లేవీయకాండము

ఈ పుస్తకాన్ని వాుసినదెవరు?

లేవీయకాండము యొక్క అంశాలు నేరుగా నిర్గమకాండము‌తో సంబంధం కలిగి ఉండటంతో ఈ రెండు పుస్తకాలను ఒకే వ్యక్తి రాసినట్లు రుజువుపరుస్తోంది. మోషే నిర్గమకాండమును వ్రాశాడనుటకు మద్దతునిచ్చే వాదనలే లేవీయకాండమును కూడా వ్రాశాడనుటకు సమర్థిస్తున్నాయి (మునుపటి అధ్యాయం చూడండి). అదనంగా, " మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను" (లేవీయకాండము 1:1; 4:1; 5:14; 6:1) అనే వాక్యం చెప్పబడిన సందర్భాలు యాభైకి పైగా మనకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. క్రొత్త నిబంధన కూడా మోషేనే లేవీయకాండములోని వాక్యభాగాలకు రచయితగా సూచిస్తుంది (మత్తయి 8:4; లూకా 2:22; హెబ్రీయులు 8:5).

లేవీయకాండము అనే పదం లేవి తెగ నుండి ఉద్భవించింది. ఈ తెగలోని సభ్యులను దేవుడు యాజకులుగాను, ఆరాధన నాయకులుగాను ఉండునట్లుగా ప్రత్యేక పరచాడు. " ‘లేవీయకాండము’ అను పదము సెప్టువాజింట్ నుండి అనువదించబడింది. దీని అర్థం ‘లేవీయులకు సంబంధించినది.’ ఈ లేవి తెగను గూర్చి పుస్తకమంతటా నొక్కిచెప్పబడనప్పటికీ, యాజకపరమైన విషయాలు ఈ శీర్షికే సముచితమైనదని చూపిస్తున్నాయి.”1 ఇశ్రాయేలను కొత్త దేశాన్ని సరైన ఆరాధనలో మరియు సరైన జీవనంలో శిక్షణ ఇచ్చి, తద్వారా వారు తమ రాజాధిరాజు యొక్క స్వభావమును ప్రతిబింబింపజేయాలని ఈ పుస్తకం యొక్క ప్రథమ ఉద్దేశం.

మనమెక్కడ ఉన్నాము?

లేవీయకాండములోని ధర్మశాస్త్రము సీనాయి పర్వతము నొద్ద లేదా దాని సమీపంలో దేవుడు మోషేతో మాట్లాడి అందించాడు. అక్కడ ఇశ్రాయేలీయులు కొంతకాలం బస చేశారు. పది ఆజ్ఞలను ఇచ్చిన తరువాత దేవుడు ఈ వివరణాత్మక ఆజ్ఞలను అందించినందున, ఇవి ప్రకటింపబడటానికి క్రీ.పూ.1446 చాలా అనువైన తేదీగా కనబడుచున్నది. అయినను ఈ సమయంలోనే ప్రతి ఆజ్ఞ వ్రాయబడిందా అనేది నిర్ధారించటం అసాధ్యం. అయితే నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడిన సమయంలో ఈ ఆజ్ఞలన్నీ క్రమక్రమంగా క్రోడీకరించబడి ఉంటాయి.

లేవీయకాండము ఎందుకంత ముఖ్యమైనది?

“యూదుల పిల్లవాడు అధ్యయనం చేసే మొదటి పుస్తకం ఈ లేవీయకాండము. అయినప్పటికీ క్రైస్తవుడు అధ్యయనం చేసే బైబిల్లోని పుస్తకాలలో ఇది తరచుగా చివరి పుస్తకంగా ఉన్నది.”2 నేటి పాఠకులు ఈ పుస్తకంలోని ఆహార, బలి మరియు సామాజిక ప్రవర్తనకు సంబంధించిన ఆజ్ఞల జాబితాల వలన తరచుగా ప్రక్కన పెడుతున్నారు. కానీ ఈ గొప్ప వివరణాత్మక ఆదేశాలలో మనం దేవుని యొక్క పరిశుద్ధతను, అనగా ఆయన ప్రత్యేకతను, విశిష్టతను మరియు పూర్తి “భిన్నత్వాన్ని” కనుగొంటాము. పాపమనేది సృష్టికర్తతో మానవాళికి ఉన్న సంబంధాన్ని ఎలా నాశనం చేస్తుందో మనం ఈ పుస్తకంలో నేర్చుకుంటాము.

దేవుడు తన నిబంధన ప్రజలు తనను ఆరాధించుట ద్వారా తన సహవాసమును ఆస్వాదించడానికి బల్యర్పణ వ్యవస్థను ఏర్పాటు చేసాడు. ఇది పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణకు కూడా అనుమతించింది:

ఆరాధించువాడైన ఇశ్రాయేలీయుడు బలి పశువుపై చేయి వేసినప్పుడు, ఆ పశువు తన ప్రత్యామ్నాయమని అతను తన్ను తాను గుర్తించాడు. . . ఇది సాదృశ్యముగా అతని పాపాన్ని మరియు చట్టబద్ధముగా అతని అపరాధాన్ని ఈ బలి పశువుకు బదిలీ చేయబడి నెరవేర్చబడింది. అప్పుడు నిర్దిష్టమైన పాపానికి విమోచన క్రయధనముగా దేవుడు జంతు వధను అంగీకరించాడు. . . దేవుడు జంతు వధను అంగీకరించాడు.3

మోషే లేవీయకాండము వ్రాసిన చాలా సంవత్సరాల తరువాత, యేసు, పరిశుద్ధమైన మరియు పరిపూర్ణమైన, ఒక్కసారే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యిక భవిష్యత్తులో జంతు బలులు అనవసరమని మరియు వ్యర్ధమని తనను తాను అంతిమ బలిగా అర్పించుకోడానికి వచ్చాడు (హెబ్రీయులు 10:10).

లేవీయకాండము యొక్క ఉద్దేశమేమిటి?

లేవీయకాండము యొక్క మొత్తం సందేశం పరిశుద్ధపరచుట. దేవుని క్షమాపణను, ఆయన అంగీకారమును పొందుకున్న తర్వాత పరిశుద్ధ జీవితాన్ని మరియు ఆత్మీయ ఎదుగుదలని అనుసరించాలని ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని చేత విమోచింపబడినందున, వారు తమ దేవునికి అర్హులైన ప్రజలుగా పరిశుద్ధపరచబడాలి. "మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను" అని లేవీయకాండము 19:2 చెబుతోంది. దేవుడు సమీపించడానికి ఇష్టపడతాడని లేవీయకాండములో మనం తెలుసుకుంటాము, కాని మనం ఆయనను సమీపించటం ఆయన నిబంధనల ప్రకారం జరగాలి.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

పరిశుద్ధత అనే అంశము సంఘమునకు విస్తరించింది. లేవీయకాండము 19:2లోని విషయాన్ని క్రొత్త నిబంధనలో 1 పేతురు 1:15-16 ఇలా ప్రస్తానించాయి: "నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది...మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి." దేవుని వాత్సల్యమునుబట్టి విమోచింపబడినవారు ఈ రోజు భిన్నమైన అర్పణలు అర్పించుచున్నారు; అవేమిటంటే వారు తమ్మును తామే అర్పించుకుంటున్నారు (రోమన్లు 12:1).

ఆయన ఇశ్రాయేలీయుల పట్ల చేసినట్లే, దేవుడు క్రైస్తవులను విమోచించి ప్రత్యేకపరచాడు. యేసు మన తరపున పరిపూర్ణ బలిగా తనను తాను అర్పించుకున్నాడు. మనం క్షమించబడులాగున మనకు అర్హమైన శిక్షను ఆయన తనపై వేసుకున్నాడు. ఎవరైతే యేసు ప్రాయశ్చిత్త చర్యపై నమ్మకం ఉంచుతారో వారు కృపచేత రక్షించబడిన దేవుని పిల్లలు అవుతారు (ఎఫెసీయులు 2:8–9).

మీరు ఆయన బిడ్డలైతే, మీరు ఆయన స్వభావమును ప్రతిబింబించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇశ్రాయేలు దేశాన్ని పరిశుద్ధపరచినట్లు ఆయన మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మీ జీవితం ఆయనను ప్రతిధ్వనిస్తుందా? మీరు క్రీస్తువలె ఏ రీతిగా ఎదుగుతున్నారు?

  1. Raymond B. Dillard and Tremper Longman, III, An Introduction to the Old Testament (Grand Rapids: Zondervan, 1994), 73.
  2. F. Duane Lindsey, "Leviticus," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 163.
  3. Lindsey, "Leviticus," 166.