ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
ఇంచుమించు “ప్రవక్తల” పుస్తకాలన్నిటి మాదిరిగానే, ఈ పుస్తకం యొక్క రచయితనుబట్టి దీనికి యెషయా అనే పేరు వచ్చింది. యెషయా ఒక ప్రవక్త్రిని వివాహం చేసుకున్నాడు, ఆమె అతనికి కనీసం ఇద్దరు కుమారులను కన్నది (యెషయా 7:3; 8:3). అతను ఉజ్జియా, యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా (1:1) అనే నలుగురు యూదా రాజుల పాలనలో ప్రవచించాడు. అయితే ఆ తరువాత వచ్చిన ఐదవ, దుష్ట రాజైన మనష్షే పాలనలో మరణించాడు. రెండవ శతాబ్దం నాటికి క్రైస్తవ సాంప్రదాయం యెషయాను ప్రవక్తలలో ఒకరిగా గుర్తించింది. హెబ్రీయులకు 11:37 లో “రంపములతో కోయబడిరి”1 అని ఈ ప్రవక్త యొక్క మరణం గూర్చి వివరించబడింది. ఈ పుస్తకంతో యెరూషలేము నగరానికి ఉన్న సంబంధమునుబట్టి (యెషయా 1:1), అలాగే అతని ప్రవచన కాలంలో కనీసం ఇద్దరు ముఖ్యమైన రాజులతో ఆయనకున్న సాన్నిహిత్యమునుబట్టి (7:3; 38:1) యెషయా యెరూషలేములో నివసించి ఉండవచ్చు.
గత రెండు శతాబ్దాలుగా పాండిత్యముగలవారనేకులు ఈ పుస్తకాన్ని మూడు విభాగాలుగా విభజించి: 1–39, 40–55, మరియు 56–66, యెషయాకు బహుళ రచయితలను కేటాయించారు. ఏదేమైనా, ఈ విభాగాలు భవిష్యత్తును గూర్చి చెప్పే ప్రవచనాలను తిరస్కరించే పండితుల నుండి వచ్చాయి. ఈ రకమైన సిద్ధాంతము తన ప్రజలతో సంభాషించు దేవుని శక్తిని పరిమితం చేయడమే కాక, పుస్తకం అంతటా వ్యాప్తి చెందియున్న యేసుక్రీస్తును గూర్చి అనేక రకాల నిర్దిష్టమైన, భవిష్యత్త్ సంగతులను గూర్చిన వాదనలను విస్మరిస్తుంది.
మనమెక్కడ ఉన్నాము?
ప్రభువైన యెహోవా మాటలను పెడచెవినిబెట్టి మార్గము తొలగిన దేశానికి క్రీ. పూ. 739 నుండి 681 వరకు ప్రవచించాడు. వినయంతో ఆయనకు సేవ చేసి, తమ పొరుగువారికి ప్రేమను ఇచ్చే బదులు, యూదా దేశం యెరూషలేములోని దేవుని ఆలయంలో అర్థరహిత బలులు సమర్పించి దేశమంతటా అన్యాయాలు జరిగించింది. యూదా ప్రజలు దేవుని వైపు తమ వీపులను త్రిప్పి ఆయన నుండి తమను తాము దూరం చేసుకున్నారు. వీరి ఈ ప్రవర్తన వలన యెషయా తీర్పు విషయమైన ప్రకటనలు ప్రకటించవలసిన అవసరత ఏర్పడింది. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఆయన యొద్దకు తిరిగి వస్తారనే ఆశతో ఈ ప్రకటనలు చేయబడ్డాయి.
యెషయా ఎందుకంత ముఖ్యమైనది?
యేసుక్రీస్తు యొక్క అత్యంత సమగ్రమైన ప్రవచనాత్మక రూపాన్ని పాత నిబంధనంతటిలోను యెషయా పుస్తకం మనకు అందిస్తుంది. ఆయన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి: ఆయన రాకడను గూర్చిన ప్రకటన (యెషయా 40:3–5), ఆయన కన్యక గర్భమున జన్మించడం (7:14), ఆయన సువర్తమానమును ప్రకటించడం (61:1), ఆయన బలిగా తన ప్రాణమును ఇచ్చుట (52:13–53:12), మరియు ఆయన తన సొంతవారిని తీసుకోవటానికి తిరిగి రావడం (60:2–3). యెషయాలోని ఇటువంటి మరి అనేకమైన క్రీస్తును గూర్చిన వచనాల కారణంగా, ఈ పుస్తకం తన ప్రజలను తమ నుండి రక్షించుచున్న ప్రభువుపై నిరీక్షణకు నిదర్శనంగా నిలుస్తుంది.
యెషయా యొక్క ఉద్దేశమేమిటి?
యెషయా యొక్క ముఖ్య ఉద్దేశ్యం 12 వ అధ్యాయంలో చాలా స్పష్టముగా ప్రకటన చేయబడింది: “ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, / నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను” (యెషయా 12:2). ఇది యెషయా పేరు యొక్క అర్థాన్ని ప్రతిధ్వనిస్తుంది, ఆయన పేరుకు అర్థం “యెహోవా యొక్క రక్షణ.”2 పుస్తకం చదివిన తరువాత, దీని ముఖ్య ఉద్దేశ్యం రక్షణ అయినప్పుడు మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలలో కనిపించే తీర్పు యొక్క బలమైన ఉనికి గురించి ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ఈ రెండూ ఎలా ఇమడగలుగుతాయి? తీర్పు ఉన్న చోట రక్షణ యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. మనం రక్షణను పొందుకునే ముందు దాని యొక్క అవసరత మనకు ఉండాలి!
కాబట్టి యెషయాలోని ఆ ప్రారంభ అధ్యాయాలలో ఎక్కువ భాగం ప్రభువునుండి వెనుదిరిగిన ప్రజలకు వ్యతిరేకంగా తీర్పులను వివరిస్తుంది. అలాగే తమ తిరుగుబాటు ధోరణిలో పట్టు విడవకుండ ఉండువారు తీర్పు పొందుకుంటారని మనకు చూపిస్తుంది. మరోవైపు, తన వాగ్దానం పట్ల దేవుని విశ్వాస్యతను కూడా మనము చూస్తాము. ఆయన నమ్మకమైన విశ్వాసుల యొక్క చిన్న శేషాన్ని రక్షిస్తాడు. వీరు అంత్యదినములలో ఆయన తన పిల్లల కొరకు సిద్ధం చేసిన అద్భుతమైన క్రొత్తదియైన లోకములోకి కొనసాగుతారు (65:17-66:24).
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
దీని పరిధి కారణంగా, పాత నిబంధనంతటిలో సువార్త యొక్క స్పష్టమైన వ్యక్తీకరణ యెషయా కలిగియున్నది. మొదటి అధ్యాయం నుండే ప్రజలు దేవుని నుండి దూరమయ్యారని, ఆయన పిల్లలుగా వారు తమ బాధ్యతలలో విఫలమయ్యారని స్పష్టమవుతుంది (యెషయా 1:2–17). అయినప్పటికీ, పశ్చాత్తాపపడని ఈ ప్రజలకు దేవుడు అద్భుతంగా నిరీక్షణను అందించాడు. అదేమంటే, పాపాలను కడిగివేసుకోవటం మరియు ఆయనయందు విశ్వాసము, విధేయతతో వచ్చే ఆశీర్వాదమును (1:18-20) పొందుకోవటమే. రక్షణ దేవునిలో మాత్రమే ఉంది. ఆయన ఇయ్యబోవునది మనం స్వీకరిస్తామా లేదా అనేదే ప్రశ్న.
సువార్త సందేశంతో పాటు, యెషయా పుస్తకం దేవుని ప్రజల పాపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇతరులతో అన్యాయంగా వ్యవహరించారు, ఫలితంగా వారు దేవునికి వేషధారణతో కూడిన బలులు అర్పించారు. కుటుంబం, సహోద్యోగులు లేదా పరదేశుల పట్ల జరిగిన అన్యాయంపై యెషయా విమర్శలు చేసినట్లు వారిపట్ల నిర్దయగా వ్యవహరించడం లేదా అలక్ష్యముచేయటం వంటివి మీ స్వంత జీవితంలోనే మీరు చూస్తున్నారా? దేవునిపట్ల మరియు మన పొరుగువారి పట్ల స్వచ్ఛమైన ప్రేమలోనికి మనం తిరిగి రావాలని విశ్వాసులకు పిలుపునివ్వటమే యెషయా యొక్క సందేశం (లూకా 10:26–28).
- Justin Martyr, Dialogue with Trypho, 120.5, trans. Thomas B. Falls, ed. Michael Slusser (Washington DC: Catholic University of America Press, 2003), 181.
- Francis Brown, S. R. Driver, and Charles A. Briggs, The Brown-Driver-Briggs Hebrew and English Lexicon (Peabody, Mass.: Hendrickson, 2006), 447.