కీర్తనలు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

సాహిత్య కవితల సంకలనం అయిన కీర్తనలు, బహుళ రచయితలను కలిగి ఉన్న మిశ్రమ రచనగా గుర్తించబడిన రెండు పాత నిబంధన పుస్తకాల్లో ఒకటి (రెండవది సామెతలు). కొన్ని కీర్తనలు తమ రచయిత పేరుని మొదటి వచనంలో లేదా శీర్షికలో పేర్కొన్నాయి. ఉదాహరణకు, మోషే 90వ కీర్తనను వ్రాశాడు. వీటిల్లో చాలా వాటిని, అనగా డెభ్బై మూడు కీర్తనలను దావీదు రచించాడు. ఆసాపు పన్నెండు రాశాడు; కోరహు వారసులు పది రాశారు. సొలొమోను ఒకటో రెండో వ్రాశాడు, ఎజ్రాహీయులైన ఏతాను మరియు హేమాను మరో రెండు కీర్తనలకు బాధ్యత వహించారు. మిగిలిన కీర్తనలలో వారి రచయితలను గురించిన సమాచారము లేదు.

ఈ పుస్తకానికి మొదట టెహిల్లిమ్ అని పేరు పెట్టారు, అంటే హెబ్రీ భాషలో “కీర్తన పాటలు”. “సామ్స్” అనే ఆంగ్ల శీర్షిక సెప్టువాజింట్ యొక్క గ్రీకు టైటిల్ "సాల్మోయి" నుండి ఉద్భవించింది, దీని అర్థం “కీర్తన గానములు.”1

మనమెక్కడ ఉన్నాము?

వ్యక్తిగత కీర్తనలు చరిత్రలో మోషే కాలం మొదలుకొని, దావీదు, ఆసాపు మరియు సొలొమోనుల కాలం వరకు, అలాగే బబులోనీయుల చెర తరువాత నివసించిన ఎజ్రాహీయుల కాలం వరకు వ్రాయబడ్డాయి, అంటే పుస్తకం రాయబడిన కాలపరిమితి వెయ్యి సంవత్సరాలు. దావీదుకు ఆపాదించబడిన కొన్ని కీర్తనల్లోని అదనపు సంకేతాలు అతని జీవితంలోని లిఖితపూర్వక సంఘటనలతో సంబంధం కలిగి ఉన్నాయి (ఉదాహరణకు, 59వ కీర్తన 1 సమూయేలు 19:11 తో ముడిపడి ఉంది; 56వ కీర్తన 1 సమూయేలు 21:10–15 తో అనుసంధానించబడి ఉంది; 34వ కీర్తన 1 సమూయేలు 21:10–22:2తో సంబంధం కలిగి ఉంది; మరియు 52వ కీర్తన 1 సమూయేలు 22:9 తో ముడిపడి ఉంది).

కీర్తనలు ఐదు పుస్తకాలుగా లేదా సేకరణలుగా క్రమబద్ధీకరించబడ్డాయి. ఆలయ ఆరాధనతో పాటు సంఘముగా చేరి ఆరాధించే విధానాలు అభివృద్ధి చెందడంతో అవి క్రమంగా సేకరించబడ్డాయి. ఎజ్రా సమయానికి, కీర్తనల్లోని పుస్తకాలన్నీ వాటి తుది రూపంలో ఏర్పరచబడ్డాయి. ప్రతి భాగం స్తుతితో ముగుస్తుంది, కీర్తనల పుస్తకము మొత్తం 150వ కీర్తన యొక్క గొప్ప స్తుతితో కప్పబడింది.

కీర్తనలు ఎందుకంత ముఖ్యమైనది?

కీర్తనలలో దేవుని ప్రజల పురాతన స్తుతి పాటలు ఇమిడి ఉన్నాయి. ఈ కవిత్వమునకు ఎల్లప్పుడూ కాదు గాని తరచూ సంగీతం సమకూర్చారు. కీర్తనలు దేవునికి లేదా దేవుని గురించి ఒక కవి యొక్క భావోద్వేగాన్ని తెలియజేస్తాయి. ఒక కీర్తనాకారుని యొక్క పరిస్థితికి సంబంధించి విభిన్న భావాలను మరియు ఆలోచనలను తెలియజేయడానికి వివిధ రకాల కీర్తనలు వ్రాయబడ్డాయి.

విలాప కీర్తనలు క్లిష్ట పరిస్థితులలో రచయిత దేవునికి మొఱ్ఱపెట్టుకోవటాన్ని వ్యక్తపరుస్తున్నాయి. గీతములు అని పిలువబడే స్తుతి కీర్తనలు, రచయిత నేరుగా దేవునికి స్తుతులను చెల్లిస్తున్నట్లు చూపించుచున్నవి. కృతజ్ఞతార్పణ కీర్తనలు సాధారణంగా వ్యక్తిగత విమోచన లేదా దేవుని నుండి దయచేయబడిన దానినిబట్టి రచయిత యొక్క కృతజ్ఞతను ప్రతిబింబిస్తాయి. యాత్రికుల కీర్తనలలో “యాత్ర కీర్తన” అనే శీర్షిక ఉంది గనుక మూడు వార్షిక పండుగల కోసం యెరూషలేముకు “వెళ్ళే” యాత్రలలో వీటిని ఉపయోగించేవారు. ఇతర రకాల కీర్తనలను నేడు జ్ఞాన కీర్తనలు, రాజ కీర్తనలు (ఇశ్రాయేలు రాజు లేదా ఇశ్రాయేలు యొక్క మెస్సీయాను సూచించేవి), జయ కీర్తనలు, ధర్మశాస్త్ర సంబంధమైన కీర్తనలు మరియు సీయోను పాటలు అని పిలువబడుచున్నవి.

కీర్తనలలో ప్రత్యేకమైన హెబ్రీ పదాలు ఉన్నాయి. సెలా అనే పదం డెభ్బై ఒక్కసార్లు ఉన్నది. ఈ పదము ఇశ్రాయేలు ప్రజలు కీర్తనను బహిరంగ ఆరాధనలో చేర్చిన తరువాత ఆరాధన నడిపించువారు జోడించిన సంగీత సంజ్ఞామానం. పదమూడు కీర్తనలలో కనిపించే "దైవధ్యానము" యొక్క అర్థం పండితులకు తెలియదు. అప్పుడప్పుడు, పాటలను నడిపించేవానికి సూచనలతో కీర్తన కనిపిస్తుంది. ఉదాహరణకు, “తంతివాద్యములతో పాడదగినది” (యాభై-ఐదు కీర్తనలలో కనబడుతుంది) వంటి సూచనలను మనము చూస్తాము; "షోషన్నీయులను రాగముమీద పాడదగినది" (45, 60, 69, 80లో ఇలాంటి సూచనలు ఉన్నాయి); "అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది" (కీర్తన 22); “అల్ తష్హేతు అను రాగముమీద పాడదగినది” (కీర్తనలు 57–59, 75). ఇవి, యింకా మిగతావి కీర్తన కొరకు వాడబడిన శ్రావ్యాలను లేదా ప్రార్ధనా ఉపయోగం కొరకు చేయబడిన సూచనలను సూచించవచ్చు.

కీర్తనలు యొక్క ఉద్దేశమేమిటి?

కీర్తనల గ్రంథము ఆరాధనను వ్యక్తపరుస్తుంది. దేవుడు ఎవరో, ఆయన ఏమి చేసాడో దాని విషయమై దేవుని స్తుతించమని అనేకచోట్ల కీర్తనల గ్రంథము ప్రోత్సహిస్తుంది. కీర్తనలు మన దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తున్నది, కష్టకాలంలో ఆయన విశ్వాస్యతను మనకు దృఢపరచుచున్నది మరియు ఆయన వాక్యం యొక్క సంపూర్ణ కేంద్రీకరణను గుర్తుచేస్తున్నది. దేవుడు తన ప్రజలను ప్రేమగా నడిపిస్తున్నట్లు కీర్తనలు స్పష్టమైన చిత్రాన్ని చూపిస్తున్నందున, దేవునికి స్తుతులు చెల్లించుటలోను ఆరాధించుటలోను కీర్తనాకారుల కలములు ఎన్నడూ దూరంగా లేవు. కీర్తనలలో ఆరాధన యొక్క వర్ణన దేవునికి సమర్పించుకొనిన హృదయాలను, ఆయన యెదుట పశ్చాత్తాపపడే వ్యక్తులను, మరియు ఆయనను ఎదుర్కొనిన తరువాత మారిన జీవితాలను గూర్చి మనకు ప్రసరింపజేయుచున్నది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

1వ కీర్తన, ఆ తరువాత 150వ కీర్తన చదవండి. మీ లోతైన భావోద్వేగాలను ఆయనకు తెలియజేయడానికి మిమ్మల్ని అంగీకరించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. మీరొకవేళ బాధపడుతుంటే, 13వ కీర్తనను మార్గదర్శకంగా ఉపయోగించుకొని మీ స్వంత విలాపాన్ని దేవునికి రాయండి. ఒకవేళ మీరు ఆనందిస్తుంటే, 30వ కీర్తనను ధ్యానించండి మరియు అక్కడ కనిపించే స్తుతులను ప్రతిధ్వనింపజేయండి. మీ పరిస్థితులతో సంబంధం లేకుండా, కీర్తనలు మీ హృదయాన్ని ప్రభువుతో పంచుకోవడంలో సహాయపడే సంబంధిత పదాన్ని కలిగి ఉన్నాయి. ఏది ఏమైనను, మీ పరిస్థితి ఎలా ఉన్నను, మీ హృదయాన్ని ప్రభువుతో పంచుకోవడంలో సహాయపడే సంబంధిత వాక్యాన్ని కీర్తనలు కలిగి ఉన్నాయి.

  1. Thomas L. Constable, "Notes on Psalms," 2009 ed., Sonic Light, 1, http://www.soniclight.com/constable/notes/pdf/psalms.pdf, accessed June 1, 2009.