న్యాయాధిపతులు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఈ పుస్తకాన్ని ఎవరు వ్రాశారనే దానిపై న్యాయాధిపతుల గ్రంథము ఎటువంటి ఆనవాలు ఇవ్వలేదు. కాని యూదా సంప్రదాయం ప్రవక్తయైన సమూయేలు‌ను రచయితగా పేర్కొంది. మొదటి మరియు రెండవ సమూయేలు గ్రంథాలు సమూయేలు పేరట వ్రాయబడ్డాయి. సమూయేలు న్యాయాధిపతుల్లో చివరివాడు. దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఈ కాలంలో లేవనెత్తిన ముఖ్యమైన నాయకులలో ఒకడు ఈ సమూయేలు. మనం అనుకున్నట్లుగా న్యాయాధిపతులు కేవలం చట్టపరమైన విషయాలనే పర్యవేక్షించలేదు; సైనిక మరియు పరిపాలనా అధికారం తరచుగా వారి పనులలో భాగమైపోయింది.

సమూయేలే ఎందుకు? న్యాయాధిపతుల రచయిత ఖచ్చితంగా రాచరికం యొక్క ప్రారంభ దినాల్లో జీవించాడు. “ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు” (న్యాయాధిపతులు 17: 6; 18: 1; 19: 1; 21: 25) అనే వాక్యము పునరావృతమైంది. ఈ పుస్తకంలో జరుగుతున్న సంఘటనలకు, అలాగే దీన్ని వ్రాసే సమయానికి మధ్యనున్న వ్యత్యాసమును పై వాక్యము ఎత్తి చూపింది. సౌలు రాజుగా అభిషిక్తుడైన తరువాత (క్రీ.పూ. 1051), దావీదు తన సింహాసనాన్ని యెరూషలేములో (క్రీ.పూ. 1004) స్థాపించడానికి ముందే వ్రాయబడిందని న్యాయాధిపతులలోని ఆధారాలు సూచిస్తున్నాయి (న్యాయాధిపతులు 1: 21 ని 2 సమూయేలు 5: 6–7 తో, అలాగే న్యాయాధిపతులు 1: 29 ని 1 రాజులు 9: 16 తో పోల్చండి). అలాగే సందర్భం వచ్చినపుడు సమూయేలు వ్రాసేవాడు (1 సమూయేలు 10: 25).

మనమెక్కడ ఉన్నాము?

మనము న్యాయాధిపతుల గ్రంథమును గురించి, అది ఒక కాల వ్యవధిగాను, ఒక బైబిల్ పుస్తకముగాను ఆలోచిస్తాము. క్రీస్తుపూర్వం పద్నాలుగో శతాబ్దం ప్రారంభంలో యెహోషువ మరణం తరువాత న్యాయాధిపతుల కాలము ప్రారంభమై (యెహోషువ 24: 29), క్రీస్తుపూర్వం 1051 లో ప్రవక్తయైన సమూయేలు చేత సౌలు ఇశ్రాయేలు రాజుగా పట్టాభిషేకం చేయబడే వరకు కొనసాగింది (1 సమూయేలు 10: 24). యెహోషువ మరణానికి సంబంధించిన వృత్తాంతము ఈ పుస్తకంలో కూడా ఉండుట వలన ఈ గ్రంథము యెహోషువ గ్రంథమునకు కొనసాగింపుగా ఉన్నది (యెహోషువ 24: 29–31; న్యాయాధిపతులు 2: 6–9). దేశం భౌగోళికముగా ఎంత విస్తరించి యున్నదో ఈ న్యాయాధిపతుల పుస్తకంలోని సంఘటనలు జరిగిన నగరాలను, పట్టణాలను, యుద్ధభూములను చూస్తే తెలుస్తుంది. కొంతమంది న్యాయాధిపతులు వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో ఏకకాలంలో పాలించారని పండితులు భావిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథము యొక్క సమయం ఎంత నడచినదో లెక్కించటానికి చేసిన ప్రయత్నాలు అసంపూర్ణముగానే మిగిలిపోయాయి. కాని సాధారణంగా, ఈ పుస్తకం యెహోషువ మరణం తరువాత ఆరంభమై సమూయేలు రాకకు కొన్ని సంవత్సరాల ముందు ముగిసింది. అంటే న్యాయాధిపతుల కాలం సుమారు మూడు వందల సంవత్సరాలు.

న్యాయాధిపతులలోని విషయాలు కాలక్రమానుసారం వ్రాయబడలేదు. చివరి కొన్ని అధ్యాయాలు (న్యాయాధిపతులు 17–21) ఆ రోజుల్లో ఉన్నటువంటి నైతిక వాతావరణం గురించి సంక్షేపముగా చూపించాయి. ఈ పుస్తకంలో ఇంతకుముందు వ్రాయబడినట్లు నైతిక పతనం న్యాయాధిపతుల కాలం తరువాత జరుగలేదు గాని, ప్రారంభ అధ్యాయాల్లో చెప్పబడినట్లు ఇవన్నీ న్యాయాధిపతుల కాలంలోనే సంభవించాయి.

న్యాయాధిపతులు ఎందుకంత ముఖ్యమైనది?

న్యాయాధిపతుల సమయం ఇశ్రాయేలు‌లో గొప్ప మతభ్రష్టత్వానికి దారితీసింది. వాగ్దాన దేశములో ఇంకా పూర్తిగా స్వాధీనం చేసుకోని భూభాగాన్ని ప్రజలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో దేశం రాజకీయ మరియు మతపరమైన గందరగోళానికి గురైంది. మనష్షే (న్యాయాధిపతులు 12) మరియు బెన్యామీను (20–21) గోత్రములను దాదాపుగా తుడిచిపెట్టేంత రీతిలో గోత్రములు తమలో తాము పోరాడుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథము యొక్క విధానం స్పష్టంగా ఉంది: ఆ విధానమేమిటంటే, ప్రజలు విగ్రహారాధన మరియు అవిశ్వాసం ద్వారా తిరుగుబాటు చేయటం, తామెరుగని జనుల చేతిలో అణగద్రొక్కబడునట్లుగా దేవుడు తీర్పు తీర్చటం, దేవుడే వారి కొరకు ఒక రక్షకుని లేక న్యాయాధిపతిని లేవనెత్తడం, ప్రజలు పశ్చాత్తపపడి దేవుని వైపు తిరగటం. ప్రజలు మరల పాపములో పడిపోయినప్పుడు మళ్లీ ఈ పై విధానమే తిరిగి ప్రారంభమవుతుంది.

ఈ పుస్తకంలో మనం అనేకమంది విశ్వాస వీరులను కలుసుకుంటాము: ఒత్నీయేలు, గిద్యోను, సమ్సోను, షమ్గరు, దెబోరా, యెఫ్తా, ఏహూదు...లోపాలు కలిగియున్నటువంటి ఈ వ్యక్తులు దేవుని పిలుపునందుకొని ఇశ్రాయేలీయులను కొన్నిసార్లు నాటకీయముగా విమోచించారు. ఈ పుస్తకంలో కళ్ళను కట్టిపడేసే దృశ్యాలు, హింసాత్మక మరియు కలతపెట్టే దృశ్యాలు ఉన్నాయి. ఈ దృశ్యాల్లో కొన్ని నీతిన్యాయముల పేరిట, మరికొన్ని దుష్టత్వం పేరిట జరిగాయి.

న్యాయాధిపతులు యొక్క ఉద్దేశమేమిటి?

న్యాయాధిపతులు ముఖ్య సందేశం ఏమిటంటే, పాపమునకు శిక్ష పడకుండా దేవుడు ఊరుకోడు. నిర్గమకాండములో చెప్పబడినట్లుగా, ఇశ్రాయేలు దేవుని జనాంగము, ఆయన వారి రాజు. సీనాయి పర్వతం వద్ద ఏర్పాటు చేయబడిన నిబంధనను వారు త్రోసివేశారు. ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను అనుసరించి, దేవుని ఆజ్ఞలకు అవిధేయులై, ఘోరమైన దుర్నీతిలో పడిపోయినప్పుడు, కొన్ని సమయాల్లో అరాచకత్వానికి దిగినప్పుడు దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టినట్లు మనం ఈ న్యాయాధిపతుల్లో చూస్తాము. అయినను వారు ఆయన ప్రజలు గనుక తమ్మును కనికరించుమని వారు ఆయనకు పెట్టిన మొఱ్ఱను ఆయన ఆలకించి వారిని రక్షించుటకు రక్షకులను లేవనెత్తాడు. అయితే, ఈ దైవభక్తిగల వ్యక్తులు కూడా దేశం యొక్క దిశను మార్చడంలో తగిన ప్రభావాన్ని చూపలేదు. పాపాత్మకమైన కనానీయుల ప్రభావాలను ఎదిరించడంలో ప్రజల అసమర్థత చివరికి ఆ కనానీయుల వలెనే రాచరిక పరిపాలన కావాలనే కోరికను బయలుపరచింది. దేవుడు ఎవరినైతే మధ్యవర్తిగా ఏర్పరచుతాడో అతడే నీతిమంతుడైన రాజుగా ప్రజలను నడిపిస్తాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

జ్ఞాపకశక్తి ఒక బహుమతి. గతాన్ని గుర్తుంచుకోవడం వలన ఈ రోజు మనం ఎలా జీవించాలో లెక్కలేనన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. కాని ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. వారిని తమ వాగ్దాన దేశానికి నడిపించిన అద్భుత సంఘటనలు గాని లేదా వారిని దేవునికి ఐక్యము చేసిన నిబంధన గాని వారికి గుర్తులేదు. కానీ దేవుడు తన నిబంధనను మరచిపోలేదు. తన ప్రజలపై ఆయనకున్న గొప్ప ప్రేమ, తన పాపపు పిల్లలు తన యొద్దకు తిరిగి వచ్చేలా క్రమశిక్షణ చేసింది.

మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మీరు మరచిపోయారా? బహుశా మీ క్లిష్ట పరిస్థితులు మీ విశ్వాసాన్ని అణచివేస్తున్నాయేమో. ఆయన ప్రస్తుతం మిమ్మల్ని శిక్షించుచున్నట్లు మీకు అనిపిస్తుందా? ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించునని గ్రహించండి (హెబ్రీయులు 12: 5–11). ఆయన తట్టు తిరగండి. జ్ఞాపకముంచుకొనుడి, నమ్మకముంచుడి, విధేయులై యుండుడి. ఆయన తన చేతులు చాచి ఎదురుచూస్తూ ఉన్నాడు.