నహూము

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఎల్కోషువాడగు నహూము యొక్క పేరు లేఖనమంతటిలో ఈ గ్రంథములోని మొదటి అధ్యాయములో మొదటి వచనంలో కనిపిస్తుంది. నహూము స్వస్థలమైన ఎల్కోషు గురించి పండితులు అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించగా, దక్షిణ యూదాలో ఈ ఎల్కోషు ఉండటం వలన కాలక్రమంలో ఎల్కేషేయి నగరముగా యిది పిలువబడినదని అభిప్రాయపడి యిదే ఉత్తమమైన ఆప్షనుగా గుర్తించారు. మీకా ప్రవక్త ఈ నగరానికి సమీపంలోనే నివసించాడు. అష్షూరు సామ్రాజ్యం యొక్క భయానక శక్తికి విరుద్ధముగా ధైర్యము అవసరమయ్యే యూదా ప్రజలకు నీనెవె పట్టణానికి వ్యతిరేకంగా నహూము యొక్క ప్రవచనం చాలా ప్రధానమైనది.

మనమెక్కడ ఉన్నాము?

క్రీస్తుపూర్వం 663 లో సంభవించిన నోఅమోను లేదా తేబేసు పతనం గురించి నహూము గ్రంథములో ప్రస్తావించబడింది (నహుమ్ 3:8). అలాగే క్రీస్తుపూర్వం 612 లో జరిగిన నీనెవె నాశనం రాబోతున్నదని కూడా ప్రస్తావించబడింది (1:1; 3:11–15). అయితే, ఈ యాభై సంవత్సరాలు పైబడిన కాలంలో, నహూము ఎప్పుడు బోధించాడు? ఈ కాలం యొక్క మొదటి భాగంలో నీనెవె రాజధానిగా ఉన్న అష్షూరు సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉండి, రాజైన మనష్షే పరిపాలనలో యూదాపై గట్టి పట్టు సాధించింది (2 దినవృత్తాంతములు 33:10-13). అలాగే, నహూము పుస్తకంలో తేబేసు విధ్వంసం గురించి ప్రస్తావించగా, క్రీస్తుపూర్వం 654 లో జరిగిన దాని పునర్నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. కాబట్టి క్రీస్తుపూర్వం 663 మరియు 654 సంవత్సరాల మధ్య నహూము ప్రవచించి ఉంటాడు.

యూదా యొక్క సుదీర్ఘ చరిత్రలో అత్యంత దుష్ట రాజులలో ఒకరైన మనష్షే రాజు పాలనలో నహూము బోధించాడు. అతను మంచి రాజుగా ఉండటానికి తన సొంత అనుభవాల ద్వారా బాధను అనుభవించి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం వచ్చింది. మనష్షే యొక్క గొప్ప మార్పు క్రీస్తుపూర్వం 648 లో, అతని మరణానికి కేవలం ఆరు సంవత్సరాల ముందు జరిగిందని వ్యాఖ్యాత జె. బార్టన్ పేన్ సూచించాడు.1 అంటే యూదా చరిత్రలో చీకటి కాలంలో నహూము బోధించాడు. దేవుని నుండి పూర్తిగా వెనక్కి తిరిగిన దేశంలో అన్ని రకాల విగ్రహారాధనతో నిండిన సమయంలో బోధించాడు. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లోకి "ఆదరణ" అని అర్థమిచ్చే నహూమును పంపించడానికి ప్రభువు ఇష్టపడటం ఆయన యొక్క అవిశ్రాంతమైన మరియు అధికమైన కృపను రుజువు చేస్తుంది.2

నహూము ఎందుకంత ముఖ్యమైనది?

నీనెవెకు సంభవింపబోవు తీర్పుపై నహూము యొక్క దృష్టి యోనాలో ప్రారంభమైన కథకు కొనసాగింపుగా ఉన్నది. సుమారు క్రీస్తుపూర్వం 760 లో, అష్షూరు ప్రజలకు పశ్చాత్తాపం మరియు నిరీక్షణను గూర్చి బోధించడానికి దేవుడు యోనాను నీనెవె‌కు పంపాడు, వారు ఈ సందేశమును ఒకసారి విని అన్వయించుకున్నారు. వంద సంవత్సరాల తరువాత, నహూము కాలంలో, అష్షూరీయులు తమ పరమమూర్ఖమైన మార్గాలకు తిరిగిపోయారు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును జయించి, దక్షిణాన యూదాపై తమ శక్తిని చాటుకున్నారు (2 రాజులు 17:1–6; 18:13–19:37). నహూము యూదా ప్రజలకు ఏమి గుర్తు చేశాడో గ్రహించడంలో యోనా విఫలమయ్యాడు: దేవుని న్యాయం ఎల్లప్పుడూ సరియైనదిగాను నిశ్చయమైనదిగాను ఉంటుంది. ఆయన కొంతకాలం దయ చూపడానికి ఇష్టపడ్డాడు, అయితే ఆ మంచి బహుమానం చివరికి అందరికీ న్యాయం జరగాలనే ప్రభువు యొక్క భావాన్ని రాజీపరచలేదు.

నహూము యొక్క ఉద్దేశమేమిటి?

శక్తివంతమైన అష్షూరు రాజులను అధిపతులను సుమారు రెండు వందల సంవత్సరాలు అనుమతించిన తరువాత, నీనెవె నగరాన్ని తీర్పు తీర్చడానికి దేవుడు తన ప్రణాళికలను నహూము ద్వారా ప్రకటించాడు. ఈ పుస్తకం మొత్తంగా దేవునికి పాపం మీద ఉన్న చింతను, దుర్మార్గానికి పాల్పడినవారిని శిక్షించటానికి ఆయన అంగీకరించడాన్ని మరియు తీర్పు కోసం ఆయన కోరికను నిర్వర్తించే శక్తిని స్పష్టంగా చూపిస్తుంది. అయితే చీకటిలో ప్రకాశిస్తున్న ఆశాకిరణాలు కూడా ఇందులో ఉన్నాయి. చాలా ముఖ్యమైనదేమిటంటే, తరతరాలుగా వారి ప్రాధమిక అణచివేతదారు అయిన నీనెవె త్వరలో దేవుని నుండి తీర్పులోకి వస్తుందనే ఆలోచనతో యూదా ప్రజలు వెంటనే ఆశలు పెట్టుకున్నారు. అలాగే, విగ్రహారాధన అధికముగా ఉన్న యూదాలో ఒక చిన్న నమ్మకమైన శేషము యెహోవా యొక్క దీర్ఘశాంతము (నహూము 1:3), ఆయన మంచితనం మరియు బలం (1:7), మరియు ఆయన పునరుద్ధరణ శక్తి (2:2) ని గూర్చి ప్రకటన చేయుట ద్వారా ఓదార్చబడింది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

నిస్సందేహముగా మనలోని, మన ప్రపంచంలోని చీకటితో మనమందరం మునిగిపోయినట్లు యెరుగుదుము. నహూము ఒక చీకటి కాలంలో నివసించాడు. ఈ సమయంలో కొద్దిమంది విశ్వాసులు సాంస్కృతిక మరియు ఆత్మీయ రాజీని యింకెంతకాలం ప్రతిఘటించాల్సి వస్తుందో అని ఆలోచిస్తూ విస్మయమొంది ఉంటారు.

మీ జీవితంలో మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీరు చూసిన దానితో మీరు నిరుత్సాహపడటంతో సరైనది చేయాలనే మీ సంకల్పం బలహీనపడటం మీరు ఎప్పుడైనా కనుగొన్నారా? నహూము ప్రవక్త లోకమంతటా న్యాయం మరియు నిరీక్షణను తీసుకురావడానికి చీకటి సమయాల్లో కూడా పనిచేసే దేవుని క్రియాశీలమైన హస్తాన్ని గుర్తుచేశాడు.

  1. J. Barton Payne, “2 Chronicles,” in The Expositor’s Bible Commentary, abridged ed., Old Testament, ed., Kenneth L. Barker and John R. Kohlenberger III (Grand Rapids: Zondervan, 1994), 672.
  2. Francis Brown, S. R. Driver, and Charles A. Briggs, The Brown-Driver-Briggs Hebrew and English Lexicon (Peabody, MA: Hendrickson, 2006), 637.