ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
“చరిత్రకారుడు” అని పండితులచే చాలాకాలంగా సూచింపబడుతున్న ఈ పుస్తకం యొక్క రచయిత పేరేమిటో తెలియదు. 1 మరియు 2 దినవృత్తాంతములను ఎజ్రా వ్రాసి ఉండవచ్చని యూదా సంప్రదాయం ఊహించింది. ఇది సమూయేలు మరియు రాజుల పుస్తకాల మాదిరిగానే మొదట ఒకే పుస్తకంగా రూపొందించబడింది. కానీ ఈ పుస్తకం యొక్క సంగ్రాహకుని గూర్చిన ఖచ్చితమైన ఆనవాళ్ళు మనకు వాక్యంలో ఎక్కడ లేదు.
పుస్తకం అంతటా అనేక సూచనలు రచయిత వివిధ రకాలైన మూల రచనలపై ఆధారపడటాన్ని బయలుపరచుచున్నవి. “వృత్తాంతములు,” "గ్రంథాలు” మరియు “పుస్తకములు” మొదలగు సూచనలు ఈ పుస్తకాన్ని నమ్మదగిన చారిత్రక ఆధార పత్రముగా పేర్కొనబడ్డాయి. "రచయిత ఎవరైనప్పటికీ, అతను అధికారిక మరియు అనధికారిక పత్రాలను జాగ్రత్తగా ఉపయోగించి శ్రద్ధగా పరిశీలించిన చరిత్రకారుడు."1
మనమెక్కడ ఉన్నాము?
1 దినవృత్తాంతములలో ఆవరించిన కాలపరిమితి 2 సమూయేలు మరియు 1 రాజుల కొన్ని భాగాలను ప్రతిఫలింపజేయుచున్నవి. చరిత్రకారుడు 1 దినవృత్తాంతములలో దావీదు పాలనపై దృష్టి పెట్టాడు. బైబిల్లోని ఇతర పుస్తకాల్లో దావీదును గూర్చి నమోదు చేయబడిన విభిన్న సంఘటనలలో కొన్ని ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి, కొన్ని పొందుపరచబడలేదు. తన ఉద్దేశములకు ప్రాముఖ్యతనిచ్చే సంఘటనలను చరిత్రకారుడు ఈ పుస్తకంలో పొందుపరచాడు. ఉదాహరణకు, 1 దినవృత్తాంతములలో బత్షెబ (2 సమూయేలు 11) తో దావీదు వ్యభిచారమును గూర్చి వ్రాయలేదు. ఎందుకంటే ఇది చరిత్రకారుడు తన పనిని ప్రారంభించక ముందే అందరికీ తెలిసిన విషయమే, గనుక ఇది పునరావృతం చేయలేదు.
దినవృత్తాంతములు దాదాపు ఎజ్రా లేదా నెహెమ్యా కాలంలో, అనగా యూదులు పారసీక దేశమంతటా చెదరగొట్టబడి, కొందరు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చినప్పుడు వ్రాయబడింది. పురావస్తు ఆధారాలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నాయి. "కుమ్రాన్ వద్ద కనుగొనబడిన దినవృత్తాంతములు యొక్క అసలైన రాతప్రతి యొక్క శకలాలు పారసీకుల కాలము (క్రీ.పూ. 538-333) లోని తేదీని దాదాపుగా ఖరారు చేస్తున్నాయి."2
మొదటి దినవృత్తాంతములు ఎందుకంత ముఖ్యమైనది?
వంశావళులకు ఎక్కువ చోటును కేటాయించడం పాఠకులు గమనిస్తారు. దినవృత్తాంతములలో ఈ కుటుంబ జాబితాలు ఎందుకు సర్వసాధారణం? వంశావళులు అనేక ఉద్దేశాలను నెరవేర్చుతాయని పండితులు అంటున్నారు. అవేమిటంటే
ఒక విశేషమైన పాత్ర లేదా హోదాకు ఒక వ్యక్తి లేదా కుటుంబ అర్హత యొక్క చట్టబద్ధతను ప్రదర్శించడానికి. . . ఏర్పరచబడిన జనుల మరియు యాజకత్వము యొక్క పవిత్రతను కాపాడటానికి . . . వాగ్దాన దేశము నుండి వెళ్లగొట్టబడినప్పటికీ దేవుని ప్రజలు ఎడతెగకుండా వుండెదరని ధృవీకరించడం.3
కుటుంబ చరిత్రతో పాటు, 1 దినవృత్తాంతములు యాజకులు, లేవీయులు, సైన్యాలు, దేవాలయ అధికారులు మరియు వివిధ పరిచర్యలకు సంబంధించిన నాయకుల జాబితాను పేర్కొన్నది.
దినవృత్తాంతములలో, ఇశ్రాయేలు చరిత్ర యాజక సంబంధమైన దృక్పథం ద్వారా చెప్పబడింది. యెహోవాను ఆరాధించడం మరియు ఆయన ధర్మశాస్త్ర నిబంధనలకు కట్టుబడి ఉండటంపై చరిత్రకారుడు ఎక్కువ శ్రద్ధ చూపించాడు. నిబంధన మందసమును (1 దినవృత్తాంతములు 13, 15-16) సరైన పద్ధతిలో తరలించడానికి మరియు దానిని యెరూషలేముకు తిరిగి తీసుకొనిరావడానికి అవసరమైన వివరణాత్మక వర్ణనలను గూర్చి దావీదు తీసుకున్న నిర్ణయాలను రచయిత చేర్చాడు. చరిత్రకారుడు కూడా దావీదు యొక్క కీర్తనలలో ఒకదాన్ని ప్రముఖంగా పేర్కొన్నాడు (16:8-36). యెబూసీయుడైన ఒర్నాను యొక్క కళ్లమును దావీదు ఎలా కొన్నాడనే కథను మనము చదువుతాము, ఇదే భవిష్యత్తులో దేవాలయ ప్రదేశంగా దావీదు నియమించాడు (21:15-30). దేవాలయాన్ని నిర్మించాలని దావీదు కోరినప్పటికీ, దావీదు కుమారుడైన సొలొమోనుకు ఆ ఘనత దక్కుతుందని దేవుడు అతనికి బయలుపరచాడు (17:1–14).
మొదటి దినవృత్తాంతములు యొక్క ఉద్దేశమేమిటి?
ఇప్పటికే మనకు 2 సమూయేలు మరియు 1-2 రాజుల చరిత్ర ఉన్నప్పుడు, 1-2 దినవృత్తాంతముల పుస్తకాలు ఎందుకు అవసరము? మత్తయి, మార్కు, లూకా మరియు యోహానుల సువార్తలు యేసు జీవితంపై భిన్నమైన దృక్పథాన్ని అందించినట్లే, దినవృత్తాంతముల పుస్తకాలు ఇశ్రాయేలు చరిత్రను ఇతర చారిత్రక పుస్తకాల కంటే భిన్నమైన ఉద్దేశ్యంతో అందించాయి. 2 సమూయేలు మరియు 1-2 రాజుల పుస్తకాలు ఇశ్రాయేలు మరియు యూదా రాచరిక పాలనను గూర్చి చూపించాయి-ముఖ్యంగా చెరలోనికి వెళ్లటానికి దారితీసిన ఇరు దేశాల పాపాలు. కాని చెరలోనుండి తిరిగి వచ్చిన కాలం తరువాత వ్రాయబడిన దినవృత్తాంతముల పుస్తకాలు, తిరిగి వచ్చిన యూదులు ధ్యానం చేయాలని వేటిని దేవుడు కోరుకున్నాడో ఆ చరిత్రలోని అంశాలపై దృష్టి పెట్టాయి: విధేయత వలన కలిగే దేవుని ఆశీర్వాదాలు, దేవాలయం మరియు యాజకత్వం యొక్క ప్రాధాన్యత, మరియు దావీదు ఇంటికి ధారాళమైన వాగ్దానములు.
చరిత్రకారుడు వ్యక్తపరచాలనుకున్న విషయములను 1 దినవృత్తాంతములు 29:10–19లో దావీదు యొక్క ప్రార్థన క్లుప్తంగా తెలియజేసింది: దేవునికి మహిమ, దావీదు కుటుంబానికి దేశ నాయకత్వమును బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మరియు దావీదు యొక్క వారసులు తమను తాము దేవునికి సమర్పించుకోవాలనే కోరిక. దేవుని యెడల విశ్వాసం కలిగివుంటే ఆశీర్వాదమును పొందుకుంటాము.
ఈ పుస్తకం వ్రాసే సమయానికి, దావీదు యొక్క వారసులు ఇశ్రాయేలు మీద రాజులుగా పరిపాలించడంలేదు. భవిష్యత్ పరిపాలకుడు ఆ వంశము నుండే ఉదయిస్తాడని దేవుడు వాగ్దానం చేసినందున, రాచరిక సంబంధమైన దావీదు వంశాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చరిత్రకారుడు కోరుకున్నాడు. బబులోనులో డెభ్బై సంవత్సరాల చెర ముగిసిన తరువాత, యూదుల రాజకీయ మరియు సామాజిక శక్తి రాజకీయ పాలకులతో కంటే మతముతోనే ఎక్కువగా ఉన్నది. భవిష్యత్ మెస్సీయ కోసం ప్రజలను సిద్ధం చేయడానికి ఇశ్రాయేలు యొక్క చరిత్రను యాజక మరియు రాజ సంబంధమైన దృక్పథముతో చెప్పడానికి ఉద్దేశించబడింది.
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
1 దినవృత్తాంతములు 29 లో దావీదు యొక్క అద్భుతమైన ప్రార్థన చదవండి. మీ స్వంత ఆత్మీయ వారసత్వాన్ని పరిశీలించుకోండి. అతని వంటి దైవిక బలం మరియు స్వభావమును మీరు కలిగియుండి మీ స్వంత బిడ్డలకు మాదిరిగా ఉండాలనుకుంటున్నారా? 11వ వచనంలో దావీదు వైఖరిని నిజాయితీగా ప్రతిధ్వనించడానికి మీరు ఏ చర్యలు తీసుకోవాలి, “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి” (ఆంగ్ల తర్జుమ NIV)?
ఆయన హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నాడని ఎరిగి (1 దినవృత్తాంతములు 29:17), రాబోయే తరాలు ఆశీర్వదించబడులాగున నీ అడుగులను స్థిరపరచుమనియు మరియు నిన్ను తనతో నింపుమనియు ఆత్మను వేడుకొనుడి.
- Eugene H. Merrill, "1 Chronicles," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 589.
- Larry Richards, The Bible Reader's Companion (Wheaton, Ill.: Victor Books, 1991), electronic ed., accessed through Libronix Digital Library System.
- Richards, The Bible Reader's Companion.