మీకా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

మీకా ప్రవక్త తన స్వస్థలమైన మోరెషెత్గతు ద్వారా తనను తాను గుర్తించుకున్నాడు, ఇది యెరూషలేముకు నైరుతి దిశలో ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఫిలిష్తియా మరియు యూదా సరిహద్దు దగ్గర ఉన్నది. దేశంలో వ్యవసాయం అధికముగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్న మీకా తన దేశంలోని ప్రభుత్వ అధికార కేంద్రాల వెలుపల నివసించాడు. దీనివల్ల అతనికి సమాజంలోని దీనదరిద్రుల పట్ల, అనగా కుంటివారు, వెళ్లగొట్టబడినవారు, బాధింపబడినవారి పట్ల బలమైన చింతకు దారితీసింది (మీకా 4: 6). అందువల్ల, మీకా తన ప్రవచనాన్ని చాలావరకు ఇశ్రాయేలు, యూదా రాజధాని నగరాలైన షోమ్రోను మరియు యెరూషలేము యొక్క శక్తివంతమైన నాయకుల వైపు మళ్ళించాడు (1: 1).

మనమెక్కడ ఉన్నాము?

యెషయా మరియు హోషేయ యొక్క సమకాలీనుడిగా, అష్షూరు సామ్రాజ్యం (క్రీ.పూ. 722) చేతిలో ఇశ్రాయేలు యొక్క ఘోరమైన పతనం చుట్టూ తిరిగిన ముఖ్యమైన సంవత్సరాల్లో మీకా ప్రవచించాడు. ఈ పతనమును గూర్చి కూడా అతను ప్రవచించాడు (మీకా 1: 6). యూదాలోని యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా పాలనలో తాను ప్రవచించినట్లు మీకా ఈ గ్రంథములో తన పరిచయంలో పేర్కొన్నాడు. అదే సమయంలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును భూస్థాపితం చేసిన దుష్ట రాజుల పేర్లను గురించి చెప్పడంలో విఫలమయ్యాడు.

ఈ కాలంలో, ఇశ్రాయేలు చెడు మరియు నమ్మకద్రోహ నాయకత్వం యొక్క ప్రభావాల వలన దిగజారిపోతుంటే, యూదా పరిస్థితి ఒక రంగుల రాట్నంవలె తయారైయ్యింది, అనగా ఒక తరంలో దాని గతి మంచి ఎత్తుకు చేరుకుంటే, మరొక తరంలో మందకొడిగా సాగింది. ఈ సమయంలో యూదాలో, మంచి రాజులు మరియు దుష్ట రాజులు ఒకరి తరువాత ఒకరు వచ్చారు. ఈ పద్ధతి యోతాము (మంచి రాజు, 2 రాజులు 15: 32-34); ఆహాజు (చెడు రాజు, 2 రాజులు 16: 1-4); మరియు హిజ్కియా (మంచి రాజు, 2 రాజులు 18: 1–7) పాలనలో కనిపిస్తుంది.

మీకా ఎందుకంత ముఖ్యమైనది?

మీకా గ్రంథము పాత నిబంధనంతటిలో యేసుక్రీస్తు జననమును గూర్చిన ముఖ్యమైన ప్రవచనాన్ని క్రీస్తు పుట్టడానికి ఏడువందల సంవత్సరాల ముందు ఆయన జన్మస్థలమైన బేత్లెహేమును మరియు శాశ్వతకాలముండు ఆయన స్వభావమును సూచిస్తుంది (మీకా 5: 2).

యేసు జననమును గురించిన మీకా ప్రవచనమును చుట్టుకొని సమాధానకారకుడైన రాజు పాలనలో ప్రపంచ భవిష్యత్తు గురించి చాలా స్పష్టమైన వర్ణన ఉన్నది (5: 5). పండితులు వెయ్యేండ్ల రాజ్యం అని పిలిచే ఈ భవిష్యత్ రాజ్యములో, అన్యజనులనేకులు ఒకరితో ఒకరు శాంతి మరియు భద్రతతో జీవించడం (4: 3–4) మరియు పరిపాలించు రాజును, అంటే స్వయంగా యేసును ఆరాధించడానికి యెరూషలేమునకు రావడం (4: 2) జరుగుతుంది. ఈ సంఘటనలు ఇంకా జరగనందున, భవిష్యత్తులో అనిశ్చయమైన సమయంలో వెయ్యేండ్ల రాజ్యం కొరకు మనం ఎదురుచూస్తున్నాము.

మీకా యొక్క ఉద్దేశమేమిటి?

మీకా పుస్తకంలో ఎక్కువ భాగం రెండు ముఖ్యమైన రాబోయే విషయాల చుట్టూ తిరుగుతుంది: ఒకటి ఇశ్రాయేలు మరియు యూదాపై తీర్పు (మీకా 1:1–3:12), మరొకటి వెయ్యేళ్ళ రాజ్యంలో దేవుని ప్రజల పునరుద్ధరణ (4:1–5:15). భయమును మరియు నిరీక్షణను ప్రేరేపించు తీర్పు మరియు పునరుద్ధరణ అను ఈ రెండు భావములను మీకా ప్రవచనం యొక్క చివరి క్రమంలో పూర్తవటం, అలాగే ఒక న్యాయస్థానం దృశ్యంలో దేవుని ప్రజలు ఆయన నుండి మరియు ఇతరుల నుండి తొలగిపోయినందుకు వారి సృష్టికర్త ముందు విచారణ చేయబడుదురు (6:1–7:20). ఈ క్రమంలో, దేవుడు వారి పక్షమున చేసిన మంచి పనులను ప్రజలకు గుర్తుచేస్తాడు. వారు తమ గురించి మాత్రమే లక్ష్యముంచుకున్నను ఆయన వారిని ఎలా చూసుకున్నాడో వారికి గుర్తుచేస్తున్నాడు. దేవుని ప్రజలను భయముతోను మరియు తీర్పుతోను వదిలిపెట్టడానికి బదులు, మీకా గ్రంథము రక్షణ మరియు దయకు (7: 7) ఒకేఒక్క మూలమైన ప్రభువునకు ప్రవక్త మొఱ్ఱపెట్టి ప్రజలకు వారి నిత్య దేవునిలోనే నిత్య నిరీక్షణ అని చూపించి ముగుస్తుంది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఇశ్రాయేలు మరియు యూదాపై మీకా చేసిన నేరారోపణలో చాలావరకు ఈ దేశాల యొక్క దీనుల పట్ల అన్యాయమైన వ్యాపార లావాదేవీలు, దోపిడీ, మహిళలు మరియు పిల్లలను దుర్వినియోగం చేయడం మరియు వారి దేశ ప్రజల కష్టమును దోచుకొని విలాసవంతమైన జీవితమును జీవించిన ప్రభుత్వం ఉన్నాయి.

మీ స్వంత జీవితంలో అన్యాయం ఎక్కడ ఉన్నది? మీ జీవితంలో దీనులైన వారు ఎవరు? ఇశ్రాయేలు మరియు యూదా ప్రజల మాదిరిగా మీకు పశ్చాత్తాపం కోసం పిలుపు అవసరమా?

దేవుడు ఎన్నుకున్న ప్రజలు పశ్చాత్తాపం చెందాలని మీకా యొక్క ఉద్రేకపూర్వక విజ్ఞప్తి మనలో చాలా మందికి దుఃఖము కలుగజేస్తుంది. మనలో చాలామంది ప్రజలను దుఃఖపరచాలని లేదా అన్యాయం చేయడానికి మార్గాలను కనుగొనాలని ప్రతిరోజూ నిశ్చయించుకొనరు. అది ఒక అలవాటుగా చేసేస్తాము. ఇతరులకు న్యాయమును, దయను వ్యాపింపచేయటం పట్ల మన ఉదాసీనత నుండి బయటపడటానికి మీకా మాటలను స్వీకరించుదాము. అలాగే రాబోయే మధురమైన వెయ్యేండ్ల రాజ్యాన్ని పోలి ఉండే ప్రపంచం వైపు పరుగెత్తుదాము. దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలని సంకల్పించుకుందాం- “ న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు” (మీకా 6: 8).