హబక్కూకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఈ ప్రవచన పుస్తకంలో తన పేరు ప్రస్తావించబడిన రెండు సందర్భాలను మించి హబక్కూకు గురించి మనకు చాలా తక్కువ తెలుసు. రెండుసార్లు అతను తనను తాను “ప్రవక్తయగు హబక్కూకు” (హబక్కూకు 1:1; 3:1) గా గుర్తించాడు, ఈ పదం హబక్కూకు వృత్తిరీత్యా ప్రవక్త అని సూచిస్తుంది. సమూయేలు రోజుల తరువాత (1 సమూయేలు 19:20; 2 రాజులు 4:38) ప్రవక్తలను విద్యావంతులను చేసే సంస్థయైన ఒక ప్రవచనాత్మక పాఠశాలలో హబక్కూకు మోషే ధర్మశాస్త్రంలో శిక్షణ పొందాడని దీని అర్థం. హబక్కూకు దేవాలయంలో దేవుని ఆరాధనలో పాల్గొన్న ఒక యాజకుడు కూడా కావచ్చు. ఈ భావన పుస్తకం యొక్క చివరి కీర్తనలాంటి ప్రకటనను ఆధారం చేసుకుని చెప్పబడింది: “ప్రధానగాయకునికి తంతివాద్యములతో పాడదగినది” (హబక్కూకు 3:19).

మనమెక్కడ ఉన్నాము?

చాలా పుస్తకాల తేదీ కంటే హబక్కూకు పుస్తకం తేదీని నిర్ణయించడం కొంచెం సులభం. తరచుగా అతను సంభవించుటకు సిద్ధముగానున్న బబులోనీయుల దండయాత్ర (హబక్కూకు 1:6; 2:1; 3:16) గురించి మాట్లాడాడు. క్రీస్తుపూర్వం 586 లో యూదా రాజధాని నగరమైన యెరూషలేమును పూర్తిగా నాశనం చేయడానికి ముందు క్రీస్తుపూర్వం 605 లో చిన్న స్థాయిలో ఈ సంఘటన సంభవించినది. హబక్కూకు యూదాను వర్ణించిన విధానం దాని చరిత్రలోని హీనమైన కాలాన్ని సూచిస్తుంది. ఈ పుస్తకం యొక్క తేదీ బబులోనీయుల దండయాత్రకు దగ్గరగా ఉన్నట్లైతే, హబక్కూకు తన ప్రజలను చెడు నడవడిలోకి నడిపించిన యెహోయాకీము రాజు యొక్క పాలనలోని మొదటి ఐదు సంవత్సరాలలో (క్రీ.పూ. 609–598) ప్రవచించాడు.

దేవుని ప్రజల దృష్టిలో హబక్కూకు యొక్క ప్రవచనం విపత్తు అంచున ఈ లోకం ఉన్నదేమోనని అనుకొని దానికి నిర్దేశించబడింది. క్రీస్తుపూర్వం 722 లో ఉత్తర రాజ్యం నాశనమైనప్పుడు కూడా, దేవుని ప్రజలు యూదాలోనే ఉన్నారు. అయితే, మరొక శక్తివంతమైన విదేశీ సైన్యం ఉద్రేకముతో దండెత్తుతుంటే, దేవుడు ఏమి చేస్తున్నాడని హబక్కూకు వంటి నమ్మకమైన ప్రజలు విస్మయమొందుచున్నారు. ఆయన తన ప్రజలకు వాగ్దాన దేశమును ఇవ్వలేదా? ఆయన ఇప్పుడు దానిని తీసివేసుకుంటాడా? అటువంటి విధ్వంసం ఎదురైనప్పుడు శేషమైయున్న దేవుని ప్రజల కోసం హబక్కూకు చేసిన ప్రార్థన నేటికీ నిజమైన విశ్వాసం మరియు అంతులేని నిరీక్షణకు గొప్ప సాక్ష్యంగా ఉంది.

హబక్కూకు ఎందుకంత ముఖ్యమైనది?

దేవునికి హబక్కూకుకి మధ్య గొప్ప సంభాషణ కలిగి ఉన్నందున, హబక్కూకు లేఖనాలన్నిటిలోకెల్లా చాలా గొప్ప వాక్యభాగమును మనకు అందిస్తుంది (హబక్కూకు 1-2). ప్రపంచంలో దేవుని “నిష్క్రియాత్మకత” గురించి ప్రవక్త తన బాధను ఆధారం చేసుకొని ఈ సంభాషణను మొదలుపెట్టాడు. దుర్మార్గులకు న్యాయం చేసే విషయంలో దేవుడు ఇంకా ఎక్కువ చేయాలని అతను కోరుకున్నాడు. హబక్కూకు పుస్తకం యోనా మాదిరిగానే విసుగు చెందిన ప్రవక్తను చిత్రీకరిస్తుంది. అయినప్పటికీ హబక్కూకు తన నిరాశను ప్రార్థనలుగా మార్చి చివరికి దేవుణ్ణి స్తుతించాడు. అంతేగాని, యోనా చేసినట్లుగా ప్రభువు నుండి పారిపోవడానికి ప్రయత్నించలేదు.

హబక్కూకు యొక్క ఉద్దేశమేమిటి?

ప్రవక్తయైన హబక్కూకు యెరూషలేములో నిలబడి, తన దేశమైన యూదా స్థితి గురించి ఆలోచిస్తున్నప్పుడు, అతను మూగబోయి ఉండాలి. పూర్తి బహిరంగముగా చెడు చాలా పెరిగిపోయింది. కాని వింతేమిటంటే, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎంతకాలం ఈ గందరగోళము కొనసాగుటకు అనుమతిస్తాడు? ఇంక ఎంతోకాలం దేవుడు అనుమతించడు (హబక్కూకు 2: 2-3). మరొక జనము, అనగా బబులోనీయులు వచ్చి యెహోవా దేవుని తరపున న్యాయమును అమలుచేస్తారు. యూదాలోని దుర్మార్గులు, అనగా తమ దుర్మార్గాలనుండి శాశ్వతంగా తప్పించుకోవచ్చునని భావించినవారు త్వరలో శిక్షించబడతారు.

హబక్కూకు పుస్తకం అతిశయపడు ప్రజలు తగ్గింపబడుదురని, నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకునని మనకు ఒక వర్ణనను అందిస్తుంది (2:4). మన ప్రపంచంలో దేవుడు నిశ్శబ్దంగా మరియు అపరిష్కృతంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, చెడును ఎదుర్కోవటానికి ఆయనకు ఎల్లప్పుడూ ప్రణాళిక ఉంది. చివరికి ఆయన న్యాయమే చేస్తాడు. ప్రవక్తయైన హబక్కూకు యొక్క ఉదాహరణ విశ్వాసులను ప్రభువుకొరకు కనిపెట్టుకొని ఉండుమని ప్రోత్సహిస్తుంది, అలాగే మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఆయన జరిగించునని ఆశించాలి (రోమా 8:28).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

హబక్కూకు మనలో చాలా మంది లోతుగా ఆలోచించు ఒక రకమైన ప్రశ్నను దేవుణ్ణి అడిగాడు, “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు?” (హబక్కూకు 1:3). మన జీవితంలో చెడుతనము యొక్క రుజువులను మనమందరం చూశాము. మనమందరం దీనిచేత స్పృశించబడ్డాము. మరియు మనము దీనినుండి వివిధ దశలలో స్వస్థతనొంది దాని తాలూకు మచ్చలను భరించుచున్నాము. మనం చేతులార చేసుకున్న చీకటి జైలు గదిలో చిక్కుకున్నట్లుగా చెడుతో చుట్టుముట్టబడి, మన పేలవమైన కోరికలు మరియు మన పడిపోయిన ప్రపంచం వల్ల మనం తరచుగా అణగదొక్కబడుతున్నాము. ఏదేమైనా, దేవుని దయ చొచ్చుకుపోలేని చీకటిగల ప్రదేశముగాని, మందముగావుండే గోడగాని ఏదీ లేదని శక్తివంతమైన మరియు జీవితాన్ని రూఢిపరచే విధంగా హబక్కూకు పుస్తకం మనకు గుర్తుచేస్తుంది.