మొదటి రాజులు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

1 మరియు 2 సమూయేలు పుస్తకాల మాదిరిగా, 1 మరియు 2 రాజుల గ్రంథాలు మొట్టమొదట ఒకే పుస్తకముగా ఉండేవి. హెబ్రీ బైబిల్లో రాజుల గ్రంథము సమూయేలు‌లో ప్రారంభమైన కథనాన్ని కొనసాగించింది. సెప్టువాజింట్ (అనగా హెబ్రీ భాషలోని పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమ చేయుట)వాటిని రెండు భాగాలుగా వేరు చేసింది. మనము మన తెలుగు శీర్షిక “రాజులు” ను బైబిల్ యొక్క లాటిన్ అనువాదమైన జెరోమ్ యొక్క వల్గేట్ నుండి పొందాము.

1 మరియు 2 రాజుల రచయిత ఎవరికీ తెలియదు. కొంతమంది వ్యాఖ్యాతలు ఎజ్రా, యెహెజ్కేలు, యిర్మీయాలను కాదగ్గ రచయితలుగా సూచించారు. మొత్తం గ్రంథం నాలుగు వందల సంవత్సరాలకు పైచిలుక ఉన్న కాలాన్ని ఆవరించియున్నందున, సమాచారమంతయు సంకలనం చేయడానికి అనేక మూల పదార్థాలు ఉపయోగించబడ్డాయి. సాహిత్య శైలులు, పుస్తకం అంతటా అల్లిన ఇతివృత్తాలు మరియు ఉపయోగించిన సమాచారం యొక్క స్వభావం వంటి కొన్ని ఆధారాలు బహుళ సంగ్రాహకులు లేదా రచయితల కంటే ఒకే సంగ్రాహకుడు లేదా రచయితని సూచిస్తున్నాయి. దేవుని ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి రాతప్రతిని సమీకరించాడు (2 రాజులు చూడండి). ముప్పై ఏడు సంవత్సరాల జైలు శిక్ష (క్రీ.పూ. 560) తర్వాత బబులోనీయులు రాజైన యెహోయాకీను‌ని విడుదల చేసే వరకు రచయిత ఆ పనిని పూర్తి చేయలేదు. ఈ పనిని పూర్తి చేయటానికి మరో ఇరవై సంవత్సరాలు పట్టింది.1

మనమెక్కడ ఉన్నాము?

మొదటి రాజులు దావీదు రాజు చివరి రోజులు (సుమారు క్రీ.పూ. 971 లో) మరియు వారసత్వము కొరకు జరుగుతున్న కుట్రలను వివరిస్తుంది. దావీదు మరణించినప్పుడు (1 రాజులు 2:10), సొలొమోను సింహాసనాన్ని అధిరోహించి, బలమైన మరియు తెలివైన నాయకుడిగా స్థిరపడ్డాడు. సొలొమోను పాలన యొక్క ప్రారంభ సంవత్సరాల్లో, ఇశ్రాయేలు దేశం దాని “గొప్ప ప్రాభవ దినాలను” అనుభవించింది. దాని ప్రభావం, ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక శక్తి తక్కువ వ్యతిరేకతను అనుభవించాయి; దాని పొరుగువారు దానికి పెద్ద సైనిక ముప్పుగా నిలబడలేదు.

క్రీ.పూ. 931 (1 రాజులు 11:43) లో సొలొమోను మరణించిన కొద్దికాలానికే, రాజ్యం ఉత్తర (ఇశ్రాయేలు) మరియు దక్షిణ (యూదా) సంస్థలుగా విభజించబడింది. క్రీస్తుపూర్వం 853 సంవత్సరం నుండి ఈ విభజించబడిన రాజ్యం యొక్క చరిత్రను మొదటి రాజులు గమనిస్తూ వస్తుంది.

మొదటి రాజులు ఎందుకంత ముఖ్యమైనది?

దేవుని అధికారం క్రింద ఉండి, ధర్మశాస్త్రానికి విశ్వాసపాత్రులుగా ఉండి పరిపాలించిన రాజులు దేవుని ఆశీర్వాదాలను అనుభవించారు. కానీ ధర్మశాస్త్రం నుండి తొలగిపోయిన రాజులు శాపాలను అనుభవించారు.

మొదటి రాజులు యెహోవాతో సొలొమోనుకు ఉన్న సంబంధాన్ని వెల్లడించింది. సొలొమోనుకు ఇవ్వబడిన దైవిక జ్ఞానం మరియు సంపదను గూర్చి ఈ పుస్తకం నొక్కిచెప్పింది. సొలొమోను యొక్క కీర్తి ఇశ్రాయేలు యొక్క సరిహద్దులను దాటి ఆధునిక యెమెన్ వరకు, అనగా షేబ దేశపు రాణి యొక్క దేశము వరకు చేరుకుంది (1 రాజులు 10:1-13). సొలొమోను యొక్క అనేక వివాహాలు, విస్తృతమైన ఉపపత్నుల సంగతులు కథలుగా చెప్పుకోవచ్చు. కానీ అవి తరువాతి సంవత్సరాల్లో అతనిని విశ్వాసము నుండి తొలగి తిరుగునట్లుగా చేసాయి. అయినప్పటికీ, సొలొమోను దేవుని ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయము తన ప్రజల మధ్య దేవుని యొక్క శాశ్వత నివాస స్థలమైన ఉన్నది.

దుష్టుడైన ఉత్తర రాజైన ఆహాబుపై దేవుని తీర్పును ప్రకటించిన ప్రవక్తయైన ఏలీయాను మొదటి రాజులు పరిచయం చేసింది. ఇతర అద్భుతాలను చేయడంతో పాటు, ఏలీయా కర్మెలు పర్వతంపై అబద్ధ ప్రవక్తలతో జరిగిన నాటకీయ ఘర్షణలో గెలుపొందాడు (18:1–46).

మొదటి రాజులు యొక్క ఉద్దేశమేమిటి?

మొదటి రాజులు "చరిత్రను పొందుపరచడానికి, అలాగే, చరిత్ర యొక్క పాఠాలను నేర్పడానికి"2 వ్రాయబడింది. పాత నిబంధనలోని ఇతర చారిత్రక పుస్తకాల మాదిరిగానే, ఇక్కడ పొందుపరచబడిన చరిత్ర కేవలం ముఖ్యమైన సంఘటనలను మాత్రమే కాకుండా వాటి ద్వారా నేర్చుకున్న ఆత్మీయ సత్యాలను కాపాడుకోవటానికి ఉద్దేశించబడింది.

1 మరియు 2 రాజుల పుస్తకాలలో, ప్రతి రాజు “యెహోవా ధర్మశాస్త్రానికి తాను ఎలా ప్రతిస్పందించి తన నిబంధన బాధ్యతను నెరవేర్చుతాడో దాన్నిబట్టి అంచనా వేయబడతాడు. అతను ‘చెడుగా నడిచాడో’ లేదా ‘యెహోవా దృష్టిలో యథార్థముగా నడిచాడో’ తెలుసుకోవటానికి ఇదే అగ్ని పరీక్ష వంటిది.”3 ప్రవక్తల యొక్క దృష్టి ద్వారా మనం ఇశ్రాయేలు మరియు యూదా చరిత్రను నేర్చుకుంటాము. ఈ ప్రవక్తల కన్నులు ఎల్లప్పుడూ దేశం యొక్క భాగ్యమును దాని రాజుల విశ్వాసముతో (లేక అవిశ్వాసముతో) అనుసంధానించాయి.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

సొలొమోను తన కాలములో తెలివైన వ్యక్తిగా పిలువబడ్డాడు. అతను తన కాలములో ధనవంతుడని వాదించవచ్చు. అతను అనేక విధాలుగా దేవుని దయను పొందుకున్నాడు. అయినప్పటికీ అతని తరువాతి సంవత్సరాల్లో అతను చూపించిన అవిశ్వాసం వల్ల అతని వారసత్వం దెబ్బతిన్నది. ఒక రాజు “అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు” (ద్వితీయోపదేశకాండము 17:17) అనే దేవుని ఆజ్ఞకు పూర్తి విరుద్ధంగా, సొలొమోను చాలా మంది విదేశీ మహిళలను వివాహం చేసుకున్నాడు. “సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పిరి” (11:4) అని మొదటి రాజులు విలపిస్తున్నది. ఆ ఆశీర్వాదాలన్నింటినీ తనకు ఇచ్చిన దేవునికి బదులుగా సొలొమోను తన భాగ్యము, సైనిక శక్తి మరియు రాజకీయ పొత్తులపై ఆధారపడటం ప్రారంభించాడు. అతను బహుమతులపై దృష్టి పెట్టాడు, కాని వాటిని అనుగ్రహించువానిని మరచిపోయాడు.

మీరు ఎంత తరచుగా ఇదే పని చేస్తున్నారు? మీరు విస్మరిస్తున్నటువంటి దేవుని ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు, మీ జీవితంలో పొందుకున్న ఆశీర్వాదాలను గుర్తు చేసుకొని, వాటి విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీ బలమునకు, ప్రాముఖ్యతకు మూలంగా మీ ఆస్తుల మీదనో లేక స్థితి మీదనో కాకుండా ఆయనపై ఆధారపడండి.

కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. (కీర్తన 20: 7)

  1. See Thomas L. Constable, "1 Kings," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 483.
  2. Constable, "1 Kings," 484.
  3. Merrill F. Unger, Unger's Commentary on the Old Testament (Chattanooga, Tenn.: AMG, 2002), 447.