యిర్మీయా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

యూదాలోని అనాతోతు అనే చిన్న పట్టణానికి చెందిన ఒక యాజకుని కుమారుడును, ప్రవక్తయునైన యిర్మీయాకు ప్రభువునొద్ద నుండి వచ్చిన ప్రవచనాలను తన కార్యదర్శియైన బారూకునకు చెప్పి వ్రాయించాడు. యిర్మీయా యొక్క వంశావళి కారణంగా, అతడు యాజకునిగా పెంచబడివుంటాడు. అయినప్పటికీ అతని యాజక సేవను గురించి ఎక్కడా నమోదు చేయబడలేదు. బదులుగా, యూదా ప్రజలు వినకపోయినప్పటికీ వారితో ప్రభువు తరపున మాట్లాడటానికి దేవుడు ఈ నిశ్చయమైన ధైర్యాన్ని కలిగియున్న మానవుణ్ణి ఎంచుకున్నాడు.

ప్రవచించడం ప్రారంభించినప్పుడు యిర్మీయాకు దాదాపు ఇరవై సంవత్సరాలు. అతడు ఆ పనిలో తన మిగిలిన జీవితమంతా, అనగా నలభై లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కొనసాగాడు. అతని సందేశం ప్రజలకు కొంత బరువుగా ఉన్నందున, యిర్మీయా ప్రవచనాలు గణనీయమైన మానసిక లోతును, అలాగే తరచుగా దేవుని ప్రజల దుస్థితి లేదా అతని స్వంత కష్టాలపై దుఃఖపడటాన్ని (యిర్మీయా 12:1-4; 15:10) వెల్లడిస్తున్నాయి.

మనమెక్కడ ఉన్నాము?

క్రీ. పూ. 627 లో యిర్మీయా పరిచర్య ప్రారంభమై, క్రీ. పూ. 582 లో ఐగుప్తుకు పారిపోయిన యూదులకు ఇవ్వబడిన తన ప్రవచనంతో ముగిసింది (యిర్మీయా 44:1). ఈ సమయంలో ఎక్కువ కాలం, యిర్మీయా తన పరిచర్యను యెరూషలేమునే ఆధారం చేసికొని కొనసాగించాడు. మొదట అష్షూరు మరియు ఐగుప్తు, ఆ తరువాత వారిని జయించిన బబులోను చేత చాలా సంవత్సరాలు బెదిరించబడిన దక్షిణ యూదా రాజ్యము యిర్మీయా యొక్క ప్రవచనాత్మక పరిచర్య (క్రీ.పూ. 586) సమయంలో పడిపోయింది.

దేవుని యొద్ద నుండి వస్తున్న తీర్పు వైపు ఏమాత్రం ఆలస్యము చేయక పరుగెడుతున్న దేశాన్ని ఉద్దేశించి యిర్మీయా ప్రసంగించాడు. బయటి శక్తులు దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు తమ భవిష్యత్తు విషయమై భయపడి ఉండవచ్చు. కానీ వినయము మరియు పశ్చాత్తాపముతో స్పందించక, యూదా ప్రజలు ప్రధానంగా తమకు తాముగా స్వేచ్ఛగా జీవించారు. అలాగే ప్రభువు ఆజ్ఞలను మరియు వారి అవిధేయత వలన పెరుగుతున్న ప్రమాదాన్ని అలక్ష్యం చేశారు.

యిర్మీయా ఎందుకంత ముఖ్యమైనది?

దేవుని నమ్మకమైన సేవకులలో ఒకడైన వాని మనస్సు మరియు హృదయములోనికి ఒక ప్రత్యేకమైన ప్రవేశమును యిర్మీయా యొక్క ప్రవచనాలు అందిస్తాయి. ఈ పుస్తకంలో భావోద్వేగానికి సంబంధించిన అనేక వ్యక్తిగత ప్రకటనలు ఉన్నాయి. యిర్మీయాను దేవుని సందేశాన్ని అందించే ప్రవక్తగా మాత్రమే రంగంలోనికి దించకుండా, తన ప్రజల పట్ల కనికరమున్న మానవుడిగా, దుర్మార్గులకు తీర్పు కోరుతూ, తన సొంత భద్రత విషయమై ఆందోళన చెందాడు.

విశేషమేమిటంటే, క్రీస్తు భూమిపైకి వచ్చిన తర్వాత దేవుడు తన ప్రజలతో చేయుటకు ఉద్దేశించిన క్రొత్త నిబంధన యొక్క స్పష్టమైన దృష్టిని కూడా యిర్మీయా పుస్తకం మనకు అందిస్తుంది. ఈ క్రొత్త నిబంధన దేవుని ప్రజలకు పునరుద్ధరణ సాధనంగా ఉంటుంది. ఆయన తన ధర్మశాస్త్రమును వారిలో ఉంచుతాడు, అనగా రాతి పలకల మీద కాకుండా మాంసపు హృదయాలపై వ్రాస్తాడు. దేవాలయం వంటి స్థిరమైన ప్రదేశం ద్వారా దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకునే బదులు, తన ప్రజలు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా ఆయనను ప్రత్యక్షంగా తెలుసుకుంటారని యిర్మీయా ద్వారా వాగ్దానం చేశాడు (యిర్మీయా 31:31-34; హెబ్రీయులకు 8:6 కూడా చూడండి).

యిర్మీయా యొక్క ఉద్దేశమేమిటి?

దేవుని ప్రజలు బబులోనుకు చెరగొనిపోబడటానికి ముందే యిర్మీయా యూదా యొక్క అంతిమ సంవత్సరాల్లో ప్రవచించినందున, పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం తీర్పు అని అర్ధమవుతుంది. వాస్తవముగా, మొదటి నలభై ఐదు అధ్యాయాలు ప్రధానంగా అవిశ్వాసం మరియు అవిధేయత కారణంగా యూదా మీదికి వచ్చే తీర్పుపై దృష్టి సారించాయి. అయితే, ఈ సంఘటనలలో కృప యొక్క అంశం కూడా ఉంది. సీనాయి అరణ్యంలో దేవునికి మరియు ఇశ్రాయేలీయులకు మధ్య మొదటి నిబంధన జరిగిన దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల తరువాత యెరూషలేము పతనం వస్తుంది (నిర్గమకాండము 24:1–18). ఇటువంటి పొడిగింపబడిన కాలం దేవుని గొప్ప సహనానికి మరియు దయకు సాక్ష్యమిస్తుంది, తన ప్రజలకు వారి పాపాత్మకమైన మార్గాల నుండి తిరగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. వారి ఈ పాపాత్మకమైన జీవన విధానం వారు దేవునితో మొదటి నిబంధనను త్రోసివేసిన కొద్దిసేపటికే ఆరంభించారు (32:1–35).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

పాత నిబంధనలో తన ప్రజలపట్ల దేవుని యొక్క సహనమును చూచినప్పుడు దేవుడు ఎల్లప్పుడు దయగలవాడు అని మనకు గుర్తొస్తుంది. ఆయన ఎన్నుకున్న ప్రజలు ఆయనతో చేసిన నిబంధనను ఒక సహస్రాబ్దిలో ఎక్కువ కాలం పరిపాటిగా విస్మరించినప్పటికీ తక్షణ మరణం మరియు విధ్వంసం జరుగకపోవటమనేది దేవుని కొరకు బాగా జీవించాలనే మన పోరాటములలో మనకు ఆశను చిగురింపజేయాలి. మనము ఆయనను విసికించినప్పటికీ, ఆయన మనపట్ల సహనంతో ఉన్నాడు. మన జీవితాలకు ఉత్తమమైన వాటిని ఉత్పన్నం చేయడానికి మనలో పనిచేస్తున్నాడు.

కానీ అంతము ఖచ్చితంగా వస్తుందని యిర్మీయా పుస్తకం మనకు గుర్తుచేస్తుంది. ఈ సత్యము హృదయపూర్వకముగా దేవుని వెంబడించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మీరు ఆయనను వెంబడిస్తారా?