యెహోషువ

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఈ పుస్తకం యొక్క ముఖ్యమైన వ్యక్తియే దీనికి శీర్షిక అయ్యాడు. యెహోషువ అనగా “యెహోవా రక్షించును.”1 ఎందుకంటే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేశాన్ని నడిపించి, వాగ్దాన దేశమును జయించి స్వాధీనపరచుకోవటానికి యెహోషువ చాలా కీలకమైన వ్యక్తి గనుక ఈ పేరు ఈయనకు తగినదే. ఈ పుస్తకాన్ని యెహోషువ గాని లేక అతని పర్యవేక్షణలో ఒక శాస్త్రి గాని వ్రాసివుండవచ్చని దైవ పండితులు భావిస్తున్నారు. ఒక సేనాధిపతి చేత ప్రత్యక్ష అనుభవాలు (ఉదాహరణకు, యెహోషువ 5: 1, 6 లో “వారు,” "మనకు" అనే సర్వనామములు ఉపయోగించబడినవి), అలాగే తెలుసుకోదగిన మరియు భద్రపరచదగిన సైనిక వివరాలు ప్రారంభ అధ్యాయాల్లో పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకంలో కొంత భాగాన్ని యెహోషువనే వ్రాశాడని యెహోషువ 24:26 సూచించుచున్నది. యెహోషువ తదనంతరం, వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత జరిగిన సంఘటనలను సూచించే వాక్యభాగాలను ప్రధాన యాజకులైన ఎలియాజరు లేదా ఫీనెహాసు ఈ పుస్తకంలో చేర్చి ఉంటారు (15: 13–19; 19: 47; 24: 29–33).2

మనమెక్కడ ఉన్నాము?

ఈ పుస్తకం యొక్క సంఘటనలు ఇరువది అయిదు సంవత్సరాల నిడివిగలవై క్రీ.పూ. 1406 లో మోషే మరణించిన వెంటనే, అనగా వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకొనక ముందు ఆరంభమైయ్యాయి. కనానును స్వాధీనపరచుకోవటానికి యేడు సంవత్సరాలు పట్టింది. కనానును జయించిన ఇరవై సంవత్సరముల తరువాత యెహోషు యొక్క చివరి మాటలు మరియు అతని మరణము సంభవించాయి. ఇశ్రాయేలు దేశం యొర్దాను నది ఒడ్డున, యెరికోకు అవతల ఉన్నప్పుడు ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. ఈ పుస్తకం వాగ్దాన దేశంలో నివాసముంటున్నవారిని ఓడించిన అనేకమైన సైనిక దండయాత్రల వివరాలను భద్రపరచింది. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరిని పోగుచేసి చివరిసారిగా హెచ్చరించి ఉపదేశించుటతో ఈ పుస్తకం ముగుస్తుంది.

వాగ్దాన దేశంలో స్థిరపడిన జయశీలురైన ఇశ్రాయేలీయులకు వ్రాయబడింది. వీరు జయశాలురై క్రొత్తగా స్థిరపడినప్పటికీ, వాగ్దాన దేశమును పూర్తిగా స్వాధీనపరచుకోలేదని యెహోషువ వీరికి గుర్తు చేసాడు: "స్వాధీనపరచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది" (13: 1).

యెహోషువ ఎందుకంత ముఖ్యమైనది?

వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు యొక్క ప్రయాణం పరాకాష్టకు చేరటాన్ని యెహోషువా గ్రంథము భద్రపరచింది. కనాను దేశమును యాకోబు సంతతికి ఇస్తానని దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఇక్కడ మనం చూడగలము. దేవుడైన యెహోవాయే తమకు సర్వసైన్యాధిపతియని యెహోషువ వర్ణించాడు. ఎందుకంటే తన ప్రజలు తన యందు విశ్వాసముంచి, విధేయులైనట్లైతే వారిని విజయవంతముగా యుద్ధములో నడిపించేది ఆయనే.

యెహోషువ గ్రంథము వైరుధ్యమైన కథను వివరించింది. ఒక వైపు, దేవుడు తాను వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలు దేశానికి ఇచ్చాడు. మరోవైపు, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో నివాసముంటున్న జనులను పూర్తిగా వెళ్లగొట్టకుండా వారిని ఉండనిచ్చి, వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వాధీనపరచుకోవటంలో విఫలమైయ్యారు. దేవుడు తాను చెప్పిన దానిని పూర్తిగా నెరవేర్చాడు, కాని ఇశ్రాయేలీయులు తాము చేయవలసిన పనిని పూర్తి చేయలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ కనానీయలు ఇశ్రాయేలీయులపై దుష్ప్రభావాన్ని చూపారు.

ఈ పుస్తకంలో మనకు విశ్వాసపాత్రమైన వృత్తాంతాలు కనబడుచున్నాయి: రాహాబను వేశ్య (యెహోషువ 2: 1–21), యెరికో యుద్ధం (6: 1–27), మరియు యోధుడైన కాలేబు (14: 6–14). అలాగే అవిధేయత, దాని పర్యవసానాలను కూడా మనం కళ్ళారా చూడవచ్చు: ఆకాను చేసిన పాపం (7: 1), దాని వల్ల హాయి పట్టణం చేతుల్లో ఓడిపోవడం (7: 5), శత్రువును సమూల నాశనం చేయాలన్న దేవుని ఆజ్ఞను పాటించటంలో విఫలమైన కొన్ని గోత్రములు, ఆఖరికి యెహోషువ కూడా దేవుని యొద్ద మొదట విచారణ చేయకుండా గిబియోనీయులతో నిబంధన చేసాడు (9: 1–27).

యెహోషువ యొక్క ఉద్దేశమేమిటి?

యెహోషువ గ్రంథము వాగ్దాన దేశమును స్వాధీనపరచుకున్నవారి సంతతికి, అనగా వారి పితరులు ఆ దేశములో ఎలా స్థిరపడ్డారనే విషయాలను గూర్చి చారిత్రక వృత్తాంతముగా వ్రాయబడింది. ఈ పుస్తకం దేవుడిని సర్వసైన్యాధిపతిగా, రక్షకునిగా, రాజుగా కొనియాడుచున్నది. ఇశ్రాయేలు యొక్క ఒక్కొక్క గోత్రమునకు ఇవ్వబడిన భౌగోళిక సరిహద్దులను గూర్చి ఈ పుస్తకం తెలుపుచున్నది. అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే, ఈ యెహోషువ గ్రంథము, మోషే కాలం మరియు న్యాయాధిపతుల కాలం మధ్య అనుసంధాన కథనంగా పని చేసింది. ఈ రెండింటి మధ్యనున్న కాలంలోనే ఈ పుస్తకం మొదటిసారిగా చాటించబడింది. వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనే ప్రయాణమును మోషే ఆరంభించి, అరణ్యంలో ఎన్నో ఒడిదుడుకులను సహించాడు. అయితే యెహోషువ ఆ వాగ్దాన దేశమును విజయవంతముగా స్వాధీనపరచుకున్నాడు. ఎన్ని యుగాలైనను దేవుని వాగ్దానాలు ప్రజల కన్నుల యెదుటనే నెరవేరుతున్నాయి. "యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను" (యెహోషువ 21: 45).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

యెహోషువ గ్రంథములోని చివరి వచనాలు మూడు భూస్థాపన కార్యక్రమాలను గూర్చి వివరించాయి: యెహోషువా (యెహోషువా 24: 29-30), యోసేపు ఎముకలు (24: 32), మరియు ప్రధాన యాజకుడైన ఎలియాజరు (24: 33). వింతగా అనిపించినా, ఈ మూడు భూస్థాపన కార్యక్రమాలు దేవుని వ్యక్తిత్వమును ప్రకటించుచున్నవి. ఈ ముగ్గురు మనుష్యులు ఇశ్రాయేలీయులు దాస్యములో ఉన్న దినాలకు సంబంధించినవారు (యోసేపు తన తండ్రియైన యాకోబు కుటుంబముతో ఐగుప్తులో ఎప్పుడో స్థిరపడ్డాడు, యువకులుగా ఉన్న యెహోషువ, ఎలియాజరులు బానిసత్వమునుండి విడుదలనొంది అరణ్యము గుండా సుదీర్ఘ ప్రయాణమును కొనసాగించారు).

ఎప్పటికైన సరే, దేవుడు మాత్రమే వాగ్దానమునకు కట్టుబడియుండేవాడు. నమ్మదగినవాడుగాను, ఉండువాడుగాను ఆయన ఇశ్రాయేలునకు ఉన్నట్లుగా, ఆయన మనకు కూడా తోడుగా ఉన్నాడు. "నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును" (1: 9).

  1. Donald K. Campbell, "Joshua," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 325.
  2. Norman L. Geisler, A Popular Survey of the Old Testament (Peabody, Mass.: Prince Press, 2007) 93-94.