సామెతలు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

సామెతలు కూడా కీర్తనల గ్రంథము మాదిరిగానే, దాని వివిధ విభాగాల రచయితలుగా బహుళ వ్యక్తులను పేర్కొంది. ఈ జ్ఞాన పలుకుల పుస్తకానికి ప్రధాన రచయితగా ఉండటానికి సొలొమోను ప్రత్యేక అర్హత కలిగియున్నాడు. ఇశ్రాయేలును పరిపాలిస్తున్నప్పుడు సొలొమోను దేవుణ్ణి జ్ఞానం కావాలని కోరినట్లు మొదటి రాజులు 3:5–9 వివరించుచున్నది. చివరికి దేవుడు సొలొమోను చేసిన అభ్యర్థన ప్రకారం అతనికి దయచేసాడు(1 రాజులు 4:29–31). వాస్తవానికి, సొలొమోను తనను తాను పుస్తకములోని చాలా భాగానికి మూలంగా గుర్తించాడు. సామెతలు 1:1, 10:1, మరియు 25:1 అనే మూడు విభిన్న విభాగాల ప్రారంభంలో అతని పేరు కనిపిస్తుంది, అంటే సుమారు పుస్తకంలోని మొదటి ఇరవై తొమ్మిది అధ్యాయాలను ఈ మూడు భాగాలు ఆవరించాయి.

సామెతలు 22:17-24:34 తో కూడిన ఒక చిన్న విభాగం “జ్ఞానుల ఉపదేశమును” (సామెతలు 22:17) వ్యక్తీకరిస్తుంది, ఇది సొలొమోను వివిధ వనరుల నుండి సంకలనం చేసి ఉండవచ్చు. సొలొమోను బహుళ వనరుల నుండి వ్రాసినట్లు సామెతలు 24:23లో సాక్ష్యముగా కనిపిస్తుంది, ఇక్కడ ఈ విభాగం యొక్క రచయితలను వివరించడానికి సొలొమోను “జ్ఞానులు” (వివేకముగలవారు అని కూడా అనువదించారు) అని బహువచన నామవాచకాన్ని ఉపయోగించాడు. అలాగే, "ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అమెనెమోప్" వంటి మెసపొతేమియ మరియు ఐగుప్తు యొక్క సామెతల సేకరణలతో ఈ పుస్తకం సారూప్యత కలిగియుండుటవలన, తన జీవితంలో దేవుడు బయలుపరచిన జ్ఞాన సూక్తుల ఆధారంగా ఈ విభాగాన్ని నమోదు చేయడానికి సొలొమోనును దేవుడు ప్రేరేపించి ఉండవచ్చు.1

చివరి రెండు అధ్యాయాలు ఆగూరు (30:1) మరియు లెమూయేలు (31:1) లను తమ రచయితలుగా గుర్తించాయి, అయినప్పటికీ ఈ పురుషుల గుర్తింపులు చరిత్రలో మర్మముగా మిగిలిపోయినవి.

మనమెక్కడ ఉన్నాము?

సామెతల యొక్క కూర్పే చాలా కష్టమైన ప్రశ్నలలో ఒకటిగా ఈ పుస్తకమును గూర్చి మిగిలిపోయింది. సొలొమోనుతో ఈ పుస్తకం బలమైన అనుబంధం కలిగియుండుటవలన క్రీ.పూ. 931 లో అతని మరణానికి ముందే దీనిలోని చాలా విషయాలు పూర్తిచేయబడ్డాయి. సామెతలు 25-29 లో సొలొమోను సామెతలు హిజ్కియా మనుష్యులు సంకలనం చేసినందున, ఈ పుస్తకం దక్షిణ యూదా రాజ్యంలో ఉండిపోయింది. క్రీస్తుపూర్వం 686 లో హిజ్కియా పాలన ముగిసేలోపు ఈ పుస్తకం చివరి రూపం దాల్చినట్లు ఇది సూచిస్తుంది.

సామెతలు ఎందుకంత ముఖ్యమైనది?

మరే ఇతర బైబిల్ పుస్తకమూ చేయని పనిని సామెతలు నెరవేరుస్తుంది: ఇది భూమిపై సమర్థవంతమైన జీవితాన్ని గడపడానికి అనేక చిన్న సూచనలను సంకలనం చేస్తుంది. మిగిలిన పుస్తకాలు లోతైన వేదాంత సత్యాలు, జయాపజయాల సుదీర్ఘ కథనాలు లేదా అవిధేయులైన ప్రజలకు ప్రవచనాత్మక బోధలు మొదలగువాటిని వ్యక్తీకరిస్తే, సామెతలు జ్ఞాన మార్గమును ప్రజలకు బోధించడంలో చింత కలిగియున్నది. పుస్తక రచయితలు ఒక వ్యక్తి జీవితంలోని విభిన్న పరిస్థితులను గుర్తించి, కొన్ని నిర్దిష్ట సందర్భాల్లో అనుసరించాల్సిన సూచనలను మాత్రమే కాకుండా రకరకాల పరిస్థితులలో వర్తించే సూత్రాలను అందించారు.

సామెతలు యొక్క ఉద్దేశమేమిటి?

సామెతలు యొక్క ముఖ్య విషయం పుస్తక ప్రారంభంలోనే పేర్కొనబడింది: “ యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము” (సామెతలు 1:7). యెహోవాయందు భయభక్తులు కలిగియుండటం ఆయన అర్హమైన గౌరవముతో ఆయనను చూడటాన్ని సూచిస్తుంది. ఆయనను గురించి మనకు ఏదైతే తెలుసో, ఆ తెలిసినవాటి వెలుగులో మన జీవితాలను గడపడం, ఆయనను మన జీవితాలలో అత్యున్నత స్థానంలో నిలబెట్టడం మరియు వినయపూర్వకమైన నమ్మకంతో ఆయనపై ఆధారపడటం. అప్పుడే మనం జ్ఞానం మరియు తెలివిని కనుగొంటామని సామెతలు బోధించుచున్నది (9:10 చూడండి).

సామెతలు వ్రాసేటప్పుడు, తన పాఠకులు అన్ని విషయాలలో ఆచరణాత్మక నీతిని పొందుకుంటారని, అలాగే దేవుని అధికారమూ నడిపింపు క్రింద మన జీవితాలను గడపడం ద్వారా నీతిని ఆచరణలో పెడతామని సొలొమోను ఆశించాడు. మన జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేసే వివేచనను ఇవ్వడంపై దృష్టిపెట్టి అతను పుస్తకం యొక్క ఉద్దేశ్యాన్ని 1:2–6 లో ప్రత్యేకంగా వివరించాడు. పుస్తకంలో ఎక్కువ భాగం ఇతరుల మాటలను, అనగా తల్లిదండ్రులు, పెద్దలు వంటి వారి మాటలను వినడానికి ప్రాధాన్యత ఇస్తుంది. తద్వారా మనం వారి నుండి నేర్చుకుని మన జీవితాల యొక్క ప్రత్యేకమైన పరిస్థితులకు మనకంటే ముందు వెళ్ళిన వారి జ్ఞానమును వర్తింపజేయవచ్చు (1:5, 8). మొదట దేవుని ముందు ఆ తరువాత ఇతరుల ముందు ఎంత జ్ఞానం కలిగియున్నారనటానికి వినయామే కొలమానం. ఒకవేళ మనము శ్రద్ధగా వినడం కంటే ఆతురముగా మాట్లాడాలని నిర్ణయించుకుంటే. . . దానితో కూడా సామెతలు వ్యవహరిస్తుంది (12:15; 13:3).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

దీన్ని చదవండి! తర్వాత జీవించండి! బైబిల్లో అధికముగా అన్వయించుకోదగిన కొన్ని సత్యాలు సామెతలు కలిగియున్నది. సామెతలు చాలావరకు వాస్తవ ప్రపంచం నుండి వచ్చిన ప్రతిబింబాలతో నిండిన వివరణములు. ఈ విధానం మనకు ఎదురయ్యే రోజువారీ పరిస్థితులకు అద్దం పట్టేలా ప్రత్యేకమైన సామెత ఎలా వర్తిస్తుందో చాలా స్పష్టంగా చూడటానికి అనుమతిస్తుంది. అంటే ఉదయం మంచం మీదనుండి లేవడం దగ్గర నుండి ఇతరులతో మన సంబంధాలలో బలమైన పునాదిని నిర్మించడం వరకు ఉపయోగపడతాయి. దేవుడు మన జీవితంలోని పెద్ద, విపత్కర సంఘటనలతోనే కాదు, మన జీవితాల్లోని ప్రాపంచిక, “కనబడని” క్షణాలతో కూడా ఆయన చింత కలిగియుంటాడని సామెతలు మనకు గుర్తుచేస్తున్నది.

“చిన్న” పరిస్థితులలో కూడా మీరు దేవుణ్ణి వెంబడించుచున్నారా? మీ జీవితంలోని అదృశ్య క్షణాలపై మీ దృష్టిని కేంద్రీకరించడానికి సామెతలను అనుమతించండి.

  1. Allen P. Ross, "Proverbs," in The Expositor's Bible Commentary: Old Testament, abridged ed., ed. Kenneth L. Barker and John R. Kohlenberger III (Grand Rapids: Zondervan, 1994), 938.