యోనా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ప్రధానంగా ప్రథమ పురుషలో వ్రాయబడిన యోనా గ్రంథము, ప్రవక్తను తన సొంత వృత్తాంతము యొక్క రచయిత అని స్పష్టంగా పేర్కొనలేదు. కాని గ్రంథము యొక్క ప్రేరేపణ లేదా చారిత్రక వాస్తవికతను అనుమానించడానికి మనకు ఎటువంటి కారణం లేదు. 1 వ వచనంలో అమిత్తయి కుమారునిగా గుర్తించబడిన యోనా, ఈ ప్రాంతంలోని నజరేతుకు సమీపంలో ఉన్న గత్హేపెరు అనే పట్టణం నుండి వచ్చాడు, తరువాత యిది గలిలయ అని గుర్తించబడింది (2 రాజులు 14: 25). ఈ గ్రంథము ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు నుండి వచ్చిన కొద్దిమంది ప్రవక్తలలో ఒకనిగా యోనాను తయారు చేసింది.

మనమెక్కడ ఉన్నాము?

యోనా ప్రవక్తగా ఉన్న సంవత్సరాల్లో, అన్యదేశాల మధ్య ఇశ్రాయేలు ఆత్మీయ కోణంలో కాకుండా రాజకీయంగా ఎత్తుగా నిలిచింది. యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిన రాజైన యరొబాము II (క్రీ.పూ. 793-753) పాలనలో ఇశ్రాయేలు సరిహద్దులు సొలొమోను కాలం మొదలు చాలా గొప్ప స్థాయికి విస్తరించాయి. పెరిగిన ఐశ్వర్యమునకు ఫలితంగా భౌతికవాద సంస్కృతి ఏర్పడింది. ఇది బీదలకు మరియు దీనులకు అన్యాయం చేసి వృద్ధి చెందింది. ఇది యోనా యొక్క ప్రవచనాత్మక సమకాలీనుడైన ఆమోసు యొక్క ముఖ్య సందేశాలలో ఒకటి.

అయినప్పటికీ, తన సొంత ప్రజలకు ప్రవచించమని యోనాను నిర్దేశించకుండా, దేవుడు అతన్ని అష్షూరు రాజధానియైన నీనెవెకు నియమించాడు. దేవుని సందేశాన్ని అందించడానికి ఈశాన్య ప్రయాణాన్ని చేయడానికి మొదట ఇష్టపడని యోనా, తనకు తెలిసిన పశ్చిమ దిశగా ఉన్న ఆధునిక స్పెయిన్‌లోని తర్షీషును లక్ష్యంగా చేసుకున్నాడు. దేవుడు చివరికి యోనాను సరైన దిశలో తిప్పిన తరువాత, ప్రవక్త విధేయతతో నీనెవె ప్రజలకు ప్రవచించాడు. అప్పుడు అషుర్దాను III (క్రీ.పూ. 772-754) అష్షూరుకు రాజుగా ఉన్నాడు. అష్షూరు కొంతకాలంగా రాజకీయంగా బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ, యోనా కాలం నాటికి బందీల పట్ల మరియు ఇతర అనుచిత వ్యక్తుల పట్ల వారి క్రూరత్వం ఇశ్రాయేలు‌లో బాగా ప్రసిద్ధి చెందింది. కావున యోనా తెచ్చిన పశ్చాత్తాపం యొక్క సందేశానికి స్పష్టమైన అవసరం ఏర్పడింది.

యోనా ఎందుకంత ముఖ్యమైనది?

యేసు తన భూసంబంధమైన పరిచర్యలో (యెషయా, దానియేలు మరియు జెకర్యా మిగిలిన ముగ్గురు) ప్రస్తావించిన నలుగురు ప్రవక్తల పేర్లలో యోనా ఒకడు. కాని యోనాను గూర్చి ప్రస్తావించటం కంటే ఎక్కువే ఉన్నది. గొప్ప మత్స్యము కడుపులో ప్రవక్త మూడు రోజుల నివాసమును తన మరణానికి సాదృశ్యముగా పేర్కొని, యేసు తన గొప్ప పునరుత్థానానికి ముందు మూడు రోజులు “భూగర్భములో” గడుపుటను గూర్చి చెప్పి తనను తాను యోనాతో గుర్తించుకున్నాడు (మత్తయి 12 : 39–41). యోనా జీవితంలోని బలహీనమైన సమయంలో యేసు తనను తాను ప్రవక్తతో గుర్తించుకొనిన సంగతి హెబ్రీయుల గ్రంథములో ప్రతిధ్వనిస్తుంది, అక్కడ యేసు “కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను” అని బోధించబడింది (హెబ్రీయులు 2: 17). యోనా గ్రంథము ప్రవచనాత్మక క్రమములో ఒక ముఖ్యమైన లింకుగా నిలుస్తుంది. క్రీస్తు మరణం మరియు పునరుత్థానం సంభవించడానికి వందల సంవత్సరాల ముందు వాటిని గురించి పాఠకులకు ఒక సత్వరదృష్టిని ఇస్తుంది.

యోనా యొక్క ఉద్దేశమేమిటి?

దేవుని పిలుపు తనకు వచ్చినప్పుడు, దేవుడు అష్షూరీయులను శిక్షించాలన్న తన స్వార్థపూరిత కోరికను దాటి యోనా చూడలేకపోయాడు. అలాంటి జనులకు దేవుడు తన కనికరముగల సందేశాన్ని పంపాలని ఎలా కోరుకుంటాడు? యోనా దేవుని సందేశాన్ని తీసుకొనిపోవుటకు ముందు, అతను విరువబడాలి. అతను ప్రభువు దయను గురించి కొంత నేర్చుకోవాలి. తర్షీషుకు పారిపోవడము, అతని ఓడ బద్దలవటం మరియు గొప్ప మత్స్యము కడుపులో గడిపిన సమయం ద్వారా, యెహోవా యొద్దనే రక్షణ దొరకునని యోనాకు బలమైన రీతిలో నమ్మకం కలిగింది (యోనా 2: 9). మరియు దేవుని అత్యున్నత శక్తి కారణంగా, తన రక్షణను మరియు దయను ఎక్కడ కురిపించాలో దేవుడే నిర్ణయిస్తాడు (4: 11).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మీరు ఎప్పుడైనా దేవునితో పోరాడుతున్నారని మీరు భావిస్తున్నారా-మీ కోరికలు మిమ్మల్ని ఒక మార్గంలో లాగడం, దేవుని కోరికలు మిమ్మల్ని మరొక విధంగా లాగడం? యోనా ఈ స్థితిలో తనను తాను చూచుకున్నాడు, కాని ఒకసారి మాత్రమే తన కోరిక దేవుని కోరికపై గెలిచింది. లేదు, గెలిచానని అనుకున్నాడు. మన స్వంత జీవితంలో మనం తరచూ చూస్తున్నట్లుగా, గర్వము మరియు ఇష్టములేని హృదయంపై దేవుడు అధిక మోతాదులో వినయాన్ని యిచ్చినప్పటికీ, యోనా ద్వారా దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేర్చాడు.

యోనా చివరికి బయలుదేరి దేవుని సందేశాన్ని ప్రకటించగా, అతని కథ యొక్క పాఠం అక్కడితో ముగియలేదు. యోనా నీనెవెకి ప్రవచించాడు, కాని అతను దాని గురించి సంతోషంగా లేడు (యోనా 4: 1). ఇక్కడ మన జీవితాలకు మరో కొలబద్ద దొరుకుతుంది: మన కోరికలను దేవుని కోరికలతో సమరేఖలోనికి తేవటం ఎల్లప్పుడూ ఒక ప్రక్రియే. మనము దేవుని చిత్తాన్ని అనుసరించే కదలికల ద్వారా వెళుతున్నంత మాత్రమున మన హృదయాలు ఆయనతో సమరేఖలో ఉన్నట్లు కాదు. దేవుడు యోనా క్రియలను, అతని హృదయాన్ని కోరుకున్నాడు. ఆయన మనవి కూడా కోరుకుంటున్నాడు.