మలాకీ

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పాత నిబంధన యొక్క చివరి పుస్తకమైన మలాకీ దాని రచయిత నుండి దాని పేరును పొందింది (మలాకీ 1:1). హెబ్రీ భాషలో, ఈ పేరు "దూత" అనే పదం నుండి వచ్చింది, ఇది ప్రభువు ప్రవక్తగా మలాకీ దేవుని సందేశాన్ని దేవుని ప్రజలకు అందజేసే పాత్రను సూచిస్తుంది.1 మలాకీ తన గురించి గుర్తించే ఇతర సమాచారాన్ని ఇవ్వలేదు, ఇతర ప్రవక్తలకు విలక్షణమైన గుర్తులను, అనగా అతని తండ్రి పేరు లేదా అప్పటి ఇశ్రాయేలు నాయకుని పేరు వంటివి చేర్చలేదు.

ఏదేమైనా, పుస్తకంలోని విషయాల ఆధారంగా, యెరూషలేములోని ఆలయంలో ఆరాధనలు చేయటంలో సుపరిచితమైన యూదా ప్రేక్షకులకు మలాకీ తన తీర్పు సందేశాన్ని అందించాడని స్పష్టమవుతుంది (2:11). యూదా ప్రజలు యెహోవా యొక్క సత్య ఆరాధన నుండి తొలగిపోయి, తమను తాము తీర్పులోనికి తెచ్చుకున్నారు, మరియు రక్షణ యొక్క అవసరత ఎంతైన ఉన్నది.

మనమెక్కడ ఉన్నాము?

మలాకీ ఖచ్చితంగా యూదా ప్రజలకు వ్రాసాడు (మలాకీ 1:1; 2:11), అయితే చారిత్రాత్మక నేపథ్యం మలాకీ 1:8 లో స్పష్టమవుతుంది. ఇక్కడ ప్రవక్త "అధికారి" అనే పదం కోసం ఫార్సీ పదాన్ని ఉపయోగించాడు, ఇది క్రీస్తుపూర్వం 538–333 మధ్యకాలంలోని పారసీక సామ్రాజ్యం వాగ్దాన దేశాన్ని పరిపాలించిన కాలాన్ని సూచిస్తుంది. ఆలయంలో జరుగు బల్యర్పణల్లో అవినీతిని గురించి కూడా మలాకీ వ్రాసాడు, అంటే క్రీస్తుపూర్వం 515 లో ఇశ్రాయేలీయులు ఆలయాన్ని పునర్నిర్మించిన చాలా సంవత్సరాల తరువాత అతను తన సందేశాన్ని ఇచ్చివుంటాడు. ప్రవక్త యొక్క ఆందోళనలు నెహెమ్యా యొక్క ఆందోళనలకు అద్దం పడుతున్నాయి గనుక క్రీస్తుపూర్వం 432 నుండి నెహెమ్యా అనేక సంవత్సరాలు నగరాన్ని విడిచిపెట్టినప్పుడు మలాకీ ప్రజలకు ప్రవచించాడని దేవుని వాక్యము సూచిస్తుంది (నెహెమ్యా 13:6).

మలాకీ ఎందుకంత ముఖ్యమైనది?

పాత నిబంధన యొక్క చివరి పుస్తకంగా మలాకీ యొక్క ప్రత్యేకమైన స్థానం, దేవునిచేత ప్రత్యేకంగా ఏర్పరచబడ్డ ఒక జనాంగమును, అబ్రాహాము యొక్క వారసులును మరియు యూదు ప్రజల గొప్ప సంప్రదాయం యొక్క వారసులునైన ఇశ్రాయేలీయుల స్త్రీపురుషుల హృదయాలలోనికి సంగ్రహావలోకనం అందిస్తుంది. ఐగుప్తు నుండి నిర్గమనం మరియు దావీదు రాజుపట్ల దేవుని విశ్వాస్యత వంటి మహిమకార్యములను గురించి వారి చరిత్ర వివరించింది. అయితే వారు అరణ్యంలో తిరుగులాడి తీర్పును మరియు వాగ్దాన దేశము నుండి చెరపట్టబడి సిగ్గును అనుభవించారు.

మలాకీ సమయంలో, అనగా అబ్రాహాము శకానికి వెయ్యి సంవత్సరాల తరువాత ఇశ్రాయేలీయులు, చరిత్ర యొక్క ప్రయోజనం మరియు బరువును తమ వైపు కలిగి ఉన్నారు; విశ్వాసం యొక్క ప్రకాశవంతమైన ప్రతిఫలాలను మరియు తమ భూమి నుండి వేరుచేయబడేంత తీర్పుతో సంబంధం ఉన్న శిక్షలను వారు చూడగలిగారు. అయినను, ఆ దృక్పథం కలిగియున్నప్పటికీ, వారు యింకను ప్రభువు మార్గం నుండి తప్పిపోయి తిరుగుచున్నారని మలాకీ పుస్తకం మనకు బోధిస్తుంది. వారికి ఎప్పటిలాగే దేవుని మధ్యవర్తిత్వము అవసరం. కాబట్టి ఈ పుస్తకం పాత నిబంధనలోని తుది తీర్పుగా, మెస్సీయ అనగా యేసుక్రీస్తు ద్వారా దేవుని రక్షణ కార్యమును గూర్చి ముందుగానే తెలియజేసింది.

మలాకీ యొక్క ఉద్దేశమేమిటి?

క్రీస్తుపూర్వం 605 లో యూదా ప్రజలు వాగ్దాన దేశం నుండి చెరపట్టబడటం ఆరంభమైంది, డెభ్బై సంవత్సరాల తరువాత బబులోను నుండి తిరిగి వచ్చారు. మలాకీ సమయానికి, వారు తమ దేశమునకు తిరిగివచ్చి వంద సంవత్సరాలకు పైగా అయ్యింది. మరియు వారు తిరిగి వచ్చినప్పుడు వారు ఆశించిన ఆశీర్వాదాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆలయం పునర్నిర్మించబడినప్పటికీ, తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల ఉత్సాహం దేవుని విషయాల పట్ల పూర్తి అలసత్వమునకు దారితీసింది.

దేవుడు తమను ప్రేమిస్తున్నాడని ప్రజలు నమ్మడానికి యిబ్బందిపడుతున్న సమయంలో మలాకీ వచ్చాడు (మలాకీ 1:2). ప్రజలు తమ దౌర్భాగ్యమైన పరిస్థితులపై దృష్టి సారించి, తమ స్వంత పాపపు క్రియలను ఒప్పుకోవటానికి నిరాకరించారు. కాబట్టి దేవుడు వారి మీద నేరస్థాపన చేశాడు. మరియు మలాకీ ద్వారా, దేవుడు తనతో చేసిన నిబంధనకు వారు ఎక్కడ పడిపోయారో ప్రజలకు చెప్పాడు. వారు మార్పులను చూడాలని ఆశించినట్లయితే, వారు తమ స్వంత చర్యలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక సంవత్సరాలకు ముందు సీనాయి పర్వతంపై తమ తండ్రులు దేవునితో చేసిన ప్రమాణం ప్రకారం దేవునికి నమ్మకంగా సేవ చేయాల్సిన అవసరం ఉంది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఇశ్రాయేలు చరిత్ర అంతటా దేశం విఫలమైంది మరియు దేవుడు తన ప్రజలను తిరిగి తన వద్దకు పిలిచాడు. ఇశ్రాయేలు విఫలమైన ప్రతీసారి ఆ చక్రం మళ్లీ మొదటికే వస్తుంది. పాత నిబంధన యొక్క దేవుని చివరి మాట పాపము వలన కలిగే తీర్పుకు సంబంధించినదైయున్నది. అలాగే ఆయన కృప వల్లనైన సహాయం లేకుండా ఆయనను మనం ప్రేమించలేమని ఆ మాట సాక్ష్యమిస్తుంది.

మీరు స్థిరంగా దేవుణ్ణి అనుసరించడానికి కష్టపడుతున్నారా? దేవుని ముందు నమ్మకంగా జీవించమని మలాకీ యొక్క పిలుపు మనల్ని ప్రేరేపిస్తుంది. అలాగే దేవుడు తన ప్రజలకు దయను విస్తరింపజేయడం ఇంకా పూర్తవ్వలేదనే నిరీక్షణను అందిస్తుంది (మలాకీ 3:1; 4:2, 5–6).

  1. Francis Brown, S. R. Driver, and Charles A. Briggs, The Brown-Driver-Briggs Hebrew and English Lexicon (Peabody, Mass.: Hendrickson, 2006), 521.