మొదటి సమూయేలు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

హెబ్రీ బైబిల్లో 1 మరియు 2 సమూయేలును కలిపి ఒకే పుస్తకాన్ని రూపొందించారు. బైబిల్ (పాత నిబంధన) యొక్క గ్రీకు అనువాదమైన సెప్టువాజింట్, ఈ సమూయేలు గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజించినది. ప్రధాన వ్యక్తి అయిన ప్రవక్త సమూయేలు పేరు ఈ గ్రంథానికి ఉన్నప్పటికీ, రచయిత ఎవరనేది ఈ గ్రంథము చెప్పలేదు. 1 సమూయేలు 1: 1–24: 22 లో ఉన్నది సమూయేలు మరణించే వరకు జరిగిన అతని జీవిత చరిత్ర మరియు అతని పనులే గనుక ఈ గ్రంథాన్ని సమూయేలే వ్రాసి, ఇందులోని సమాచారాన్ని అందించి ఉంటాడు. నాతాను మరియు గాదుతో కలిసి సమూయేలు "రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు” పొందుపరచినట్లు 1 దినవృత్తాంతములు 29: 29 లో వ్రాయబడింది. ప్రవక్తల పాఠశాల నుండి ఎవరో ఒకరు 1 మరియు 2 సమూయేలు గ్రంథాలను సమూయేలు, నాతాను, గాదు1 నుండి లభించిన పత్రాలను ఉపయోగించి సంకలనం చేసివుంటారని ఈ వాక్యభాగంలోని (1 దినవృత్తాంతములు 29: 29) ఆధారాలు సూచిస్తున్నాయి.

మనమెక్కడ ఉన్నాము?

ఇశ్రాయేలు పది గోత్రాలు యూదా యొక్క రెండు గోత్రాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, రాజ్యము రెండుగా విడిపోయిన విషయాన్ని మొదటి సమూయేలు 27: 6 సూచిస్తుంది. ఇది సొలొమోను పాలన తరువాత సంభవించింది. దావీదు మరణం (క్రీ.పూ. 971) తరువాత మరియు సొలొమోను మరణం తరువాత (క్రీ.పూ. 931) ఈ పుస్తకం వచ్చినదని మనం తేల్చవచ్చు. క్రీ.పూ. 722 లో అష్షూరీయుల దండయాత్ర గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించలేదు గనుక, ఇది ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళక ముందే ఉద్భవించింది.

1 సమూయేలులో జరిగే సంఘటనలు న్యాయాధిపతుల ముగింపు రోజుల నుండి, సమూయేలు జననం (క్రీ.పూ. 1120), సౌలు మరణం (క్రీ.పూ. 1011) వరకు, అంటే సుమారు 110 సంవత్సరాల కాలంలో జరిగాయి. సమూయేలు జననం, దేవుని యొద్ద నుండి అతనికి వచ్చిన పిలుపు మరియు ప్రవక్తగా అతని పరిచర్య, సౌలు రాజు యొక్క ఎత్తు పల్లాలు, మరియు యువకుడైన దావీదు అభిషేకం పొంది పరిపక్వత చెందటం మనం చూస్తాము.

హెబ్రీయులు ఆక్రమించుకొని స్థిరపడిన ఇశ్రాయేలు దేశంలో (యెహోషువ చూడండి) మొదటి సమూయేలు జరిగింది. అనేక ఇతర ప్రజలు ఇశ్రాయేలు‌తో పాటు నివసించడం కొనసాగించారు. వీరు తరచుగా శాంతికి విఘాతం కలిగించి ఇశ్రాయేలీయులను వారి విశ్వాసం నుండి తప్పించే విధముగా ప్రోత్సహించారు.

మొదటి సమూయేలు ఎందుకంత ముఖ్యమైనది?

ఇశ్రాయేలు చరిత్ర యొక్క ఈ క్లిష్టమైన కాలంలో, దేవుని ప్రజలు ఎవరి గోత్రములు వారివి అన్నట్లుగా కాక, ఒక రాజు నేతృత్వంలోని ప్రభుత్వ రూపంలో ఐక్యపరచబడిన దేశంగా రూపాంతరం చెందారు. న్యాయాధిపతుల కాలములో గడిపిన ఆయాసకరమైన జీవితానికి బదులుగా వారు బలమైన ప్రధానమైన రాచరికం యొక్క స్థిరత్వమును కోరుకున్నారు.

మొదటి సమూయేలు ఆ రాచరికం యొక్క స్థాపనపై దృష్టి పెట్టింది. చుట్టుప్రక్కల దేశాల రాజుల మాదిరిగానే ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరారు (1 సమూయేలు 8: 5). మొదటి రాజైన సౌలు “భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తు గలవాడు” అయినప్పటికీ, నీతియుక్తమైన హృదయం లేదు గనుక అతని సంతానంలో ఎవరునూ కిరీటాన్ని వారసత్వంగా పొందకూడదని నిర్ణయించబడింది (9: 1–15: 35). బేత్లెహేముకు చెందిన యెష్షయి యొక్క చిన్న కుమారుడైన దావీదును తదుపరి రాజుగా అభిషేకించుమని దేవుడు సమూయేలును ఆజ్ఞాపించాడు (16: 1–13).

1 సమూయేలు యొక్క అధిక భాగము యువ సంగీతకారుడు, గొర్రెల కాపరి మరియు యోధుడైన దావీదు చేసిన శూరకృత్యములను గూర్చి వ్రాయబడింది. గొల్యాతు (17: 1–58) పై అతని అసాధారణ విజయం, యోనాతాను‌తో అతని ప్రాణ స్నేహం (18: 1–4) మరియు పెరుగుతున్న అతని సైనిక పరాక్రమమును (18: 5–30) మనం ఈ పుస్తకంలో చూస్తాము. అతను సింహాసనం కొరకు ఓపికతో ఎదురు చూశాడు, తరచూ సౌలు చేత వెంబడించబడి తరుమబడ్డాడు. ఇది 1 సమూయేలుకి మరియు 2 సమూయేలుకి మధ్య స్పష్టమైన విభజన గుర్తుగా పనిచేస్తుంది.

మొదటి సమూయేలు యొక్క ఉద్దేశమేమిటి?

మొదటి సమూయేలు గ్రంథము ఇశ్రాయేలు రాచరికం యొక్క ప్రారంభాన్ని వివరించింది. ప్రవక్తయైన సమూయేలు, దురదృష్టవంతుడైన సౌలు రాజు మరియు దావీదును రాజుగా దేవుడు ఎన్నుకోవటం వంటివి కనిపిస్తాయి. అనేక ఇతివృత్తాలు ప్రముఖంగా ఇందులో ఉన్నాయి.

దైవ సంకల్పము: దేవుడు తన ఉద్దేశాల కొరకు రోజువారీ సంఘటనలు పదేపదే పనిచేయునట్లు చేశాడు. ఆయన పెనిన్నాతో హన్నా యొక్క వివాదాస్పద సంబంధాన్ని ఉపయోగించుకున్నాడు (1 సమూయేలు 1: 1–28), తప్పిపోయిన గార్దభములను వెతుకుతున్న సమయంలో సౌలును సమూయేలు వద్దకు నడిపించాడు (9: 1–27) మరియు తన సహోదరులకు ఆహారాన్ని తీసుకువెళ్లినప్పుడు దావీదు గొల్యాతును గురించి తెలుసుకునే విధముగా చేసాడు (17: 1–58). ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

రాచరికం: దైవ రాజుగా, దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి మానవ ప్రతినిధిగా దావీదును నియమించాడు. ఈ చరిత్ర దావీదు ఇంటిని ఇశ్రాయేలు యొక్క చట్టబద్ధమైన పాలకులుగా ధృవీకరిస్తుంది. యూదా యొద్దనుండి దండము తొలగదని దావీదు గోత్రమునకు యాకోబు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఇది నెరవేరుస్తుంది (ఆదికాండము 49: 10).

మానవ భాగ్యాన్ని మార్చివేయడం: హన్నా యొక్క గొడ్డుతనము పిల్లలను దయచేసింది (1 సమూయేలు 1: 1–28; 2: 21); ఏలీ కుమారులకు బదులుగా సమూయేలు ప్రవక్త అయ్యాడు (2: 12; 3: 13); సౌలు అణగారిన గోత్రమునకు చెందినవాడైనప్పటికీ ప్రాముఖ్యత నొందాడు; దావీదు కనిష్ఠ కుమారుడు అయినప్పటికీ రాజుగా అభిషేకించబడ్డాడు (16: 1-13). తన తలంపులను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకుగాను దేవుడు సాధారణ మానవ పద్ధతులను మార్చివేసి సర్వముపైనున్న తన సార్వభౌమత్వాన్ని చూపించాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఇరవై ఒకటవ శతాబ్దంలో దేవుడు యింకా సార్వభౌముడే. మన సహకారం ఉన్నా లేకున్నా ఆయన తన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. సమూయేలు, సౌలు మరియు దావీదు జీవితాలలో జరిగినట్లుగా, దేవుని పిలుపునకు మన ప్రతిస్పందనే మన ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. సమూయేలు, దావీదు చేసినట్లు మనం ఆయనకు విధేయత చూపిస్తూ ఆశీర్వాదముతో కూడిన జీవితాలను కలిగి జీవిస్తామా? లేదా మనం, సౌలు మాదిరిగా మన స్వంత నిబంధనల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తామా? "బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుట శ్రేష్ఠము" అని సమూయేలు సౌలుతో చెప్పాడు (1 సమూయేలు 15: 22). ఆ సత్యం నేటికీ మనతో మాట్లాడుచున్నది.

  1. Norman L. Geisler, A Popular Survey of the Old Testament (Peabody, Mass.: Prince Press, 2007), 107.