హగ్గయి

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

హగ్గయి ప్రవక్త తన నాలుగు సందేశాలను క్రీస్తుపూర్వం 520 లో, బబులోను (క్రీ.పూ. 538) యొక్క చెర నుండి తిరిగివచ్చిన పద్దెనిమిది సంవత్సరాల తరువాత, యెరూషలేములోని యూదా ప్రజలకు వ్రాశాడు. క్రీస్తుపూర్వం 586 లో దేవాలయం నాశనముకాక మునుపు మరియు చెరలోనికి వెళ్లకముందు ప్రవక్త యెరూషలేమును చూశాడని హగ్గయి 2:3 సూచిస్తుంది. అంటే అతను తన ప్రవచనాలను అందించే సమయానికి డెభ్బై ఏళ్ళకు పైబడి వయస్సు కలిగియున్నాడు. ఈ వాస్తవాల నుండి, హగ్గయి యొక్క చిత్రం వెలుగులోనికి రావడం ప్రారంభిస్తుంది. అతను తన దేశం యొక్క మునుపటి కీర్తిని చూసిన ఒక వృద్ధుడు. తన ప్రజలు చెర అనబడే బూడిద నుండి పైకి లేచి, దేశాలకు దేవుని వెలుగుగా వారి నిజమైన స్థలాన్ని తిరిగి పొందాలనే ఉద్రేకపూరిత కోరికతో ప్రవక్త ఉన్నాడు.

మనమెక్కడ ఉన్నాము?

యూదా ప్రజలు చాలా దుర్బలంగా ఉన్న సమయంలో హగ్గయి ప్రవచనం వచ్చింది. వారు బబులోను చెరలోనికి పంపబడి తగ్గింపబడ్డారు. వారు తమ వాగ్దాన దేశానికి తిరిగి వస్తారనే నిరీక్షణతో ఉన్నారు. ఆపై వారు కట్టడం మానివేసిన మందిరమును పునర్నిర్మించడంలో వ్యతిరేకత రావటంతో నిరుత్సాహపడ్డారు (ఎజ్రా 4:24). ఇప్పుడు, పదహారు సంవత్సరాల తరువాత, మందిరాన్ని పునర్నిర్మించడంలో విఫలమైనందుకే తమకు ఆహారం, వస్త్రములు మరియు ఆశ్రయములేక లేమిలోనున్నారని హగ్గయి నిందించడంతో, యూదులు ప్రభువు గృహమును పునర్నిర్మించాలన్న సందేశమునకు చెవినొగ్గారు.

ఇతర ప్రవక్తలలో చాలా మందికి భిన్నంగా, హగ్గయి తన ప్రవచనవాక్యాలను స్పష్టంగా రోజుతో సహా పేర్కొన్నాడు. అతను నాలుగు వేర్వేరు ఉపదేశాలను ఇచ్చాడు, మొదటిది క్రీస్తుపూర్వం 520 ఆగస్టు 29 న (హగ్గయి 1:1); రెండవది అక్టోబర్ 17 న, క్రీస్తుపూర్వం 520 (2:1); చివరి రెండు డిసెంబర్ 18 న, క్రీస్తుపూర్వం 520 (2:10, 20). ఈ ఉపదేశాలు యూదా ప్రజలను ఆలయ నిర్మాణమును పూర్తి చేయాలని మరియు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను భవిష్యత్తులో పొందుకోవటం కొరకు దేవునిపై నిరీక్షణ పెట్టుకోవాలని ప్రోత్సహించాయి.

హగ్గయి ఎందుకంత ముఖ్యమైనది?

వేలాది సంవత్సరాల తరువాత, పాత నిబంధన ప్రవక్తల పుస్తకాలలో హగ్గయి పుస్తకం చాలా ప్రత్యేకమైనదిగా ఉంది: యూదా ప్రజలు విన్నారు! ఆలయాన్ని పునర్నిర్మించాలన్న హగ్గయి ఉపదేశం ఉద్రేకపూరితమైనదిగాను, సరళమైనదిగాను మరియు సూటిగాను ఉన్నది (హగ్గయి 1:8). అతని మార్గనిర్దేశాన్ని అనుసరించారా లేదా అనే విషయాన్ని ఎవరూ తప్పుపట్టలేరు- ఎందుకంటే ఫలితాలు ప్రజలందరికీ స్పష్టముగా కనిపిస్తున్నాయి. ఆలయాన్ని పునర్నిర్మించే భౌతిక చర్య ద్వారా, ప్రజలు తమ ఆత్మీయ జీవితంలో ఒక మార్పును సూచించడం ప్రారంభించారు: స్వీయ ఆరాధన నుండి దేవుని ఆరాధన వైపు మార్పుచెందారు.

హగ్గయి యొక్క ఉద్దేశమేమిటి?

ఇటీవల చెరలోనుండి తిరిగి వచ్చిన యూదులకు హగ్గయి దగ్గర ఒక ముఖ్యమైన సందేశం ఉంది. వారు తమ దేవుణ్ణి మరచిపోయారు, బదులుగా వారి స్వంత ప్రయోజనాలపై దృష్టి పెట్టడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వారు "తమ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకోవలసిన” సమయం వచ్చినది (హగ్గయి 1:5, 7). తమ ఆలోచనలకు, చర్యలకు ప్రభువు కేంద్రంగా ఉన్నాడని చూపించడం కంటే యూదులకు మరేమీ ముఖ్యమైనది కాదు. కాబట్టి దేవుని ఆలయాన్ని పునర్నిర్మించడం పూర్తి చేయాలని హగ్గయి వారికి ఆదేశించాడు.

అయితే, పునర్నిర్మాణ పనితోనే వారిని వదిలివేయకుండా, హగ్గయి యూదులకు బోధించడం కొనసాగించాడు. కడవరి మందిరము యొక్క మహిమను గూర్చిన నిరీక్షణ మరియు దేవుని ప్రజలు శత్రువులపై విజయం సాధిస్తారని బోధించడంతో వారిని ప్రోత్సహించాడు (2:7–9, 21–22). హగ్గయి సందేశం ప్రకారం, ప్రజలు తమ జీవితాల్లో దేవుణ్ణి కేంద్రముగా ఉంచినట్లయితే, దేవుడు తన ప్రజల కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలను వారు సఫలపరచుకుంటారు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

బబులోను నుండి తమ స్వదేశమైన యూదాకు వలస వచ్చిన యూదులు బాహ్యముగాను మరియు అంతర్గతముగాను తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎజ్రా 4:1–5 ఆలయాన్ని పునర్నిర్మించే ప్రణాళికకు వచ్చిన బాహ్య ప్రతిఘటనను నమోదు చేస్తుంది. యూదా శత్రువులు మొదట కట్టుచున్నవారి శ్రేణుల్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. అది పనిచేయనప్పుడు, వారు భయపెట్టే వ్యూహాలను ఆశ్రయించారు. మరోవైపు, హగ్గయి తమ స్వంత పాపం నుండి వారు ఎదుర్కొంటున్న అంతర్గత వ్యతిరేకతపై దృష్టి పెట్టాడు. దేవుని యొక్క ఇంటి స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా యూదులు తమ స్వంత ప్రయోజనాలను ప్రభువు ప్రయోజనాలకంటే ముందు ఉంచుకున్నారు. వారు తమ స్వంత క్షేమమును మరియు భద్రతను చూసుకున్నారు.

యూదుల నిర్లక్ష్యం నేపథ్యంలో ఆలయాన్ని పునర్నిర్మించటానికి హగ్గయి చేసిన ప్రోత్సాహం, యేసు క్రీస్తు పునాది మీద మన జీవితాలను నిర్మించుకోవాలని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు చేసిన ఉపదేశాన్ని గుర్తుకు తెస్తుంది (1 కొరింథీయులు 3:10–17). పరిశుద్ధాత్మ యొక్క ఆలయంగా మీ స్థితి ప్రతిబింబించే విధముగా మీ జీవితాన్ని మీరు నిర్మించుకుంటూ, పరీక్షా సమయంలో నిలబడే వారసత్వాన్ని ఉంచి వెళుతున్నారా? ఈ పాత నిబంధన ప్రవక్త నుండి నాలుగు ఉద్వేగభరితమైన ఉపదేశాల నుండి ఆ నిర్మాణ ప్రణాళిక కొరకు ధైర్యాన్ని తెచ్చుకొనండి.