మొదటి యోహాను

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఈ పత్రిక యొక్క రచయిత తనను తాను ఎప్పుడూ పేరు ద్వారా గుర్తించుకోలేదు, కాని సంఘ ప్రారంభం నుండి క్రైస్తవులు ఈ పత్రికను అధికారికంగా భావించారు, ఇది అపొస్తలుడైన యోహాను రాసినట్లు నమ్ముతారు. ఆ సాక్షుల బృందంలో పాలికార్ప్ అనే రెండవ శతాబ్దపు బిషప్ ఉన్నాడు. ఇతను యువకుడిగా ఉండి యోహానును వ్యక్తిగతంగా యెరిగినవాడు. అదనంగా, రచయిత యేసు జీవితానికి మరియు పరిచర్యకు అపొస్తలుల ప్రత్యక్ష సాక్షుల బృందంలో భాగంగా తనను తాను స్పష్టంగా స్థాపించుకున్నాడు, "మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము" (1 యోహాను 1:3).

మనమెక్కడ ఉన్నాము?

ఈ పత్రిక యొక్క గ్రహీతలను యోహాను పేర్కొనలేదు, కానీ తన ప్రసంగములను ప్రకటన 2-3 లో ఎఫెసు సమీపంలోని ఏడు సంఘములకు ఇచ్చాడు- ఈ నగరంలో యోహాను తన జీవితం చివరలో పరిచర్య చేసాడు- ఈ పత్రిక కోసం అతను అవే సంఘాలు తన మనస్సులో పెట్టుకొని ఉన్నాడు. ఈ పత్రికలో ప్రత్యేకమైన అంశాలేమీ పెద్దగా లేవు కాబట్టి దాని కూర్పు తేదీని గుర్తించడం కష్టం. ఏదేమైనా, యోహాను రచించిన సువార్తతో దాని సారూప్యతనుబట్టి అది బహుశా అదే సమయంలో వ్రాయబడి ఉంటుంది. పత్మాసునందు తన పరవాసం నుండి యోహాను రచించాడు గనుక క్రీ.శ. 90 తేదీ ఉత్తమ ప్రతిపాదనగా తేలింది.

మొదటి యోహాను ఎందుకంత ముఖ్యమైనది?

1 యోహానులోని పోలికలు అద్భుతమైనవియు స్పష్టమైనవియునై ఉన్నవి: క్రీస్తుకు విరుద్ధంగా అంత్యక్రీస్తు, వెలుగుకు విరుద్ధంగా చీకటి, సత్యమునకు విరుద్ధంగా అబద్ధం, నీతికి విరుద్ధంగా పాపం, తండ్రి ప్రేమకు విరుద్ధంగా లోక ప్రేమ, మరియు దేవుని ఆత్మకు విరుద్ధంగా అంత్యక్రీస్తు ఆత్మ. ఇది పూర్తి జాబితా కానప్పటికీ, ఇది ప్రపంచాన్ని సంక్లిష్టముకాని రీతిలో చూపించే ఒక పత్రికను బయలుపరుస్తుంది, అనగా ఒప్పు ఉంది మరియు తప్పు ఉంది, అంతే. యోహాను యొక్క ఈ ఉద్ఘాటన గమనార్హమైనప్పటికీ ప్రేమ లేకుండా లేదు. వాస్తవానికి ఇది బొత్తిగా దానికి విరుద్ధంగా ఉన్నది. ప్రేమ దేవుని యొద్ద నుండి వస్తుందని యోహాను గుర్తించాడు మరియు విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ప్రోత్సహించాడు (1 యోహాను 4:7). సత్యం మరియు అపరాధం మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం, అయితే ఇది ఎల్లప్పుడూ ప్రేమ యొక్క స్ఫూర్తితో జరగాలని యోహాను యొక్క మొదటి పత్రిక బోధిస్తుంది.

మొదటి యోహాను యొక్క ఉద్దేశమేమిటి?

అతను తన సువార్తలో చేసినట్లుగా, యోహాను తన మొదటి పత్రిక యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టతతో చెప్పాడు. ఈ పత్రిక గ్రహీతలకు యేసు గురించిన సువార్తను ఆయన ప్రకటించాడు, “మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది” (1 యోహాను 1:3). తరువాత, యోహాను "మీరు పాపము చేయకుండుటకై" (2:1) మరియు "మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు" (5:13) జోడించాడు. తన పాఠకులు దేవునితో మరియు దేవుని ప్రజలతో నిజమైన సహవాసం అనుభవించాలని యోహాను కోరుకున్నాడు. దేవుడు వారి కోసం చేసిన పనులకు అనుకూలంగా క్రైస్తవులు తమ స్వార్థపూరిత కోరికలను పక్కన పెట్టేవరకు అది జరగదని ఆయనకు తెలుసు.

ఆ లక్ష్యాన్ని సాధించడంలో వారికి సహాయపడటానికి, యోహాను మూడు విషయాలపై దృష్టి పెట్టాడు: విశ్వాసుల ఆసక్తి, తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం మరియు నిత్యజీవము ఉన్నదని క్రైస్తవులకు భరోసా ఇవ్వడం. నిరుత్సాహంతో పోరాడిన వ్యక్తులతో నిండిన సంఘములకు యోహాను రాశాడు- ఆ నిరుత్సాహం వారి స్వంత పాపపు వైఫల్యాల వల్ల లేదా వారి మధ్యలో తప్పుడు బోధకులు ఉండటం వల్ల కావచ్చు. వారు ప్రభువును మరింత దగ్గరగా అనుసరించి, సంఘాలలో అసమ్మతిని విత్తేవారికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడునట్లు వయస్సు పెరుగుతున్న అపొస్తలుడు ఈ విశ్వాసుల ఆసక్తిని రగిలించాలని భావించాడు. అలా చేస్తే, వారు దేవునితో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారు, అలాగే వారి జీవితాలలో ఆయన కార్యముపై విశ్వాసం పొందుకుంటారు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మనమందరం మన క్రైస్తవ విశ్వాసంలో హెచ్చు తగ్గులగుండా పయనిస్తాము. పోరాటం ఏదైనప్పటికీ-మనకు వెలుపల లేదా లోపల కావచ్చు- భావోద్వేగం లేదా పరిస్థితుల గాలులతో మనం తరచుగా కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, నెలలు మరియు సంవత్సరాలు గడిచేకొద్దీ మన అంతర్గత రూపాంతరం యొక్క సాక్ష్యాలు మరింత స్పష్టంగా కనబడుట ద్వారా యింకా ఎక్కువ నిలకడ కలిగిన జీవితాలు కలిగియుండాలని దేవుడు పిలుచుచున్నాడు. దేవునితో మీ సంబంధాన్ని మీరు ఎలా వర్ణిస్తారు- స్థిరమైన మరియు ఫలవంతమైనదా లేదా చెదిరినట్టుగా వుండి ఎండిపోయినదా?

దేవుడు కోరుకునే విశ్వాసాన్ని మనం ఎప్పటికీ మనలో కనుగొనలేమని యోహానుకు తెలుసు. బదులుగా, మనము తన కుమారుడైన యేసు స్వరూపానికి ఖచ్చితంగా మార్చబడతామని నమ్ముతూ, దేవుని కార్యము మరియు కృప మీద పూర్తి నమ్మకం ఉంచాలి. మనం ఒక్క నిజమైన దేవుణ్ణి వెంబడించడంలో మన పాపాన్ని పక్కన పెట్టినప్పుడు మాత్రమే దేవునిపై ఆధారపడటం అనే భావం వస్తుంది. లేదా, యోహాను మాటల్లో చెప్పాలంటే, “మన మొకనినొకడు ప్రేమించినయెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును” (1 యోహాను 4:12).