యాకోబు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

తాను ఏ “యాకోబో” అని యాకోబు తనను తాను ప్రత్యేకంగా గుర్తించనప్పటికీ (యాకోబు 1:1), రచయిత యేసు యొక్క సోదరుడైన యాకోబు అని విస్తృతంగా భావిస్తున్నారు. భూమిపై రక్షకుడు ఉన్న కాలంలో యాకోబు యేసును వెబడించువాడు కాదు (మార్కు 3:21-35; యోహాను 7:5) కాని చివరికి పౌలు వలె పునరుత్థానానంతర ప్రభువును చూసి నమ్మి అపొస్తలుడయ్యాడు (1 కొరింథీయులకు 15:7; గలతీయులకు 1:19). ప్రభువు పునరుత్థాన శరీరాన్ని చూసిన తరువాత, యాకోబు యెరూషలేములోని సంఘ నాయకులలో ఒకడయ్యాడు. పేతురు జైలు నుండి అద్భుతంగా విడుదలైన తరువాత పేతురు అక్కడ ఉన్న ఇతర క్రైస్తవుల మధ్య అతని గురించి ప్రత్యేకముగా చెప్పాడు (అపొస్తలుల కార్యములు 12:17). యెరూషలేము సభ (15:13-22) లో యాకోబు నిర్ణయాత్మక ప్రసంగం చేసాడు, మరియు పౌలు యాకోబును సంఘము యొక్క స్తంభములలో ఒకనిగా పిలిచాడు (గలతీయులకు 2: 9).

మనమెక్కడ ఉన్నాము?

యెరూషలేములోని సంఘములోని ముఖ్య నాయకులలో ఒకనిగా, యెరూషలేము సభ సమావేశం కావటానికి ముందు యాకోబు ఆ నగరం నుండి వ్రాసాడు. ఈ సభను గూర్చి లూకా అపొస్తలుల కార్యములు 15 లో నమోదు చేసాడు. ఆ సభలో అన్యజనుల యొద్దకు సువార్త సందేశం తీసుకువెళ్ళాలనే నిర్ణయం తీసుకుని పేతురు మరియు పౌలుతో కలిసి యాకోబు ఆ విషయాన్ని ధృవీకరించాడు. ఈ సభ క్రీ.శ. 49 లో సమావేశమైంది, అంటే యాకోబు తన పత్రికను క్రీ.శ. 45–48 లో రాశాడు. యూదు క్రైస్తవ ప్రేక్షకులకు ఈ పత్రిక వ్రాస్తున్నప్పుడు యెరూషలేము సభ వంటి ఒక ముఖ్యమైన సంఘటన గూర్చి యాకోబు వ్యాఖ్యానించడానికి ఆధారమున్నది. కానీ యాకోబు అన్యజనుల క్రైస్తవుల గురించి ప్రస్తావించలేదు గనుక ఈ పత్రికకు ముందస్తు తేదీని ఇవ్వాలి. వాస్తవానికి, ఇది క్రొత్త నిబంధనలో వ్రాయబడిన మొదటి పుస్తకం అయ్యి ఉండవచ్చు.

యాకోబు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

యాకోబు పుస్తకం క్రొత్త నిబంధన దుస్తులు ధరించిన పాత నిబంధన పుస్తకమైన సామెతలు వలె కనిపిస్తుంది. విశ్వాస జీవితంలో ఆచరణాత్మక క్రియపై దాని స్థిరమైన దృష్టి పాత నిబంధనలోని జ్ఞానయుక్తమైన సాహిత్యాన్ని గుర్తుచేస్తుంది, దేవుని ప్రజలను దేవుని ప్రజల వలె వ్యవహరించమని ప్రోత్సహిస్తుంది. పరిశుద్ధ జీవితాన్ని అనుసరించడానికి యాకోబు పేజీలు ప్రత్యక్ష ఆదేశాలతో నిండి ఉన్నాయి. ఆ స్థాయికి తూగనివారికి అతను ఎటువంటి మన్నింపులు ఇవ్వలేదు. ఈ ఆది సంఘము యొక్క నాయకుడి మనస్సులో, క్రైస్తవులు కొన్ని మార్గాల్లో నడవడం మరికొన్ని మార్గాల్లో నడవకపోవడం ద్వారా తమ విశ్వాసాన్ని రుజువు చేస్తారు. జీవితంలో అసలైన మార్పును తీసుకురాని విశ్వాసం యాకోబు దృష్టిలో నిరర్థకమైన విశ్వాసము (యాకోబు 2:17).

యాకోబు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

తన పత్రిక ప్రారంభంలో, యాకోబు తనను తాను దేవుని యొక్క దాసుడు అని పిలుచుకున్నాడు, ఈ పుస్తకం యొక్క ఆచరణాత్మక, సేవకుడు-ఆధారిత ప్రాముఖ్యతనుబట్టి అతనికి తగిన పేరే ఇవ్వబడింది. పుస్తకం అంతటా, విశ్వాసం ప్రామాణికమైన క్రియలను పుట్టిస్తుందని యాకోబు వాదించాడు. మరో మాటలో చెప్పాలంటే, తమను తాము దేవుని ప్రజలు అని పిలిచుకునేవారు నిజంగా ఆయనకు చెందినవారైతే, వారి జీవితాలు క్రియలను లేదా ఫలాలను ఇస్తాయి. యేసు యొక్క కొండ మీద ప్రసంగానికి సమానమైన భాష మరియు ఇతివృత్తం ఉన్న ఈ పత్రికలో, ఒక విషయం చెప్పి మరొకటి చేసే కపట విశ్వాసిపై యాకోబు విరుచుకుపడ్డాడు.

యాకోబుకు విశ్వాసం అమూర్త ప్రతిపాదన కాదు కాని వాస్తవ ప్రపంచంలో ప్రభావాలను కలిగి ఉంది. యాకోబు తన అభిప్రాయాన్ని వివరించడానికి అనేక ఆచరణాత్మక ఉదాహరణలను అందించాడు: శోధనల్లో ‌విశ్వాసం ఓర్పును పుట్టిస్తుంది, జ్ఞానం కొరకు దేవుణ్ణి అడుగుతుంది, నాలుకకు కళ్లెమువేస్తుంది, దుష్టత్వాన్ని విడిచిపెడుతుంది, దిక్కులేని పిల్లలను మరియు విధవరాండ్రను పరామర్శిస్తుంది, మరియు పక్షపాతముండదు. విశ్వాసం యొక్క జీవితం సమగ్రమైనదని, మన జీవితంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుందని మరియు ప్రపంచంలోని ఇతర వ్యక్తుల జీవితాలలో నిజంగా నిమగ్నమవ్వడానికి మనల్ని ప్రేరేపిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. విశ్వాసులు కూడా తప్పిపోవుచున్నారని యాకోబు గుర్తించగా (యాకోబు 3:2), తక్కువ భాగ్యముగలవారిపట్ల తమ కళ్ళను త్రిప్పుకునేవారితో, ఇతరుల దుస్థితిని విస్మరించేవారితో, లేదా తమ త్రోవల్లో ఉన్నవారిని శపించే వ్యక్తులతో విశ్వాసం ఇమిడియుండకూడదని అతనికి తెలుసు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

క్రొత్త నిబంధనలోని ఇతర పుస్తకాలకన్నా, విశ్వాసులు తమ విశ్వాసానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని యాకోబు గుర్తించాడు. మీ క్రియలు మీరు ప్రకటించిన విశ్వాసానికి ఎంత బాగా అద్దం పడుతున్నాయి? ఇది మనమందరం చక్కగా సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడే ప్రశ్న. మన విశ్వాసం మరియు క్రియలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉండు సందర్భాలను కనబరచాలనుకుంటాము కాని చాలా తరచుగా ఖాళీలు మరియు పగుళ్లను మాత్రమే చూస్తాము.

మీరు యాకోబు రాసిన పత్రికను చదివేటప్పుడు, అతను పేర్కొన్న ఆ భాగాలపై దృష్టి పెట్టండి: శోధనల సమయంలో మీ క్రియలు, తక్కువ భాగ్యవంతుల పట్ల మీ వ్యవహారము, మీరు ఇతరులతో మాట్లాడే విధానం మరియు సంబంధం కలిగి ఉండటం, మరియు మీరు మీ జీవితాన్ని ఎలా జీవించాలనేదానిలో ధనము పోషించే పాత్ర. మీరు ప్రకటించిన విశ్వాసం ప్రకారం మంచి చేయుటకు మిమ్మల్ని ప్రోత్సహించడానికి యాకోబును అనుమతించండి.