రోమీయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

సమీప భవిష్యత్తులో అక్కడికి వెళ్లాలనే కోరికను స్పష్టంగా వ్యక్తం చేసినప్పటికీ, రోమీయులకు పత్రిక రాసినప్పుడు పౌలు రోమా‌కు వెళ్ళనే లేదు (అపొస్తలుల కార్యములు 19:21; రోమీయులకు 1:10–12). అపొస్తలుడు ఇరవై ఆరు వేర్వేరు వ్యక్తులను వారి పేర్లతో పలకరించాడు, అయితే చాలామంది గ్రహీతలకు వ్యక్తిగతీకరించి ఈ పత్రికను రాసిన వ్యక్తి వారికి వ్యక్తిగతంగా అపరిచితుడైన వ్యక్తియై ఉంటాడు. వారు పౌలు గురించి విన్నారని, అలాగే పత్రిక ద్వారా ఘనపరచబడ్డారనడంలో యెటువంటి సందేహం లేదు, కాని పౌలు తన ప్రేక్షకులతో వ్యక్తిగతంగా సంబంధము కలిగియుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. తద్వారా సువార్త సందేశం బహు బలముగా అందుతుంది.

మనమెక్కడ ఉన్నాము?

క్రీ.శ. 57 లో గ్రీకు నగరమైన కొరింథు నుండి, 16 ఏళ్ల నీరో రోమా చక్రవర్తిగా సింహాసనం అధిరోహించిన మూడు సంవత్సరాల తరువాత అపొస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక రాశాడు. క్రీ.శ. 64 లో జరిగిన గొప్ప రోమా అగ్నిప్రమాదం తరువాత వారిని బలిపశువులుగా చేసే వరకు నీరో రోమా క్రైస్తవులపై హింసను ప్రారంభించనందున, రాజధానిలో రాజకీయ పరిస్థితి ఇంకా క్షీణించలేదు. అందువల్ల, పౌలు సమాధాన సమయం అనుభవిస్తున్న ఒక సంఘానికి వ్రాసాడు. కానీ ఈ సంఘానికి ప్రాథమిక సువార్త సిద్ధాంతం యొక్క బలమైన మోతాదు అవసరమని అతను భావించాడు.

కొరింథు నుండి వ్రాస్తూ, పౌలు కఠినమైన నావికులు మరియు శ్రద్ధగా పరిశీలించే వర్తకుల నుండి సంపన్న విగ్రహారాధకులు మరియు బానిసలుగా ఉన్న క్రైస్తవులు మొదలగు విభిన్నమైన వ్యక్తులను మరియు ఆచారములను ఎదుర్కొన్నాడు. ప్రముఖ గ్రీకు నగరం లైంగిక అనైతికతకు మరియు విగ్రహారాధనకు కేంద్రంగా ఉంది. కాబట్టి పౌలు రోమా పత్రికలో మానవాళి యొక్క పాపిష్ఠితనము గురించి లేదా జీవితాలను అద్భుతంగా మరియు పూర్తిగా మార్చడానికి దేవుని కృప యొక్క శక్తి గురించి వ్రాసినప్పుడు, అతను ఏమి మాట్లాడుచున్నాడో అతనికి తెలుసు. ఇది ప్రతిరోజూ అతని కళ్ళ ముందు ప్రదర్శంచబడింది.

రోమా పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

రోమీయులకు రాసిన పత్రిక లేఖనాలన్నిటిలోకెల్ల క్రైస్తవ సిద్ధాంతం యొక్క స్పష్టమైన మరియు క్రమబద్ధమైన ప్రదర్శనగా నిలుస్తుంది. ప్రపంచంలో చాలా తేలికగా గమనించదగ్గ విషయాన్ని చర్చించడం ద్వారా పౌలు ఈ పత్రికను ప్రారంభించాడు- అదే సమస్త మానవాళి యొక్క పాపిష్ఠితనము. దేవునికి విరోధముగా మన తిరుగుబాటు కారణంగా ప్రజలందరూ దోషులుగా చేయబడ్డారు. అయితే, దేవుడు తన కుమారుడైన యేసునందు విశ్వాసం ద్వారా మనకు నీతిని అనుగ్రహించాడు. మనము దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడినప్పుడు, మనకు విమోచన లేదా రక్షణ లభిస్తుంది, ఎందుకంటే క్రీస్తు రక్తము మన పాపాన్ని కప్పివేస్తుంది. అయితే విశ్వాసి దేవుని వెంబడించడం రక్షణ పొందుకోవటంతో ఆగదని పౌలు స్పష్టం చేశాడు; మనలో ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడినప్పుడు-పరిశుద్ధులముగా చేయబడినప్పుడు-ఆయనను మనం పట్టు విడవకుండ అనుసరించడంలో కొనసాగుతుంది. ఈ సమస్యలపై పౌలు యొక్క వ్యవహారం ఒక వ్యక్తి తన పాపం యొక్క శిక్ష మరియు శక్తి నుండి ఎలా రక్షించబడతాడు లేక రక్షించబడుతుంది అనే దాని యొక్క తార్కిక మరియు పూర్తి వివరణను అందిస్తుంది.

రోమా పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

పౌలు యొక్క రోమీయులకు రాసిన పత్రిక ద్వారా నడుస్తున్న ప్రాథమిక ఇతివృత్తం ఏమంటే, రక్షణకు సంబంధించిన తన ప్రణాళికలో దేవుని యొక్క నీతిని వెల్లడించడం, దీనినే పరిశుద్ధ గ్రంథము సువార్త అని పిలుస్తుంది:

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. (రోమా 1: 16–17)

మన పాపం వల్ల మానవులు దేవుని నీతిని ఎలా కోల్పోతారో (1–3), దేవుడు విశ్వాసం ద్వారా మనలను నీతిమంతులనుగా తీర్చినప్పుడు దేవుని నీతిని ఎలా పొందుకుంటారో (4–5) పౌలు చూపించాడు. తిరుగుబాటుదారుల నుండి వెంబడించువారుగా రూపాంతరం చెందడం ద్వారా దేవుని నీతిని ప్రత్యక్షముగా చూపాడు (6–8). దేవుడు యూదులను రక్షించునప్పుడు ఆయన నీతి రూఢిపరచబడుతుంది (9–11). అలాగే ఆయన నీతిని మన జీవితమంతటా ఆచరణాత్మక మార్గాల్లో వర్తింపచేసుకోవాలి (12–16).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

రోమా పత్రిక నిర్మాణం మన దైనందిన జీవితంలో ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. సిద్ధాంతముగల పదకొండు అధ్యాయాలతో ప్రారంభమైన ఈ పుస్తకం ఆచరణాత్మక బోధన కలిగిన ఐదు అధ్యాయాలుగా పరివర్తనము చెందుతుంది. క్రైస్తవులకు సిద్ధాంతం మరియు జీవితం మధ్యనున్న ఈ ఐక్యత మనం నమ్మే వాటి యొక్క సంపూర్ణ ప్రాముఖ్యతను అలాగే ఆ నమ్మకాలను మనం ఎలా సాకారం చేసుకోవాలో వివరిస్తుంది. మీ రోజువారీ జీవితం మీరు కలిగి ఉన్న నమ్మకాలకు అద్దం పడుతుందా లేదా కపటత్వంతో నిండుకొని నిరంతరం దానితో యుద్ధము చేస్తున్నారా? రోమా పత్రిక యొక్క పేజీలలో మీరు కనుగొన్న సిద్ధాంతానికి జాగ్రత్త వహించండి, అయితే దానిని ఆచరణలో పెట్టడం కూడా మర్చిపోవద్దు.