రెండవ దినవృత్తాంతములు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

చెరలోనుండి విడుదల పొందిన తరువాత యూదా పండితుడొకడు తన ప్రజల చరిత్రను వివరించడానికి అనేక చారిత్రక వనరుల నుండి విషయాలను సంకలనం చేశాడు. ఎజ్రా సాధ్యమైన అభ్యర్థిగా పేర్కొనబడినప్పటికీ, ఈ పండితుని పేరు చెప్పబడలేదు, మనకు తెలియదు. “చరిత్రకారుడు” ఎవరైనప్పటికీ, అతను ఈ చారిత్రక వృత్తాంతమును వ్రాయడానికి అధికారిక మరియు అనధికారిక పత్రాలను ఉపయోగించాడు. ఇంతకు ముందే గుర్తించినట్లుగా, 2 దినవృత్తాంతములు మొదట 1 దినవృత్తాంతములతో కలిసి ఒకే పుస్తకంగా ఉన్నది. సుమారు క్రీ.పూ. 200 లో పాత నిబంధన యొక్క గ్రీకు భాషాంతరమైన సెప్టువాజింట్ అనువాదం జరిగినప్పుడు రెండు పుస్తకాలుగా ఈ దినవృత్తాంతములు వేరు చేయబడింది.

మనమెక్కడ ఉన్నాము?

సొలొమోను సింహాసనాన్ని అధిష్టించడం (క్రీ.పూ. 971) దగ్గర నుండి దక్షిణ యూదా రాజ్యం చివరకు క్రీ.పూ. 586 లో బబులోను చెరలోనికి వెళ్ళే వరకు జరిగిన కాలము రెండవ దినవృత్తాంతములు కలిగియున్నది. పుస్తకం యొక్క దృష్టి యూదాపై ఉంది. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు చరిత్ర కంటే, యూదాను పరిపాలించిన దావీదు యొక్క వారసుల కథను చెప్పడంలో రచయిత ఎక్కువ శ్రద్ధ చూపాడు. దేవాలయం ఉన్న యెరూషలేము యొక్క ప్రాధాన్యత, ఈ పుస్తకం యొక్క ముఖ్యాంశమైన యాజకత్వముతో పాటు సమానముగా ఉన్నది.

2 దినవృత్తాంతములు బహుశా క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, “బబులోను సామ్రాజ్యం పతనమైన తరువాత యూదుల యొక్క చిన్న సమూహం యూదాకు తిరిగి వచ్చిన తరువాత వ్రాయబడింది. ఆలయాన్ని పునర్నిర్మించడం మరియు పరిశుద్ధ భూమిలో మరల స్థిరపడే ఉద్దేశముతో, ఈ చిన్న సమాజం తమ మనుగడ కోసం శ్రమలు పడింది.”1 చివరికి యూదులు ఆలయాన్ని పునర్నిర్మించారు, కాని తమ భూమిని తిరిగి పొందే పోరాటంలో కొన్నేళ్లు కొట్టుమిట్టాడారు. ఈ నేపథ్యంలో, నాయకులు దేవుని ధర్మశాస్త్రానికి విశ్వాసపాత్రులుగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలపై చరిత్రకారుడు దృష్టి పెట్టి యూదుల చరిత్రను వర్ణించాడు.

రెండవ దినవృత్తాంతములు ఎందుకంత ముఖ్యమైనది?

సొలొమోను తొలి తిరుగుబాట్లను నలగ్గొట్టి, ఏకీకృత దేశంపై తన సింహాసనాన్ని స్థాపించుకొని, తన అధికారాన్ని పటిష్టం చేసికోవడంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది (1 రాజులు 2). దేవుడు తన తండ్రియైన దావీదుకు ఇచ్చిన ప్రణాళికలను ఉపయోగించి అద్భుతమైన దేవుని ఆలయాన్ని నిర్మించాడు. సొలొమోను రాజుకు తొమ్మిది అధ్యాయాలు నియమింపబడితే, వాటిల్లో ఆరు అధ్యాయాలు ఆలయ నిర్మాణంపై దృష్టి సారించాయి, ఈ పని ఆయన పుట్టుకకు ముందే కేటాయించబడింది (2 దినవృత్తాంతములు 2–7).

సొలొమోను కుమారుడైన రెహబాము పాలనలో రాజ్యం విడిపోయినప్పుడు, ఇశ్రాయేలు నలుమూలల నుండి లేవీయులు వచ్చి రెహబాము పక్షాన ఉండి, వారి యాజక విధులను కొనసాగించడానికి యెరూషలేముకు గుంపులు గుంపులుగా వచ్చేశారు (10:1–19). కానీ నీతి మరియు భ్రష్టత్వము అనే చక్రం సింహాసనాన్ని వర్ణించింది. కొంతమంది రాజులు పూర్తిగా చెడ్డవారై, దేవుని ధర్మశాస్త్రాన్ని విస్మరించి, ప్రజలను పాపాత్మకమైన ప్రవర్తనల్లోకి నడిపించారు. సొలొమోను వంటి కొంతమంది రాజులు నీతిమంతులుగా ఆరంభించి తరువాత పడిపోయారు. మనష్షే (33: 1-25) వంటి వారు తప్పిపోయారుగాని మరల పశ్చాత్తాపపడ్డారు. హిజ్కియా, యోషీయా వంటి కొద్దిమంది రాజులు “అతడు యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు ప్రవర్తించెను” (29:2; 34:2) అనే సారాంశంతో ఘనపరచబడ్డారు. 2 దినవృత్తాంతములంతటా, విశ్వసనీయతకు తగిన ప్రతిఫలం లభించింది; ద్రోహమునకు తీర్పు లభించింది.

ఒక చరిత్ర ప్రేమికుడు ఈ కాలంలోని లౌకిక చారిత్రక వ్యక్తులను గూర్చిన ప్రస్తావనను ఎంతగానో ఆస్వాదిస్తాడు. అష్షూరు యొక్క తిగ్లత్పిలేసరు నుండి, అష్షూరుకు చెందిన సన్హెరీబు వరకు, బబులోనుకు చెందిన నెబుకద్నెజరు వరకు ఉన్నటువంటి యూదేతర విదేశీ నాయకులు యూదా రాజకీయ దశలో ప్రముఖ పాత్ర పోషించారు.

రెండవ దినవృత్తాంతములు యొక్క ఉద్దేశమేమిటి?

చెరలోనుండి విడుదల పొందిన యూదులకు వారి దేవుడు ఎవరో, ఆయన ఎలా పనిచేశారో గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. చరిత్ర వారికి ఉత్తమ పాఠాన్ని అందించింది. "రచయిత యూదా చరిత్రను ఉపయోగించి నిరూపించాలనుకున్నదేమంటే ఆయనయందు నమ్మకముంచి, సంతోషంగా ప్రభువును ఆరాధించే తన ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు."2

ఒక రచయిత ఇలా పేర్కొన్నాడు:

ఆరాధనకై పిలుస్తూ నిరీక్షణకు ఆహ్వానము యిచ్చేదే చరిత్ర. యూదాలో యిబ్బందులు పడుతున్న యూదుల సమాజం గత దైవిక తరాల మాదిరిగానే దేవునికి మొదటి స్థానం ఇచ్చి, ఆరాధన పట్ల ఇదే విధమైన ఉత్సాహంతో వారి నిబద్ధతను చూపిస్తే, దేవుడు తన విశ్వాస్యతను ఖచ్చితంగా వారి పట్ల చూపిస్తాడు. దావీదు యొక్క వంశము మరోసారి సీయోను సింహాసనాన్ని అధిష్టిస్తుంది మరియు దేవుని రాజ్యము భూమియందంతటా స్థాపించబడుతుంది.3

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఇశ్రాయేలీయులకు చేసినట్లుగా, చరిత్ర మన జ్ఞాపకాలను కదిలించగలదు. దేవుడు మిమ్మును ఆశీర్వదించిన సందర్భాలను మీరు గుర్తు చేసుకోగలరా? అలాంటి జ్ఞాపకాలు ఆశీర్వాదకరమైనవే గాక, పరిశుద్ధతలో నిరీక్షణతో, ధైర్యముతో ముందుకు సాగడానికి ప్రోత్సాహకాలుగా ఉంటాయి.

దేవుడు మీ జీవితంలో పనిచేసిన నిర్దిష్ట సమయాలను గుర్తుకు తెచ్చుకోవటానికి మీరు కష్టపడుతుంటే, మీ భక్తిసంబంధమైన అభ్యాసమును పరిశీలించుకోండి. మీరు చేసిన ప్రార్థనలు, వాటికి వచ్చిన సమాధానములను గుర్తుచేసే ప్రార్థన దినచర్య పుస్తకము మీ స్వంత “చరిత్ర” కరదీపికగా పనిచేస్తుంది. దేవుడు తన పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆలాగున మనం కూడా ఆయన మంచితనమును గూర్చి ఆయనను స్తుతించగలుగుతాము మరియు మన భవిష్యత్తుపై నిరీక్షణ కలిగియుండవచ్చు!

  1. Larry Richards, The Bible Reader's Companion (Wheaton, Ill.: Victor Books, 1991), electronic ed., accessed through Libronix Digital Library System.
  2. Richards, The Bible Reader's Companion.
  3. Richards, The Bible Reader's Companion.