పరమగీతము

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పరమగీతము దాని శీర్షికను పుస్తకంలోని మొదటి వచనం నుండి తీసుకున్నది, ఈ గీతము ఎవరి నుండి వచ్చిందో పేర్కొంది: “సొలొమోను రచించిన పరమగీతము” (పరమగీతము 1:1). పుస్తకం యొక్క ఆదిమ హెబ్రీ భాషాంతరమున దాని శీర్షికను పుస్తకం యొక్క మొదటి రెండు పదాల నుండి తీసుకుంది, షియర్ హషిరిమ్, సాధారణంగా దీనిని "గీతముల గీతము" అని అనువదిస్తారు. ఈ రెండవ శీర్షిక గ్రీకు మరియు లాటిన్ బైబిల్ అనువాదాలలో తరువాతి శతాబ్దాలలో శేషించియున్నది. గీతము అనే పదం పునరావృతమవటం వలన రచయిత దీనిని "అన్ని పాటల్లోకెల్లా గొప్పది"1 గా ఎంచడాన్ని సూచిస్తుంది. ఇతర ప్రసిద్ధ బైబిల్ పదబంధాలలో ఇదే విధమైన నిర్మాణాన్ని మనము కనుగొంటాము: ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, మరియు అతిపరిశుద్ధస్థలము, ఇలా కొన్ని పేర్కొనబడినవి.

పుస్తకం అంతటా అతని పేరు ప్రస్తావించబడినందున, ఆంగ్లంలో ఈ పుస్తకం యొక్క శీర్షిక చివరికి సొలొమోను రాజు పేరును తీసుకుంది (1:5; 3:7, 9, 11; 8:11-12). ఈ శీర్షికలో మార్పు పుస్తక రచయితగా సొలొమోను యొక్క సాంప్రదాయ దృక్పథానికి మద్దతు ఇస్తుంది. గత రెండు శతాబ్దాలలో అనేకమంది విమర్శకులు సొలొమోను రచనపై వివాదం చేసినప్పటికీ, అంతర్గత సాక్ష్యాలు దీనికి మద్దతు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. సొలొమోను పేరు కనిపించడం వల్లనే కాదు, అతని రాజరికము యొక్క ప్రయోజనం (3:6–11) మరియు అతనికున్న అనేక మంది భార్యలు, ఉపపత్నులు (6:8) ఉండటం వంటివి సొలొమోను రచనకు ఆధారములు.

మనమెక్కడ ఉన్నాము?

సొలొమోను ఇశ్రాయేలు రాజుగా పరిపాలిస్తున్న సమయంలో ఈ పుస్తకాన్ని వ్రాశాడు, అనగా అతను క్రీ.పూ. 971 మరియు 931 మధ్య కాలంలో దీనిని రచించాడు. సొలొమోను రచనను నమ్మే పండితులు ఈ గీతమును అతని పాలన యొక్క ఆరంభంలోనే వ్రాసినట్లు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే మొత్తం భార్యలు, ఉపపత్నుల సంఖ్య 1,000 (1 రాజులు 11:3) మందితో పోలిస్తే 6:8 లో పేర్కొన్న 140 మంది రాణులు, ఉపపత్నులు చాలా తక్కువ గనుక తన పరిపాలన తొలినాళ్ళలో ఈ పుస్తకాన్ని రాశాడు. అంతేకాని కేవలం తన యౌవన ఉత్సాహం వల్ల పుట్టిన కవిత్వం కాదు. అలాగే, లెబానోను, ఐగుప్తుతో సహా దేశం యొక్క ఉత్తర మరియు దక్షిణ ప్రదేశాలలోని పేర్లను రచయిత ప్రస్తావించారు. సొలొమోను పాలన ప్రారంభంలో ఈ దేశాల మధ్య సాపేక్ష శాంతి మరియు మంచి సంబంధాలను గుర్తుచేస్తున్నది ఈ పుస్తకం.

పరమగీతము ఎందుకంత ముఖ్యమైనది?

ఈ పుస్తకం పాత నిబంధనలో కనీసం రెండు కారణాల వల్ల అద్వితీయమైనదిగా ఉంది: ఒకే కవితగా దీని స్వభావము మరియు దీని కథావిషయం, అలాగే ముఖ్యంగా వివాహిత జంట మధ్య ప్రేమను గురించి స్పష్టమైన చర్చ. వివాహం లోపల శారీరక ప్రేమ అనే అంశాన్ని వివరించడానికి పరమగీతము చరిత్రలో చాలా మంది పాఠకులను అసౌకర్యానికి గురిచేసింది, ఎంతగా అంటే రబ్బీ అకీబా యూదు సిద్ధాంతములో (క్యానన్) ఈ పుస్తక స్థానాన్ని క్రీ.శ. 90 లో జామ్నియా సమావేశములో తీవ్రంగా రక్షించాల్సి వచ్చింది.2 కానీ వివాహ సంబంధాల యొక్క అందానికి నిదర్శనంగా, పరమగీతము ఈ అందమైన వాస్తవికతను గురించి ప్రత్యేకంగా వివరించిన దృష్టితో నిలిచింది.

పరమగీతము యొక్క ఉద్దేశమేమిటి?

పరిశుద్ధ గ్రంథమంతటిలో వివాహములో జరిగే ఐక్యత యొక్క సంపూర్ణతను గూర్చి యిక్కడ కొంత అద్భుతమైన కవితా భాషలో వివరించబడింది. చాలా మంది దేవుని ప్రత్యేక బహుమతులను గురించి రోగితో మాట్లాడినట్లు లేదా ఉత్సాహం లేని భాషతో మాట్లాడే ప్రపంచంలో, సొలొమోను కవిత్వం యొక్క తీవ్రోత్సాహం వివాహమును గురించిన సత్యము కొరకు దాహముగొన్న ప్రపంచానికి సేదతీర్చుతుంది. ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకుంటూ అనురాగము కొరకు ఆరాటపడుచూ ప్రేమలో ఉన్న ఇద్దరు ప్రేమికులతో ఈ సంబంధాన్ని సొలొమోను ప్రారంభించాడు (పరమగీతము 1:1–3:5). క్రమంగా వారు వివాహంలో కలిసిపోయి, తమ దాంపత్యసిద్ధి పొందే ముందు వరుడు తన వధువు అందాన్ని ప్రశంసిస్తాడు (3:6–5:1). చివరగా, ఆమె విరహ భయంతో పోరాడుతుంది, అయితే అతను తన వధువు పట్ల తనకున్న ప్రేమానురాగాలను గూర్చి భరోసా ఇస్తాడు (5:2–8:14). ఇవన్నీ వివాహం యొక్క మంచితనమును గూర్చిన విషయాన్ని బలోపేతం చేస్తాయి. ఈ పుస్తకం సాధారణముగా సంఘమను తన వధువు పట్ల క్రీస్తుకున్న ప్రేమను చిత్రీకరించుచున్నదని కొందరు సూచిస్తున్నారు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ప్రార్థన నుండి వివాహం వరకు, వివాహం నుండి ప్రేమ యొక్క భరోసా వరకు, పెళ్ళికి ముందు మరియు పెళ్లి సమయంలో పరమగీతము కవితాత్మకంగా విస్తృతమైన సంఘటనలు మరియు భావాలను ప్రదర్శిస్తుంది. బలమైన సంబంధాలు కలిగివున్న వారిని కూడా బెదిరించే చిన్నచిన్న అసూయలు, భయాల మధ్య శాశ్వతమైన ప్రేమకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. పరిశుద్ధ వివాహంలోని ఇద్దరు వ్యక్తుల ఐక్యత నుండి పుట్టుకొచ్చిన మంచితనాన్ని మరియు అందాన్ని మెచ్చుకుంటూ, వివాహమునకు విలువనివ్వటమే సమాజానికి గట్టి పునాదియని పరమగీతము యొక్క అద్భుతమైన మాటలను మనం లక్ష్యపెట్టాలి.

మీ వివాహం మీ జీవితంలో దేవుని మంచితనం మరియు అందం యొక్క సంకేతంగా మీరు భావించుచున్నారా, లేదా అది కాలక్రమేణా దాని కంటే తక్కువగా మారిందా? వివాహము దాని తరువాత జరిగే శారీరక ఐక్యత రెండూ దేవునిలో ఉద్భవించాయని పరమగీతము మనకు గుర్తు చేస్తుంది; అందువల్ల వివాహమూ, శారీరక ఐక్యత ఈ రెండూ ఆయన కృప యొక్క రుజువుగా ఈ లోకంలో పనిచేస్తున్నాయని పరిగణించాలి.

  1. Dennis F. Kinlaw, "Song of Songs," in The Expositor's Bible Commentary: Old Testament, abridged ed., ed. Kenneth L. Barker and John R. Kohlenberger III (Grand Rapids: Zondervan, 1994), 1027.
  2. Tom Gledhill, The Message of the Song of Songs: The Lyrics of Love (Downers Grove, Ill.: InterVarsity, 1994), 35.