యోహాను

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

యోహాను సువార్త దాని రచయిత పేరును యెన్నడూ సమకూర్చనందుకు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇతర మూడు బైబిల్ సువార్తలలో కూడా యెటువంటి గుర్తింపులు చేయబడలేదు. అయితే, యోహాను‌ను రచయితగా గుర్తించడానికి రెండు ముఖ్యమైన అంశాలు సూచించబడ్డాయి. మొదటిగా, రచయితను యేసు ప్రేమించిన శిష్యుడిగా ఈ పుస్తకమే గుర్తించింది. ఈ వర్ణన మూడు కారణాల వల్ల యోహానుకు సూచించబడింది: రచయిత పన్నెండు మంది శిష్యులలో ఒకరై ఉండాలి, ఎందుకంటే అతను సువార్తలోని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి (యోహాను 21:24); అతను బహుశా ముగ్గురు ఆంతరంగిక శిష్యుల్లో (యాకోబు, యోహాను, మరియు పేతురు) ఒకడై ఉండాలి, ఎందుకంటే పునరుత్థానము గురించి మరియ చెప్పిన మొదటి వ్యక్తుల్లో అతను కూడా ఉన్నాడు (20:1–10); మరియు ఈ శిష్యుడు పుస్తకంలో పేతురు నుండి ప్రత్యేకించబడ్డాడు, అయితే యాకోబు పునరుత్థానం అయిన వెంటనే మరణించాడు గనుక అతను రచయిత అవ్వటానికి అవకాశం లేదు.

యోహాను రచనకు రెండవ ముఖ్యమైన సాక్ష్యం ప్రారంభ క్రైస్తవుల ఏకగ్రీవ సాక్ష్యం. వారిలో రెండవ శతాబ్దపు క్రైస్తవుడైన ఇరేనియస్, యోహాను యేసుపై తల పెట్టిన శిష్యుడని, అలాగే “యేసు ప్రేమించిన యొకడు” (13:23) అని, ఈ సువార్త యొక్క రచయిత అని ప్రకటించాడు.

మనమెక్కడ ఉన్నాము?

క్రైస్తవ సంప్రదాయంలో, యోహాను సువార్తను ఎల్లప్పుడూ నాల్గవ సువార్తగా సూచిస్తారు, అనగా ఇది మిగతా మూడు సువార్తల తరువాత కూర్చబడింది. యోహాను‌ను వ్యక్తిగతంగా ఎరిగిన రెండవ శతాబ్దపు క్రైస్తవ హతసాక్షి పాలికార్ప్, ఇరేనియస్ తో ఎఫెసులోని సంఘానికి అపొస్తలుడు పనిచేస్తున్న సమయంలో యోహాను ఈ సువార్తను రాశాడని చెప్పాడు. క్రీ.శ. 85 మరియు క్రీ.శ. 95 మధ్య యోహాను ఈ సువార్తను వ్రాసినట్లు ఈ అంశాలు సూచిస్తున్నాయి.

యోహాను ఎందుకంత ముఖ్యమైనది?

యోహాను తన సువార్తలో యేసు జననమును గూర్చిన కథను చేర్చలేదు; బదులుగా, అతను చరిత్రలోకి మరింత వెనక్కి వెళ్లి తన పుస్తకాన్ని పరిచయం చేశాడు. ఆదికాండము 1:1 లోని “ఆదియందు” భాషను ప్రారంభిస్తూ, యోహాను దేవుని స్వభావానికి మరియు వాక్య స్వభావమైన యేసుక్రీస్తుకు మధ్య ప్రత్యక్ష సంబంధమును నిర్మించాడు. క్రీస్తు దైవత్వమును గూర్చి నొక్కిచెప్పడం యోహాను సువార్త యొక్క అద్భుతమైన స్వభావం. ఇది పుస్తకంలో మరెక్కడా లేని విధముగా, ముఖ్యంగా యోహాను 8:58 లో, దైవిక పేరు “నేను” అనే నామం తనదని యేసు చెప్పినప్పుడు, కోపంతో ఉన్న యూదుల గుంపు ఆయన దైవదూషణ చేస్తున్నాడని ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు.

యోహాను యొక్క ఉద్దేశమేమిటి?

మిగతా మూడు సువార్తలు యేసును రాజు, పరిచారకుడు మరియు మనుష్యకుమారునిగా చిత్రీకరించగా, యోహాను యేసును దేవుని కుమారునిగా చిత్రీకరించెను. యోహాను తన ఇతివృత్తాన్ని ఇతర సువార్త రచయితలకన్నా స్పష్టంగా చెప్పాడు. తన పాఠకులు “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును”, తద్వారా నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఆయన రాశాడు (యోహాను 20:31). ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి యోహాను యేసుక్రీస్తు యొక్క ఉద్వేగభరితమైన మరియు విలక్షణమైన చిత్రం ఇతర మూడు సువార్తలలోని చిత్రాలతో పూర్తి ఐక్యత కలిగి ఉన్నదని అలాగే యేసుక్రీస్తు దైవ మానవుడని పరిశుద్ధ గ్రంథమంతటా వెల్లడించబడిన ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ సువార్త తెలియజేస్తున్నదని చెప్పాడు.

యేసు స్వభావాన్ని తన పాఠకులకు తెలియజేయడానికి యోహాను అనేక పద్ధతులను ఉపయోగించాడు. వీటిల్లో యేసు యొక్క ఏడు "నేను" ప్రకటనలు కలిగి ఉన్నాయి. ఇందులో యేసు "లోకమునకు వెలుగు" (8:12), "పునరుత్థానము మరియు జీవము" (11:25), మరియు "మార్గం, సత్యం మరియు జీవము" (14:6) తనను గూర్చి తాను చెప్పకున్నాడు. యోహాను యొక్క సువార్తలో ఎక్కువ భాగమును (2–12 అధ్యాయాలు) సూచనల పుస్తకము అని పిలువవచ్చు, ఎందుకంటే యేసు ఏడు వేర్వేరు అద్భుతాలను చేసినట్లు ఈ భాగము వివరిస్తుంది. కానాలో నీటిని ద్రాక్షారసము‌గా మార్చడం మరియు బేతనియలో చనిపోయిన లాజరుని లేపడం వంటి అద్భుతాలు ఈ భాగములో వివరించబడ్డాయి. ఈ అద్భుతాలు దేవుని కుమారునిగా ఆయన గుర్తింపును వివరిస్తున్నాయి.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

దేవుని దైవిక కుమారుడిగా యేసు యొక్క గుర్తింపు ఆయన్ని ప్రత్యేకపరచింది. ఎప్పటికీ మరే వ్యక్తికి కూడా ఈ ప్రత్యేకత రాదు. దేవునితో మాత్రమే వచ్చే మహనీయతను ఆయన ధరించుకున్నాడు. అందువల్ల, మన తరపున ఆయన చేసిన కార్యము మన రక్షణను నిశ్చయం చేసింది. ఆయన దేవుడు గనుక, పాత నిబంధనలోని జంతువుల బలుల పరిమిత ప్రభావానికి భిన్నంగా, సిలువపై ఆయన చేసిన త్యాగం శాశ్వతమైన సూచనలను కలిగి ఉంది. దైవ మానవుడైన యేసు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసాడు. ఆయన దైవిక స్వభావం వల్ల ఆయనయందు మనం ధైర్యం కలిగి ఉండవచ్చు.

యోహాను సువార్త చదివేవారికి, చాలా సులభమైన ప్రశ్న, అయినను ముఖ్యమైనది: యేసు, ప్రభువు అని మీరు నమ్ముచున్నారా? మీరు విశ్వసించినట్లైతే, మీరు నిత్యజీవమును పొందుకుంటారు. మీరు ఒక రోజు దేవుని సన్నిధిలో ఎటువంటి బాధలు, కన్నీళ్లు మరియు మరణం లేని ప్రదేశంలో జీవిస్తారనే సత్యాన్ని హక్కుగా పొందుకుంటారు.