ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
పత్రిక ప్రారంభంలో పేతురు తనను తాను “యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడు” అని పరిచయం చేసుకున్నాడు మరియు ఈ పత్రికను “మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి” (2 పేతురు 1:1) అని సంబోధించాడు. తన మొదటి పత్రికను అందుకున్న అదే విశ్వాసుల సమూహానికి పేతురు వ్రాస్తున్నాడని తరువాత మాత్రమే స్పష్టమవుతుంది. 2 పేతురు 3:1 లో, “యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను” అని రచయిత తలపోయుచున్నాడు.
మనమెక్కడ ఉన్నాము?
క్రీస్తుశకం 64-66లో 1 పేతురు రాసిన వెంటనే పేతురు రోమా నుండి ఈ పత్రిక రాశాడు. అదే మొదటి సమూహానికి ఇంత త్వరగా మరొక పత్రికను వ్రాయుటకు ఏమి ప్రేరేపించినది? పత్రికలోని విషయాలనుబట్టి చూస్తే, ఆసియ మైనరులోని సంఘములలో తప్పుడు బోధకులను గూర్చిన నివేదికలను పేతురు అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రజలలో తప్పుడు బోధను వ్యాప్తి చేసే వారి కపటమైన ఉనికిని గురించి అపొస్తలుడు సంఘమును హెచ్చరించాడు (2 పేతురు 2:1). ఇటువంటి ఇబ్బందులు అంత్య దినములకు సూచనగా (3:3) ఉన్నవని హెచ్చరించాడు. పేతురు తన ప్రజలు నిబ్బరముగా ఉండాలని ప్రోత్సహించి, ఈ విధముగా నిబ్బరముగా ఉండటం ఎలా సర్వోత్తమముగా చేయాలో వారికి సూచించాలని కోరుకున్నాడు.
రెండవ పేతురు ఎందుకంత ముఖ్యమైనది?
ఆసియ మైనరు సంఘములు పేతురు యొక్క మొదటి పత్రికలో ప్రసంగించిన హింస మరియు బాధలతో మాత్రమే పోరాడలేదు; వారు తమ శ్రేణుల్లో కలహాలు మరియు విభేదాలను కూడా కలిగి ఉన్నారు. క్రైస్తవులలో భిన్నాభిప్రాయములు మరియు తప్పుడు బోధ యొక్క ఆటుపోట్లను నివారించే ప్రయత్నంలో, పేతురు దేవుని యొక్క సరైన జ్ఞానాన్ని నేర్చుకోవడం, దాన్ని గట్టిగా పట్టుకోవడం యొక్క ప్రాముఖ్యతను గూర్చి నొక్కి చెప్పాడు. వాస్తవానికి, ఈ భావన అతనికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ చిన్న, మూడు-అధ్యాయాలు కలిగిన పత్రికలో జ్ఞానం అనే పదం ఏదోయొక రూపంలో పదిహేనుసార్లు కనిపిస్తుంది.
రెండవ పేతురు యొక్క ఉద్దేశమేమిటి?
తన రెండవ పత్రికలో పేతురు యొక్క ఇతివృత్తం చాలా సరళమైనది: తప్పుడు బోధకు పరిష్కారంగా మరియు క్రీస్తు రెండవ రాకడ యొక్క వాగ్దానాన్ని తలచుకుంటూ తప్పుడు బోధకులకు సరైన సమాధానం ఇచ్చునట్లుగా దేవుని వాక్యం ద్వారా ఆత్మీయ పరిపక్వతను వెంబడించండి (2 పేతురు 1:3, 16). అపరిపక్వ క్రైస్తవుల చెవుల్లో తప్పుడు బోధకులు తమ మధురమైన మాటలను గుసగుసలాడటం ప్రారంభించినప్పుడు, క్రీస్తు శరీరం విడిపోవటం మొదలవుతుంది, ఆపైన మొట్టమొదటిగా దానికున్న విలక్షణమైనదాన్ని కోల్పోతుంది- అదే యేసు క్రీస్తు యొక్క ప్రత్యేకమైన స్వరూపము మరియు కార్యముపై విశ్వాసం. క్రైస్తవుని ఎదుగుదలకు ప్రాథమిక సాధనంగా పేతురు దేవుని వాక్యాన్ని పదేపదే సూచిస్తున్నాడు (1:4, 19–21; 3:1-2, 14-16).
దేవుని యొక్క నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరియు విశ్వాస జీవితాన్ని "పూర్ణజాగ్రత్తగలవారై" జీవించడానికి పేతురు తన పాఠకులను ప్రోత్సహించాడు, తద్వారా వారు "శాంతముగలవారై, ఆయన [యేసు] దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడతారు" (1:5; 3:14). మరియు విశ్వాసులు అతని సలహాను పాటించకపోతే, వారు తమ క్రైస్తవ సమాజాన్ని తప్పుడు బోధకులకు ఇచ్చివేసినట్లే, వీరు “కల్పనావాక్యములు చెప్పుచు. . . లాభము సంపాదించు” కోవటానికి చూస్తారు (2:3).
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
పేతురు పత్రిక యొక్క గ్రహీతల మాదిరిగానే, మనమందరం కష్ట సమయాల్లోగుండా వెళ్తాము. మన ఇబ్బందుల యొక్క మూలం ఎక్కడి నుండో లేక మనకు దగ్గరగా ఉన్నవారి నుండో వచ్చినప్పుడు ఆ శ్రమలు మనలను మరింత కృంగదీస్తాయి. మన వ్యక్తిగత జీవితాల్లో ఇది నిజమని మనకు తెలుసు: వివాహంలో చీలిక, అవివాహిత కుమార్తె యొక్క ఊహించని గర్భధారణ లేదా బంధువుతో దూషణకరమైన సంబంధం. అయితే ఇది సంఘములో కూడా నిజమై ఉన్నది.
ముఖ్యంగా సంబంధాలు మరియు వేదాంతశాస్త్ర రంగాలలో విశ్వాసులు అనేక విధాలుగా విభేదాలను సృష్టించవచ్చు. మన కుటుంబాలలో మరియు మన సంఘాలలో ఆ విధమైన అసమ్మతి నుండి కాపాడుకోవటానికి ఆయన ఎవరోయని దేవుని ప్రజలు తెలుసుకోవాలి. ఆయన వాక్యము ద్వారా మనకున్న దేవుని యొక్క జ్ఞానం మనలను చీల్చాలని బెదిరించే సంఘర్షణలకు వ్యతిరేకంగా రక్షించుటకు మొదటి వరుసలో ఉంటుంది. పేతురు వ్రాసినట్లుగా, "ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి" (2 పేతురు 3:17-18).
దాన్ని దృష్టిలో పెట్టుకుని, మీ విశ్వాసం పెరగడానికి మీరు ఏ మార్గాలను ఎంచుకుంటున్నారు? దేవుని గురించి సరైన జ్ఞానంతో మన మనస్సులను కాపాడుకోవడానికి సమయం తీసుకుందాం, తద్వారా దేవుడు మనకోసం నిర్దేశించిన మార్గం నుండి మనం తొలగిపోకుండా ఉండవచ్చు.