, గాదు మరియు సమూయేలు-ఈ పుస్తకానికి పేరు పెట్టబడిన ప్రవక్త (1 దినవృత్తాంతములు 29: 29), వ్రాసి సేకరించిన పత్రాల నుండి సంకలనం చేయబడింది.
మనమెక్కడ ఉన్నాము?
రెండవ సమూయేలు గ్రంథము ఇశ్రాయేలు దేశంలో దావీదు యొక్క పాలన కాలములో ఏర్పాటు చేయబడింది. అలాగే ఇశ్రాయేలు రాజుగా తన నలభై సంవత్సరాల కాలమును (క్రీ.పూ. 1011-971) ఈ గ్రంథము వెంబడించింది.
రెండవ సమూయేలు ఎందుకంత ముఖ్యమైనది?
మొదటి సమూయేలు ఇశ్రాయేలు యొక్క రాచరికం గురించి పరిచయం చేసింది. 2 సమూయేలు దావీదు రాజవంశం యొక్క స్థాపన, అలాగే దేవుడు ఎన్నుకున్న నాయకుడి క్రింద ఇశ్రాయేలు యొక్క విస్తరణను గూర్చి వివరించింది. సౌలు మరణం గురించి దావీదు తెలుసుకున్న విషయముతో ఈ పుస్తకం తెరుచుకుంటుంది. సౌలు మరియు తన ప్రియ స్నేహితుడైన యోనాతాను మరణాలపై దావీదు విలపించడం (2 సమూయేలు 1: 19-27) అనేది వారి మరణమును గూర్చి దావీదు యొక్క వ్యక్తిగత దుఃఖాన్ని ప్రత్యక్షముగా చూపించింది. యెహోవా త్వరగా దావీదును యూదా గోత్రముపై (2: 4) ఆ తరువాత ఇశ్రాయేలీయులందరిపై తన అభిషిక్తుడైన రాజుగా (5: 3) ఏర్పరచి, మొత్తం పన్నెండు గోత్రములను ఏకం చేసి దేశమును దృఢపరచాడు.
మొదటి పది అధ్యాయాలు దావీదును యుద్ధంలో విజేతగా, ప్రజలచే ప్రశంసించబడినవానిగా, దీన దరిద్రుల పట్ల దయగలవానిగా మరియు దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉండటాన్ని చూపించాయి. నిబంధన మందసమును స్వస్థానమునకు తిరిగి తీసుకువస్తున్నప్పుడు (6: 12-16) దావీదు యెరూషలేము వీధుల్లో యెహోవా దేవుని ఎదుట నాట్యమాడటం మనం చూస్తాము. "తన తండ్రియైన యోనాతాను నిమిత్తము" (9: 7) దావీదు ఉపకారము చూపిన యోనాతాను యొక్క కుంటికాళ్లుగల కుమారుడైన మెఫీబోషెతును మనం కలుస్తాము.
అయినను పరిశుద్ధ గ్రంథము యొక్క రచయితలు తమ వీరుల లోపాలను ఉపేక్షించలేదు. తరువాతి అధ్యాయాలలో, బత్షెబతో దావీదు చేసిన వ్యభిచారం (2 సమూయేలు 11: 1–27) వలన అనేక విషాదాలు సంభవించాయి: వారి బిడ్డ మరణం (12: 18), దావీదు కుమార్తెయైన తామారును అతని కుమారుడైన అమ్నోను అత్యాచారం చేయటం (13: 1–39), అమ్నోను యొక్క హత్య (13: 28-30), తన కుమారుడైన అబ్షాలోము చేత దావీదు రాజకీయంగా పడగొట్టబడటం (15: 1–37), అటుపిమ్మట అబ్షాలోము యొక్క మరణం (18: 1–33).
తన కడపటి సంవత్సరాల్లో శ్రమలు ఉన్నప్పటికీ, దావీదు దేవుని యొక్క క్షమాపణను మరియు దయను పొందుకొని సంతోషించాడు. అతని పాపాలపై అతనికున్న నిజమైన దుఃఖము మరియు విచారము అతని పశ్చాత్తాపపడే హృదయాన్ని వెల్లడించింది, యిటువంటి హృదయమే ప్రభువుకు ప్రీతికరమైనది.
రెండవ సమూయేలు యొక్క ఉద్దేశమేమిటి?
పుస్తకానికి మరియు మొత్తం బైబిల్ చరిత్రకు మూలము ఈ 2 సమూయేలు 7: 16, "నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును." ఈ దైవిక వాగ్దానం దావీదు నిబంధన అని పిలువబడే ఇంకొక నిబంధనకు నాంది పలికింది, దీనిలో దేవుడు దావీదు ఇంటికి శాశ్వతమైన సింహాసనాన్ని వాగ్దానం చేశాడు. “దావీదు యొక్క విశ్వాసం వల్ల, దేవుడు సౌలు వారసులతో వ్యవహరించినట్లుగా దావీదు యొక్క వారసులతో వ్యవహరించలేదు. పాపం శిక్షించబడుతుంది, కాని దావీదు యొక్క వంశము పూర్తిగా కొట్టివేయబడదు.”1
దావీదు 89 వ కీర్తనలో దేవుని విశ్వాస్యతను కొనియాడాడు. దైవావేశము వలన ఈ క్రింది మాటలు రాశాడు:
"నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను." (కీర్తన 89: 34–37)
దావీదుకు దేవుడిచ్చిన బేషరతు వాగ్దానం చివరికి దావీదు యొక్క వారసుడైన యేసుక్రీస్తులో నెరవేరుతుంది. ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత భూమిని శాశ్వతంగా కలిగి ఉంటారని ఎడతెగని వాగ్దానం కూడా ఈ నిబంధనలో ఉన్నది.
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
దావీదు "యెహోవా చిత్తానుసారమైన మనస్సుగలవాడు" (1 సమూయేలు 13: 14) అని తెలిసినదే. ఎందుకంటే, అతను చాలా ఘోరముగా పాపము చేసి తప్పులు చేసినప్పటికీ, అతను ఆ వైఫల్యాలను అంగీకరించి దేవుని ముందు పశ్చాత్తాప పడ్డాడు. పశ్చాత్తాపం అంటే పాపం నుండి తొలగి నీతి వైపు తిరగడం. మనం పరిపూర్ణులముకాము అని మన తండ్రికి తెలుసు. కాబట్టి మనము విశ్వాసం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులమవటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. మరియు మన రక్షణ సురక్షితమైనప్పటికీ, మన అనుదిన పాపాలు దేవునితో మన సంబంధాన్ని అడ్డగిస్తాయి. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు, వినయంతో ప్రభువు వైపు తిరిగినప్పుడు, ఆయన మనలను క్షమించి, ఆయనతో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తాడు.
చివరిగా అపొస్తలుడైన యాకోబు దావీదుకు తగిన మాట రాశాడు. ఇది మీది కూడా కావచ్చు: "ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును" (యాకోబు 4: 10).
- Lawrence O. Richards, The Teacher's Commentary (Wheaton, Ill.: Victor Books, 1987), electronic ed., accessed through Libronix Digital Library System.