నెహెమ్యా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

యూదా సంప్రదాయం ఈ చారిత్రక పుస్తకం యొక్క ప్రాథమిక రచయితగా నెహెమ్యాను గుర్తిస్తుంది. పుస్తకంలో ఎక్కువ భాగం అతని యొక్క ఉత్తమ పురుష కోణం నుండి వ్రాయబడింది. అతని యవ్వనం గురించి, నేపథ్యం గురించి ఏమీ తెలియదు; పారసీకదేశపు రాజ ప్రాంగణంలో రాజైన అర్తహషస్త‌కు గిన్నె అందించువానిగా పనిచేస్తన్న యుక్తవయస్కుడైన అతనిని మనము కలుస్తాము (నెహెమ్యా 1:11–2:1). ఈ ప్రతిష్ఠాత్మక స్థానం నెహెమ్యా యొక్క నిజాయితీగల స్వభావమును బయలుపరుస్తుంది. చెరలో ఉన్నవారు ఇంటికి వెళ్ళడానికి అనుమతించిన తరువాత అతను పర్షియాలోనే ఉన్నప్పటికీ, యూదాలోని వ్యవహారాల పట్ల అతనికి చాలా ఆసక్తి ఉంది (అతని సహోదరుడైన హనానీ [1:2] అంతకుముందు అక్కడకు తిరిగి వెళ్లాడు).

నెహెమ్యా పుస్తకాన్ని ఎజ్రా పుస్తకానికి కొనసాగింపుగా చదువవచ్చు. కొంతమంది పండితులు ఈ రెండూ మొదట ఒకే పుస్తకముగా రచించబడినదని నమ్ముచున్నారు. నెహెమ్యా యొక్క అసలు వృత్తాంతాలను ఇతర విషయాలతో సంకలనం చేసి నెహెమ్యా పుస్తకాన్ని ఎజ్రా రూపొందించడానికి అవకాశం ఉంది. అయితే, చాలామంది పండితులు ఈ పుస్తకాన్ని నెహెమ్యా రాసినట్లు నమ్ముచున్నారు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీస్తుపూర్వం 444వ సంవత్సరంలో పారసీకదేశపు నగరమైన షూషనులో నెహెమ్యా పుస్తకం ప్రారంభమవుతుంది. పిమ్మట అదే సంవత్సరంలో, బబులోనులో డెభ్బై సంవత్సరాల చెర జీవితం ముగిసిన తరువాత మూడు విడతలుగా తిరిగి వచ్చిన యూదా జనుల్లోని మూడవ గుంపును నడిపించుచు నెహెమ్యా ఇశ్రాయేలునకు ప్రయాణమైయ్యాడు. (ఎజ్రా గ్రంథము మొదటి రెండు విడతల్లో యెరూషలేముకు తిరిగి వెళ్లిన వారిని గూర్చి వివరిస్తుంది.) యెరూషలేములో జరిగిన సంఘటనలపై ఈ పుస్తకం యొక్క అధిక భాగము కేంద్రీకృతమై ఉన్నది. ఈ కథనం క్రీస్తుపూర్వం 430 సంవత్సరంలో ముగుస్తుంది, ఆ తర్వాత కొంతకాలానికి ఈ పుస్తకం వ్రాయబడిందని పండితులు భావిస్తున్నారు.

నెహెమ్యా పాత నిబంధన యొక్క చివరి చారిత్రక పుస్తకం. క్యానన్ (ప్రామాణిక సూత్రం)లో నెహెమ్యా తరువాత ఎస్తేరు పుస్తకం కనిపించినప్పటికీ, ఎజ్రా 6, 7 అధ్యాయాల మధ్య కాలంలో, ఇశ్రాయేలునకు మొదటి రెండు విడతల్లో తిరిగి వచ్చిన గుంపుల మధ్య కాలంలో ఈ నెహెమ్యా పుస్తక చరిత్ర జరిగింది. మలాకీ ప్రవక్త నెహెమ్యాకు సమకాలీనుడు.

నెహెమ్యా ఎందుకంత ముఖ్యమైనది?

నెహెమ్యా ఒక సామాన్యుడు, ఎజ్రా వలె యాజకుడు కాదు లేదా మలాకీ వలె ప్రవక్త కాదు. పట్టణపు గోడలను పునర్నిర్మించడానికి యూదుల గుంపును యెరూషలేముకు నడిపించే ముందు అతను పారసీకదేశపు రాజుకు సేవ చేశాడు. "రాజ దర్బారులో నెహెమ్యా యొక్క నైపుణ్యం శేషింపబడినవారి మనుగడ కోసం అవసరమైన రాజకీయ మరియు శారీరక పునర్నిర్మాణం కొరకు తగినంత సమకూర్చినది."1

నెహెమ్యా నాయకత్వంలో, యూదులు వ్యతిరేకతను తట్టుకొని తమ లక్ష్యాన్ని సాధించడానికి కలిసి వచ్చారు. రాజకీయంగా ప్రాముఖ్యంలేని దేశములో కష్టపడి పనిచేయుటకు రాజభవనంలోని గౌరవనీయమైన స్థానాన్ని వదులుకుని నెహెమ్యా మాదిరిగా ఉండి నడిపించాడు. ప్రజల రాజకీయ మరియు ఆత్మీయ పునాదులను పటిష్టం చేయడానికి ఈ పుస్తకంలో కనిపించే ఎజ్రాతో నెహెమ్యా భాగస్వామి అయ్యాడు. దేవుని ముందు నెహెమ్యా యొక్క తగ్గింపు (1, 9 అధ్యాయాలలో కదిలించివేసే ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థనలను చూడండి) ప్రజలకు ఒక ఉదాహరణగా నిలిచింది. తాను సాధించిన విజయాలనుబట్టి తన్నుతాను మహిమపరచుకోలేదుగాని ఎల్లప్పుడూ దేవునికే మహిమా ఘనతలు చెల్లించాడు.

నెహెమ్యా యొక్క ఉద్దేశమేమిటి?

యూదా రాజధాని నగరమైన యెరూషలేము యొక్క గోడ పునర్నిర్మాణాన్ని గూర్చి నెహెమ్యా నమోదు చేశాడు. ప్రజల ఆత్మీయ పునరుజ్జీవనముకై కలిసి నాయకత్వం వహించిన నెహెమ్యా మరియు ఎజ్రాలు, బబులోనీయుల చెరనుండి విడుదల పొందిన తరువాత యూదులు తమ స్వదేశంలో రాజకీయ మరియు మతపరమైన పునరుద్ధరణ కొరకు దిశానిర్దేశం చేశారు.

నెహెమ్యా యొక్క జీవితం నాయకత్వంపై చక్కటి అధ్యయనాన్ని అందిస్తుంది. అతను బయటి వ్యక్తుల నుండి వ్యతిరేకతను, అలాగే అంతర్గత గందరగోళాన్ని అధిగమించాడు. సగం మందిని నిర్మాణ పనుల్లో ఉపయోగించుకొని, మిగిలిన సగం మందిని సన్బల్లటు ఆధ్వర్యంలో తమ మీద దాడి చేస్తామని బెదిరించిన షోమ్రోనువారి మీద నిఘా కోసం ఉపయోగించుకొని తన వ్యూహంతో తన పరిపాలనా నైపుణ్యాలను నెహెమ్యా ప్రయోగించాడు (నెహెమ్యా 4–7). ఒక గవర్నర్‌గా, పారసీకదేశము విధించిన పన్నులపై అసంతృప్తిగా ఉన్న యూదులతో నెహెమ్యా శాంతి చర్చలు జరిపాడు. అతను తన లక్ష్యాలను పూర్తి చేయటంలో దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాడు. ఆ లక్ష్యాలను సాధించడం వల్ల ప్రజలు తమ భవిష్యత్తును గురించి ప్రోత్సహించబడి, పునరుద్ధరించబడి, ఉత్తేజపరచబడ్డారు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఒక వ్యక్తి దేశంపై ఎలాంటి ప్రాముఖ్యమైన ప్రభావాన్ని చూపుతాడో ఈ నెహెమ్యా పుస్తకం మనకు చూపిస్తుంది. నెహెమ్యా లౌకిక కార్యాలయాలలో పనిచేస్తూ, యూదులకు క్రమమును, స్థిరత్వమును మరియు దేవునిపై సరైన దృష్టిని తిరిగి తీసుకొని రావటానికి తన స్థానాన్ని ఉపయోగించాడు.

దేవుడు అన్ని రకాల వ్యక్తులను అన్ని రకాల ప్రదేశాలలో అన్ని రకాల పనులను చేయుటకు ఉపయోగిస్తాడు. దేవుని సేవ చేయడానికి మీరు “పరిచర్యలో” ఉండాలని మీరు భావిస్తున్నారా? ధైర్యముగా ఉండండి; మీ వృత్తి ఆయన సేవను పరిమితం చేయలేదు. నిజానికి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశముతోనే ఉంచాడు. మీ పని గురించి ఈ వైఖరిని కలిగి ఉండండి: “మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి” (కొలొస్సయులు 3:17).

  1. Norman L. Geisler, A Popular Survey of the Old Testament (Peabody, Mass.: Prince Press, 2007), 165.