అపొస్తలుల కార్యములు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

అపొస్తలుల లేదా ఇతర ముఖ్యమైన విశ్వాసుల గొప్ప పనులను వివరించడానికి ప్రారంభ క్రైస్తవ సాహిత్యంలో తరచుగా ఉపయోగించే ప్రాక్సెయిస్ అనే గ్రీకు పదం నుండి అపొస్తలుల గ్రంథము యొక్క శీర్షిక వచ్చింది. ఈ శీర్షిక పుస్తకంలోని విషయాలను ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ఇది క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన వెంటనే తదుపరి దశాబ్దాలలో కీలకమైన అపొస్తలుల (ముఖ్యంగా పేతురు మరియు పౌలు) జీవితాలను క్రమముగా పువ్వులతో అలంకరించినట్లు వివరించింది.

ఈ రచన యొక్క రచయితగా లూకా యొక్క గుర్తింపును పురాతన కాలమంతా ప్రశ్నించబడలేదు. ఈ పుస్తకం లూకా సువార్త నుండి స్పష్టమైన పురోగతిని చూపిస్తుంది, ఆ సువార్త ఆగిపోయిన చోటునుండే ఈ పుస్తకం ఆరంభమైంది. లూకా సువార్తకు ఒక పురాతన ఉపోద్ఘాతం, లూకా మొదట అపొస్తలుల అనుచరుడని ఆ తరువాత పౌలుకు సన్నిహితంగా తయారయ్యాడని సూచిస్తుంది.1 ఈ విధంగానే అపొస్తలుల కార్యముల గ్రంథము పేతురుతో మొదలై పౌలుతో ముగుస్తుంది. పౌలుతో పాటు రోమా సామ్రాజ్యాన్ని పర్యటించినప్పుడు, అపొస్తలుల కార్యములు యొక్క తరువాతి భాగంలో లూకా ఉత్తమ పురుష బహువచనంలో మాట్లాడటం ప్రారంభించాడు (అపొస్తలుల కార్యములు 16:10).

మనమెక్కడ ఉన్నాము?

పౌలు రోమా‌లో ఖైదు చేయబడి, కైసరు యెదుట తాను విజ్ఞప్తి చేసుకోవడానికి వేచి ఉండటంతో అపొస్తలుల కార్యములు అకస్మాత్తుగా ముగుస్తుంది. ప్రారంభ క్రైస్తవ సంఘము యొక్క ఈ చరిత్రలో, లూకా పౌలు యొక్క మరణం (క్రీ.శ. 64-68) గురించి లేదా నీరో (క్రీ.శ. 64) క్రింద చెలరేగిన క్రైస్తవులపై హింసను గురించి ప్రస్తావించలేదు. ఈ రెండు సంఘటనలు జరుగక ముందు, అనగా క్రీ.శ. 60 మరియు క్రీ.శ. 62 మధ్య కాలంలో, పౌలు జైలులో కూర్చుని, తన విజ్ఞప్తి యొక్క పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు లూకా ఈ పుస్తకాన్ని పూర్తి చేసాడు.

అపొస్తలుల కార్యములు ఎందుకంత ముఖ్యమైనది?

యేసు ఆరోహణము జరిగిన వెంటనే సంఘ చరిత్రను వివరించే పరిశుద్ధ గ్రంథములోని ఏకైక పుస్తకం అపొస్తలుల కార్యములు. అందుకని, యెరూషలేము నుండి మిగిలిన రోమా సామ్రాజ్యంలోకి సంఘము ఎలా ఎదగగలిగింది మరియు విస్తరించింది అనేదానికి ఇది ఒక విలువైన వర్ణనను మనకు అందిస్తుంది. కేవలం మూడు దశాబ్దాలలో, యెరూషలేములో భయపడ్డ విశ్వాసుల యొక్క ఒక చిన్న సమూహం సామ్రాజ్యం-వ్యాప్తంగా యేసు క్రీస్తుకు తమ జీవితాలను సమర్పించుకున్న ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఆ దేశములో సువార్తను అత్యున్నత ప్రభుత్వ అధికారియైన రోమా చక్రవర్తి వద్దకు తీసుకెళ్లే చేరువలో ఉన్న పౌలు చేసిన ఒక ముఖ్య గమనికతో ఈ గ్రంథము ముగిసింది.

అపొస్తలుల కార్యములు యొక్క ఉద్దేశమేమిటి?

అపొస్తలుల కార్యములను చక్కగా రెండు భాగాలుగా విభజించవచ్చు, మొదటిది ప్రధానంగా యెరూషలేము మరియు సమరయలోని పేతురు పరిచర్యతో వ్యవహరించగా (అపొస్తలుల కార్యములు 1–12), రెండవది రోమా సామ్రాజ్యమంతటా పౌలు చేపట్టిన తన మిషనరీ ప్రయాణాలను (అపొస్తలుల కార్యములు 13–28) అనుసరిస్తుంది. సువార్త యొక్క వ్యాప్తిని భౌగోళికంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా వివరించడానికి అపొస్తలుల కార్యములు ముఖ్యమైనది. ఇది సువార్తను ప్రత్యేకంగా పేతురు పై గదిలోని ఒక చిన్న సమూహానికి బోధించడం ద్వారా యూదు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం నుండి ప్రధానంగా అపొస్తలుడైన పౌలు పరిచర్యలో అన్యజనుల మధ్యకు సువార్త బయలుదేరటాన్ని నమోదు చేస్తుంది. ఈ పరివర్తన పేతురు యొక్క దర్శనము ద్వారా ఉత్తమంగా వివరించబడింది, దీనిలో "దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు" (10:15) అని ఒక స్వరం వినిపించింది. దీనివల్ల పేతురు సువార్తను చాలామంది అన్యజనులతో పంచుకున్నాడు. పాఠమేమిటి? దేవుడు తన నిరీక్షణ మరియు రక్షణ సందేశము ప్రజలందరికీ విస్తరించాలని కోరుకుంటున్నాడు- “యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును” (1:8).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

సువార్తను పంచుకోవడానికి ఏ అవకాశాలను మీరు రాబోయే రోజుల్లో సద్వినియోగం చేసుకోగలరు? మీరు అపొస్తలుల కార్యములు గ్రంథము చదువుచున్నప్పుడు ఈ ప్రశ్న మీ మనస్సులో మ్రోగాలి. వాస్తవంగా ప్రతి అధ్యాయంలో, అపొస్తలులైన పేతురు, పౌలు సువార్తను వ్యక్తులకు మరియు ప్రజల సమూహాలకు శక్తివంతంగా అందించారు. అపొస్తలుల కార్యములలోని అపొస్తలులు సువార్తలలో తరచూ దారితప్పిన శిష్యులవలె కాక అద్భుతమైన పరివర్తనను చూపిస్తూ, సువార్తోత్సాహంతో ప్రకాశిస్తూ చిత్రీకరించబడ్డారు. యేసు మరణం మరియు పునరుత్థానంపై అపొస్తలుల విశ్వాసం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారి హృదయాలలో గుర్తించదగిన మార్పును తెచ్చిపెట్టింది.

చాలా తరచుగా, మన స్వంత జీవితాలు ఆ విధమైన మార్పును ప్రతిబింబించవు. ఇతరులు మన విశ్వాసానికి ఎలా ప్రతిస్పందిస్తారనే భయంతో లేదా సువార్త అవసరమయ్యే వేరొకరి జీవితంలో వెచ్చించడానికి మన స్వంత దినచర్యలోనుండి బయటకు రావడానికి ఎంతగానో మనము యిబ్బంది పడుతుంటాము. దేవునితో మరింత సన్నిహితంగా నడవడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి అపొస్తలుల కార్యములను అనుమతించండి, తద్వారా మీరు క్రీస్తు నామమును ధైర్యంతో మరియు అపొస్తలుల ఉత్సాహంతో తెలియజేయగలుగుతారు.

  1. Helmut Koester, Ancient Christian Gospels: Their History and Development (Harrisburg, Pa.: Trinity Press International, 1990), 335. (Accessed on Google Books, March 25, 2010.)