ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
యోబు పుస్తకం యొక్క రచయిత ఎవరో తెలియదు. ఆమోదయోగ్యమైన రచయితలుగా అనేక సూచనలు చేయబడ్డాయి: తన మాటలను బాగా గుర్తుకు తెచ్చుకోగలిగిన యోబు రచయితయై ఉండవచ్చు; కథలో చివరగా మాట్లాడిన నాల్గవ స్నేహితుడైన ఎలీహు కావచ్చు; వివిధ బైబిల్ రచయితలు మరియు నాయకులు కావచ్చు; లేదా సంవత్సరాలుగా విషయాలను సంకలనం చేసిన చాలా మంది సంపాదకులు కావచ్చు. ఖచ్చితమైన సమాధానం లేనప్పటికీ, పుస్తకంలో కనిపించే వివరణాత్మక మరియు సుదీర్ఘమైన సంభాషణలను ప్రత్యక్ష సాక్షే నమోదు చేసి ఉంటాడు. పాత నిబంధన కాలంలో, రచయితలు కొన్నిసార్లు మూడవ వ్యక్తి రూపంలో తమను తాము సూచించుకొన్నారు, కాబట్టి రచయితగా ఉండే బలమైన అవకాశం యోబుకే ఉన్నది.
యోబు ఎవరు? బాగా తెలిసిన బైబిల్ హీరోలలో ఈ సంపన్న భూస్వామి మరియు తండ్రి ఒకడు. ముందస్తు హెచ్చరిక ఏ మాత్రమూ లేకుండా తనకు కలిగిన సమస్తమును పోగొట్టుకొని రిక్తునిగా చేయబడి, అతని విశ్వాసము తీవ్రంగా పరీక్షించబడిందని మనకు తెలుసు.
మనమెక్కడ ఉన్నాము?
ఈ పుస్తకము యొక్క సందర్భం వాక్యము ద్వారా గుర్తించనప్పటికీ, క్రీస్తుపూర్వం 2100 నుండి 1900 వరకు పితరుల కాలంలో యోబు జీవించాడని అంతర్గత ఆధారాలు సూచిస్తున్నాయి. యోబు 42:16 ప్రకారం, యోబు తన విషాదాలు సంభవించిన తరువాత 140 సంవత్సరాలు అదనంగా జీవించాడు, బహుశా మొత్తం 210 సంవత్సరాలు. అతని సుదీర్ఘమైన జీవితకాలం తెరహు (అబ్రాహాము తండ్రి), అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులతో సమముగా ఉంటుంది. అబ్రాహాము మాదిరిగానే (ఆదికాండము 12:16) యోబు యొక్క సంపదను కూడా పశువుల రూపంలో కొలిచారు (యోబు 1:3; 42:12). పితరుల మాదిరిగానే, దేవుని ప్రత్యేకమైన శీర్షికయైన “ఎల్ షాద్దై” (దేవుడు సర్వశక్తిమంతుడు) ను యోబు ఉపయోగించాడు. యోబు పుస్తకంలో మోషే ధర్మశాస్త్రము గురించి ప్రస్తావించబడలేదు; యోబు కుమార్తెలు తన కుమారులతో సమానంగా వారసులు అవ్వటం, యోబు యాజకుడు కాకపోయినా బలులు అర్పంచటం వంటివి ధర్మశాస్త్ర ప్రకారం సాధ్యం కానివి (లేవీయకాండము 4:10; సంఖ్యాకాండము 27:8) పాటించాడు. మనకు ఖచ్చితంగా తెలియకపోయినా, యాకోబు కాలంలో లేదా ఆ తర్వాతి కాలంలో యోబు జీవించి ఉండవచ్చు.
యోబు ఊజు దేశంలో నివసించాడు (యోబు 1:1), కానీ ఊజు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇది కనాను వెలుపల, ఎడారికి సమీపంలో ఉందని పండితులు నమ్ముతున్నారు. ఎందుకంటే "ఆచారాలు, పదజాలం, భౌగోళిక మరియు సహజ చరిత్రకు సంబంధించిన సూచనలు ఉత్తర అరేబియాకు సంబంధించినవి."1
యోబు ఎందుకంత ముఖ్యమైనది?
యోబు గ్రంథము జ్ఞాన సాహిత్యం క్రిందకు వస్తుందని ఇశ్రాయేలీయులు వర్గీకరించారు. ఈ పుస్తకంలో పురాతన చట్టపరమైన చర్యలకు సంబంధించిన భాషను, విలాపములు మరియు బైబిల్లో మరెక్కడా కనిపించని ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. అదనంగా, యోబు యొక్క అధిక భాగము కవిత్వాన్ని సూచించే సమాంతర పంక్తులలో వ్రాయబడింది.
బాధను అనుభవించే ప్రతి మానవుడి హృదయానికి దగ్గరగా ఉన్న సమస్యలను ఈ పుస్తకం వివరిస్తుంది. యోబును ఇంత బాధతో, శ్రమలతో బాధపెట్టడానికి దేవుడు సాతానును ఎందుకు అనుమతించాడనే కథకు మొదటి అధ్యాయం ఒక మనోహరమైన దృక్పథాన్ని అందించింది. చివరకు దేవుడు స్వయంగా మాట్లాడే వరకు ఒక ప్రత్యేకమైన త్రయ విధానములో ఏర్పాటు చేయబడిన సంభాషణలు మరియు ఏకభాషల ద్వారా, వివరించలేని వాటిని వివరించడానికి మానవ జ్ఞానం ప్రయత్నించింది.
యోబు యొక్క చివరి అధ్యాయాలు, యోబు యొక్క వినయపూర్వకమైన మరియు అవివేకమైన మర్త్యత్వమునకు విరుద్ధంగా, తన మహిమను మరియు ప్రత్యేకమైన “భిన్నత్వమును” గూర్చి దేవుని నైపుణ్యతగల సమర్థన, అలాగే సృష్టిని మించిన దేవుని శాశ్వతమైన సర్వోత్కృష్టతను నమోదు చేశాయి. “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము”(యోబు 38:4).
యోబు యొక్క ఉద్దేశమేమిటి?
అకారణముగా బాధలను అనుభవించుచున్న యోబు యొక్క దుస్థితిని చూస్తే, “మంచి వ్యక్తులకు చెడు ఎందుకు జరుగుతుంది?” అనే ప్రాచీన ప్రశ్న అడగడానికి మనల్ని బలవంతం చేస్తుంది. యోబుకు ఇవ్వబడిన సమాధానం పాఠకుడిని సంతృప్తిపరచవచ్చు లేదా సంతృప్తిపరచకపోవచ్చు. దేవుడు మంచి కారణంతో బాధను అనుమతిస్తాడు, కాని ఆయన ఆ కారణాలను ఎన్నడూ వెల్లడించకపోవచ్చు.
యోబు దేవుణ్ణి తిరస్కరించలేదు, కాని యోబు ఆయనను సవాలు చేసి నిందించాడు. చివరకు పరిస్థితిపై తన సొంత దృక్పథాన్ని గర్జనచేసి భయంకరముగా చెప్పి సర్వశక్తిమంతుడు యోబును నిష్కర్షగా నిశ్శబ్దపరచాడు. "ఎందుకు?" అనే యోబు ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వలేదు. దానికి బదులుగా ఆయన యోబును, అతని స్నేహితులను తన ఘనత మరియు సార్వభౌమాధికారం యొక్క సత్యముతో స్పృశించాడు. దేవుని శక్తి మరియు వైభవం గురించి లోతైన భావనకు యోబు వచ్చేశాడు, ఆయనను మరింతగా విశ్వసించాడు:
"వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని;
అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను;
కావున నన్ను నేను అసహ్యించుకొని,
ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను." (యోబు 42:5–6)
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
బాధ తప్పనిసరిగా మనలో ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఈ జీవితంలో కష్టాలు తప్పవు. శోధనలు వచ్చినప్పుడు దేవునితో ఉన్న మీ సంబంధం మీకు సరిపోతుందా? మీ కష్టాల్లో మీరు ఆయనను విశ్వసిస్తున్నారా? యోబు 38–42 చదవండి. సర్వశక్తిమంతునితో సమయం గడపండి. ఆ అధ్యాయాలలో వివరించబడిన శక్తివంతమైన సృష్టికర్తపై బలమైన విశ్వాసం కోసం ప్రార్థించండి. ఆయన కళ్ళతో మీ పరిస్థితిని మీరు చూడగలిగేలా ఆయన విషయమై సరైన దృక్పథం కొరకు ప్రార్థించండి.
మీ బాధలో దేవుడు ఎక్కడున్నాడు అని అడగడానికి బదులు, యోబు పుస్తకం దేవుని అధికారమును ధృవీకరిస్తూ మనల్ని ఈలాగు అడుగుచున్నది, “మన బాధలో మనము ఎక్కడ ఉన్నాము? మన పరిస్థితులను మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, మన సృష్టికర్తను మనం విశ్వసిస్తున్నామా?”
- Roy B. Zuck, "Job," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 718.