ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
హోషేయ తన నేపథ్యం గురించి కొంచెమే వెల్లడించాడు, అయినప్పటికీ అతని ప్రవచన పుస్తకం అతని జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలను సమర్పిస్తుంది. ప్రవక్త పేరుకి అర్ధం "రక్షణ," అంటే పశ్చాత్తాపం చెంది అతని సందేశం కారణంగా దేవుని వైపు తిరిగేవారికి నిరీక్షణ యొక్క దారిచూపే సూచనగా ఇశ్రాయేలులో హోషేయ యొక్క స్థానం ఉన్నది.1 దేవుని ఆజ్ఞను అనుసరించి హోషేయ గోమెరును వివాహం చేసుకున్నాడు. "వ్యభిచారము చేయు స్త్రీ" గా దేవుడు ఈ వధువును వర్ణించాడు. ఈ స్త్రీ హోషేయకు ముగ్గురు పిల్లలను అనగా, ఇద్దరు కుమారులను మరియు ఒక కుమార్తెను (1:4, 6, 9) కన్నది. దేవుడు హోషేయ పిల్లల పేర్లను అలాగే అతని భార్య యొక్క విశ్వాసరాహిత్యమును ఇశ్రాయేలు ప్రజలకు నిర్దిష్ట సందేశాలను పంపడానికి ఉపయోగించాడు.
మనమెక్కడ ఉన్నాము?
హోషేయ 1:1 లో, ప్రవక్త తన ప్రవచనాత్మక పరిచర్యలో పరిపాలించిన రాజులను గుర్తించాడు. మొదటి నలుగురు రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, మరియు హిజ్కియాలు క్రీ. పూ. 790 నుండి క్రీ.పూ. 686 వరకు దక్షిణ రాజ్యమైన యూదాపై పరిపాలించారు. యరొబాము II క్రీ. పూ. 782 నుండి క్రీ.పూ. 753 వరకు ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యాన్ని పరిపాలించాడు. హోషేయ క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దం (క్రీ.పూ. 755–715) లో నివసించాడని ఇది తెలియజేస్తుంది. అతను ప్రవక్తలైన యెషయా మరియు మీకాకు సమకాలీనుడు.
హోషేయ తన ప్రవచనాత్మక హెచ్చరికల యొక్క ప్రారంభ భాగాన్ని యెహూ ఇంటి వారసుడైన యరొబాము II కు గురిపెట్టాడు. అతని కుమారుడు జెకర్యా చాలా త్వరగా నాశనమయ్యాడు (హోషేయ 1:4; 2 రాజులు 15:8-12). ఈ ప్రవచనం యరొబాము వారసులకు వ్యతిరేకంగా హోషేయ పిల్లల పుట్టుకతో సంబంధం కలిగి ఉన్నందున, అతను ఉత్తర రాజ్యంలో నివసించాడని మనము నిర్ధారించగలము. అక్కడ అతని పిల్లల పేర్లు గొప్ప ప్రభావాన్ని చూపించాయి.
హోషేయ ఎందుకంత ముఖ్యమైనది?
ఇతర ప్రవక్తలకన్నా, హోషేయ తన సందేశాన్ని తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టాడు. తనకు నమ్మకద్రోహం చేస్తుందని తెలిసినను ఒక స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారాను మరియు ఇశ్రాయేలుపై తీర్పు సందేశాలను పంపే విధముగా తన పిల్లలకు పేర్లు పెట్టడం ద్వారాను హోషేయ యొక్క ప్రవచనం అతని కుటుంబ జీవితంలో నుండి ప్రవహించినదని తెలుస్తుంది. హోషేయ ప్రవచనంలో స్పష్టంగా కనబడే పశ్చాత్తాపం, విముక్తి మరియు పునరుద్ధరణ యొక్క చక్రం, అలాగే అతని వివాహం కూడా (హోషేయ 1:2; 3:1–3) - మన జీవితాలతో సన్నిహిత సంబంధం కలిగియున్నవి. ఈ క్రమం నిజమైన మనుష్యుల జీవితాలలో కనబడుతుంది. లేఖనాలు నిజ జీవితంతో సంబంధం లేని నైరూప్య ప్రకటనల సేకరణకు దూరంగా ఉన్నాయని ఈ చక్రం గుర్తుచేస్తుంది. ఇవి మన రోజువారీ ఉనికిలోకి ప్రవేశించి పనిచేస్తున్నాయి. మన క్రియలు మరియు సంబంధాలన్నింటినీ ప్రభావితం చేసే సమస్యలపై వ్యాఖ్యానిస్తున్నాయి.
హోషేయ యొక్క ఉద్దేశమేమిటి?
తీర్పు మరియు పునరుద్ధరణ యొక్క ఐదు చక్రాల చుట్టూ నిర్మించబడిన హోషేయ పుస్తకం దాని పునరావృత ఇతివృత్తాన్ని స్పష్టం చేస్తుంది: దేవుడు పాపంపై తీర్పు తెచ్చినప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన ప్రజలను తిరిగి తన వద్దకు తెచ్చుకుంటాడు. తమ జీవితాల పట్ల దేవుని మార్గము కంటే తమ మార్గము పట్లే ఎక్కువ ఆసక్తి ఉన్న జనాంగము పట్ల, అనగా ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ, వారి విగ్రహారాధన మరియు అన్యాయం యొక్క చీకటికి వ్యతిరేకంగా స్పష్టంగా ప్రకాశిస్తుంది (హోషేయ 14:4).
పుస్తకం అంతటా, ప్రజలు ప్రభువు నుండి దూరమవడం మరియు ఇతర దేవతల వైపు తిరగడం (4:12–13; 8:5–6) హోషేయ చిత్రీకరించాడు. విగ్రహారాధన పట్ల ఈ వాంఛ అనేది ఇశ్రాయేలీయులు తాము దేవుని ప్రజలము కాదన్నట్లు జీవిస్తున్నారని అర్థమిస్తుంది. హోషేయ యొక్క మూడవ బిడ్డ అయిన లోఅమ్మీ పుట్టుక ద్వారా దేవుడు వారికి చాలా చెప్పినప్పటికీ, చివరికి తనతో వారి సంబంధాన్ని పునరుద్ధరిస్తానని, తన అవిధేయ ప్రజలను “కుమారులు” అని సన్నిహిత, వ్యక్తిగత భాషను ఉపయోగించి వర్ణించి గుర్తుచేసాడు (1:9–10; 11:1).
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
తన కుమారుడైన యేసు ద్వారా ఇప్పుడు మనకు ఇవ్వబడిన దేవుని రక్షించే శక్తిని మీరెరుగుదురా? అలా అయితే, దేవునిచేత విమోచింపబడిన బిడ్డగా, మీ జీవితంలో ఒకప్పుడు మీ తీర్పునకు గురైనవారికి “విముక్తి” నిచ్చారా, వారిని క్షమించారా? దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రజలకు దేవుని ప్రేమను గూర్చి హోషేయ పుస్తకం ఒక ఉదాహరణను అందించడమే కాక, సన్నిహిత సంబంధంలో క్షమాపణ మరియు పునరుద్ధరణ ఎలా ఉంటుందో కూడా ఇది చూపిస్తుంది. దేవుడు అనుగ్రహించు క్షమాపణకు అనర్హులెవరూ లేరు గనుక మనం క్షమించడానికి కూడా ఎవ్వరూ అనర్హులు కారని హోషేయ గ్రంథము విశదపరచింది. ఖచ్చితంగా, దేవుడు తననుండి వెనుదిరిగే వారిపై తీర్పు తెస్తాడు, కాని హోషేయ తన సొంత వివాహంలోనే పునరుద్ధరించే శక్తివంతమైన క్రియ మన జీవితాల్లో దైవభక్తిని వెదకే వారికి కఠినమైన లక్ష్యమును సిద్ధము చేసింది.
- Francis Brown, S. R. Driver, and Charles A. Briggs, The Brown-Driver-Briggs Hebrew and English Lexicon (Peabody, Mass.: Hendrickson, 2006), 448.