మార్కు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

అపొస్తలుడైన యోహాను కాకుండా ఇతర సువార్తల రచయితలకంటే పరిశుద్ధ గ్రంథము మార్కు గురించి ఎక్కువ సమాచారాన్ని నమోదు చేసింది. లూకా మార్కు యొక్క పేరును అపొస్తలుల కార్యములలో చాలాసార్లు ప్రస్తావించాడు. అప్పుడే ఎదుగుతున్న యెరూషలేము సంఘము అతని తల్లి ఇంట్లో కూడుకొన్నది. మార్కు పౌలు మరియు బర్నబాతో కలిసి మొదటి మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించాడు, కాని త్వరగా ఇంటికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ తరువాత బర్నబాతో కలిసి కుప్రకు మరింత మిషనరీ సేవ కొరకు ప్రయాణించాడు. తన చివరి పత్రికలో పేర్కొన్న చివరి వ్యక్తులలో ఒకడైన మార్కు పౌలు జీవితంలో ముఖ్యమైనవాడయ్యాడు (2 తిమోతి 4:11).

సువార్తలోని విషయాలకు మార్కు యొక్క మూలమైన పేతురు‌తో మార్కు కలిగి ఉన్న వ్యక్తిగత సంబంధం చాలా ముఖ్యమైనది. మార్కు యొక్క తల్లి ఇల్లు పేతురుకు ఒక సాధారణ విశ్రమస్థలం. ఎంతలా అంటే, ఆ ఇంటిలోని సేవకులు అతని స్వరం ద్వారానే అతనిని గుర్తుపట్టేసేవారు (అపొస్తలుల కార్యములు 12:12-14). అలాగే, గెత్సేమనేలో మార్కు ఉన్నట్లుగాను, ఈ పడుచువాడు సురక్షితమైన దూరం నుండి విచారణను చూస్తున్నట్లుగాను తెలుస్తుంది (మార్కు 14:51–52). కొంతమంది పండితులు మార్కు ఇంటిలో చివరి భోజనం జరిగిందని నమ్ముచున్నారు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీ.శ. 70 లో జరిగిన దేవాలయ నాశనానికి సంబంధించిన సంఘటన గూర్చి యేసు యొక్క ప్రవచనంపై మార్కు ఎటువంటి వ్యాఖ్య ప్రతిపాదించలేదు గనుక ఆ విషాద సంఘటనకు కొంతకాలం ముందే మార్కు తన సువార్తను రచించాడని మనం చక్కగా భావించవచ్చు. అలాగే, ముఖ్యంగా మత్తయి గ్రంథము యొక్క యూదుల ప్రాధాన్యతతో పోల్చినప్పుడు ఈ సువార్త స్పష్టంగా రోమా అనుభూతిని కలిగి ఉంది. నెరవేరిన ప్రవచనంపై చాలా వ్యాఖ్యలను విడిచిపెట్టొచ్చని మార్కు అనుకున్నాడు (మత్తయి 21:1–6 మరియు మార్కు 11:1–4 పోల్చండి). అలాగే అరమెయిక్ పదాన్ని ఉపయోగించవలసివచ్చినప్పుడు, అతను దానిని వివరించాడు (మార్కు 3:17). మార్కు రోమా‌లో ఉన్నట్లు, అపొస్తలుడైన పేతురు మరణానికి కొంతకాలం ముందు పేతురు జ్ఞాపకాల నుండి వ్రాసినట్లు (క్రీ.శ. 64-68) ఇది సూచిస్తుంది. బహుశా క్రీ.శ. 57 మరియు క్రీ.శ. 59 మధ్య సువార్తను రచించి ఉంటాడు.

మార్కు ఎందుకంత ముఖ్యమైనది?

యేసు నిరంతరం ముందుకు వెళుతున్నట్లుగా మార్కు సువార్త చిత్రీకరిస్తుంది. మార్కు రచనలోని ముందుకు సాగిపోయే విధానం జ్ఞానముగల పాఠకుల మనస్సును సిలువ మరియు పునరుత్థానం వైపు నిరంతరం చూచునట్లుగా చేస్తుంది. ముప్పై తొమ్మిది సార్లు మార్కు వెంటనే అనే పదాన్ని ఉపయోగించాడు. భూమిపై యేసు యొక్క సమయం తక్కువగా ఉందని, అలాగే ఆయన కొద్ది సంవత్సరాల పరిచర్యలో సాధించడానికి యింకా చాలా ఎక్కువ ఉందనే అర్థాన్ని ఈ పదము ఇస్తుంది.

మార్కు యొక్క ఉద్దేశమేమిటి?

మత్తయి సువార్త యేసును రాజుగా చిత్రీకరించగా, మార్కు ఆయన్ని దేవుని పరిచారకునిగా చూపించాడు. యేసు చేసిన పని ఎప్పుడూ గొప్ప ఉద్దేశ్యం కొరకేనని, ఆ విషయాన్ని మార్కు 10:45 లో స్పష్టంగా వివరించబడింది, "మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.” దేవుని కుమారుని యొక్క శక్తిని మరియు కరుణను రెండింటినీ వివరిస్తూ మార్కు తన సువార్తను యేసు యొక్క అద్భుతాలతో నింపాడు. ఈ వాక్యభాగాలలో, ప్రజలకు ఆత్మీయ పునరుద్ధరణను అందించిన మంచి గురువుగా కంటే ఎక్కువగా మార్కు యేసును బయలుపరచాడు; ఈ పుస్తకం యేసును నిజమైన దేవునిగా మరియు నిజమైన మానవునిగా ప్రజల జీవితాల్లోకి చేరుకొని, వారి శారీరక మరియు స్థితిగతుల మార్పులను ప్రభావితం చేసినట్లు చిత్రీకరించింది.

మార్పుకు కారకునిగా యేసు జీవితం అంతిమ ఉద్దేశ్యం లేకుండా లేదు. ఆయన నడిపించుచున్న ఈ పరిచర్య మధ్యలో యేసు నిరంతరం మానవాళికి సేవ చేయబోయే ఖచ్చితమైన మార్గాన్ని సూచించాడు: సిలువపై ఆయన మరణం మరియు మృతుల నుండి ఆయన పునరుత్థానము. యేసుక్రీస్తు యొక్క ఈ క్రియలపైన విశ్వాసం ద్వారానే మానవులు తమ మొత్తం జీవం కొరకు శాశ్వతమైన విమోచనను పొందుతారు. అంతేకాక, మన జీవితాలను ఎలా గడపాలి అనేదానికి యేసు మనకు మాదిరి అవుతాడు, అంటే ఆయన చేసినట్లే మనం కూడ ఇతరులకు సేవ చేయాలి.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

వరుసగా మూడు అధ్యాయాల్లో, అనగా 8, 9, 10 అధ్యాయాలలో మూడుసార్లు యేసు తన శిష్యులకు తన గొప్ప అర్పణము మరియు అంతిమ విజయము గురించి తెలియజేస్తున్నట్లు వర్ణించాడు. ఆయన శిష్యులు ఆయన బోధను పూర్తిగా తృణీకరించారు (మార్కు 8:31-32) లేదా వారు ఇతర విషయాల పట్ల చింత కలిగి ఉన్నారు (9:31-34; 10:32-37). మానవ జాతి చరిత్రలో గొప్ప పరిచర్య చేయడానికి యేసు సిద్ధమవుతున్నప్పుడు, ఆయన శిష్యులు తమ గురించి మాత్రమే, అనగా తమ స్థానం లేదా భద్రత గురించి మాత్రమే ఆలోచించగలిగారు.

యేసు శిష్యులు చేసినట్లుగా, మీరు త్యాగపూరితమైన సేవ వైపు మొగ్గు చూపడం మీకు కష్టముగా ఉన్నదా? మరొక వ్యక్తికి సేవ చేయడానికి అవకాశం ఎదురైనప్పుడు మనమందరం పెనుగులాడే ప్రలోభాలు ఏమిటంటే, మనల్ని మనం వెనుకకు లాక్కోవడం, మన సుఖాన్ని పొందడం లేదా మన స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడం.

మార్కు పుస్తకంలో యేసు మనముందుంచిన సవాలు ఏమిటంటే, ఆ స్వీయ-శోషణ నమూనాలను విరగగొట్టడం, అలాగే ఇతరులకు సేవ చేయటంలో మరియు ప్రేమను చూపటంలో మనల్ని మనం సమర్పించుకోవడం.