ఈ పుస్తకాన్ని వాుసినదెవరు?
పంచకాండములోని మిగిలిన పుస్తకాల మాదిరిగానే, సార్వత్రిక యూదా మరియు క్రైస్తవ సాంప్రదాయం సంఖ్యాకాండము యొక్క రచనను మోషేకు ఆపాదంచింది. ఈ పుస్తకంలో మోషే కేంద్ర బిందువు. అలాగే కనీసం రెండు సందర్భాల్లో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సంఘటనలను మోషే భద్రపరచడాన్ని సంఖ్యాకాండము ప్రస్తావించింది (సంఖ్యాకాండము 33:2; 36:13).
సెప్టువాజింట్లో ఈ పుస్తకాన్ని "అరిత్మోయి" అని అంటారు. అనగా “సంఖ్యలు” అని అనువదించారు. అందుకే "సంఖ్యాకాండము" అని పేరు పెట్టబడింది. ఈ పుస్తకంలో అనేక గణాంకాలు, జనాభా గణనలు, గోత్ర, అర్చక గణాంకాలు మరియు ఇతర సమాచార గణాంక వివరాలు ఉండటం వలన ఈ పేరు పెట్టారు. హెబ్రీ భాషలో ఈ పుస్తకం యొక్క ఆరంభ వాక్యంలో ఉండే పేరు "మిద్-బార్," అనగా "అరణ్య మందలి" అని అర్ధం. ఈ పదముతోనే ఈ పుస్తకం మొదలవుతుంది గనుక దీనికి "మిద్-బార్" అని హెబ్రీ భాషలో పేరు పెట్టారు. హెబ్రీ భాషలోని ఈ పుస్తకం యొక్క టైటిల్ ఈ పుస్తక సారమును, అనగా ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడిన కాలాన్ని మరింత ఖచ్చితముగా వివరించింది.1
మనమెక్కడ ఉన్నాము?
ఈ పుస్తకం యొక్క సంఘటనలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన రెండవ సంవత్సరంలో అనగా క్రీ.పూ.1444లో వారు సీనాయి పర్వతమునొద్ద గుడారాలు వేసుకున్నప్పుడు (సంఖ్యాకాండము 1:1) ప్రారంభమయ్యాయి. ఈ కథనం ముప్పై ఎనిమిది సంవత్సరాల తరువాత క్రీ.పూ. 1406 లో “యెరికోయొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో” (36:13) ముగుస్తుంది. సీనాయి అరణ్యములో ప్రజలు సుదీర్ఘంగా తిరుగుతూ ఉండటం, కాదేషు-బర్నేయ ఒయాసిస్ వద్ద వారి సమయం మరియు వాగ్దానం చేసిన భూమి అవతల యొర్దాను నది ఒడ్డునకు వారి రాకను సంఖ్యాకాండము భద్రము చేసింది.
ఎర్ర సముద్రం గుండా తప్పించుకున్న మాజీ బానిసల పిల్లలు, యువతరం వైపు దేవుడు సంఖ్యాకాండము యొక్క సందేశాన్ని నిర్దేశించారు. యెహోషువా, కాలేబు మరియు మోషే మినహా, పాతతరం అనగా మొదటి జనాభా లెక్కల సమయంలో ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ వారి అవిధేయత మరియు అవిశ్వాసం కారణంగా సంఖ్యాకాండము పూర్తయ్యేలోపు మరణించారు (సంఖ్యాకాండము 14:22-30). మోషే తన మరణానికి ముందు ఈ పుస్తకాన్ని పూర్తి చేశాడు (ద్వితీయోపదేశకాండము 31:24).
సంఖ్యాకాండము ఎందుకంత ముఖ్యమైనది?
సంఖ్యాకాండము పాఠకుడిని సుదీర్ఘమైన మరియు వంకలు వంకలుగా పోయే మార్గంలో అరణ్యము గుండా బాధించే వివరాల్లోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తకం మొత్తం పన్నెండు గోత్రముల జనాభా గణన ఫలితాలను ఒకసారి కాదు, రెండుసార్లు నమోదు చేసింది; ఇది నిబంధన మందసమును మరియు గుడారమును నిర్వహించడానికి అవసరమైన యాజక సూచనలను నమోదు చేసింది; మరియు వారు గుడారాలు వేసికున్నప్పుడు ఏయే గోత్రములు ఎక్కడ తమ గుడారములు వేసికోవాలనే విషయాలను కూడా వివరించింది. కానీ వీటన్నిటి ద్వారా, దేశంపై యెడతెగక నిలిచిన దేవుని దిశానిర్దేశమును మనం అనుమానించలేము.
ఎప్పుడో వాగ్దానం చేయబడిన దేశములో ఇంకా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర స్థాపించబడనందున, ఈ పుస్తకం లేఖనాల్లోని యితర భాగాల్లో ప్రస్తావించబడిన ముఖ్యమైన సంఘటనలకు తెరదీసింది. పన్నెండు మంది గూఢచారులలో యెహోషువ మరియు కాలేబు మాత్రమే దేశమును స్వాధీనం చేసుకోగలమని ఇశ్రాయేలీయులను ధైర్యపరచారు (సంఖ్యాకాండము 13-14; యెహోషువ 14: 7); మోషే బండని కొట్టగా నీరు ఉబుకుతూ బయటకు వచ్చింది (సంఖ్యాకాండము 20:11; కీర్తన 106:32); విశ్వసించు ఇశ్రాయేలీయులు తమ పాము కాటు నుండి స్వస్థత పొందటానికి మోషే ఒక స్తంభంపై ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడు (సంఖ్యాకాండము 21:6–9; యోహాను 3:14); మరియు బిలామును అతని గాడిద మందలించింది (సంఖ్యాకాండము 22:21-34; ప్రకటన 2:14).
సంఖ్యాకాండము యొక్క ఉద్దేశమేమిటి?
ఈ పుస్తకంలో, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సహనాన్ని పరీక్షించారు, కాగా ఆయన వారి ఓర్పును మరియు విశ్వాసమును పరీక్షించాడు. ప్రజలు చాలాసార్లు విఫలమైనప్పటికీ, దేవుడు తన నిరంతర సన్నిధిని పగటివేళ మేఘములోను రాత్రివేళ అగ్నిస్తంభములోను వారిని మార్గములో నడిపించుట ద్వారా నిలుపుతూ తన విశ్వాస్యతను చూపించాడు.
ఒక చరిత్ర పాఠం కంటే చాలా విలువైనదీ సంఖ్యాకాండము. తిరుగుబాటు చేయుట, సణుగుకొనుట మరియు అవిశ్వాసము వలన కలుగు పర్యవసానాలను గూర్చి దేవుడు ప్రాధేయపడలేదు. వీటిని తాను సహించనని దేవుడు ఇశ్రాయేలుకు ఎలా గుర్తు చేశాడో సంఖ్యాకాండ పుస్తకం తెలియజేసింది. తనతో ఎలా నడవాలో ఆయన తన ప్రజలకు నేర్పించాడు. అంటే ఏదో అరణ్యంలో కాళ్ళతో భౌతికంగా నడవడమే కాదు, చుట్టు ప్రక్కల నున్న దేశాల మధ్య సాక్షులుగా జీవిస్తూ, తమ చేతులతో ఆయనను సేవిస్తూ, పెదవులతో ఆరాధిస్తూ ఆయనతో నడవాలి. ఆయన వారి దేవుడు, వారు ఆయన ప్రజలు, మరియు వారు తనలాగే ప్రవర్తించాలని ఆయన ఆశించాడు.
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
ఆధునిక పాఠకులు సంఖ్యాకాండము నుండి ఇశ్రాయేలీయుల ప్రారంభ దినాల యొక్క సమగ్ర చరిత్రను మాత్రమే కాకుండా, విధేయతలోనే దేవుని సంతోషము ఉన్నదనేటువంటి నూతన అర్థమును గ్రహించగలరు. ఆయన మన దేవుడు, మరియు మనము నీతిమంతులుగా జీవించాలని, మన మాటలు మరియు క్రియల ద్వారా ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు.
అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తన మొదటి పత్రిక వ్రాసినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణ ఘట్టము అతని దృష్టిలో పడింది. అందుకే 1 కొరింథీ. 10:6లో పౌలు ఇలా వ్రాశాడు, " వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి."
సణుగుతూ, తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులకు, మీకు మధ్య ఏమైనా పోలిక ఉందా? వారిని నిదర్శనంగా తీసుకొని వెంబడంచకుండా మీరు ఎలా ఉండగలరు? వినయముతో మరియు చిత్తశుద్ధితో, మెత్తని మరియు నిష్కపటమైన హృదయం కొరకు ప్రార్థించండి. దేవుని హస్తము చేత నడిపించబడటానికి మీ హృదయమును ఎల్లప్పుడు తెరచి ఉంచండి.
- Eugene H. Merrill, "Numbers," The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 215.