మూడవ యోహాను

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

2 యోహానులో చేసినట్లే, అపొస్తలుడైన యోహాను తనను తాను 3 యోహానులో “పెద్ద” (3 యోహాను 1:1) గా గుర్తించుకున్నాడు. తన చివరి పత్రిక రాసే సమయానికి, యోహాను తన జీవితపు ముగింపుకు చేరుకున్నాడు. ఆరు దశాబ్దాల ముందు యేసు యోహానును, అతని సహోదరుడైన యాకోబును వారి దోనెలో నుండి వారిని పిలిచినప్పుడు నాటకీయంగా తన జీవితం మారిపోయింది. ఈ బాలురు యేసును వెంబడించడానికి వారి జీవనోపాధిని మరియు వారి తండ్రియైన జెబెదయిని విడిచిపెట్టారు (మత్తయి 4:21-22). తన విశ్వాసం కోసం చనిపోయిన పన్నెండు మంది శిష్యులలో యాకోబు మొదటివాడు, యోహాను మిగతా వారందరికంటే ఎక్కువకాలం జీవించాడు. యోహాను తన సువార్తలో "యేసు ప్రేమించిన శిష్యుడు" (యోహాను 21:20) అని తన గురించి తాను పేర్కొన్నాడు, ఈ శీర్షిక యోహాను యొక్క అన్ని పరిశుద్ధ గ్రంథ రచనలలో గొప్ప ఇతివృత్తాలలో ఒకటి, 3 యోహానుతో సహా - దేవుని ప్రేమ మానవుల జీవితాల్లో దానంతట అదే పనిచేస్తుంది.

మనమెక్కడ ఉన్నాము?

పత్రికలో నిర్దిష్ట సమాచారం లేకపోవడం వల్ల మనం తేదీని ఖచ్చితంగా గుర్తించలేము, 3 యోహాను బహుశా క్రీ.శ. 90 లో పత్మాసు ద్వీపం నుండి వ్రాయబడి ఉండవచ్చు, అక్కడ యోహాను ఆ సమయంలో చెరలో ఉంచబడ్డాడు. ఆసియ మైనర్‌లోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘముల నాయకుడైన గాయున‌కు యోహాను తన పత్రిక రాశాడు. దియొత్రెఫే అనే వ్యక్తి వల్ల కలిగే కొన్ని ఇబ్బందులను గురించి అపొస్తలుడు నివేదికను అందుకున్నాడు. మరియు సరైన రీతిలో కష్టాలను ఎదుర్కోవటానికి గాయును బలోపేతం చేయడానికి యోహాను రాశాడు.

మూడవ యోహాను ఎందుకంత ముఖ్యమైనది?

గాయు తన ప్రాంతంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, యోహాను అతనిని శ్రమలకు ఎలా స్పందించాలో అది మాత్రమే కాకుండా, సత్యాన్ని ప్రకటించే వారితో ఎలా సంబంధం కలిగి ఉండాలో కూడా నిర్దేశించాలనుకున్నాడు. యోహాను యొక్క మూడు పత్రికలు ఎక్కువగా సహవాసం యొక్క అంశముతో సంబంధం కలిగి ఉన్నాయి-దేవునితో, సువార్తకు శత్రువులతో మరియు 3 యోహాను విషయంలో, సత్యాన్ని ప్రకటించే వారితో. సువార్త ప్రకటించటానికి ప్రయాణించిన వారికి సంఘముల నుండి ఆత్మీయ స్వాగతం పలకాలని, వారికి ఆతిథ్యం ఇవ్వమని మరియు “దేవునికి తగినట్టుగా” సాగనంపాలని యోహాను కోరుకున్నాడు (3 యోహాను 1:6).

మూడవ యోహాను యొక్క ఉద్దేశమేమిటి?

ఆసియలోని సంఘానికి ఇబ్బందులు వచ్చాయి. దియొత్రెఫే అక్కడి సంఘాల్లో ఒకదానిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు మరియు కొంతమంది ప్రయాణ మిషనరీలను సంఘానికి రాకుండా నిషేధించడానికి తన శక్తిని ఉపయోగించాడు. ఒకానొక సమయంలో, సంఘము అతనిలో నాయకత్వ లక్షణాన్ని చూసింది మరియు అతనికి బాధ్యతలు అప్పగించింది, కానీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉండేసరికి అధికారం అతని తలమీదికెక్కింది. తన సంఘములో సువార్తను బోధించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయాణించే పరిచారకులను స్వాగతించడానికి అతను నిరాకరించాడు. ఇంకా ఘోరంగా, యోహాను నుండి మునుపు ఒకసారి దిద్దుబాటు పొందినప్పటికీ, దియొత్రెఫే వినడానికి నిరాకరించాడు (3 యోహాను 1:9).

ఈ ఇబ్బందికరమైన పరిస్థితి యోహాను‌ను గాయు‌కు వ్రాయడానికి, అలాగే ప్రేమపూర్వక వైఖరితో సత్యాన్ని గట్టిగా పట్టుకున్నందుకు విశ్వాసులను ప్రశంసించడానికి ప్రేరేపించింది. ఈ క్రైస్తవులు ఒకరినొకరు ఆదరించుకున్న విధానం ద్వారా వారి జీవితాలలో సువార్తను నిజం చేయడానికి కృషి చేశారు. మరియు యోహాను, ఈ “సాధారణ” క్రైస్తవుల ప్రవర్తన గురించి ఈ మంచి నివేదికకు ప్రతిస్పందనగా, ప్రేమలో కొనసాగమని మరియు ఆసియలోని సంఘములలో తమ్మును తాము అప్పగించుకొని పరిచర్య చేసిన పరదేశులైన విశ్వాసులను ఆదరించమని వారిని ప్రోత్సహించాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఇతర క్రైస్తవులకు, ప్రత్యేకించి మీ స్థానిక సంఘములో మరియు ప్రపంచంలోని సంఘములలో మీకు మరియు ఇతరులకు సేవ చేసే వారికి మీరు ఆతిథ్యం ఎలా చూపిస్తున్నారు? ఇతరులకు-ముఖ్యంగా అపరిచితులకు ఆతిథ్యం చూపించడానికి మన దైనందిన జీవితంలో మనకు అవసరం లేనంత నమ్మకం మరియు అంగీకారం అవసరం. ఇది ఒక నిర్దిష్ట రక్త సంబంధం లేదా పంచుకున్న అనుభవం కంటే యేసుక్రీస్తులో ఒక సాధారణ బంధం మీద ఆధారపడటానికి మనల్ని బలవంతం చేస్తుంది. ఇది మన సుఖ ప్రదేశం నుండి బయటికి రమ్మని, అలాగే దేవునిపై మన నమ్మకాన్ని ఉంచేటువంటి ప్రదేశంలోకి వెళ్ళమని బలవంతం చేస్తుంది.

ఈ రకమైన జీవనాన్ని వివరించడానికి యోహాను ప్రేమ మరియు సత్యం వంటి పదాలను ఉపయోగించాడు మరియు వేరే మార్గంలోకి వెళ్ళే ప్రమాదాలను వివరించడానికి దియొత్రెఫేను గూర్చిన ప్రతికూల ఉదాహరణను ఉపయోగించాడు. యేసు జీవితంలో మరియు పరిచర్యలో మనం కనుగొన్న సత్యానికి అనుగుణంగా జీవించడం, దేవుని ప్రజలకు సేవ చేసేవారిని సంరక్షించడం మరియు సహాయం చేయడం క్రైస్తవులుగా మనకు బాధ్యత ఉంది. మన ప్రభువు ఆయనను ఆదరించిన ప్రజలతో ఆవరించబడ్డాడు. ఈ రోజున యేసు బోధను ముందుకు తీసుకొనివెళ్ళేవారికి కూడా అదే చేయాలని మూడవ యోహాను మనకు బోధిస్తుంది.