రూతు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

టాల్ముడ్ (యూదా సంప్రదాయం) ప్రకారం, రూతు గ్రంథమును ప్రవక్తయైన సమూయేలు రాశాడు. రచయితను గూర్చి ఈ గ్రంథము ఏమీ చెప్పలేదు, కాని దీన్ని వ్రాసినవారు ఎవరైనను సరే చాలా నైపుణ్యం కలిగిన కథకుడు. ఇది ఇప్పటివరకు వ్రాయబడిన కథల్లో అత్యంత అందమైన చిన్న కథ అని పిలువబడింది.

పుస్తకం యొక్క చివరి వచనాలు రూతును ఆమె మనవడైన దావీదు (రూత్ 4: 17–22) తో అనుసంధానించాయి కాబట్టి ఇది అతని అభిషేకం తరువాత వ్రాయబడిందని మనకు తెలుస్తుంది. ఈ పుస్తకం చివర్లోని వంశావళి, న్యాయాధిపతుల రోజుల నుండి ఉన్నటువంటి దావీదు యొక్క వంశాన్ని చూపిస్తుంది. కాబట్టి అతనే రాచరికమునకు హక్కుదారుడనటానికి మద్దతుగా ఈ వంశావళి ఉపయోగపడుతుంది. సొలొమోను గూర్చి ప్రస్తావించలేదు గనుక దావీదు సింహాసనాన్ని అధిరోహించక మునుపు ఈ పుస్తకం వ్రాయబడిందని కొందరు నమ్ముచున్నారు.

మనమెక్కడ ఉన్నాము?

రూతు యొక్క సంఘటనలు క్రీ.పూ 1160 మరియు క్రీ.పూ 1100 మధ్య, న్యాయాధిపతుల తరువాతి కాలంలో సంభవించాయి (రూతు 1: 1). ఇశ్రాయేలీయుల యొక్క మతభ్రష్టత్వం మరియు అనైతికత వల్ల కలిగిన బాధలతో నిండిన చీకటి రోజులు ఇవి. దేవుడు పాపిష్ఠులైన తన ప్రజలపైకి కరువు మరియు యుద్ధం రాజేసి తీర్పులు తీర్చాడు. కరువును గూర్చిన వార్తతో రూతు గ్రంథము ఆరంభమౌతుంది. ఈ కరవు నయోమి కుటుంబాన్ని బేత్లెహేము నుండి పొరుగున ఉన్న మోయాబు దేశములోనికి వెళ్ళునట్లు చేసింది. "వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని" (1: 6) విని, నయోమి రూతుతో కలిసి చివరికి బేత్లెహేముకు తిరిగి వచ్చింది.

న్యాయాధిపతులలో కనిపించే పాపము, బాధ, విజ్ఞాపన మరియు రక్షణ యొక్క చక్రీయ విధానంలో భాగంగా పాఠకులు ఈ సమయాన్ని గుర్తించవచ్చు. కానీ ఈ కథ దేవునికి మరియు విశ్వాసపాత్రులైన తన ప్రజలకి మధ్య ఉన్న ప్రేమ యొక్క శక్తిని చూపించే కాంతి కిరణంగా నిలుస్తుంది. న్యాయాధిపతులలో కనిపించే ఎక్కువ నిడివిగల కథనాలకు విరుద్ధంగా రచయిత ఒక చిన్న పట్టణంలో కళ్లము దగ్గరనున్న కుటుంబమును గూర్చి క్లుప్తంగా ఒక ప్రత్యేకమైన కోణంలో చూపించాడు.

రూతు ఎందుకంత ముఖ్యమైనది?

Tఈ పుస్తకం నయోమి యొక్క దృక్కోణం నుండి వ్రాయబడింది. ప్రతి సంఘటన ఆమెకు సంబంధించినదే: ఆమె భర్త మరియు కొడుకుల మరణాలు, ఆమె కోడళ్ళు, ఆమె బేత్లెహేముకు తిరిగి రావడం, ఆమె దేవుడు, ఆమె బంధువు, బోయజు, అమ్మడానికి ఆమె భూమి మరియు ఆమె సంతానం. “ఒక స్త్రీ దృష్టితో దేవుడి”1 ని చూపించిన కథకి సమానమైనది లేఖనములో దాదాపుగా మరెక్కడా లేదు.

నయోమిని ఒక ఆడ యోబుతో పోల్చారు. ఆమె అన్నింటినీ కోల్పోయింది: ఇల్లు, భర్త మరియు కుమారులు- అంతేకాదు, యోబు కంటే ఎక్కువే కోల్పోయింది- అదేమిటంటే, ఆమె జీవనాధారము. ఆమె ఇశ్రాయేలు యొక్క అత్యల్పులైన మనుష్యుల వర్గంలో చేరింది. అదే పేదలు మరియు విధవరాండ్ర వర్గము. ఆమె తన దుఃఖంలో దేవునికి మొఱ్ఱపెట్టింది గాని దేవుడు ఆమె మార్గంలో ఉంచిన బహుమతిని చూడటాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆ బహుమతే రూతు.

రూతు సద్భక్తిగల ప్రేమను తనలో ఇముడ్చుకుంది. కరిగించివేసే ఆమె యొక్క విశ్వాసముతో కూడిన ప్రమాణము (రూతు 1: 16–17), స్పష్టంగా వైవాహిక జీవితానికి సంబంధించినది కానప్పటికీ, క్రొత్త జంటలు కోరుకునే భక్తి యొక్క గంభీరతను తెలియజేయడానికి ఆధునిక వివాహ వేడుకలలో తరచుగా చేర్చబడుతుంది. ఈ పుస్తకం దేవుని దయ యొక్క పరిమాణమును బయలుపరచుతుంది. ఆయన తాను ఏర్పరచుకున్న జనాంగములోనికి రూతును స్వీకరించాడు. అంతేగాక, ఏ వంశములో తాను అభిషేకించిన రాజైన దావీదు, ఆ తరువాత తన కుమారుడైన యేసు జన్మిస్తారో, ఆ వంశావళిని కొనసాగించే పాత్రనిచ్చి ఆయన ఆమెను గొప్ప చేశాడు (మత్తయి1: 1, 5).

రూతు యొక్క ఉద్దేశమేమిటి?

దైనందిన జీవితంలో విధేయత కలిగివుంటే అది దేవునికి ప్రీతికరముగా ఉంటుంది. ఇతరులతో మనం చేసే సంభాషణల ద్వారా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేసినప్పుడు, మనం ఆయనకు మహిమ తీసుకొస్తాము. నయోమి కోసం రూతు యొక్క త్యాగం, కృషి దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది. తన సమీప బంధువుడైన నయోమి భర్త పట్ల బోయజు యొక్క విధేయత దేవుని విశ్వాస్యతను ప్రతిబింబిస్తుంది. రూతు యొక్క భవిష్యత్తు కోసం నయోమి యొక్క ప్రణాళిక నిస్వార్థ ప్రేమను ప్రతిబింబిస్తుంది.

విధేయత తీసుకొచ్చే ఆశీర్వాదాలను ఇశ్రాయేలీయులకు రూతు పుస్తకం చూపించింది. ఈ పుస్తకం వారి దేవుని ప్రేమగల, నమ్మకమైన స్వభావాన్ని వారికి చూపించింది. దేవుడు తన ప్రజల మొఱ్ఱను ఆలకించి ఉత్తరమిస్తాడని ఈ పుస్తకం వెల్లడిపరచింది. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన ఏదైతే బోధించాడో దానిని ఆచరించాడు. తమ భవిష్యత్తు విషయమై చాలా తక్కువ అవకాశాలు కలిగివున్న నయోమి, రూతు అనబడే యిద్దరి విధవరాండ్రకు ఆయన సిద్ధపరచుట చూడగా, ఆయన సమాజముచేత వెలివేయబడిన వారిని ఆదరించి మనల్ని కూడా ఈ విధముగా చేయుమని ఆజ్ఞాపించినట్లు మనం నేర్చుకుంటున్నాము (యిర్మీయా 22: 16; యాకోబు 1: 27).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఇశ్రాయేలు చరిత్రలో ఇశ్రాయేలీయులు అత్యంత బాధ్యతారహితంగా జీవిస్తున్న సమయంలో రూతు పుస్తకములోని చరిత్ర జరిగింది. అలాగే కష్టసాధ్యమైన సమయాల్లో కూడా ప్రజలను దేవుని యెదుట ఎంతో బాధ్యతగా, విశ్వాసమునకు తగినట్లుగా జీవించాలని పిలిచింది ఈ రూతు గ్రంథము. ఈ పిలుపు ఈ రోజు మనకు కూడా స్పష్టంగా వర్తిస్తుంది.

ఎడతెగక తన బిడ్డల బాగోగులను చూసుకొను ప్రేమగల, నమ్మకమైన మరియు బలవంతుడైన దేవునికి మనం సంబంధించినవారము. రూతు మరియు బోయజు మాదిరిగానే, దైవభక్తి లేని సంస్కృతిలో మనం జీవిస్తున్నప్పటికీ, నమ్మకమైన విధేయతతో ఆ దైవ కృపకు స్పందించుటకు పిలువబడ్డాము. మీరు సిద్ధంగా ఉన్నారా?

  1. Carolyn Custis James, The Gospel of Ruth: Loving God Enough to Break the Rules (Grand Rapids: Zondervan, 2008), 28.