జెఫన్యా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

జెఫన్యా 1: 1 లో, రచయిత తనను తాను "హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యా" అని పరిచయం చేసుకున్నాడు. జెఫన్యా యొక్క ముత్తాత హిజ్కియా వరకు అతని పితరుల జాబితా ఇక్కడ ఉండటం ప్రవక్తలలో యిది ఒక ప్రత్యేకమైన పరిచయం. మరి హిజ్కియాతో ఎందుకు ఆగిపోవాలి? ఎందుకంటే, యూదా యొక్క మంచి రాజులలో ఒకరి వారసుడిగా ప్రవక్త తన రాజవంశాన్ని ప్రముఖంగా పేర్కొనాలనుకున్నాడు. జెఫన్యా 1: 4 ప్రకారం అతను యెరూషలేములో ప్రవచించినట్లు సూచిస్తుంది. అయితే ఆలయ ఆరాధన గురించి ఆయన చేసిన అనేక సూచనలు ఇశ్రాయేలు యొక్క మత సంస్కృతితో బలమైన పరిచయాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ కారకాలన్నీ యూదా రాజకీయ మరియు మత ప్రపంచం మధ్యలో ఉన్న వ్యక్తి యొక్క చిత్రాన్ని చిత్రించాయి. అధికారంలో ఉన్నవారికి దగ్గరగా ఉన్న వ్యక్తి భయము కలిగించే తన సందేశానికి మరింత ఎక్కువ ప్రభావాన్ని తీసుకొచ్చి ఉంటాడు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీస్తుపూర్వం 640 నుండి 609 వరకు యూదా రాజైన యోషీయా పాలనలో జెఫన్యా ప్రవచించాడని పుస్తకం చెబుతుంది (జెఫన్యా 1:1). వాక్యాల్లోని కొన్ని వివరాలను లెక్కించడం ద్వారా జెఫన్యా ప్రవచించిన కాలమును మనం సరిగ్గా గుర్తించవచ్చు. మొదట, 2:13 లో ప్రవక్త నీనెవె పతనం గురించి ముందుగా చెప్పాడు. ఈ సంఘటన క్రీ.పూ. 612 లో జరిగింది. జెఫన్యా ధర్మశాస్త్రం నుండి తరచూ ఉల్లేఖనాలు చేశాడు (ఉదాహరణకు, 1:13 ను ద్వితీయోపదేశకాండము 28:30, 39 తో పోల్చండి). ఈ ధర్మశాస్త్రము యూదాలో యోషీయా పాలనలో ఎక్కువ భాగం పోగొట్టుకున్న స్థితిలోనే ఉన్నది. అందువల్ల, క్రీస్తుపూర్వం 622 లో యోషీయా పాలన యొక్క చివరి భాగంలో, రాజు ధర్మశాస్త్రపు చుట్టలను కనుగొన్న తరువాత (2 దినవృత్తాంతములు 34:3–7) జెఫన్యా ప్రవచించాడు.

దీని ద్వారా తెలిసినదేమంటే, జెఫన్యా యోషీయా పూర్వీకుల పాలనలో పెరిగాడు. ఆ పూర్వీకులెవరంటే, యోషీయా తాతయైన దుష్ట రాజు మనష్షే, మరియు మనష్షే కుమారుడును చెడ్డవాడును యువకుడునైన ఆమోను. ఒక యువకుడిగా, కాబోయే ప్రవక్త విగ్రహారాధన, పిల్లలను బలివ్వటం మరియు అన్యాయముగా చంపడం వంటి బలమైన ప్రభావాలు ఈ లేత మనస్సుపై పడివుంటాయి (2 రాజులు 21:16; 2 దినవృత్తాంతములు 33:1–10). కానీ జెఫన్యా దేవుని మనిషిగా ఎదిగాడు, ప్రజల ముందు నిలబడగలిగాడు. దేవుని తీర్పును గూర్చిన సందేశాన్ని ప్రకటించగలిగాడు. అలాగే దారితప్పిన ప్రజలకు నిరీక్షణను ఇవ్వగలిగాడు.

జెఫన్యా ఎందుకంత ముఖ్యమైనది?

ఈ పుస్తకంలో పాత నిబంధనలోని ఇతర పుస్తకాల కంటే ఎక్కువగా యెహోవా దినము గురించి ప్రస్తావించబడింది. బబులోను‌ చేతుల్లో యూదా పడిపోవడం, రాబోయే తీర్పు మరియు భవిష్యత్తులో మానవాళి యొక్క పునరుద్ధరణ యొక్క చిత్రాన్ని గూర్చి ఈ గ్రంథము స్పష్టం చేస్తుంది. ఈ సందర్భంలో, ఇది ప్రధానంగా యూదా దేశంపై సంభవింపబోవు దేవుని యొక్క తీర్పును సూచిస్తుంది. యెహోవా దినమున తన దేశము, తన పొరుగువారు, చివరికి భూమి మొత్తం నాశనమవ్వడం జెఫన్యా చూశాడు (జెఫన్యా 1:2, 4; 2:10). యెహోవా దినము సమీపమాయెనని (1:14), అది ఉగ్రతకు సమయమని (1:15), పాపానికి తీర్పుగా అది వస్తుందని (1:17), చివరికి దేవుని సన్నిధి యొక్క ఆశీర్వాదం తన ప్రజల మధ్య ఉంటుందని జెఫన్యా రాశాడు.

జెఫన్యా యొక్క ఉద్దేశమేమిటి?

చాలామంది ప్రవక్తల రచనల మాదిరిగానే, జెఫన్యా పుస్తకమూ ప్రజలందరికీ వారి పాపానికి తీర్పు వస్తుందని, ఆ తరువాత దేవుడు ఏర్పరచుకున్న ప్రజల యొక్క పునరుద్ధరణ జరుగుతుందని తెలియజేస్తుంది. దేవుని తీర్పు సందేశానికి జెఫన్యా యొక్క ప్రాధమిక లక్ష్యమెవరంటే, యూదా దేశము. ఎందుకంటే ఈ దేశము తమ రాజైన మనష్షే పాలనలో ఘోరమైన పాపములో పడింది. పాపభరితమైన దేశములో జెఫన్యా యొక్క ప్రవచనం దైవభక్తి మరియు పరిశుద్ధత కొరకు కేకలు వేసింది. యూదా ప్రజలు చాలా కాలం నుండి వారి వ్యక్తిగత జీవితాలలోనే కాదు, వారి ఆరాధనలో కూడా దేవుని దగ్గర నుండి వెనుదిరిగారు. ఇది వారి పాపం యొక్క లోతును, అలాగే దేవుని ప్రజలు పునరుద్ధరణ మార్గంలో పరిశుద్ధము చేయబడవలసిన లోతైన అవసరాన్ని ప్రతిబింబిస్తుంది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

యూదాలో నివసించే వారు దేవుని ఆరాధనను హాస్యాస్పదమైన చర్యగా మార్చివేశారు. ఇతర దేవతలను ఆరాధించటానికి వారు తమ సొంత ఆరాధనా స్థలాలను నిర్మించడమే కాక (పాత నిబంధనలో “ఉన్నత స్థలములు” అని పిలుస్తారు), వారు ఆ సమయంలో దేవుని నివాస స్థలమైన ఆయన ఆలయాన్ని అపవిత్రం చేయడం మొదలుపెట్టారు (జెఫన్యా 1:9).

క్రీస్తులో ఆధునిక విశ్వాసులుగా, మనం కూడా బహిరంగముగా పాపములో జీవించినప్పుడు ఆరాధనను అపహాస్యం చేసినవారమౌతాము. ఆ పాపముపై చర్య తీసుకోకుండా తప్పుడు వదనముతో ప్రతీవారమూ దేవుని యెదుటికి వస్తున్నారా? దేవుడు మీ జీవితాన్ని, అలాగే ఆయనతో మీ సంబంధాన్ని ఎంత ముఖ్యముగా తలచునో మీకు గుర్తు చేయడానికి జెఫన్యాను అనుమతించండి. ఒకవేళ మీరు విఫలమైనట్లైతే, జెఫన్యా 3 యొక్క సందేశాన్ని గుర్తుంచుకోండి - దేవుడు ఎల్లప్పుడూ పునరుద్ధరణ మరియు నిరీక్షణ యొక్క దేవుడు.