ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
పాత నిబంధన యొక్క అతిచిన్న పుస్తకములో, ప్రవక్త ఓబద్యా ప్రతి పదాన్ని చాలా అమూల్యముగా భావించినట్లు తెలుస్తోంది. అతను తనను, తన కుటుంబాన్ని గూర్చి చెప్పడానికి ఏ రకంగాను ఏ పదాలను ప్రదానము చేయలేకపోయాడు. ఓబద్యా అనే పేరుతో మరో పన్నెండు మంది పురుషులు లేఖనంలో కనిపిస్తుండగా, పాత నిబంధన పండితులు వారిలో ఎవరినైనను ఈ పుస్తక రచయితగా ఖచ్చితముగా గుర్తించలేదు. ఈ ప్రవక్త యొక్క అంతిమ గుర్తింపు మర్మముగా మరుగుపరచబడిన్నప్పటికీ, అన్య దేశమైన ఎదోముపై తీర్పు చెప్పే ఈ ప్రవచనమంతటను ఓబద్యా యెరూషలేమునకు ప్రాధాన్యతనివ్వటం వలన ఓబద్యా దక్షిణ యూదా రాజ్యంలోని ఈ పరిశుద్ధ పట్టణం దగ్గరలోని ఏదోయొక ప్రాంతము నుండి వచ్చాడని మనం భావించవలసి వస్తుంది.
మనమెక్కడ ఉన్నాము?
పుస్తకంలో ఉన్న తక్కువ చారిత్రాత్మక సమాచారం కారణంగా ఓబద్యా గ్రంథాన్ని ఖచ్చితంగా ఎప్పుడు వ్రాశారనేది చెప్పడం దాదాపు అసాధ్యం. పండితులు అనేక ఆప్షన్లను ప్రతిపాదించినప్పటికీ, ఉత్తమ వాదన ప్రకారం క్రీస్తుపూర్వం 840 లలో ఓబద్యా రచించబడింది. యోవేలుకు కొన్ని సంవత్సరాల ముందు తొలి రచనా ప్రవక్తగా మరియు ఎలీషా యొక్క సమకాలీనుడిగా ఓబద్యా ఉన్నాడు. ఈ ముందరి తేదీకి అతిపెద్ద సాక్ష్యం ఓబద్యా 1: 10-14 నుండి వచ్చింది. ఇది యెరూషలేముపై ఎదోమీయుల దండయాత్రను సూచిస్తుంది. యూదాపై దండయాత్ర చేయటానికి ఎదోము చాలా బలహీనంగా ఉన్నప్పటికీ, మార్పు యొక్క గాలులు తనకు అనుకూలంగా వీచినప్పుడు ఎదోము ఇతర దేశాలతో భాగం పుచ్చుకొన్నది.
840 వ దశకంలో, ఎదోము యూదా రాజైన యెహోరాముపై తిరుగుబాటు చేసినప్పుడు, ఫిలిష్తీయులు మరియు అరేబియా ప్రజలు కూడా యెరూషలేముపై దాడి చేశారు (2 రాజులు 8: 20–22; 2 దినవృత్తాంతములు 21: 16–17). ఈ దాడిలో ఎదోమీయుల భాగస్వామ్యాన్ని 2 దినవృత్తాంతములు సూచించకపోయినను, ఓబద్యా 1: 10–14లో యెరూషలేములో ఆక్రమణదారుల నుండి పారిపోతున్న యూదులను నరికివేసేందుకు సమీప రహదారులపై వేచివున్న ఎదోమీయులు తమ పొరుగువారిపై చేసిన హింసాత్మక ప్రవర్తనను గూర్చి వర్ణించబడింది. అన్యదేశ శక్తుల చేత యెరూషలేము దాడికి గురైనదని చాలా సులభముగా ఎదోమీయుల చెవిని పడగా, తమ్మును తాము పోరాట బరిలోకి దింపుకుని, తద్వారా వారు కూడా యెరూషలేములోని తమ పొరుగువారిని దోచుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చునని అనుకున్నారు.
ఓబద్యా ఎందుకంత ముఖ్యమైనది?
గ్రంథములో ఎక్కువ భాగం అన్యదేశమైన ఎదోముపై తీర్పును ఉచ్ఛరిస్తుంది. ప్రధానంగా ఇతర దేశాలపై తీర్పును ప్రకటించిన ముగ్గురు ప్రవక్తలలో ఓబద్యా ఒకరు (మిగిలిన యిద్దరు నహూము మరియు హబక్కూకు). ప్రవక్తల గ్రంథాలలోని ప్రవక్తలు ఎదోము మరియు ఇతర దేశాలకు వ్యతిరేకంగా తీర్పు యొక్క భాగాలను కలిగి ఉండగా, ఓబద్యా యొక్క ఏకైక దృష్టి దేవునితో మానవాళికి ఉన్న సంబంధం గురించి ఒక ముఖ్యమైన, కఠినమైన, సత్యాన్ని సూచిస్తున్నది. అదేమిటంటే, ప్రజలు తమను తాము దేవుని ప్రజల నుండి తొలగించుకొన్నప్పుడు లేదా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తమను తాము నిలువబెట్టుకున్నప్పుడు, వారు జీవిత ముగింపులో పునరుద్ధరణ కంటే తీర్పును ఆశించవచ్చు.
ఓబద్యా యొక్క ఉద్దేశమేమిటి?
"యెహోవా ఆరాధకుడు" అని అర్థమిచ్చే ఓబద్యా పేరు, ఆగ్నేయంలో యూదాకు పొరుగున ఉన్న ఎదోముపై ఆయన ప్రకటించిన తీర్పు సందేశానికి విరుద్ధముగా ఉన్నది.1 యెహోవా ఆరాధకునిగా ఓబద్యా దేవుని యెదుట తన్నుతాను తగ్గించుకున్నాడు. అతను సర్వశక్తిమంతుడైన దేవుని యెదుట తన దీనస్థితిని అంగీకరించాడు.
దేవుడు “యెహోవా ఆరాధకుడు” అనే వ్యక్తిని ఎదోము ప్రజల కొరకు పంపించడం పొరబాటేమీ కాదు. యెహోవా దృష్టిలో గర్వముగా నడచి ఎదోము అపరాధియైనది (ఓబద్యా 1: 3). వారు వాస్తవానికి తమను తాము గొప్పగా భావించుకున్నారు; దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను ఎగతాళి చేసి, దోచుకొని, హాని కలిగించేంత గొప్పగా తమ్మును తాము భావించుకున్నారు. జనములపై దేవుని సార్వభౌమ శక్తిని నొక్కిచెప్పడానికి "ప్రభువగు యెహోవా" ఊరక నిలబడడు, అలాగే తన ప్రజలను శాశ్వతంగా బాధపడనివ్వడు (1: 1). తన ప్రజలపట్ల ఎదోము హీనముగా ప్రవర్తించిన తీరును గూర్చి దేవుడు ఓబద్యా ద్వారా గుర్తుచేశాడు (1: 12-14). అలాగే యూదా ప్రజలకు విమోచనను వాగ్దానం చేసాడు, ఎదోమీయులకు కాదు (1:17–18). చరిత్రలో కనుమరుగైపోయిన ఎదోము దేశము సామెతలు 16: 18 లో కనిపించే సత్యానికి ప్రధాన ఉదాహరణగా నిలచినది: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
ఓబద్యా ప్రవచనం గర్వము యొక్క నాశనకరమైన శక్తిపై దృష్టి పెడుతుంది. మన స్వంత భావాలను, కోరికలను అనుసరించి మన చుట్టూ ఉన్నవారిపై వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా స్వార్థ ధోరణితో జీవించడం వల్ల కలిగే పరిణామాలను ఇది గుర్తు చేస్తుంది. దేవుని కొరకు మరియు ఇతరుల కొరకు మీ స్వంత భావాలు మరియు కోరికలను పక్కన పెట్టడానికి మీరు కష్టపడుతున్నారా? ఏదెనులో జరిగిన పతనం యొక్క విషాదం నుండి అటువంటి గర్వము పడిపోయిన మానవుల జీవితాలలో ఒక భాగమే అయినప్పటికీ, దేవుని అధికారం క్రింద మనల్ని మనం ఉంచుకోవాలని, మన ఆశ ఆయన ఉద్దేశాలకు లోబడి ఉండాలని, మరియు అన్నిటి పునరుద్ధరణ జరిగినప్పుడు మన నిరీక్షణ ఆయన ప్రజలముగా ఉండుటలోనే కనుగొనాలని ఓబద్యా మనకు గుర్తుచేస్తున్నాడు.
- Walter L. Baker, "Obadiah," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 1453.