ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
పౌలు తన జీవితంలో 2 కొరింథీయులను దుర్బల సమయంలో రాశాడు. కొరింథులోని సంఘము కష్టపడుతోందని అతను తెలుసుకున్నాడు. అలాగే ఆ స్థానిక విశ్వాసుల ఐక్యతను కాపాడటానికి చర్యలు తీసుకోవటానికి ప్రయత్నించాడు. క్రీస్తు నిమిత్తం తాను అనుభవించిన హింస గురించి, అలాగే దేవునిపై ఆధారపడేలా శరీరంలో ఉంచబడిన ఒక మర్మమైన ముల్లును గురించిన వివరాలు పౌలు వెల్లడించడంతో ఈ పత్రిక వ్యక్తిగత వ్యాఖ్యలతో గూఢార్థంగల మాటలు కలిగియున్నది.
మనమెక్కడ ఉన్నాము?
1 కొరింథీయుల పత్రికను అందించడానికి తిమోతిని ఎఫెసు నుండి పంపిన తరువాత, పౌలు సంఘము పట్ల తనకున్న శ్రద్ధతో, కొరింథును తానే స్వయముగా సందర్శించాడు. తరువాత, పౌలు ఎఫెసులోని తన పనిలో తాను పడ్డాడు, అక్కడ నుండి కొరింథీయులకు ఒక దుఃఖకరమైన పత్రిక రాశాడు గాని అది భద్రపరచబడలేదు (2 కొరింథీయులకు 2:1–11; 7:8 చూడండి). అప్పుడు పౌలు మాసిదోనియకు బయలుదేరాడు. అక్కడికి చేరుకున్న తరువాత, తీతు నుండి కొరింథీయులకు సంబంధించిన ఒక మంచి నివేదిక ఆయనకు వచ్చింది (7:13), ఈ నివేదిక పరిశుద్ధ గ్రంథములో “2 కొరింథీయులకు” పేరుతో పౌలు వారికి నాల్గవ పత్రిక రాయడానికి దారితీసింది. (కొరింథీయులకు పౌలు రాసిన మొదటి రెండు పత్రికల గురించి చదవడానికి 1 కొరింథీయుల పేజీ చూడండి.) అపొస్తలుడు ఈ పత్రికను క్రీ.శ. 56 చివరిలో, బహుశా ఫిలిప్పీ నగరంలో రచించి ఉంటాడు.
2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?
ఈ పత్రిక మరే ఇతర క్రొత్త నిబంధన పుస్తకంలో లేని పౌలు జీవితంపై వ్యక్తిగత అవగాహనను అందిస్తుంది. అయితే, 8 మరియు 9 అధ్యాయాలలో, అతని పత్రిక ఇతరులకు ఇవ్వాలన్న దేవుని ప్రణాళికను కూడా స్పష్టంగా తెలుపుతుంది. పౌలు మొదట ఎక్కువగా అన్యజనులు ఉన్న మాసిదోనియ సంఘముల యొక్క దాతృత్వమును ఉదాహరించటంపై దృష్టి పెట్టాడు. వారు యెరూషలేములోని తమ యూదు క్రైస్తవ సోదర, సోదరీలకు ఇచ్చారు. అప్పుడు అతను కొరింథీ విశ్వాసులను యెరూషలేములో చేసే పనికి తమ సొంత విరాళాలు ఇవ్వమని హెచ్చరించాడు. క్రైస్తవులు ఇవ్వడం గురించి అనేక వాస్తవాలు ఈ రెండు అధ్యాయాలలో స్పష్టమవుచున్నాయి: క్రైస్తవులు వారి ఆర్థిక సామర్ధ్యాల ప్రకారం ఔదార్యముగా ఇస్తారు మరికొన్ని సమయాల్లో తమ సామర్థ్యమును మించి యిస్తారు; క్రైస్తవులు తమ ధనమును జాతి మరియు జాతీయ భేదాలు లేకుండా ఇస్తారు; ఇవ్వడానికి తీర్మానం చేసుకున్న క్రైస్తవులు ఆ ప్రమాణాలను పాటించాలి; మరియు క్రైస్తవులు బలవంతంగా కాకుండా సంతోషంగా ఇవ్వాలి.
2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?
కొరింథులోని సంఘము ఇటీవల విభేదాలు మరియు తగాదాలతో పోరాడుతోంది. పౌలు 2 కొరింథీయులను వ్రాసే సమయానికి చాలామంది విశ్వాసులకు సమస్య పరిష్కరించబడింది. చాలామంది తమ పాపపు మార్గముల విషయమై పశ్చాత్తాపపడ్డారు. మరియు ఒకరితో ఒకరు, అలాగే పౌలు నాయకత్వంపట్ల కూడా తిరిగి ఐక్యతలోకి వచ్చారు.
అయినప్పటికీ, తన అపొస్తలత్వమును మరియు అతని ఉపదేశమును సమర్ధించుకోవటానికి భావప్రకటన ఇంకా అవసరమని పౌలు భావించాడు. సంఘములోని కొందరు అతని సాత్వికతను నైతిక బలహీనతకు లేదా అధికారం లేకపోవటానికి సంకేతంగా భావించారు (2 కొరింథీయులకు 10:1-2). ఈ ఆరోపణలు, పౌలు తాను ఇతర అపొస్తలుల మాదిరిగానే ప్రాముఖ్యత కలిగి ఉన్నాడని, క్రైస్తవ విశ్వాసం గురించి తనకు లోతైన జ్ఞానం ఉందని, క్రీస్తు నామములో తీవ్ర శారీరక శిక్ష అనుభవించాడని వాదించడం ద్వారా తనను తాను సమర్ధించుకోవడానికి దారితీసాయి. అలాగే దేవుని నుండి దర్శనాలు మరియు ప్రకటనలు అందుకున్నాడు (11:1–12:13).
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
విభజనలు మరియు తగాదాల నుండి పశ్చాత్తాపం చెందిన నేపథ్యంలో పౌలు కొరింథీయులకు వ్రాసినట్లే, మనకొరకు ఈనాటి సందేశం స్పష్టంగా ఉంది: ఐక్యతతో జీవించాలంటే మనము ఒకరినొకరు వినయంగా క్షమించుకోవాలి మరియు మన నాయకులను అనుసరించాలి. క్రైస్తవులైయుండి కూడా మనం ఒకరినొకరు బాధించుకుంటున్నామని, మనకు అన్యాయం చేసిన వారిని క్షమించాల్సిన అవసరం ఉందని రెండవ కొరింథీయులు మనకు గుర్తుచేస్తున్నది (2 కొరింథీయులకు 2:7). పశ్చాత్తాపం చెందినవారిని క్షమించమని కొరింథీ విశ్వాసులను హెచ్చరించుటకు పౌలు సుముఖంగా ఉన్నాడు. నోటితో వ్యతిరేకించిన వారికి విరోధముగా తన అపొస్తలత్వమును సమర్థించుకున్నాడు. ఇవన్నీ దేవుని ప్రజల మధ్య ఈ రకమైన జీవన విధానానికి అపొస్తలుని సమర్పణను వివరిస్తుంది.
ఇతరులను క్షమించటానికి అలాగే / లేదా మీ దైవిక నాయకులను అనుసరించడానికి మీరు ఎన్ని విధాలుగా యిబ్బందిపడుచున్నారు? మనలోని గర్వ స్వభావము తరచుగా మనల్ని పరాజితులను చేస్తుంది లేదా ఇతరుల కోరికలకు సంబంధించి మన నిరాశ మరియు కోపాన్ని కలిగి ఉండటానికి దారితీస్తుంది. ఏదేమైనా, యేసు యొక్క సమాధానపరచు పరిచర్య (5:17-19) గురించి పౌలు మనకు గుర్తు చేసినట్లే, అనైక్యత ఏలుతున్న సంబంధాలను పునరుద్ధరించటానికి మనం ప్రయత్నించాలి. ప్రజలందరి మధ్య వినయంతో జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ స్వంత జీవితంలో నాయకులతో మరియు ఇతర విశ్వాసులతో విభేదాల అంధకూపమును జాగ్రత్తగా చూసుకోండి.