మొదటి థెస్సలొనీకయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు థెస్సలొనీకలో సంఘమును ప్రారంభించిన తరువాత, అక్కడనుండి వెళ్ళిన కొద్ది నెలల్లోనే అక్కడి విశ్వాసులకు ఈ మొదటి పత్రిక రాశాడు. స్థానిక సమాజమందిరములో పౌలు మూడు విశ్రాంతి దినములు యూదులకు బోధించాడని అపొస్తలుల కార్యములలో లూకా నమోదు చేశాడు (అపొస్తలుల కార్యములు 17:2). అయితే, చాలామంది పండితులు పౌలు థెస్సలొనీకయులతో మూడు వారాలు కాకుండా మూడు నెలలు గడిపినట్లు నమ్ముచున్నారు, ఎందుకంటే ఫిలిప్పీ సంఘము నుండి ఒకటి కంటే ఎక్కువ కానుకలను పొందుకోవడానికి అతను చాలాకాలం అక్కడే ఉండి ఉంటాడు (ఫిలిప్పీయులకు 4:15-16).

థెస్సలొనీకలో పౌలు చేసిన పరిచర్య యూదులను మాత్రమే కాకుండా అన్యజనులను కూడా తాకింది. సంఘములోని చాలామంది అన్యజనులు విగ్రహారాధన నుండి బయటకు వచ్చారు, అప్పటి యూదులలో అది ప్రత్యేకమైన సమస్యేమీ కాదు (1 థెస్సలొనీకయులకు 1:9).

మనమెక్కడ ఉన్నాము?

తన రెండవ మిషనరీ ప్రయాణంలో థెస్సలొనీకలో బోధించిన కొద్ది నెలలకే, క్రీ.శ. 51 లో కొరింథు నగరం నుండి థెస్సలొనీక సంఘానికి పౌలు తన మొదటి పత్రికను రాశాడు. థెస్సలొనీక నుండి బలవంతముగా బయలుదేరిన తరువాత, పౌలు, సీల మరియు తిమోతి బెరయ ద్వారా ఏథెన్సుకు వెళ్లారు. ఏథెన్సులో కొద్దికాలం తర్వాత, థెస్సలొనీకలోని క్రొత్తగా జన్మించిన సంఘము నుండి సమాచారమును తెలుసుకోవాలనే అవసరత ఉందని పౌలు భావించాడు. అందువల్ల అతను తిమోతిని తిరిగి అక్కడకు పంపించి అక్కడ ఉన్న క్రొత్త విశ్వాసులకు సేవ చేయడానికి మరియు పరిచర్య చేయడానికి పంపాడు. తప్పుడు బోధకులు వారి సమూహములో చొరబడి ఉండవచ్చనే భయంతో పౌలు థెస్సలొనీకయుల విశ్వాస స్థితిని పరిశీలించాలనుకున్నాడు. అయితే, తిమోతి ఒక మంచి సమాచారముతో త్వరగా తిరిగి వచ్చాడు, క్రొత్త విశ్వాసులకు ప్రోత్సాహక పత్రికగా 1 థెస్సలొనీకయులను వ్రాయుమని పౌలును ప్రేరేపించాడు.

మొదటి థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు ఏమి దాచియుంచినదో కొంత అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటారు. యుగాంతం విషయానికి వస్తే ఇంకెంత ఎక్కువ కోరుకుంటారు? మొదటి థెస్సలొనీకయులు క్రైస్తవులకు సంఘము ఎత్తబడటం గురించి స్పష్టమైన వాక్యభాగాన్ని అందిస్తుంది, ఈ సంఘటన ఏడు సంవత్సరాల శ్రమకాలమును ప్రారంభిస్తుంది. ఎత్తబడు సమయమున, క్రీస్తు తన ప్రజల కొరకు తిరిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైనవారు మొదట లేగుస్తారు, ఆ తరువాత జీవించి ఉన్నవారు కొనిపోబడుదురు. ప్రభువుతో నిత్యత్వాన్ని గడపటం ఆరంభించడానికి విశ్వాసులందరూ యేసును ఆకాశమండలములో కలుస్తారు (1 థెస్సలొనీకయులకు 4:16-18).

మొదటి థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

గొప్ప హింసను ఎదుర్కోవడంలో థెస్సలొనీకయుల విశ్వాసమునకు ముగ్ధుడైన పౌలు, ఆ సమాజంలోని క్రైస్తవులను దైవభక్తి కలిగి ఎదగాలనే లక్ష్యంతో ప్రోత్సహించడానికి ఈ పత్రిక రాశాడు. యేసుక్రీస్తు మార్గమునకు మరియు దేవుని కృపకు వ్యతిరేకంగా ఉన్నవారి తప్పుడు బోధ ప్రజలకు బహిర్గతమైనదని పౌలుకు తెలుసు. యువ సంఘము తన విశ్వాసములో పరిపక్వం చెందకపోతే, ప్రమాదం కాలక్రమేణా పెరుగుతుందని పౌలు కూడా అర్థం చేసుకున్నాడు.

దానిని దృష్టిలో పెట్టుకుని, తుదకు యేసు క్రీస్తు తిరిగి రావాలనే నిరీక్షణతోనే ఏదైనా ఆత్మీయ ఎదుగుదల అంతిమంగా ప్రేరేపించబడుతుందని పౌలు ప్రజలకు బోధించాడు. తమ స్వంత ప్రయాస చేత తమ స్థితిని మెరుగుపరచుకొమ్మని ప్రజలకు చెప్పడానికి పౌలు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు, ఎందుకంటే చివరికి మార్పును ప్రేరేపించేది ఏమిటంటే దేవుని ఆత్మ యొక్క శక్తితో స్థిరంగా నడిచే జీవితం అని అతనికి తెలుసు. ప్రశ్నలు మరియు అనిశ్చితులతో ఉన్న యువ క్రైస్తవుల సమూహానికి, క్రీస్తు తిరిగి వస్తాడనే నిరీక్షణను, ప్రశ్నల మధ్యలో ఓదార్పును మరియు దైవిక జీవనానికి ప్రేరణను పౌలు అందించాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మీ క్రైస్తవ విశ్వాసం పాతదిగా ఉన్నట్లు, మీరు ఆయన సేవలో వృద్ధి చెందటానికి బదులు మీరు ఫలించలేక వాడిపోతున్నట్లు మీరు ఎప్పుడైనా భావించారా? థెస్సలొనీకయులకు పౌలు రాసిన మొదటి పత్రిక అటువంటి భావనకు సరైన పరిష్కారం. క్రీస్తు తిరిగి రావడంపై దాని దృష్టి ఈ రోజు దాహముగొన్న ఆత్మకు నీరును అందిస్తుంది, బాధ లేదా అనిశ్చితి మధ్యలో నిరీక్షణను అందించడం ద్వారా పరిపక్వతలో ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఈ పరిశుద్ధీకరణ ప్రక్రియ కోసం పౌలు యొక్క నిర్దిష్ట, ఆచరణాత్మక సూచనలను మన ప్రస్తుత పరిస్థితులకు నేరుగా అన్వయించవచ్చు. క్రీస్తులో మన నిరీక్షణను అంటిపెట్టుకుని ఉన్నట్లైతే, మన జీవితంలో అనేక స్పష్టమైన ఫలితాలను చూడవచ్చు: లైంగిక అనైతికతను నివారించడం, ఇతరులను మోసం చేయడానికి ఒప్పుకొనకపోవడం, మీ తరఫున సేవచేసే క్రైస్తవులను మెచ్చుకోవడం, కీడుకు ప్రతికీడు చేయకపోవటం, ఎల్లప్పుడూ ఆనందించడం, ఎడతెగక ప్రార్థన చేయడం, మరియు అన్ని విషయాలలో కృతజ్ఞతలు చెప్పడం- కొన్ని మాత్రమే చెప్పబడినవి (1 థెస్సలొనీకయులకు 4:3–7; 5:12–23). ఈ జాబితా సంపూర్ణంగా లేదు, కానీ థెస్సలొనీకయులకు రాసిన మొదటి పత్రిక ప్రతి క్రైస్తవుడు తన జీవిత కాలంలో పరిశుద్ధతలో ఎదుగుటకు అపేక్షించాలని స్పష్టం చేసింది.