మొదటి కొరింథీయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు కొరింథీ ప్రజలకు రాసిన మొదటి పత్రిక ఇది కాకపోయినప్పటికీ (1 కొరింథీయులకు 5:9 చూడండి), పౌలు యొక్క గ్రంథకర్తృత్వం రచనా పండితుల సమాజంలో విస్తృతంగా ఆమోదించబడింది. కొరింథీయులు పౌలు (5:10–11) నుండి వచ్చిన మునుపటి పత్రికను తప్పుగా అర్థం చేసుకున్నారని మనకు తెలుసు, అయితే ఆ లేఖ మనుగడలో లేదు. అందువల్ల, కొరింథీయులకు పౌలు రాసిన రెండవ పత్రిక 1 కొరింథీయులుగా మనకు తెలుసు. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవునిచేత ప్రేరేపించబడినది.

1 కొరింథీయులుగా మనకు తెలిసిన పత్రిక రాయడానికి నాలుగు సంవత్సరాల ముందు, అపొస్తలుడు కొరింథులో పద్దెనిమిది నెలలు గడిపాడు, కాబట్టి అతనికి సంఘము మరియు దాని సమూహముతో బాగా పరిచయం ఉంది. పత్రిక గ్రహీతలు పత్రిక యొక్క ప్రాముఖ్యతను వారి స్వంత పరిస్థితులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమునకు ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకుని ఉంటారు. క్రీ.శ. 95 లో, రోమా బిషప్ అయిన క్లెమెంతు కొరింథీయులకు తన స్వంత లేఖ రాశాడు, అందులో 1 కొరింథీయులలో పౌలు బోధన యొక్క అధికారాన్ని సంబోధించాడు. ఇది ఉత్పత్తియైన కొద్ది దశాబ్దాల తరువాత, కొరింథీయులకు రాసిన ఈ పత్రిక కొరింథు వెలుపల ప్రయాణించింది. మరియు ఈ కొరింథీ పత్రిక దాని ఆరంభ సందర్భానికి మించి ప్రామాణికమైనదిగా పరిగణించబడింది.

మనమెక్కడ ఉన్నాము?

కొరింథీ సంఘములో కలహాల గురించి కలతపెట్టే నివేదికను అందుకున్నప్పుడు పౌలు తన మూడవ మిషనరీ ప్రయాణంలో రెండు సంవత్సరాలకు పైగా ఎఫెసులోనే ఉన్నాడు, దాని సభ్యులలో ఒకరైన క్లోయె (1 కొరింథీయులకు 1:11) తో సంబంధం ఉన్న వ్యక్తుల నుండి అతను ఈ నివేదిక అందుకున్నాడు. అతను ఇటీవల స్థాపించిన సంఘము (అపొస్తలుల కార్యములు 18:1–17) అప్పటికే లోతైన విభజనలను పెంచింది, ఈ పరిస్థితికి తక్షణ చర్య అవసరం. ఎఫెసు నుండి మాసిదోనియకు బయలుదేరాలని యోచిస్తున్నప్పుడు (1 కొరింథీయులకు 16:5–8) పౌలు తన పత్రికను క్రీ.శ. 55 లో రాశాడు.

1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

మొదటి కొరింథీయులు సంఘము గురించి మరియు మొదటి శతాబ్దంలో నిజమైన ప్రజలను ప్రభావితం చేసిన సమస్యల గురించి స్పష్టమైన చర్చ కలిగి ఉంది. కొరింథీ సంఘము వివిధ రంగాల్లో పాపంతో క్షీణించింది, కాబట్టి సంఘము దానిలోని పాపం యొక్క సమస్యపట్ల ఎలా వ్యవహరించాలో పౌలు ఒక ముఖ్యమైన నమూనాను అందించాడు. సంబంధములలో విభేదాలు మరియు అన్ని రకాల అనైతికత వైపు గ్రుడ్డివానిగా ఉండటానికి బదులు, అతను సమస్యలను పరిష్కరించాడు. కొరింథీ సంఘములో స్వచ్ఛత కోసం తానిచ్చిన ధైర్యమైన పిలుపులో, సంఘానికి కళంకం కలిగించిన పాపాన్ని శుభ్రపరచడంలో సహాయపడటానికి కొంతమంది మంచి అభిప్రాయాన్ని కూడా పణంగా పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని పౌలు స్పష్టం చేశాడు.

1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

మొదటి కొరింథీయులు పౌలు క్లోయె ఇంటివారి వలన తెలుసుకున్న నివేదికలను, అలాగే సంఘము నుండి వచ్చిన లేఖను గురించి కూడా ప్రస్తావించాడు (1 కొరింథీయులకు 7:1). కొరింథులోని సంఘానికి రాసిన ఈ పత్రికలో, జీవితం మరియు సిద్ధాంతం రెండింటికి సంబంధించిన అనేక విభిన్న విషయాలను పౌలు వివరించాడు: విభజనలు మరియు తగాదాలు, లైంగిక అనైతికత, విశ్వాసుల మధ్య వ్యాజ్యములు, వివాహం మరియు ఒంటరితనం, క్రీస్తులో స్వాతంత్ర్యము, ఆరాధనలో క్రమం, ప్రభువు బల్ల యొక్క ప్రాముఖ్యత, మరియు కృపావరములను సరిగ్గా ఉపయోగించటం; అతను పునరుత్థానంపై లోతైన బోధనను కూడా చేర్చాడు.

స్థానిక సంఘములో క్రైస్తవ ప్రవర్తనపై పౌలు నొక్కిచెప్పడమే ఈ అంశాలన్నిటినీ కలిపే ఆలోచన విధానం. క్రైస్తవ ప్రజలు క్రైస్తవ ఆదర్శాల ప్రకారం జీవిస్తారని అపొస్తలుడు ఆశించాడు, లేదా అతను చెప్పినట్లుగా, "విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి" (6:20).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

వివిధ నేపథ్యాల ప్రజలతో నిండి ఉన్న ఒక పెద్ద, అంతర్జాతీయ మహానగరం కొరింథు. ఆఫ్రొడైట్ వంటి దేవతలకు విగ్రహారాధన చేయటం నగరంలో ప్రముఖంగా ఉంది, అయితే కొరింథులో ఆమె యొక్క దేవాలయాలకు మించి అనేక శోధనలు ఉన్నాయి. ఈ విధముగా ఎటువంటి స్పష్టమైన పరిణామాలు లేకుండా పాపాత్మకమైన ప్రవర్తనలో పాల్గొనడానికి అంతులేని అవకాశాలను కలిగి ఉన్న ఒక ఆధునిక పట్టణ ప్రాంతం వలె కొరింథు ఉన్నది.

ఇటువంటి సమాజం స్పష్టంగా కొరింథీ సంఘముపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. తమ నగరం నుండి వెనుదిరగకూడదని విశ్వాసులకు పౌలు ఇచ్చిన సూచనను గమనించండి. ఇది అప్పుడు లేదా ఇప్పుడు సంఘానికి పౌలు యొక్క దర్శనము కాదు. బదులుగా, అవిశ్వాసుల మధ్య క్రీస్తు పట్ల మనకున్న సమర్పణ విషయమై మరింత నమ్మకంగా జీవించాలని ఆయన మనకు సూచించాడు. ఒకరికొకరు జవాబుదారీగా ఉండే ఏకీకృత సమాజంలో ఆరాధించడం ద్వారా క్రైస్తవులైన మనం మన వెలుగును వారి చీకటి ప్రదేశాలలో ప్రకాశింపజేస్తామని పౌలు ఆశించాడు. మన సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, పరిశద్ధత యొక్క సాధనలో మనము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటామని, మన శారీరక పునరుత్థానం రాబోతుందనే నిరీక్షణను గట్టిగా పట్టుకొని కలిసి ప్రయత్నిస్తామని ఆయన ఆశించాడు.

ఈ రకమైన సమాజాన్ని మరింత యథార్థం చేయడానికి మీ స్థానిక సంఘములో మీరు ఏమి చేయగలరు?