ఫిలేమోనుకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

తన మూడవ మిషనరీ ప్రయాణంలో రెండు సంవత్సరాలకు పైగా పౌలు ఎఫెసు ప్రజలమధ్య ఆసియ మైనర్‌లో పరిచర్య చేశాడు. అన్యజనులకు అపొస్తలుడైన వానికి ఇది జయకరమైన సమయం. ఎందుకంటే ఎఫెసు నివాసితులు మరియు నగర సందర్శకులు ఇరువురిలోనూ చాలామంది మారుమనస్సు పొందటం చూశాడు. పౌలు బోధ ద్వారా మారిన సందర్శకులలో ఒకరు ఫిలేమోను అనే వ్యక్తి, ఇతను సమీప నగరమైన కొలొస్సైకి చెందిన బానిస యజమాని (ఫిలేమోను 1:19). ఫిలేమోను పేరును కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథములోని ఈ పుస్తకంలో, పౌలు తన “ప్రియుడిని” “జతపనివాడు” అని సంబోధించాడు, ఈ పేరు పౌలుతో పాటు కొంతకాలం పనిచేసిన వారికి ఇవ్వబడింది. (సువార్త రచయితలు మార్కు మరియు లూకా కూడా ఈ శీర్షికను ఈ పత్రికలో తదుపరి వచనాల్లో పొందారు [1:1, 24]). స్పష్టంగా, పౌలు మరియు ఫిలేమోనుల మధ్య బంధుత్వం ఉన్నది, ఇది పత్రికను తీసుకువచ్చిన పరిస్థితుల దృష్ట్యా ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని ఇస్తుంది.

మనమెక్కడ ఉన్నాము?

ఒనేసిము అనే బానిస తన యజమానియైన ఫిలేమోను యొద్దనుండి పారిపోయాడు. మరియు అతను రద్దీగల పట్టణ వాతావరణంలో కనిపించకుండా ఉండవచ్చనే ఆశతో కొలొస్సై నుండి రోమాకు పారిపోయాడు. రోమా‌లో ఒకసారి, ఒనేసిముకు, ప్రమాదవశాత్తు లేదా తన స్వంత రూపకల్పన ద్వారా, పౌలుతో పరిచయం ఏర్పడింది. పౌలు వెంటనే పారిపోయిన బానిసను యేసుక్రీస్తునందు విశ్వాసములోనికి నడిపించాడు. తుకికు చేతితో కొలొస్సై సంఘానికి ఒక పత్రిక పంపాలని పౌలు అప్పటికే యోచిస్తున్నాడు. కాబట్టి క్రీస్తుశకం 60 లేదా 61 లో రోమా‌లోని జైలు గది నుండి పౌలు ఫిలేమోనుకు వ్యక్తిగత పత్రిక రాసి, దానితోపాటు ఒనేసిమను బానిసను తిరిగి కొలొస్సైకు పంపాడు.

ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

మానవాళికి దేవుని యొక్క ప్రకటన వ్యక్తిగతంగా ఉందని ఫిలేమోనుకు రాసిన పత్రిక మనకు గుర్తు చేస్తుంది. సువార్తలు లేదా రోమీయు‌లకు రాసిన పత్రిక లేదా ఫిలిప్పీ లేదా కొలొస్సైలోని సంఘములకు పౌలు రాసిన పత్రికలు వంటి మరింత క్రమబద్ధమైన పరిశుద్ధ గ్రంథ రచనల్లో, దేవుడు ఒక ఇంటిలోని పరీక్షలను మరియు శ్రమలను పట్టించుకోడు లేక ఆయనకు సమయంలేదనే అభిప్రాయానికి రావటం సులభం. ఫిలేమోను దీనికి విరుద్ధంగా ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. ఎందుకంటే, దేవుని ప్రేమ, క్రీస్తులో క్షమాపణ లేదా మానవత్వం యొక్క స్వాభావిక గౌరవం వంటి ఉన్నతమైన సిద్ధాంతాలు దైనందిన జీవితంలో నిజమైన మరియు సంబంధిత ప్రభావాన్ని చూపుతాయని ఈ పత్రిక బయలుపరుస్తుంది. ఇలాంటి సూత్రాలు విశ్వాసుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయగలవని, చెయ్యాలని ఫిలేమోను పుస్తకం వివరిస్తుంది.

ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

ఫిలేమోనుకు పౌలు ఇచ్చిన సందేశం చాలా సరళమైనది: దేవుడు ఫిలేమోను హృదయంలో చేసిన ప్రేమ మరియు క్షమాపణ యొక్క కార్యము ఆధారంగా, తప్పించుకున్న మరియు ఇప్పుడు విశ్వసించిన బానిసయైన ఒనేసిముకు కూడా అదే చూపించుమని చెప్పాడు. అతనికి ఫిలేమోను వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి అపొస్తలుడి సందేశానికి అదనపు శక్తి చేకూరి ఉండి ఉంటుంది. పౌలు ఫిలేమోనుకు సువార్తను వివరించాడు గనుక లోతైన ఫలితాన్ని చూశాడు: ఒకప్పుడు చనిపోయిన హృదయంలో యిప్పుడు కొత్త జీవితం వికసించింది (ఫిలేమోను 1:19). మారుమనస్సు ఏమాత్రం స్వల్పమైన విషయం కాదని పౌలుకు తెలుసు, దానిని ఘనపరచి, ప్రోత్సహించాలి.

కావున పౌలు ఒక అభ్యర్థన చేశాడు. ఒనేసిమును క్షమించాలని, బానిసను క్రీస్తునందు ప్రియసహోదరునిగా అంగీకరించాలని, దేవుని సేవలో అతను ఉపయోగపడ్డాడని అపొస్తలుడు కనుగొన్నాడు గనుక ఒనేసిము‌ను తిరిగి పౌలు దగ్గరకు పంపించాలని ఫిలేమోనును కోరుకున్నాడు (1:11-14). పౌలు ఒనేసిము పాపాన్ని తగ్గించలేదు. ఇది పౌలు ఫిలేమోనును ఇవ్వమని కోరిన ఒక రకమైన చౌకైన కృప కాదు. ఈ అభ్యర్థనలో త్యాగం అవసరం, అందుమూలముగా, పౌలు సౌమ్యత మరియు శ్రద్ధతో ఈ అంశాన్ని సంప్రదించాడు (1:21). క్రైస్తవ ప్రేమ మరియు క్షమాపణ ఫలితంగా బానిసత్వం నుండి బంధుత్వానికి అందమైన మరియు గంభీరమైన పరివర్తనను ఫిలేమోనుకు ఆయన రాసిన పత్రిక పరిపూర్ణమైన వర్ణనలో అందిస్తుంది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఎక్కువ కాలం జీవించండి, అప్పుడు మీకు అన్యాయం జరిగినప్పుడు క్షమించడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. ఇది అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ విశ్వాసులుగా, సిలువమీద క్రీస్తు యొక్క రక్షణ కార్యము యొక్క ఫలితమే మనం క్షమించటానికి కావలసిన సామర్థ్యాన్ని సుముఖతను అందిస్తుందని మనం గుర్తించాలి. ఆ వాస్తవం కారణంగా, క్షమాపణ అనేది మనం ఎవరో మరియు మన జీవితాలను ఎలా గడపాలని ఆశిస్తున్నామో చెప్పడానికి నిర్ణయించే అంశంగా పనిచేస్తుంది. మనం క్షమించనప్పుడు, కటుత్వము మన హృదయాల్లో పాతుకుపోతుంది మరియు మనలోని శక్తిని నులిమివేస్తుంది.

మీరు క్రీస్తు క్షమాపణను పొందినప్పటి నుండి క్షమించడం మీకు ఏయే విధాలుగా కష్టమైంది? మీ స్వంత జీవితంలో క్షమాపణను ప్రోత్సహించడానికి పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రికను అనుమతించండి. అలాగే మీ హృదయంలో మరియు మీ సంబంధాలలో నూతన జీవితాన్ని పెంపొందించులాగున దేవుణ్ణి విశ్వసించండి.